నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (9)

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (9)

‘తన విషాగ్నితో తక్షకుడు నా తండ్రిని ఎలాగయితే దగ్ధంచేసి చంపాడో, అలాగే నేను ఆ తక్షకుని వాని మిత్ర బాంధవులతో సహా యాగాగ్ని శిఖలలో పడి దహనమయిపోయేట్లుగా చేసి స్వర్గలోక వాసుడయిన నా తండ్రికి, ఉదంకునకు ప్రీతి కలిగిస్తాను’ అని చెప్పి, సడలని నిశ్చయానికి వచ్చి, కాశీరాజు కుమార్తె అయిన వపుష్ఠమయ మహాదేవి ధర్మపత్నిగా సర్పయాగం చేయాలని దీక్షవహించి,  శిల్పశాస్త్రనిపుణులయిన ఆచార్యులచే నిర్మించబడి యజ్ఞోపకరణ సామగ్రి అంతా సమృధ్ధిగా సమకూర్చబడీ వున్న యాగశాలలో, బ్రాహ్మణులతో కూడి వున్న ఆ జనమేజయ మహారాజు వద్దకు వాస్తువిద్యా నిపుణుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘రాజా, అన్నీ శాస్త్ర ప్రకారం అమర్చుకుని చేస్తున్నప్పటికీ, ఈ యజ్ఞం చివరిదాకా నడవదు, మధ్యలోనే ఆగిపోతుంది’ అంటాడు.

ఆ బ్రాహ్మణుడు చెప్పినది విని కూడా, చ్యవనకుల విఖ్యాతుడయిన చండభార్గవుడు హోతగా, పింగళుడు అధ్వర్యుడుగా, శార్జ్గవుడు బ్రహ్మగా, కౌత్సుడు ఉద్గాతగా, వ్యాస వైశంపాయన పైల జైమిని సుమంతాది మహామునులు సదశ్యులుగా యాజ్ఞికులు ఆ యజ్ఞాన్ని మొదలుపెడతారు. యజ్ఞం కొనసాగే కొలదీ, ఆ యజ్ఞమంత్రాల మహిమకు నాగప్రములందరూ భయకంపితులై ఒకరొకరిని పిలుచుకుంటూ వరుసగా వచ్చి ఆ యాగకుండం నుంచి పుడుతున్న అగ్నిలో ఆర్తనాదాలు చేస్తూ వచ్చి  పడి కాలిపోసాగారు. అలా వచ్చి పడిన వాళ్ళలో కోటిశ, మానస, పూర్ణ, శల, ఫాల, హలీమక, పిఛ్ఛల, గౌణప, చక్రాది వాసుకి కుల సంభవులు, పుఛ్ఛాండక, మండలక, విరోహణ, సురోమ, మహా హన్వాదులయిన తక్షక కుల సంభవులు, పారావత, పారిజాతయాత్ర, పాండర, హరిణ, కృశ, విహంగాది ఐరావత కుల సంభవులు, నేరక, కుండల, వేణి, బాహుక, శృంగబేర, ధూర్తక, ప్రాతరాతకాదులయిన కౌరవ్య కుల సంభవులు, శంకుకర్ణ, పిఠరక, కుఠార, సుఖసేచన, పూర్ణాంగద, పూర్ణముఖ, సుచిత్ర, పరాశర, తరుణక, మణి స్కందారుణ్యాదులయిన ధృతరాష్ట్ర కులసంభవులూ…ఇలా వేలాదిగా వుంటారు. అప్పుడు తక్షకుడు కూడా చాలా భయపడినవాడై, పరుగెత్తుకుని  ‘స్వామీ, రక్షించు రక్షించు రక్షించు!’ అంటూ సురగణాధిపుడైన ఇంద్రుని వద్దకు చేరుతాడు.. ఇంద్రుడు, పూర్వం విష్ణుమూర్తి వచనం వలన వాసుక్యాది సర్పకుల ముఖ్యులకు సర్పయాగం వలన హాని లేకపోవడమన్నది తెలిసినవాడు కాబట్టి, నీకొచ్చిన భయమేమీ లేదు  అని చెప్పి తక్షకుని తన వద్ద వుండనిస్తాడు. ఇక్కడ వాసుకి తన వంశజులయిన, తన భ్రాతృవంశజులయిన ఎన్నెన్నో మహా సర్పాలు జనమేజయుడు నిర్వహించే సర్పయాగాగ్నిలో పడి దహించుకు పోవడం చూసి శోకతప్త హృదయుడై , తన చెల్లెలయిన జరత్కారువును చూసి ‘ఈ ఉపద్రవం నుంచి మాకు స్వస్తి చేకూరాలంటే అది నీ కుమారుడయిన ఆస్తీకుని వలననే అవుతుంది. అది బ్రహ్మవచనం. యేలాపుత్రుడు ఈ సంగతిని మాకు చెప్పాడు. జరత్కార మహామునికి నిన్నిచ్చి వివాహం చేయడం కూడా ఈ ప్రయోజనాన్ని ఆశించే. ఇంకొక్క నిమిషం సమయం వృధా అయినా  మొత్తం సర్పకులమంతా తుడిచిపెట్టుకు పోయే ప్రమాదముంది. కాబట్టి ఆస్తీకుడు సత్వరం జనమేజయ మహారాజు వద్దకు వెళ్ళి ఆ సర్పయాగాన్ని ఆపేయించేట్లు చేయాలి’ అంటాడు.

అన్న మాటలను విన్న జరత్కారువు, కొడుకును చూసి నీ మేనమామ చెప్పినట్లుగా చేయమంటుంది. దానికి ఆస్తీకుడు ‘అలాగే!ఇప్పటివరకూ పడి దగ్ధమైపోయినవే తప్ప మిగతా ఏ కద్రువకుమారుడినీ ఆ సర్పయాగాగ్నిలో పడనీయను. ఇప్పుడే ఆ సర్పయాగాన్ని ఆపిస్తాను’ అని చెప్పి వాసుక్యాది ప్రముఖులకు మాట ఇచ్చి, వేదవేదాంగ పారగులయిన బ్రాహ్మణోత్తములు తనకు తోడై రాగా జనమేజయుడు చేస్తున్న సర్పయాగ సదనానికి వెళ్ళి, అక్కడ తన దేహంనుంచి వెలువడిన ఉజ్వలమైన కాంతితో నిండి  ఆ ప్రదేశమంతా ప్రకాశిస్తూండగా , స్వస్తివచన పూర్వకంగా ‘చంద్రవంశానికి అలంకారము వంటివాడవై, రాజర్షివై, ధారుణి ప్రజలనందరనూ దయతో ధర్మం తప్పకుండా పాలిస్తూ వున్న  వాడవు’ అంటూ జనమేజయుని, అతనిచే చేయబడుతూన్న యజ్ఞ మహిమను, ఆ యజ్ఞంలో పాల్గొన్న ఋత్విజులను, సదస్యులను, అగ్నిభట్టారకుని పలు విధాల స్తుతించగా, ఆ స్తుతికి  అందరూ సంత్రుప్తులయిన పిమ్మట, జనమేజయుడు ఆస్తీకుని చూసి ‘మునీంద్రా, నీకు ఏది ఇష్టమో చెప్పు, అది ఇస్తాను’అంటాడు.  అందుకు సంతోషించిన ఆస్తీకుడు, ఇప్పుడు నీవు చేస్తున్న ఈ సర్పయాగాన్ని వెంటనే ఆపేయమంటాడు. అక్కడి విప్రజనం కూడా ‘ఇలాంటి విశిష్ఠ  విప్రుడు, మహా తపోధనుడు, పాత్రుడు అయినట్టి వానికి  ప్రియం కలిగేలాగా ఏమిచ్చినా అది మంచికే అవుతుంది కాబట్టి, అతడు కోరినది సంతోషంగా ఇవ్వు మహారాజా!’ అంటారు. ఆ సమయానికి  యజ్ఞమంత్రాల ప్రభావం వలన ఇంద్రుని రక్షణ నుంచి కూడా బయటపడిన వాడైన తక్షకుడు ఇక తప్పక యాగాగ్నిలో పడడానికి దావాగ్నిశిఖలాగా మండుతూ  జనులందరూ ఆశ్చర్యపడేట్లుగా గగన వీధిన వస్తూన్న వాడిని ఆపి ఆస్తీకుడు ‘ఓహో  తక్షకా, ఇక నీవు వెనుకకు తిరిగి వెళ్ళిపో!’ అంటాడు. అలా ‘తల్లి శాపం కారణంగా ప్రారబ్ధమయిన సర్పయాగమనే మృత్యు ముఖం నుంచి వారిని కాపాడాడు ఆస్తీకుడు’ అంటూ అక్కడి సదస్యులు ఎంతగానో సంతోషపడి ఆస్తీకుని స్తుతించారు. జరత్కారు మునీంద్రునికి జరత్కారువుకూ జన్మించిన మహామునియైన ఆస్తీకుని మనసులో తలుచుకుంటే సర్పభయం పోతుందనీ, అంతే కాకుండా ఆ ఆస్తీకుని చరితం విన్న వారికి సర్వపాప క్షయం అవుతుందనీ చెబుతారు.

(ఇక్కడితో నన్నయ భట్టారకునిచే రచించబడిన  శ్రీ ఆంధ్ర మహాభారతం, ఆది పర్వంలో నాగ గరుడోత్పత్తి, సముద్ర మంథనము, అమృత సంభవము, సౌపర్ణోపాఖ్యానము, జనమేజయ సర్పయాగము, ఆస్తీకు చరితము అన్నది ద్వితీయాశ్వాసం, సమాప్తం).

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (8)

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (8)

అప్పుడు పరీక్షిత్తు కలత చెందిన హృదయం కలవాడై, తాను చేసిన దుష్కార్యానికి బాధపడి, శమీకుని ఔదార్యానికి సంతోషపడి, శృంగి శాపానికి భయపడి, తన మంత్రివర్గంతో విచారించి తక్షకుడు తనను సమీపించగాలేని ఏకస్తంభపు మేడను వారిచే నిర్మింపజేసుకుని రాత్రి పవలనేది లేక ఎల్లప్పుడూ అందులోనే జాగరూకుడై, విషప్రయోగాన్ని విరిచివేయగల మంత్ర తంత్రాలు తెలిసిన విషవైద్యులను  దగ్గరలోనే పెట్టుకుని ఉండడం మొదలెడతాడు. అక్కడ తక్షకుడు శృంగి వచనంతో ప్రభావితుడై పరీక్షితుడి వద్దకు ఎలా వెళ్ళాలా అని ఆలోచనలో పడి ఉంటాడు.

ఇదిలా వుండగా, ఆదిని సర్పాలన్నీ భువిపై వున్న జీవులనన్నిటినీ తమ విషాగ్నితో హింసించి చంపుతూండడం చూసిన విష్ణుమూర్తి లోకహితాన్ని కోరినవాడై కశ్యపునకు విషంతో ప్రభావితులైన జీవులను సజీవులనుగా చేసే సంజీవని మంత్రాన్ని ఉపదేశించి వుంటాడు. ఆ కశ్యపుడు ఈ సంగతినెఱిగి ఆ రోజు ఏడవ రోజు కావడం వలన ధర్మపరుడైన పరీక్షిత్తు మహారాజును ఈ సంకటం నుంచి రక్షించి  అతడి వద్ద నుండి అపరిమిత ధనాన్ని, ఆ వెంట లభించే అపరిమితమైన యశస్సును పొందాలని తలచి, హస్తినాపురానికి వెళుతూండగా, తక్షకుడు వృధ్ధ విప్రుని రూపంలో దారిలో ఆ మునికి ఒక వనంలో ఎదురుపడి ఆపి ‘మునీంద్రా, ఎక్కడికి ఏ పనిమీద వెళుతున్నావు’ అని అడుగుతాడు. దానికి కశ్యపుడు ‘తక్షకుడనే పాము ఈ రోజు పరీక్షిత్తు మహారాజును కరుస్తాడట, నేను ధర్మపరుడైన ఆ రాజును నా మంత్రతంత్ర విద్యలచేత దయతో రక్షించడానికి వెళుతున్నాను’ అంటాడు. ఆ మాటలకు నవ్వి ‘ఆ తక్షకుడిని నేనే, అశనిపాతాన్నుంచి అయినా బ్రతికి బయటపడ వచ్చేమో గాని, నా విష ప్రభావాన్నుంచి బ్రతికి బయట పడడం సాధ్యమవుతుందనుకుంటున్నావా? నీ మంత్రంత్రా లేవీ నా వద్ద పని చెయ్యవు. అందు వలన వెనక్కి తిరిగి  వెళ్ళిపో. అలా కుదరదంటే, నా విషప్రభావాన్ని చూడాలనుకుంటే, ఇప్పుడు ఆ వటవృక్షాన్ని కఱిచి నా విషపు అగ్నిలో ఆ మహా వృక్షాన్ని భస్మం చేస్తాను, చేతనయిన వాడవైతే దానిని మళ్ళీ బతికించు’ అని తక్షకుడు ఆ వృక్షాన్ని కాటు వేయగా కనుల ఎదుటే ఆ వటవృక్షం భస్మమై బూడిదై మిగులుతుంది.

కశ్యపుడు ఆ బూడిదనంతా ఒక చోట చేర్చి తన మంత్ర తంత్ర శక్తితో ఆ బూడిదను ముందున్నట్లుగానే వటవృక్షంగా మార్చగా చూసిన తక్షకుడు, ఆశ్చర్యపడి ‘మునీంద్రా, నీ విద్యాబలం చేత ఇది సజీవంగా అయితే అవవచ్చు గాక, కుపితుడైన ముని శాపం తగిలి పోగొట్టుకున్న ఆయుష్షు కలవాడైన పరీక్షిత్తు నా విషప్రభావం తగిలి తిరిగి సజీవుడు కాలేడు. కనుక  అతడిచ్చే ధనం కంటే అధికమైన ధనం నేనిస్తాను. అది తీసుకుని మరలి వెళ్ళిపో’ అంటాడు. కశ్యపుడు కూడా దివ్యజ్ఞానంతో పరికించి చూసి అది అలాగే జరగనున్నదని తెలుసుకుని, తక్షకుడిచ్చిన అనంతమైన ధనాన్ని తీసుకుని మరలి వెళ్ళిపోతాడు.

అయితే, జనసంచారమే లేని ఆ అడవిలో ఆ యిద్దరి మధ్యనే జరిగిన ఈ సంగతి మీ కేలా తెలిసిందనే సందేహం నీకు కలిగితే, అది కూడా చెబుతాము, వినండి అని మంత్రులు ఇలా చెప్పసాగారు – ఆ అడవికి దగ్గరలోనే వున్న పట్టణానికి చెందిన ఒక బ్రాహ్మణుడు కట్టెలకోసం వెళ్ళినవాడు ముందుగానే ఆ వటవృక్షాన్ని ఎక్కివుండి దానితో పాటే దగ్ధుడై మళ్ళీ దానితో పాటే పునర్జీవితుడై  తిరిగి వచ్చి దీనినంతా జనులకు చెప్పాడు. అలా కశ్యపుని వెనక్కి పంపి, తక్షకుడు ఆ క్షణమే నాగకుమారులను పిలిచి మీరు బ్రాహ్మణులై రసవంతాలై  మంచి మంచి రంగులతో వున్న ఆస్వాదయోగ్యమైన పండ్లను తీసుకుని మోదుగ ఆకుల బుట్టలలో పెట్టుకుని పరీక్షితు మహారాజు వద్దకు వెళ్ళి అవి అక్కడ ఇవ్వండని  చెప్పి వాళ్ళను పంపి తాను అదృశ్య రూపుడై వారితోడే వెళతాడు.

అటుపై, బ్రాహ్మణ కుమారుల రూపంలో వున్న వారిని, ఆకర్షణీయమైన  రూపాలతో వున్న వారిని, ఋగ్యజుష పదక్రమం తప్పకుండా చదువుతూ వస్తూన్న వారిని పరీక్షితు మహారాజు చూసి, వారిని దగ్గరకు రండని పిలిచి మెచ్చి వారు ఇచ్చినవన్నీ తీసుకుని ప్రతిగా వారిని తగురీతిని సత్కరించి పంపుతాడు. తరువాత, కాల మహిమచే ప్రేరితుడై ఆ మహారాజు ఆ ఫలాలను తినాలనే కోరిక పుట్టిన వాడై, తన మంత్రులను, చుట్టములను, మిత్రులను పిలిచి ‘నేటి ఏడవ దినం, ముని శాపం ముగిసిపోయే రోజు, సూర్యుడు కూడా అస్తమించే సమయమయింది. ఇక భయం లేదు’ అని ఆ ఫలాలను వాళ్లకు పంచి తానూ ఒకటి తీసుకుని దానిని చీల్చగా, అందులోంచి ఒక చిన్న క్రిమియై, ఆ తరువాత అదే లత్తుక వర్ణంతో పామై విషాగ్ని చిలికేలాగా ఆ రాజును కఱిచి తక్షకుడు మాయమైపోతాడు. అలా ఆ ఏకస్తంభపు మేడతో సహా మీ తండ్రిగారు తక్షక విషాగ్నికి దగ్ధమై పరలోకగతులయ్యారు. ఆ తరువాత జరగాల్సిన పరలోక క్రియలను పురోహితులు ఘనంగా నిర్వర్తించి, మిమ్ములను రాజ్యాభిషిక్తులను చేశారు. ఆ వెనుక, ధర్మ మార్గాన నడుస్తూ, ప్రజలందరికీ మేలు చేస్తూ, అనేక యాగాలలో మంచి దక్షిణలిచ్చి విప్రులను సంతోష పెడుతూ మంచి కీర్తిని సంపాదించుకున్నావు. అలాంటి నీకు ఈమాత్రం అపకారం చెయ్యడం తగనిది కాదు. ఆ తక్షకుడిని వాడి  సహోదరులతో సహా సర్పయాగం నిర్వహించి ఆ యాగాగ్నిలో పడి భస్మమయేలా చెయ్యి’ అని జనమేజయునికి మంత్రులు సమస్తమూ వివరించి  చెబుతారు.

అంతా విన్న జనమేజయుడు, మనస్సులో బాగా కోపం చెందిన వాడై, సర్పయాగం చేయాలని నిశ్చయించుకుని, పురోహితులను ఋత్విజులను తన వద్దకు పిలిపించుకుని, వారితో…

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (7)

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (7)

పరీక్షిత్తు శమీకుని ‘మునీంధ్రా, నా చేతిలో దెబ్బతిన్న మృగం ఒకటి దాని శరీరంలో బాణంతో ఈ వైపు వచ్చింది. అది ఎటు వెళ్ళిందో తమరు గనుక చూసి వున్నట్లయితే చెప్పండి’ అని అడుగుతాడు. దానికి ఆ ముని మౌనవ్రతంలో ఉన్నవాడు కాబట్టి మాట్లాడకపోవడంవల్ల, అది గ్రహించని పరీక్షితుడు ఆయన మౌనానికి  కోపించి ఆ పక్కనే చచ్చి పడివున్న పాము నొకదానిని తన విల్లంబుతో ఎత్తి ఆ ముని కంఠాన్ని తగిలేలా వేసి హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోతాడు.

అదలా వుండగా, ఆ శమీకుని కుమారుడు, విష్ణుని గురించి ఘోరతపస్సులో వున్న వాడైన భృంగి సమానుడు మహా కోపిష్ఠివాడు అయిన శృంగి అనే పేరున్నవాడు,  కృశుడనే ముని వలన తన తండ్రి మెడలో చచ్చి పడివున్న పామును పరీక్షితుడు వేసి వెళ్ళాడన్న సంగతిని తెలిసికొని ఉగ్రుడై,మంత్రజలాన్ని తన చేతిలోకి తీసుకుని , జనసంచారం అనేది లేని ఈ అరణ్యమధ్యంలో అన్ని కోరికలనూ విడిచి పెట్టి, ఆవుదూడలు పాలు కుడిచేటప్పుడు వాటి నోటినుంచి విడుదల అయ్యే నురగనే ఆహారంగా తీసుకుంటూ, మౌనవ్రతం వహించి తపస్సు చేసుకుంటూన్న మహావృధ్ధుడైన నా తండ్రిని అవమానించిన పరీక్షితుడు  నేటినుంచి ఏడు రోజులలోపల తక్షకుని విషమనే అగ్నికి  దగ్ధుడై యమపురికి వెళతాడని శపించి, తన తండ్రి వద్దకు వెళ్ళి, పాము కళేబరం తన కంఠానికి తగిలి వేలాడుతూండడాన్ని పట్టించుకోకుండా స్థిరంగా పరమ ధ్యానంలో ఉన్నవానిని శమీకుని చూసి, ఆ పాము కళేబరాన్ని తీసి అవతల పారవేసి, ఆ క్షణంలో కన్నులు తెరిచిన తండ్రికి  నమస్కరించి, కన్నీరు నిండిన కన్నులతో తాను పరీక్షితునకు ఇచ్చిన శాపం గురించి చెప్పగా, అది విని బాధపడిన శమీకుడు ‘క్రోధం తపస్సును చెరుస్తుంది. ఆ క్రోధమే అణిమాదులైన సకల సద్గుణాలూ పోయలా చేస్తుంది. ధర్మక్రియలకు అడ్డుతగిలేదీ ఆ క్రోధమే. అలాంటి క్రోధంతో ఉడికిపోవడం తపసి అయిన  వాడికి సరిపోతుందా? క్షమాగుణం లేని తపసి చేసే తపస్సు, సంపద, ధర్మం తప్పి వర్తించే ప్రభ్వు రాజ్యం, ఇవన్నీ కూడా ఓటికుండలోని నీళ్ళలాగా అస్థిరాలు నాయనా!’ అంటాడు.

(ఈ సందర్భంలో శమీకుని చేత నన్నయ చెప్పించిన ఈ సుభాషితాలైన కంద పద్యాలు రెండూ చలా చక్కటివి. విషయాన్ని చక్కగా  సంగ్రహీకరించి చెప్పినటువంటివి. సర్వజనీనము సర్వకాలీనము అయినటువంటివి. పదే పదే మననం చేసుకోదగినట్టివి. కంఠోపాఠం చేయదగినటువంటివి. తెలుగులోని అతి గొప్పవైన కందపద్యాలలో ఈ రెండు పద్యాలూ తప్పకుండా చేరతాయి. ఆ రెండు కంద పద్యాలు ఇవి:

“క్రోధమ తపముం జెరచును
గ్రోధమ యణిమాదులైన గుణముల బాపుం
గ్రోధమ ధర్మక్రియలకు
బాధ యగుం గ్రోధిగా తపస్వికి  జన్నే.”

“క్షమలేని తపసి తపమును
బ్రమత్తు సంపదయు ధర్మ బాహ్యు ప్రభు రా
జ్యము భిన్న కుంభమున తో
యములట్టుల యధ్రువంబులగు నివి యెల్లన్.”)

అంతే కాకుండా, ఇంకా ‘క్షమ అనే గుణాన్ని విడిచి నీవు సకజనులకూ రక్షకుడైనటువంటి ప్రభువు పరీక్షితునికి దీనిపై విచారణ అనేదేమీ చేయకుండా శాపం పెట్టి కీడు చేసావు. రాజు చేత రక్షించబడుతూ వుంటూ కదా మహామునులు తపస్సు చేసుకుంటూ, వేద విహితాలైన ధర్మాలన్నిటినీ నడుపుతూ మహా శక్తివంతులై వున్నారు. అలాంటి రాజులకు అపకారం చేయడంకంటే హానికరమైన పని వేరే ఇంకేమి వుంటుంది? అంతేగాకుండా, భరతకుల పవిత్రుడైనటువంటి పరీక్షితుని నీవు సామాన్యునిగా ఎంచడం తగినపనేనా? క్షత్రియులై పుట్టి, భువిపై క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్రులనే నాలుగు జాతుల వారినీ వారివారి ఆచార చరిత్రలను తప్పకుండా పరీక్షితుడు కాచినట్లు ఇంతకు ముందర ఈ భువిని యేలిన  రాజులు ఎవరైనా కాచారా? అతడు వేట అనే వ్యసనాన అలసి దప్పికొనినవాడై వుండి ఆ శ్రమలో తెలియక చేసిన తప్పు పని ఇది. దానిని నేను సహించాను. అందువలన, ఆ మహాత్మునకు నీవు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తిరిగి తీసుకోగలిగితే మంచి అవుతుంది, నేను సంతోషిస్తాను’ అంటాడు.

తండ్రి చెప్పింది ఆలకించిన శృంగి ‘నిజమే, కోపంతోనే ముందు అలా పలికాను. అయితే, కోపంలోంచి వెలువడినవైన ఆ నా మాటల తీష్ణత తక్షకునిలోని విషాగ్నిని ప్రేరేపించకుండా ఎలా సమసిపోతుంది? నా పలుకు అమోఘం కదా!’ అంటాడు. ఆ మాటలకు శమీకుడు బాధపడి, తన శిష్యుడైన గౌరముఖుడనే వానిని పిలిచి, దీనినంతా పరీక్షితునికి వివరించి చెప్పి, తక్షకుని వలన జరగబోయే  ఉపద్రవాన్ని తొలగించుకునే ఉపాయాన్ని తానే చేసుకొమ్మని చెప్పిరమ్మంటాడు. ఆ శిష్యుడు అప్పుడు పరీక్షితుని వద్దకు వెళ్ళి ‘అడవిలో ఏకాంతంగా తపస్సు చేసుకుంటున్న మా గురువుగారైన శమీకునిపై పాము కళేబరాన్ని తమరు వెయ్యడం తెలుసుకున్న వారి కుమారుడైన శృంగి, ఏడు రోజులలోపల ఆ పరీక్షితుడు నా కోపంచేత తక్షకుని విషాగ్నికి  దగ్ధుడవుతాడని కార్చిచ్చులాంటి శాపాన్ని మీకు ఇచ్చాడు. దానిని తెలుసుకున్న మా గురువులు  బాధపడి, ఆ ప్రమాదం తొలగిపోయే విధంగా మంత్ర తంత్ర విధులను నిర్వర్తిస్తూ అప్రమత్తంగా ఉండవలసిందని మీకు చెప్పిరమ్మని నన్ను పంపించారు’ అని చెప్పి వెళ్ళిపోతాడు.

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (6)

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (6)

వాసుకి అలా జరత్కారునికోసం ఎదురుచూస్తుండగా, ఆ జరత్కారడనే ముని బ్రహ్మచర్య నియమాన్ని కఠోరంగా పాటిస్తూ పెళ్ళిమీద ఆలోచన అనేది లేకుండా ఒంటరివాడుగానే  లోకమంతా తిరుగుతూ, ఒకనాడు ఒక వనంలో ఒక పెద్ద తొఱ్ఱలో ఒక పెద్ద ఎలుకచే క్రమంగా కొరకబడుతూన్న వీరణ మనే చెట్టు వేరును ఆధారంగా చేసుకుని తలక్రిందులుగా వుండి సూర్యకిరణాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వ్రేలాడుతూన్న ఋషులను కొందరిని చూసి వారి వద్దకు వెళ్ళి ‘ఇలా తలక్రిందులుగా వ్రేలాడుతూ చాలా కష్ట పడుతూ చేస్తున్న ఇది కూడా ఒక రకమయిన తపస్సేనా, నాకు తెలిసేలా చెప్పండి, నేనూ ఈ తపస్సు చేస్తాను’ అని అడగగా, దానికి ఆ విప్రులు ‘నాయనా, ఇదేం తపస్సు,  సంతాన హీనులమూ, అదృష్టహీనులమూ అవడం చేత, మా మనస్సులలో చాలా దుఃఖితులమవడం వలన ఏ ఆధారమూ లేని వారమై అధోలోకాలకు వెళ్ళేదారిలో ఇలా వ్రేలాడుతున్నాం. మందభాగ్యులమైన మా యాయావర వంశంలో జరత్కారుడనే ఒక పాపకర్ముడు  పుట్టి పెళ్ళాడడానికీ, సంతానవంతుడవడానికీ ఇష్టపడక వున్నాడు. మేము వాడి పితృపితామహములం.  మేము ఇప్పుడు పట్టుకుని వేలాడుతున్న ఈ వట్టివేరులనన్నిటినీ యముడు మూషికమై తరతరాలుగా కొరుకుతూ వస్తూండగా, చివరకు ఇప్పటికి ఈ ఒక్క వేరే ఆధారంగా మిగిలి వుంది. ఇది కూడా ఈ జరత్కారుడు పెళ్ళాడకుండా అలాగే మిగిలిపోయిన అనంతరం తెగిపోయి మేము అధఃపాతాళానికి  వెళ్ళిపోతాం. అలా కాకుండా, అతడు పెళ్ళిచేసుకుని సంతావంతుడయితే, ఉన్నతలోకాలకు వెళతాం. నీవేవరివో గాని, మా చుట్టం లాగా వచ్చి, మా ఈ మాటలన్నీ ఆలకించావు కాబట్టి, నీకు గనుక ఆ జరత్కారుడు కనుపించి నట్లయితే, అతడికి ఈ సంగతి నంతటినీ చెప్పి, మేము పడుతున్న అవస్థలను మామీద దయయుంచి విన్నవించు నాయనా!’ అని కోరతారు.

వారి మాటలను విన్న జరత్కారుడు ఎంతగానో చింతించి, ఇక తొందరగా పెళ్ళిచేసుకోవాలని నిశ్చయించుకుని తన పితృవర్గంతో ‘నేనే ఆ జరత్కారుడను, మీరు నా పితృదేవతలు నాకు ఆరాధ్యులు, అలాంటి మిమ్మల్ని ఇలా చూడడం నాకు ఎలా సంతోషంగా వుంటుంది? ఇప్పుడిక అత్యవసరంగా పెళ్ళిచేసుకోవడం నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ఆ కోరిక  ఇప్పుడు కలిగింది నాకు’ అని విన్నవించుకుంటాడు. దానికి ఆ మహామునులు జరత్కారుని మాటలకు సంతోషించి ‘చూడు నాయనా, తమకు తగిన సత్పుత్రులను పొంది, ధర్మము తప్పకుండా వర్తించుకుంటూ వుండేవారు ఉత్తములచే  పొగడబడుతూ సద్గతులను అవలీలగా  పొందుతారు. అత్యంత ఘోరమయిన నియమనిష్ఠలతో తపస్సులు చేసీ, మంచి మంచి దక్షిణలను ఇచ్చీ, ఎన్నో యజ్ఞాలను చేసీ కూడా అపుత్రకులైన వారు అంతటి సద్గతులను పొందలేరు. కాబట్టి  నీవు వేగిరం పెళ్ళిచేసుకుని సంతానవంతుడవై  మమ్ములనూ ఉత్తమలోకాలకు పోయేటట్లుగా చెయ్యి’ అంటారు.

అలాగే నన్న జరత్కారుడు’నా పేరును పోలిన పేరు కలిగిన స్త్రీతోనే నాకు పెళ్ళి జరగాలి’ అని వారితో చెప్పి, వారి వద్ద సెలవు తీసుకుని, తన పేరును పోలిన పేరున్న కన్య కోసం వెదుకుతూ భూవలయమంతా తిరుగుతూ, ఎంతకూ తన కోరికకు తగినట్లుగా తన పేరుకు అనురూపమైన పేరున్న కన్య కనపడక వుంటాడు.

ఈ సంగతిని తన వేగుల ద్వారా తెలుసుకున్న వాసుకి తన చెల్లెలైన జరతకారువును జరత్కార ముని వద్దకు తీసుకుని వెళ్ళి ‘ధన్యులైన మీతో సంబంధంతో మా జన్మ కూడా ధన్యమయినట్లుగా భావిస్తాం స్వామీ, దయతో నా చెల్లెలయిన ఈమెను వివాహమాడ వలసింది’ అని కోరతాడు. ఆ మాటలకు తన పేరును పోలిన పెరుతోనే వున్నది కాబట్టి ఆ కన్యను పెళ్ళాడి, వారి ప్రథమ సమాగమం నాడు ఆమెతో ‘నాకు ఎప్పుడైనా సరే నీవు గనుక అవమానం చేసినట్లయిన, ఆ క్షణమే  నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను సుమా’ అంటాడు. అనాటి నుంచి భర్త మాటను జవదాటక వర్తించుకుంటూ, ఆమె అతనికి రేయిపవలనక అన్ని సపర్యలు చేస్తూ వుంటుంది. అలా రోజులు గడుస్తుండగా, ఒక నాడు జరత్కారుడు, తన భార్య  ఊఱుప్రదేశాన్ని తల దిండుగా చెసుకుని నిద్రిస్తుండగా, సూర్యుడు అస్తమించే సమయం అవుతున్నాకూడా ఆ సమయాన సంధ్యాసమయోచిత కర్యాలేమీ నిర్వర్తించకుండా ఆశ్రమవాసులైన మునులు వుండడం చూసిన ఆమె మనసులో ‘సంధ్యా సమయంలో చేయవలసిన విధులు చేయకపోవడం వల్ల ధర్మలోపం అవుతుందని తెలిసినదానవై వుండి కూడా నన్నెందుకు నిద్ర లేపలేదని కోపిస్తాడేమో?’ అని ఒక వంక, మరొక వంక ‘అలా చేస్తే, నాకు నిద్రాభంగం కలిగిస్తావా అని కోపిస్తాడేమో?’ అని తర్జనభర్జన పడుతూ, చివరకు అలా కోపించినప్పటికీ సహించవచ్చు గాని, ధర్మక్రియలకు లోపం జరగడం వల్ల  కలిగే బాధను హృదయంలో భరించడం కష్టమని నిశ్చయించుకున్నదై భర్తను నిద్ర లేపుతుంది. నిద్ర నుంచి మేలుకున్న జరత్కారుడు ఆమె తలచినట్లుగానే ‘నా నిద్రను ఎందుకు చెడగొట్టావు?’ అని కోపించి అడుగగా ‘సూర్యుడు అస్తమించబోతున్నాడు కనుక నిద్ర నుంచి లేపవలసి వచ్చింది’ అని చెప్పిన ఆమెకు ‘నేను నిద్ర నుంచి లేచే దాకా ఆగకుండా, సూర్యుడు మాత్రం అస్తమిస్తాడని ఎలా అనుకున్నావు? అలా భావించి నీవు నాకు అవమానం తలచావు. నేను నీకు ముందు చెప్పినట్లుగానే ఇక నీ వద్ద వుండబోను. అయితే, ఇప్పుడు నీ గర్భంలో వున్న వాడు సూర్యుని తేజస్సుతో సమానమయిన తేజస్సు కలిగినవాడు, మన ఇద్దరి వంశాలకు పట్టిన దోషాన్ని దుఃఖాన్ని పోగొట్టగల సమర్ధుడు. అందుచేత నీవు బాధపడక నీ అన్న దగ్గరకే వెళ్ళి వుండు’ అని జరత్కారుడు  ఆమెను ఓదార్చి తాను తపోవనానికి వెళ్ళిపోతాడు.

జరత్కారుడు అలా అమెను వదిలి వెళ్ళిపోగా, తన అన్నయైన వాసుకి వద్దకు వెళ్ళి జరిగిన సంగతినంతా వివరించి చెబుతుంది జరత్కారువు. ఆ మీదట కొన్నాళ్ళు గడిచి జరత్కారువుకు ఆస్తీకుడు జన్మిస్తాడు. చ్యవనుని కుమార్తె యైన ప్రమతితో బాల్యం నుంచి కలిసి వేదవేదాంగాలూ చదువుకుని సకల శాస్త్రాలలోని సారాన్ని తెలుసుకున్నవాడై అధిక సాత్వీకుడు ఆస్తీకుడని అందరి మన్ననలనూ పొందుతాడు.

ఇదిలా వుండగా, అక్కడ జనమేజయుడు తక్షకుని విషమనే అగ్ని వలన తన తండ్రి మరణం సంగతి ఉదంకుని వలన తెలుసుకున్నవాడై, తన మంత్రులను పిలిచి ఆ సంగతేమిటో సవిస్తరంగా చెప్పమంటాడు. దానికి మంత్రులు ఇలా చెప్పసాగారు:

‘అభిమన్యునకు విరాటరాజు కూతురైన ఉత్తరకు కౌరవ వంశక్షయం జరుగిపోయిన సమయంలో జన్మించిన పరీక్షితుడు అనే మహారాజు ధర్మార్ధకామములను తప్పక పాటిస్తూ భూ ప్రజలను రక్షిస్తూ అరవై ఏండ్లు పాలించి, అధిక ధర్మమూర్తివైన నీవంటి పుత్రుని పొందినవాడూ అయిన   నీ తండ్రి, తన ప్రపితామహుడైనటువంటి పాండురాజుకు లాగానే వినోదార్ధం ఒకనాడు వేటకు వెళ్ళి అడవిలో చాలా మృగాలను పడగొట్టి, ఆపై తనచేతిలో వేటుపడి తప్పించుకు పాఱిపోయిన ఒక మృగాన్ని వెంబడిస్తూ వెళ్ళుతూ మధ్యలో శమీకుడనే ఒక మునీంద్రుని చూసి ఆగి….

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (5)

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (5)

అలా స్నేహితునిగా ఉండమని ఒడంబడిక కుదుర్చుకుని దేవేంద్రుడు గరుడునితో ‘నా కోరికను  ఒప్పుకున్నావు. మఱి నీకు ఇష్టమైనది ఏమిటో చెప్పు’అని అడుగగా ‘దుర్మతులైన ఆ కద్రువ పుత్రులు నాకు ఆహారమవాలి’ అంటాడు గరుడుడు. ‘నీచే రక్షించబడుతున్న ఈ భువనాలలో సర్పాలు తిరుగుతున్న సంగతిని నీకు తెలియ జేయడం, ఆపై ఇలా నీ నుంచి అనుజ్ఞను పొందడం  అన్నది నా వల్ల జరగాల్సి వున్నది కదా!’ అని  దేవేంద్రుని వద్దనుంచి పాములు తనకు ఆహారమయ్యే వరాన్ని పొంది, అక్కడనుంచి బయలుదేరి వెళ్ళి కద్రువ పుత్రులను చేరి వారికి అమృతకలశాన్ని చూపి  దానిని వొద్దికగా  పరచబడివున్నదర్భలపై  పెట్టి ‘దేవేంద్రుని ఆధీనంలో భద్రంగా రహస్యంగా  ఉంచబడిన ఈ అమృతాన్ని నేను మీరు కోరిన ప్రకారం తెచ్చి ఇచ్చాను. ఇక ఇప్పటితో నా తల్లి దాస్యం తీరింది. మీరు స్నానాదికాలు ముగించుకుని  పరిశుధ్ధులై వచ్చి ఈ అమృతాన్ని సేవించండి’ అని చెప్పి తల్లిని తన వీపుపై ఎక్కించుకుని అదృశ్యుడుగా  అక్కడే వున్న ఇంద్రుని వద్ద సెలవుతీసుకుని వెళ్ళిపోతాడు.

ఇక పాములన్నీ  అమృతాన్ని సేవించాలనే కుతూహలం వాటిలో వాటికి పెరిగిపోగా స్నానాలంకృతులై రావడానికి ముందరనే ఇంద్రుడు అమృతకలశాన్ని తీసుకుని అమరపురికి వెళ్ళి ఆ కలశాన్ని అది ముందర వున్న ప్రదేశాననే భద్రంగా వుంచి అమృతాన్ని రక్షించుకున్నవాడై సంతుష్టుడవుతాడు. అలా జరగగా, సర్పాలన్నీ అమృతాన్ని సేవించే మార్గం కనుపించక, ఆ కలశం వుంచిన ప్రదేశం కదా అని ఆ దర్భలనే కోరికతో నాకగా, వాటి నాలుకలు రెండుగా చీలడం వలన, ఆ నాటనుంచి అవి రెండునాలుకలు కలవిగా అయిపోయాయి. ఆ క్రమంలో అమృతం వాటిపై వుంచబడడం వలన అమృతస్పర్శచేత దర్భలు పవిత్రమై మిగిలాయి. ఇలా సాగిన ఈ కథ సౌపర్ణాఖ్యానంగా ప్రసిధ్ధమై ఇది విన్నవారికి సకల సంపదలూ, సర్ప భయం వలన రక్షణా కలుగుతాయని చెప్పబడింది.

ఇలా పాములు అమృతాన్ని సేవించడంలో విఫలమై వెళ్ళిపోగా, శేషుడు తన తల్లి, తమ్ములు చేసిన అధర్మానికి మనస్సులో నిర్వేదం చెంది వాళ్ళను విడిచిపెట్టి గంధమాదన బదరీవన గోకర్ణ పుష్కరారణ్య హిమవంతాది పుణ్య స్థానాలలో అనేక సహస్ర వర్షాలు బ్రహ్మను వుద్దేశించి తపస్సు చేయగా, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు. అప్పుడు శేషుడు ‘నా తల్లి తమ్ములు మూర్ఖులై ధర్మం తప్పి వినతకు వైనతేయునకు అపకారం చేశారు. వారు ఎప్పిటికయినా  ఇలాగే అది సహించక కీడు చేస్తూనే వుంటారు. అది నేను సహించలేను. వారితో నాకు పొత్తు వద్దు. ఇలాగే తపస్సు ద్వారా శరీరాన్ని  శుష్కింపజేసుకుంటూ చివరికి ఈ శరీరాన్ని విడిచిపెట్టదలచాను  స్వామీ!’ అంటాడు. ఆ మాటలకూ, శేషుని సమబుధ్ధికి మెచ్చిన బ్రహ్మదేవుడు ‘నిత్య సత్య ధర్మ నిరతుడవు, అఖిలాన్ని మేయగల సమర్ధుడవు అయిన నీకు ఇది సరయినదికాదు,ఈ భూభారాన్ని నిష్ఠతో నీవే వహించాలి’ అంటాడు. ఇంకా ‘వినతకు కొడుకైన వీరుడు, కశ్యప వాలఖిల్యాది మునుల వరమును పొందిన వాడూ, ఇంద్రుని స్నేహాన్ని సంపాదించుకున్న వాడూ అయిన గరుడుడు అందరి మన్ననలనూ పొందిన వాడు కాబట్టి అతనితో సఖ్యంగా వుండు. ఇది నీవు చేయవలసిన పని’ అని చెబుతాడు. అలా బ్రహ్మదేవుడు చెప్పిన మాటలను ఆలకించి శేషుడు అఖిల భూభారాన్ని తనపై వేసుకుని, గరుడునికి మిత్రుడై వుండసాగాడు.

అదలా వుండగా, ఇక్కడ వాసుకి, తల్లి శాపంచేత జనమేజయుడు చేసే సర్పయాగంలో సర్పకులానికి అంతటికీ జరగబోయే ప్రళయాన్ని తలుచుకుని భయపడుతున్నవాడై , తన బంధువులను ఐరావతాది సహోదరులను అందరినీ పిలిపించి ‘అనంతుడు బ్రహ్మ నుద్దేశించి తపస్సుచేసి మొత్తం భూభారాన్ని తనపై వేసుకుని మోస్తూ ఉన్నతకార్య యుక్తుడై మనందరి పొత్తు వదిలి పెట్టి తనకు తాను సుఖంగా వుంటూ మనకు ఒకనాటికి జరగబోయ ప్రళయాన్ని గురించి ఏమాత్రం ఆలోచించకుండా వున్నాడు. అయితే, అప్పుడు అమృతం కోసంగా మనం చేసిన సాగర మథనం సందర్భంలో మంథరపర్వతానికి నేను కట్టుత్రాడునై పడిన కష్టానికి అమరులందరూ పితామహుని ప్రార్ధించి నాకు క్షయం లేకుండానూ, సకల భయాలనుంచి విమోక్షణమునూ నాకు వరంగా ఇప్పించారు. అయినాకూడా, తల్లి శాపంచేత సర్పకులానికి జరగబోయే వినాశనం నాకు మనక్షోభను కలిగిస్తూ ఆ దుఃఖం భరించరానిదిగా వుంది. దానిని తప్పించుకునే ఉపాయం ఏదైనా వుందా? ఏమిటి చేయడం?’ అని అడుగగా, ఆ మాటలకు  మిగతా పాములన్ని ధైర్యంచేసి  ‘దానికి ఒకటే మార్గం. జనమేజయుడు చేయబోయే యాగానికి అందరం కసిలి విఘ్నం కలిగిద్దాం. అతడు ధర్మపరుడు కాబట్టి ఆ తరువాత అతడినే ఈ పని చేయవద్దని అడుగుదాం. కొందరం అతడికి ఈ పని వలన ఇహపరములలో జరగబోయే  నష్టాన్ని గురించి అర్ధమయేలా వివరిద్దాం. కొందరం భక్ష్య భోజ్య పానీయాల మీద పడీ, కొందరం అక్కడ ఉండే బ్రాహ్మణులమీద పడి వారిని భయంతో  ఆ యాగం చేయించడమనే పనిని విడిచిపెట్టి అక్కడినుంచి పాఱిపోయేలా చేద్దాం’ అంటారు. అలా చెప్పగా విని, వారిలో కొందరు బుధ్ధిమంతులయిన నాగముఖ్యులు ‘అయ్యలారా, ఈ పనులన్నీ మీరు చేయగలుగుతారని అనుకోవద్దు. ఆ క్రతు సమయంలో బ్రాహ్మణులు చదివే మంత్రాలనుంచి పుట్టే దారుణమయిన అగ్ని శిఖలను తట్టుకుని ఈ పనులు చేయడం అసలు సాధ్యమయేది కాదు’ అంటారు.

ఆ మాటలను విన్న యేలాపుత్రుడనే పేరున్న నాగప్రముఖుడు ‘శాపమిచ్చిన  రోజున తల్లి ఒడిలో నిద్రపోతున్నట్లుగా వుండి అమరవరులకు విష్ణుదేవునకు మధ్య జరిగిన అన్యోన్య సంభాషణను నేను విన్నాను. ఆ సంభాషణ సారాన్ని సవిస్తరంగా చెబుతాను వినండి. అమ్మ మనకు శాపం ఇచ్చిన తరువాత, అమరులందరూ విష్ణువు వద్దకు వెళ్ళి, స్వామీ కద్రువ కడు నిర్దయురాలై ఇంత అనంత బలవీర్య సంపన్నులయిన కొడుకులపై అలిగి వారికి అకారణంగా దారుణమైన శాపాన్ని ఇచ్చింది. మీరుకూడా వారించకుండా ఊరకే ఉండిపోయారు. ఇది తప్పిపోయే ఉపాయం ఏదైనా వుందా లేదా చెప్పండి అని వేడుకోగా, అంతా విన్న కమలసంభవుడు, క్రూరమైన అకారాలతో ఉండి, జగత్తుకు  అపకారంచేసే సర్పాలను భరించగా లేని ఈ భువికి హితం జరిగేలాగా, దుష్టమైనవైన పాముల సంహారం ఈ విధంగా జరిపించవలసి వచ్చింది. అయితే, సకలలోకాలకూ హితవు చేసేవిగా ప్రసిధ్ధాలయిన నాగముఖ్యులను అందరినీ వాసుకి చెల్లెలైన జరత్కారువునకూ ఆమెను పెళ్ళాడే జరత్కారుడనే మునికి జన్మించే ఆస్తీకుడనే మహాముని, జనమేజయుడు చేయబోయే సర్పయాగాన్నుంచి కలిగే ప్రళయాన్నుంచి కాపాడతాడు అని పితామహుడైన విష్ణువు దేవతలకు చెప్పగా విన్నాను’ అని చెప్పగా ఆ మాటలకు వాసుక్యాది నాగముఖ్యులంతా ఎంతగానో సంతోషించి యేలాపుత్రుని ఎత్తుకుని పలువిధాలుగా అభినందిస్తారు.

వాసుకి ఆనాటినుంచి  జరత్కారుడు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడా అనీ, ఆ సమయం ఎప్పటికి వస్తుందా అనీ ఎదురుచూస్తూ వుంటాడు.

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (4)

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (4)

అలా గరుడుడు అమృతం తేవడానికి ఆకాశ మార్గానికి ఎగరగానే, అక్కడ దేవలోకంలో సభతీరి వుండి దేవేంద్రుడు చూస్తూండగానే అగ్ని వర్షం కురవడం, వజ్రఘాతాల వంటి పిడుగులవర్షం  కురవడం, చేష్టలుడిగి దిక్పాలకుల గుండెలు ఆ హటాత్పరిణామానికి భయకంపితమవడం జరుగుతుంది.

ఈ విపరీత పరిణామలను చూసిన దేవేంద్రుడు, దేవగురువైన బృహస్పతిని ‘దీనికి కారణమేమిట’ని అడుగగా, అంతా అవలోకించిన బృహస్పతి, ‘బ్రాహ్మణుడగు కశ్యపబ్రహ్మ వరం వలన వినతకు జన్మించి, వాలఖిల్యాది మునిగణం దయవలన పక్షికులానికి ఇంద్రునివంటివాడై మహాబలశాలియైన గరుడుడు తన తల్లి దాస్యవిముక్తి కోసమై అమృతాన్ని తీసుకు పోవడానికి వస్తున్నాడు, కామరూప సంపన్నుడు కామగమనుడు అతడు, నీవు గెలవగాలేని వాడు’ అని చెప్పి, ఇంకా ‘ఆ గరుడుని మహత్త్వాన్ని గురించి నీవు పూర్తిగా ఎఱుగవు. అతడు పూర్వం కశ్యప ప్రజాపతి పుత్రునికోసం నీబోటి దేవగణాలను, వాలఖిల్యాది మహాముని గణాన్ని తనకు సహాయులనుగా చేసుకుని పుత్రకామేష్టి చేయడానికి పూనుకున్న సందర్భంలో, అధికబలంతో వున్న నీవు నీ బలానికి తగిన పెద్ద పరిమాణంలో ఆ క్రతువుకు కావలసిన వంటచెఱకును అవలీలగా మోసుకునివస్తూ, ఆ వెంటనే నిత్యం నియమ నిష్ఠలతో చిక్కినవైన శరీరాలతో వున్న వాలఖిల్యులు  తక్కువ పరిమాణంలో వున్న దర్భ మోపులను కూడా మోయలేక శరీరాలు వణుకుతూ వగరుస్తూ రావడాన్ని చూసి అపహాస్యం చెయ్యగా, దానికి వారు సిగ్గుపడి కోపించి నీకంటే వంద రెట్లు బలవంతుడైన వాడు, నీవు జయించగాలేని వాడు, రెండవ ఇంద్రుడు కాగలిగినవాడు కశ్యపునకు  పుత్రుడుగా జన్మించాలని మహావీర్యవంతాలైన మంత్రాలను ఆ యజ్ఞంలో వ్రేలుస్తూ చదువుతుండగా, అదంతా తెలుసుకున్న నీవు బెంగపడి కశ్యపుని  వద్దకు వెళ్ళి కరుణించమని ప్రార్ధించావు. అప్పుడు కశ్యపుడు ఆ మునులతో మీరు ఇలా బ్రహ్మనియుక్తికి విరుధ్ధంగా రెండవ ఇంద్రుని చేయబూనడం సబబుకాదు, అది విపరీతాలకు దారి తీస్తుంది, అయినా మీ క్రియ, వాక్కు అమోఘం కాబట్టి ఈ క్రతువు ఫలితంగా  నాకు జన్మించే కుమారుడు పక్షికులానికి అంతటికీ ఇంద్రుని వంటివాడు అయేలా  చిత్తగించండి అని వారిని సమాధాన పరిచి నీ ఇంద్రత్త్వానికి భంగం కలగకుండా చేసి, ఏక ఇంద్రత్త్వాన్ని సముధ్ధరించాడు. అలాంటి కశ్యప్రజాపతికి  యజ్ఞ మహిమ వలన, వాలఖిల్యుల తపోమహిమ వలన వినతకు జన్మించిన విహగేంద్రుడైన గరుడుడు ఇప్పుడు అమృతాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్న కారణంచేత ఈ స్వర్గలోకంలో మహోత్పాతాలు కలుగుతున్నాయి’ అని అంతా  వివరించి చెబుతాడు.

బృహస్పతి చెప్పినదంతా విన్న ఇంద్రుడు, అమృతాన్ని సదా రక్షిస్తూ వుండే వారందరినీ తన వద్దకు పిలిచి ఎలాగైనా సరే అమృతాన్ని రక్షిస్తూ వుండాలని చెబుతాడు. వారు దానికి సరేయని, యుధ్ధ సామగ్రినంతా సిధ్ధంచేసుకుని యుధ్ధానికి సన్నధ్ధులై వుండగా, అకాశాన్నుంచి పిడుగులాగా గరుడుడు ఒక్కపెట్టున వారిపై పడి వారందరినీ భయభ్రాంతులను చేసి, చెల్లాచెదురు చేసి అమృతాన్ని దక్కించుకోవడానికి అమృతం దాగి  వున్న దిక్కుగా వెళతాడు. అంతలో తేరుకున్న అమృతరక్షకులు గరుడునిపై తమ శస్త్రాస్త్రాలతో విరుచుకు పడతారు. యుధ్ధం మొదలవుతుంది. గరుడుడు తన రెక్కల రజోవృష్టి తో అమరవీరుల దృష్టిని కప్పి అమరలోకాన్ని నిరాలోకంగా చేస్తాడు. ఇంద్రుని పనుపుతో వాయుదేవుడు ఆ రజోవృష్టి చెదిరేలాగా గాలి వీస్తాడు. యుధ్ధం కొనసాగుతుంది. గరుడుని ధాటికి తట్టుకోలేని అమరవీరులు ఓడిపోయి రక్తసిక్తాలైన శరీరాలతో తలోదిక్కూ పరుగులుపెడతారు.

ఇలా అమరవీరులను ఓడించిన గరుడుడు అమృతం వున్న చోటికి చేరుకుని, అక్కడ అమృతానికి రక్షణగా చుట్టూ  కమ్ముకుని వున్న మహాగ్ని శిఖలను చూసి, సకల నదుల జలాలను తన పుక్కిట పట్టి వచ్చి ఆ అగ్నిశిఖలు ఆరిపోయేట్లుగా వాటిపై చల్లి, ఆపై దేవతలచేత తయారుచేయబడి అమృతం చుట్టూ రక్షణగా తిరుగుతూ వున్న అంతరచక్రంలోకి సూక్ష్మ దేహుడై చొరబడి  అక్కడ అమృతానికి రక్షణగా వున్న రెండు పెద్ద పాములను చూసి వాటినీ తన రెక్కల రజోవృష్టి తో అంధులైపోయేలా చేసి  వాటి శిరస్సులను తొక్కి, ఆ వెంటనే పరాక్రమంతో అమృతాన్ని చేజిక్కించుకుని గగన వీధికి ఎగురుతాడు.

అలా యుధ్ధంలో అమరవీరులను పలువురను ఓడించి విజయంపొంది, ఒక్కడుగా అమృతాన్ని చేజిక్కించుకుని దానిని ఆస్వాదించక అలోలుడై వున్న గరుడుని చూసి శ్రీహరి ‘నీ విరత్వానికి, అలౌల్యానికి, సచ్చింతనకు మెచ్చి వరం ఇవ్వడానికి వచ్చాను, నీకు ఇష్టమైనది కోరుకో’ అంటాడు. అలా ప్రసన్నుడై అనుజ్ఞ యిచ్చిన  శ్రీమన్నారాయణునికి నమస్కరించి, గరుడుడు ‘స్వామీ, అమృతాన్ని తాగకపోయినప్పటికీ కూడా నాకు అజరామరత్వాన్ని, అఖిలలోకాలకూ పెద్దవు పూజనీయుడవు అయిన నీ చెంతనే సదా ఉంటూ నీన్ను భక్తితో  సేవించుకునే భాగ్యాన్ని నాకు కరుణతో  కలుగజెయ్యి’ అని వేడుకుంటాడు. గరుడుడు కోరినట్లుగానే శ్రీహరి అడిగిన వరాన్ని ప్రసాదించి  ‘నీవు నీ అభిమతానికి తగినట్లుగా నాకు వాహనమై, మహాధ్వజమువై ఉండు’ అంటాడు. మహాప్రసాదమని స్వీకరిస్తాడు గరుడుడు. అంతలో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని గరుడునిపైకి ప్రయోగించగా, అది అగ్నికణాలను వెదజల్లుతూ గరుడుని రెక్కలను తాకబోయేంతలో, దానిని చూసి గరుడుడు నవ్వి ‘నీవు చెయబోయే హాని నన్ను తాకలేదు. నీవు దేవేంద్రుని ఆయుధానివి కావడంవలన నిన్ను అవమానించడం తగదు గనుక నా రెక్కలోని ఒక చిన్న ఈకను ఛేదించి వెళ్ళు. నాపై నీ శక్తి అంతమాత్రమే సుమా!’ అనగా, సకల దేవగణం గరుడుని రెక్కల బలానికి మెచ్చి  సుపర్ణుడని పొగుడుతారు. దేవేంద్రుడు కూడా గరుడుని శక్తిసామర్ధ్యాలకు మెచ్చి, ఆశ్చర్యంతో ‘అసమానమైన శౌర్యం కల నీతో స్నేహం చేయాలని నాకు కోరికగా ఉంది. అమరుడవు, అజరుడవు, అజితుడవు, అమేయుడవు నీవు. అలాంటి నీకు అమృతంతో పని ఏమిటి? ఇది పొరబాటున పరులకు చిక్కితే, వారు అమరులకు అసాధ్యులవుతారు గదా! అందువల్ల, ఈ అమృతాన్ని నాకు తిరిగి ఇచ్చేస్తే, నీకు ఇష్టమయిన కార్యం సిధ్ధించే మార్గం నేను కనుగొని చేస్తాను’ అంటాడు. అందుకు గరుడుడు సమాధానంగా ‘నేను నా తల్లి దాసీత్వాన్ని పోగొట్టడానికి అమృతాన్ని తీసుకుని వస్తానని కద్రువ పుత్రులతో చెప్పి వచ్చాను. ఈ అమృతాన్ని తీసుకుని వెళ్ళి వారికిచ్చి నా తల్లిని దాసీత్త్వాన్నుంచి తప్పిస్తాను. అయితే, ఆ పాములు ఈ అమృతాన్ని సేవించే లోపల నీవు వారి వద్దనుంచి తీసేసుకుని వెళ్ళిపో’ అనగా, గరుడుని ఆ ఉపాయానికి సంతోషించిన దేవేంద్రుడు ‘నీ బలపరాక్రమాలను గురించి వినాలని కోరికగా ఉంది , చెప్పు’ అంటాడు. దానికి గరుడుడు ‘ఇతరులను నిందించడం, స్వంతాన్ని గురించి గొప్పలు చెప్పుకోవడం సత్పురుషులైన వారికి తగని పని. అయినప్పటికీ, నీవు అడిగావు గాబట్టి నా సంగతి కొంతగా చెబుతాను, విను’ అని ‘ఈ భూవలయాన్ని మొత్తాన్నీ నా వీపున మోయగల వాడను. దాటనలవి కాని  ఈ సముద్ర జలాలను రత్నముల రాశితో సహా నా రెక్కల బలంతో చల్లివేయగల వాడను, ఒక్క క్షణంలోనే త్రిజగాలనూ చుట్టి రాగల వాడను’ అంటాడు.ఇలా చెప్పిన గరుడుని జవసత్త్వాలకు ఇంద్రుడు మెచ్చుకుని, ‘ఇకపై నీవు నాకు ఎప్పుడూ స్నేహితుడవై వుండు’ అని కోరతాడు.

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (3)

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (3)

‘నాయనా, వాయుదేవుడు నీ రెక్కలను, చంద్రుడు నీ వీపును, అగ్నిదేవుడు నీ శిరస్సును, ఇంకా సూర్యుడు నీ సమస్త దేహాన్ని సదా రక్షిస్తూ వుంటూ నీకు అన్ని పనులలో జయాన్ని కలిగిస్తూ వుంటారు’ అని మనసులో ఆనందపడుతూ దీవిస్తుంది. గరుడుడు తల్లి దీవనలను పొంది, ప్రయాణానికి సన్నధ్ధుడై వెళ్ళబోతూ ‘అమ్మా, అమృతాన్ని తేవడానికి నాకు చాలా బలం కావాలి, దానికి నేను తీసుకోవాల్సిన ఆహారం ఏమోటో చెప్పు’ అని అడుగుతాడు. దానికి వినత సమాధానంగా ‘సముద్రగర్భంలో నిషాదులని అసంఖ్యాకులైన జనులు  భూమి మీద జనులకు కష్టాలు కలిగించేవారు వున్నారు. వాళ్ళను భక్షించి వెళ్ళు. అయితే, ఆహారం  విషయంలో తగు జాగ్రత్తగా వుండు, ఎప్పుడూ బ్రాహ్మణుడిని  మాత్రం ఆహారంగా తీసుకోవద్దు’ అని చెబుతుంది. అందుకు గరుడుడు ‘అయితే, బ్రాహ్మణుని గుర్తించే విధానం ఏమిటి?’ అని అడుగుతాడు. దానికి వినత ‘ఎవడైతే భక్షణ సమయంలో గొంతునుండి క్రిందికి దిగక అడ్డంపడి అగ్ని లాగా మండుతాడో, అతనిని బ్రాహ్మణునిగా గుర్తించు’ అని చెబుతుంది. ఆ విషయమే ఇంకా చెబుతూ ‘కోపితుడైన బ్రాహ్మణుడు ఘోర శస్త్రతుల్యమై  మహా విషంతో సమానమవుతాడు. పూజించబడితే జనులందరికీ కోరిన కోరికలను తీర్చేవాడూ ప్రీతికరుడూ అవుతాడు’ అని కూడా చెబుతుంది.

తల్లి చెప్పిన బ్రాహ్మణ స్వరూపాన్ని తెలుసుకున్న గరుడుడు, ఆమె పాదాలకు మ్రొక్కి, వీడ్కోలు తీసుకుని త్వరిత గతిన వెళ్ళి సముద్ర గర్భంలో వేలకు వేలుగా వున్న నిషాదులను అనేకులను పాతాళాన్ని పోలిన తన కంఠ బిలాన్ని తెరిచి ఒక్క పెట్టున మ్రింగగా, అందులో ఒక బ్రాహ్మణుడు వుండి గరుడుని కంఠం నుండి క్రిందికి దిగక నిప్పులా మండుతుండగా తెలుసుకుని ‘నా కంఠబిలంలో బ్రాహ్మణుడెవరైనా ఉన్నట్లయితే వెంటనే బయటికి రావలసిందని’ వేడుకోగా, గరుడునికి ఆ బ్రాహ్మణుడు ‘నేను ఒక బ్రాహ్మణుడిని వున్నాను, నా భార్య అపవిత్ర నిషాది కీర్తిప్రియ అనే పేరున్నది, ఆమెను వదిలి నేను ఒక్కడినే బయటపడడం ధర్మం అవుతుందా?’ అనగా, గరుడుడు ‘విప్రులను పొంది వున్న అపవిత్రులుకూడా పవిత్రులవుతారు గనుక, నీవు నీ భార్యతో కూడా త్వరగా వెలుపలికి వచ్చెయ్యి’ అంటాడు.

అలా గరుడుని అనుమతితో, ఆ విప్రుడు భార్యా సమేతుడై వెలుపలికి వచ్చి, గరుడుని దీవించి తన దారిన వెళ్ళిపోతాడు.
గరుడుడు ఆకాశవీథిన ఎగిరి కశ్యపుని చూసి నమస్కరించి ‘నా తల్లిని దాస్యం నుంచి విముక్తురాలిని చేసే నిమిత్తం పాములకోసం అమృతాన్ని తేవడానికి వెళుతున్నాను. నిషాదులను అంతమందిని తిన్నా నా ఆకలి తీరకుండా వుంది. నాకు సరియయిన ఆహారాన్ని ప్రసాదించండి’ అని వేడుకోగా, కొడుకు యొక్క  ప్రయత్నానికి మెచ్చిన కశ్యపుడు ‘అగ్నిసమానుడైన విభావసుడనే పేరుగల ఒక విప్రుడు, ధనవంతుడు, సుఖంగా ఉంటుండగా, అతని తమ్ముడు సుప్రతీకుడనే వాడు తమ పిత్రార్జితమైన ఆస్తిని విభాగించి అందులోంచి ధర్మంగా తనవంతుగా రావలసింది తనకు ఇమ్మని కోరతాడు. అప్పుడు ఆ విభావసుడనే విప్రుడు అహంకారంతో తమ్మునిపై కోపించి నువ్వు ఏనుగువై పొమ్మని శాపం ఇవ్వగా, దానికి ప్రతిగా సుప్రతీకుడు కూడా అన్నను నువ్వు ప్రతిగా తాబేలువై పొమ్మని ప్రతిశాపం ఇస్తాడు. ఇలా అన్నదమ్ములిద్దరూ ఒకరిపై ఒకరు శాపములను ఇచ్చుకుని మూడు యోజనాల పొడవు పది యోజనాల చుట్టుకొలత కలిగిన తాబేలు గానూ , ఆరు యోజనాల పొడవు పన్నెండు యోజనాల విస్త్రుతి కలిగిన ఏనుగుగానూ మారిపోయి  ఒకరు నీటిమడుగులోనూ, మరొకరు అడవిలోనూ వుండి ఆస్తి విభాగం వల్ల కలిగిన తమ పూర్వ వైరాన్ని తలచుకుని ఒకరితో ఒకరు పోరుతూ వున్నారు, అవి నీకు ఆహారంగా సరియైనవి, వెళ్ళి ఆరగించు. నీకు కార్య సిధ్ధి అవుతుంది’ అని చెబుతాడు.

ఆ మాటలు విన్న గరుడుడు మనోవేగంతో వెళ్ళి ఆ రెండింటినీ చూసి, ఒక చేత కూర్మాన్ని మరొకచేత ఏనుగును చఱిచి పట్టి లాగి గగనవీధికి ఎగురుతాడు. అలా ఎగురుతున్న గరుడుని చూసిన రోహణమనే ఒక పెద్ద వృక్షం వందయోజనాల పర్యంతమైన తన శాఖపై ఆ రెండింటినీ వుంచి నింపాదిగా ఆరగించి వెళ్ళమని కోరుతుంది. అలాగే చేస్తానని గరుడుడు ఆ మహావృక్షశాఖపై దిగడానికి సన్నధ్ధుడై ఆ వృక్షశాఖపై కాలుపెట్టగానే అది ఫెళ్ళున విరిగి దిక్కులు మార్మోగేలా శబ్దంచేస్తూ భూమిపై పడబోగా,  ఆ మాహావృక్ష శాఖను ఆశ్రయించి తలక్రిందులుగా, సూర్యునికిరణాలే ఆహారంగా చేసుకుని తపస్సు చేసుకుంటున్న వాలఖిల్యాది మహామునులకు ఇది క్రింద పడితే బాధకలుగుతుందని ఊహించి, ఆ ఏనుగు కూర్మములతోడి ఆ వృక్షశాఖనూ క్రిందపడకుండా పట్టుకుని మళ్ళీ గగనవీధిలోకి ఎగిరి గరుడుడు ఆ మొత్తాన్ని వుంచడానికి అనువైన ప్రదేశం ఎక్కడా కనపడక, గంధమాదన పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సులో మునిగి వున్న కశ్యపుని కనుగొని మొక్కుతాడు.

ఇదంతా చూసిన కశ్యపుడు, వాలఖిల్యాది  మహామునులను ఉద్దేశించి ‘ఈ గరుడుడు మీకు తపోభంగం కలుగుతుందని, ఇబ్బంది కలుగుతుందని మదిలో తలచి ఈ వృక్షశాఖను విడువక పట్టి వున్నాడు. ఈతని మీద దయతో మీరు వేరే చోటకు వెళ్ళిపోండి’ అని కోరగా, కశ్యపుని ప్రార్థనను విన్న వాలఖిల్యులు ఆ వృక్షశాఖను వదిలి హిమవంతానికి వెళ్ళిపోతారు. అప్పుడు గరుడుడు తాను పట్టి వున్న ఆ మహా వృక్ష శాఖనుంచి తండ్రికి వినపడేలా ‘ఈ వృక్షశాఖను నేను విడవదగిన ప్రదేశాన్ని నాకు చెప్పండి. దీనిని వెంటనే నేను వదిలి వెయ్యాలి’ అని అంటాడు. అప్పుడు కశ్యపుడు ‘హిమవత్పర్వత గుహలలో నిర్జనప్రదేశమైన ఒక కొండ వుంది. అక్కడ నీవు ఈ వృక్షశాఖను వదులు. ఆ ప్రదేశం ఈశ్వరాదులకు కూడా అగమ్యమైనట్టిది, అది ఇక్కడికి లక్ష యోజనాల దూరంలో వుంది. వెంటనే వెళ్ళు’ అని చెబుతాడు. అలాగేనని గరుడుడు మనోవేగంతో ఆ ప్రదేశాన్ని చేరుకుని అక్కడ ఆ వృక్షశాఖను విడిచి పెట్టి, హిమవత్పర్వతంపైకి వెళ్ళి అక్కడ ఆ ఏనుగు తాబేలులను రెంటినీ ఆరగించి, మహా శక్తి సంపన్నుడై అమరలోకం వెళ్ళడానికి సమాయత్తమవుతాడు.

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (2)

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (2)

‘చూశావా, తెల్లని కాంతితో మెరెసిపోతూన్న ఆ అశ్వం శరీరమంతా అతితెల్లగా ఉండి, పూర్ణచంద్రునిలో నల్లని మచ్చలాగా, తోక దగ్గర మాత్రం నల్లగా ఉంది’ అనగా, వినత ఆ గుఱ్ఱం వైపు చూసి నవ్వి, కద్రువతో ‘నువ్వు ఏ కన్నులతో చూస్తున్నావు అక్కా! ఎక్కడి నల్లని మచ్చ, ఆ గుఱ్ఱం మహాపురుషుని కీర్తిలాగా మొత్తంగా తెల్లని కాంతితో మెరిసిపోతుంటేను!’ అంటుంది.  ఆ మాటలను విన్న కద్రువ, తానూ నవ్వి, వినతతో ‘సరే, అలాగయితే ఆ మహా అశ్వం శరీరంలో నల్లని మచ్చ గనుక ఉన్నట్లయితే నువ్వు నాకు దాసివి అవ్వు, అలా కాకున్న నేను నీకు దాసినవుతాను, అది పందెం’ అంటుంది.

అని ఇలా ఒకరి దగ్గర ఒకరికి దాసీత్వాన్ని పందెంగా పెట్టుకుని, వినత ఆ అశ్వం దగ్గరికి వెళ్ళి చూద్దాం రమ్మనగా, కద్రువ దానికి ఇప్పుడు సమయంలేదు రేపు మళ్ళీ వచ్చి చూద్దాంలెమ్మని ఇరువురూ తమతమ నివాసాలకు మరలి వెళ్ళి ఉండగా, కద్రువ తన కొడుకుల దగ్గరకు వెళ్ళి ‘నేను మిమ్ములను అందరినీ వేడుకుంటాను, నాకు తోడుగా నిలిచి నన్ను రక్షించండి,  తాము కోరుకున్న రూపాన్ని ధరించి చరించ గలిగే వారికి సాధ్యం కానిది లేదు కదా! ఆ తెల్లనైన ఉత్తమ అశ్వానికి తోకను  నల్లగా మీరు గనక చేస్తే మన వినత నాకు దాసి అవుతుంది, మీరు అలా చేయని నాడు నేను ఆమెకు దాసినవుతాను, ఇలా జంట పందెం వేసుకున్నాము’ అనగా పాములన్నీ ఇది తల్లిచే  నియోగించబడిన పని, అయినా అధర్మం చేయడానికి అవుతుందా? అని తమలో తాము విచారించి  ఆ అధర్మ కార్యానికి సుముఖులు కాకున్న, కద్రువ కోపంతో ప్రజ్వరిల్లిన ముఖం కలదై ‘జనమేజయుడు చేసే సర్పయాగంలో పాములన్నీ పడి మృతి చేందుగాక!’ అని శాపం ఇస్తుంది.

వారందరిలో, ఆ శాపానుభవానికి భయపడిన మనస్సుకలవాడైన కర్కోటకుడనే పాము, తల్లిచెప్పినట్లుగానే వెళ్ళి ఆ అశ్వాన్ని సమీపించి తోక నల్లగా అయేవిధంగా పట్టి వేలాడగా, ఆ మరుసటి రోజు వెళ్ళి చూచిన కద్రువ వినతలలో, వినత ఓటమిని అంగీకరించి కద్రువకు దాసియై పనులను చేయసాగింది. అలా జరుగుతూండగా, అయిదువందల సంవత్సరాలు గడిచి, వినత రెండవ గర్భం నుంచి ఆమెకు మనఃప్రీతి కలిగించేవిధంగా గరుడుడు జన్మిస్తాడు.

పెద్ద పెద్ద రెక్కలతో, మహా బలవంతుడై పుట్టిన గరుడుడు, ఆకాశవీధినుంచి ఎగురుతూ వచ్చి తల్లిని సమీపించి ఆమె పాదాలకు మ్రొక్కి, ఆ వెనుక కద్రువ వద్దకు వెళ్ళి, వినతుడై నిలబడగా, అతనిని చూసి కద్రువ తన సంతానం అందరినీ రెక్కలపై వుంచుకుని తిరుగుతూ వారికి అన్ని ప్రదేశాలనూ చూపిస్తూ వారు చెప్పిన పనులన్నీ చేస్తూ వుండమని ఆదేశిస్తుంది.

కద్రువ ఆదేశం మేరకు గరుడుడు ఆమె సంతానమైన పన్నగముఖ్యులందరినీ తన వీపున పెట్టుకుని ఎగురుతూ తీసుకువెళ్ళి వారికి అన్ని ప్రదేశాలనూ చూపుతూ, ఆ క్రమంలో ఒక నాడు సూర్యమండలం దాకా ఎగరగా, ఆ వేడిమికి తాళలేని పాములు గరుడుని వీపుమీంచి దొర్లి భూమిపై పడి మూర్ఛిల్లగా, వాటిని ఆ స్థితిలో చూసిన కద్రువ కడు కోపించి, ఇంద్రుని మహా భక్తితో ప్రార్ధించి తన పుత్రులపై వర్షం కురిపించగా, అవి మూర్చ నుంచి తేరుకుని ఆపదనుంచి బయటపడతాయి.

ఇలా రోజులు గడుస్తూండగా, ఒకనాడు గరుడుడు తల్లితో ‘నా రెక్కల బలంతో కొండలనైనా పిండిచేయగలిగినంతటి బలవంతుడనైన నేను, ఇలా వీపున ఈ పాములను పెట్టుకుని మోస్తూ వారికి సేవచేయాల్సిన గతి ఎలా సంభవించిందో చెప్పుమ’ని అడుగుతాడు. అప్పుడు వినత, తనకు కద్రువతో అయిన పందెంలో సంభవించిన దాసీత్వాన్ని గురించి, అనూరుని శాపాన్ని గురంచి వివరంగా చెప్పి ‘నీ వలన నా దాసీత్వానికి విముక్తి దొరుకుతుందన్న మాటను హృదయంలో దాచుకుని ఊరడిల్లి ఇలా ఉన్నాన’ని చెప్పి, కొడుకులు సత్పురుషులైన తల్లిదండ్రుల కష్టాలు  కడతేరడం ఆన్నది ప్రసిధ్ధమై వుండగా, నీ వంటి యోగ్యుడైన కుమారుడు వుండి కూడా నేనింకా దాసిగానే వుంటినే’ అంటుంది.

ఆ మాటలను విన్న గరుడుడు బాధచెంది, ఒకనాడు కద్రువ సంతానంతో ‘మా ఈ కష్టాలు తొలగిపోయే ఉపాయం చెప్పండి. మీకు ఇష్టమైనది ఏదైనా సరే, దానిని అమరుల వద్దనుంచి అయినా సరే జయించి తెచ్చి ఇస్తాను’ అని అడుగుతాడు. గరుడుని ఆ మాటలకు ‘అమిత బల పరాక్రమములు కలిగినవాడవైన నీవు, మీ దాస్య విముక్తిపై మనస్సు కలవాడవయితే, మాకు అమృతాన్ని తెచ్చి ఇవ్వవలసినద’ని కద్రువ సంతానమైన పాములన్నీ అడుగుతాయి.

ఆ మాటలను విన్న గరుడుడు సంతోషించి, అలాగే చేసి అమృతాన్ని మీకు తెచ్చి ఇచ్చి మా దాస్య విముక్తి  చేసుకుంటానని చెప్పి, జరిగినదంతా తాల్లికి కూడా వివరించి చెప్పి, అమృతాన్ని తెచ్చే పనిమీద వెళుతున్నాని ఆమె పాదాలకు ప్రణమిల్లగా, వినత సంతోషంతో కొడుకును కౌగిలించుకుని….

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (1)

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (1)

ఆ కథకుడు శౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు:

పూర్వం  కశ్యప ప్రజాపతి భార్యలైన కద్రువ, వినత అనేవారు సంతానంకోసం అనేక వేల సంవత్సరాలు కశ్యపుడిని ఆరాధించగా, ఆయన ప్రసన్నుడై మీ కోరిక మేరకు వరాలిస్తాను, కోరుకోమంటాడు.

అగ్నితో సమానమైన తేజం కలవారు, పొడుగైన దేహం కలవారు, సద్గుణవంతులైన వేయిమంది కుమారులను  ఇమ్మని కద్రువ కోరుకుంటుండి. ఆ వేయిమంది  కంటే అధిక బలవంతులయిన ఇద్దరు కుమారులను ఇమ్మని వినత కోరుకుంటుంది.

ఆదిలో కశ్యప ప్రజాపతి అనేక సంవత్సరాలు తపస్సు ఆచరించి  పుత్రకామేష్టి చేశాడు కాబట్టి, కద్రువకు వేయి మంది కొడుకులను, వినతకు ఇద్దరు కొడుకులను వారు కోరుకున్నట్లుగానే గర్భములను ఇవ్వగా, ఆ గర్భములనుంచి కద్రువకు  శేషుడు , వాసుకి, ఐరావత, తక్షక, కర్కోటక, ధనంజయ, కాళియ, మణినాగాపూరణ, పింజర, కర్దమ, బహుమూలక, కుండోదర, మహోదర మొదలైన నాగప్రముఖులు పుట్టారు.

తన గర్భంలో వున్న రెండు అండములనుండీ ఎన్నాళ్ళయినా పిల్లలు కలగకపోవడంతో సిగ్గుపడిన వినత త్వరగా తనకూ పుత్రులు కలగాలన్న తపనలో చేసిన తొందరపాటు చర్య వలన, శరీరంలో క్రింది భాగం లేకుండా అర్ధశరీరంతో వికలాంగుడై పుట్టిన అనూరుడు వినతపై కోపించి తాను సంపూర్ణ శరీరుడయ్యే  వరకూ ఆగకుండా తొందరపడిన అవినీతవు కాబట్టి సవతి అయిన కద్రువకు దాసివి కమ్మని శాపం ఇచ్చి, రెండవ అండాన్నుంచి కలిగే పుత్రుడు మహా బలపరాక్రమవంతుడై పుట్టి ఈ దాసిత్వాన్నుంచి విముక్తి కలిగిస్తాడని చెప్పి, సూర్యరథానికి  సారథియై   వెళ్ళిపోతాడు. ఆ తరువాత, అనూరుడు చెప్పినట్లుగా జరిగే సమయం దాకా వేచి ఉండాలని తన గర్భాన్ని రక్షించుకుని ఉంటుంది వినత.

అదలా వుండగా, దేవతలూ రాక్షసులూ క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని పొందే ప్రయత్నంలో మేరు పర్వతం మీదికి అందరూ వెళ్ళి, ఈ సముద్రాన్ని  ఏవిధంగా చిలకాలి, అందుకై సరితూగగల కవ్వమేది, దానికి ఆధారం కాగలిగినదేది అని విచారిస్తూ ఉండగా, వారికి బాసటగా వుండి  హరిహరులిద్దరూ ఆ కార్యం నిర్వహించడానికి పూనుకుని,  ఈ మహాకార్యానికి స్థిరమైనది, అరుదైన ఔషధములుగలిగిన వృక్షములతో గలది అయిన మంథర పర్వతం కవ్వంగా ఉండడానికి సరియైనదని నిర్ణయించగా, ఆ యిరువురిచే పంపబడిన అనంతుడు పదకొండు యోజనాల వెడల్పు అంతే ఎత్తు గలిగిన ఆ మంథర పర్వతాన్ని అనంతశక్తి కలవాడై పైకి పెఱికి ఎత్తగా, అందరూ కలిసి ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో వేసి, క్రింద ఆధారంగా కూర్మరాజును పెట్టి, చిలకడానికి కావలసిన పలుపుగా వాసుకిని అమర్చి, వాసుకి తలలవైపు అసురులు తోక వైపు అమరులు పట్టి  సాగర మథనం మొదలెట్టారు.

ఈ ప్రయత్నంలో నారాయణుడు వారికి కావాల్సిన జవసత్త్వాలను ప్రసాదించాడు. ఒకరి నొకరు ఉత్సాహపరుచుకుంటూ, దేవదానవులు ఇరువురూ సముధ్రాన్ని చిలుకగా చిలుకగా మొదటగా అందులోంచి విషం ఉద్భవించి నాలుగు వైపులా కమ్ముకోగా భయపడి పాఱిపోతూండిన దేవదానవులను, ఆ భయంకర విషాన్ని పట్టి మింగి పరమశివుడు తన గరళంలో దాచి  ఆదుకుంటాడు.

ఆ తరువాత, జ్యేష్ఠాదేవి, చంద్రుడు, లక్ష్మీదేవి, ఉఛ్ఛైశ్రవమనే గుఱ్ఱము, కౌస్తుభము, ఐరావతమనే ఏనుగు, శ్వేతకమండలం నిండుగా అమృతంతో ధన్వంతరి, ఇలా అనేకం ఉద్భవించగా, అందులో ముల్లోకాలచే కొలవబడే శ్రీదేవి కౌస్తుభము నారాయణుని వక్షస్థలంపై విలసిల్లాయి. ఉఛ్ఛైశ్రవమనే అశ్వము, ఐరావతము ఇంద్రుని చేరుకున్నాయి. ఆపై అమృతాన్ని రాక్షసులు దక్కించుకోగా నారాయణుడు కృత్రిమ నారీ రూపం ధరించి వారికి అధిక మోహం కలిగించినవాడై ఉపాయంతో ఆ
అమృత కలశాన్ని వారి వద్ద నుంచి దక్కించుకుని ఆ కలశాన్ని దేవతలకు ఇవ్వగా, వారు దానిని ఉపయోగించే సందర్భంలో దేవరూపం దాల్చి రాహువు వారితో పంక్తిలో కూర్చుని అమృతం సేవిస్తూండగా పసిగట్టిన చంద్రుడు, సూర్యుడు ఈ విషయాన్ని నారాయణునకు తెలియజేయగా, ఆ అమృతం రాహువు గొంతునుంచి దిగకముందే తన చేతి చక్రంతో వేయగా, రాహువు దేహం కంఠాన్నుంచి  విడియై భువిపై పడి మృతి చెందగా , ముఖం మాత్ర అమృత స్పర్శచేత అక్షయమై నిలిచింది.

ఆనాటినుంచి చంద్రునికి, సూర్యునికి రాహువుతో విరోధం మొదలై శాశ్వతంగా నిలిచిపోయింది.

ఆ తరువాత రాక్షసులు తమకు అమృతం దక్కలేదని తెలుసుకుని, దేవతలతో పొత్తు ఇక చాలని నిర్ణయించుకుని, పోరుకు సన్నధ్ధులై రథాశ్వాలతో విళ్ళి ఘోరమయిన యుధ్ధంలో దేవతలనందరినీ దారుణంగా హింసించసాగారు.  సముద్రతీరంలో అలా జరుగుతున్న యుధ్ధంలో చివరకు నరనారాయణులు ఇరువురూ అసురవీరులను పెక్కండ్రను చంపగా చూసి ధైర్యంకోల్పోయినవారై అసురులు సముద్రంలోకి ప్రవేశించగా, సమరంలో దక్కిన విజయంతో ఉత్సాహం పొందినవారైన దేవతలు అమరపతిని అమృతరక్షణార్ధం ప్రార్ధించి, మంథర పర్వతాన్ని యథా స్థానంలో నిలిపి, తమ తమ నివాసాలకు వెళ్ళి సుఖంగా వున్నారు.

అదలా వుండగా…

అమృతంతో పాటు సముద్రం నుంచి ప్రభవించిన అశ్వం, ఆ సముద్ర తీరంలో ఒక్కటే  ఒకనాడు తిరుగుతూ ఉండగా, కద్రువ వినత వినోదార్ధం ఆ ప్రదేశంలోనే విహరిస్తూన్న తరుణంలో  తెల్లగా అమిత కాంతితో ఆకర్షణీయంగా మెరిసిపోతున్న ఆ అశ్వాన్ని చూసి, కద్రువ వినతతో….

నన్నయ భారతం (నా వచనంలో) – 9

నన్నయ భారతం (నా వచనంలో) – 9

ఏకాంతంలో ఇలా వేడుకున్నాడు:

“అలసటనేది ఎరుగక నేను దేవయజనాధ్యయన పుణ్యకర్మములు సలిపేవాడినయితే, నేను గురువులను సద్విజులను భక్తితో  కొలిచేవాడినయితే, నేను అతిగొప్ప తపస్విని అయితే, దివిజాధిప భూసురులారా, నా మనస్సులో కొలువై వున్న  ఈ ప్రమద్వర దేహంనుంచి విషం విడిచివెళ్ళేలా దయతో అనుగ్రహించండి. మహాపురుషులైనవారు అపరిమితమైన ఆజ్ఞ చేసి, విషతత్త్వసంహితా నిపుణులు మంత్రతంత్రములను విధించి, ఈమె దేహం నుంచి విషం విడిచి వెళ్ళి తిరిగి జీవం పొందే ఉపాయం చేస్తే, వారికి ఇప్పటివరకూ నేను సంపాదించిపెట్టుకున్న నా తపఃఫలాన్ని, అధ్యయన దానఫలాన్ని సంతోషంగా ధారపోస్తాను.”

అని దీనవదనంతో ఆక్రోశిస్తున్న రురునకు ఆకాశం నుంచి ఒక దేవదూత ఇలా అన్నాడు:

“విధివశంగా జరిగే వాటిని మరల్చడానికి ఎవ్వరికీ తరం కాదు. అయినాగానీ ఒక ఉపాయం వుంది. చేయగలుగుతానంటే చెబుతాను, విను. నీ ఆయుష్షులో అర్ధ భాగం ఈమెకు ఇవ్వు.”

ఆ మాటలను విన్న రురుడు అలాగే చేస్తానని, తన ఆయుష్షులో అర్ధ భాగాన్ని ఆ కన్యకు ఇవ్వగా, ఆ ప్రమద్వర దేహం నుండి విషం వీడినదై ముందటికంటే కూడా ఇంకా సౌందర్యవతియై ప్రాణం పోసుకుని బ్రతికింది. అలా దేవదూత యమధర్మరాజు అనుమతితో చెప్పిన ఉపాయం వలన ప్రమద్వరను బ్రతికించుకుని, ఆమెను వివాహమాడి, అష్టభోగాలూ అనుభవించుతూ ఉండిన రురుడు, కొంతకాలానికి…

తన సతికి అపకారం చేసిన పాములను వదిలి పెట్టగూడదని మదిలో తలచి పెద్దదైన గట్టి కఱ్ఱను తీసుకుని కనుపించిన పామునల్లా కొట్టడం మొదలెడతాడు. ప్రదేశాలలో తిరుగుతూ, పుట్టలలోనూ పొదలలోనూ కనుపించే ప్రతి పామునూ అధిక కోపంతో చేతిలోని దండంతో గట్టిగా మోది చంపుతూ, అలా ఒకనాటికి డుండుంబమను పాముని చూసి దానికి కొట్టడానికి కఱ్ఱను ఎత్తగా, అది ‘హరిహరీ’ అని అరిచి భయంతో ‘స్వామీ, బ్రాహ్మణుడవు, తేజోమయుడవు, సువ్రతుడవు అయీన నీవు, ఏ కారణం చేత పాములపై ఇంత పగను పెంచుకున్నావు?’ అని అడగగా, ‘నా ప్రియ సతికి హాని కలిగించాయి ఈ పాములు, నేను రురుడను, నిన్ను కూడా ఇప్పుడు ఈ కఱ్ఱ తో కొట్టి చంపుతాను చూడు’ అంటూ చేతనున్న దండాన్ని పైకెత్తి  కొట్టబోయెటంతలో, డుండుభమనే ఆ పాము ఒక ముని రూపం పొంది ఎదుట నిలువగా చూచి, రురుడు ‘పామువై ఉండి ఇంతలో మునీశ్వరుని వేషం దాల్చి నిలబడ్డావు, ఇది ఎంతో ఆశ్చరంగా ఉంది నాకు, ఇది ఎట్లాగయింది?’ అని ప్రశ్నించగా, ఆ మునిశ్వరుడు రురునితో ఇలా అన్నాడు:

‘నేను సహస్రపాదుడనే పేరున్న మునిముఖ్యుడను. ఖగముడనే మునిముఖ్యుడు నా సహాధ్యాయుడు. ఒకనాడు అగ్నిహోత్రగృహంలో ఇద్దరమూ ఉండగా, హాస్యానికి గడ్డిపరకలా ఉన్న సన్నని పామును అతడిపైకి వసరగా, ఆతడు ఉలికిపడి, నా చేష్టకు కోపించి నన్ను నిర్వీర్యమైన ఒక పాముని కమ్మని శపించాడు. దానికి నేను, హాస్యానికి చేసిన పనికి ఇంత కోపం చెందడం ఎందుకు, నన్ను క్షమించుమని ప్రధేయపడగా, ప్రసన్నుడైన ఖగముడు తన వచనం అమోఘం కాబట్టి, కొంతకాలం  డుండుమమువై ఉండి భార్గవకుల వర్ధనుడైన రురుడు చూసినప్పుడు శాపవిముక్తి అవుతుందని చెప్పాడ’ని, రురునికి తన వృత్తాంతం అంతా చెప్పుకుని, ఇంకా ఇలా అన్నాడు…

‘అయ్యా, నీవు బ్రాహ్మణుడివి, భృగువంశంలో పుట్టినవాడివి. సర్వగుణ సంపన్నుడవు అయి ఉండి, ఇదేమి పని, ఇది క్షత్రియకులానికి గాని బ్రాహ్మణునికి  సరిపోయేది కాదు గదా. బ్రాహ్మణులు అహింసాపరులు, ఇతరులు చేసే హింసలను వారించు వారు, పరమ కారుణ్యమూర్తులు. జనమేజయుడు చేసిన సర్పయాగంలో కద్రువ  శాపం వలన అయ్యే  సర్పకులప్రళయాన్ని  మీ తండ్రిగారి శిష్యుడయిన ఆస్తీకుడనే బ్రాహ్మణుడు కదా తప్పించి కాపాడింది’ అని చెప్పి సహస్రపాదుడు రురునికి సర్పఘాతం నుంచి ఉపశమనబుధ్ధి పుట్టించాడు” అని చెప్పగా విన్న శౌనకాది మునులు ఆ కథకునితో ఇలా అన్నారు.

‘ఇతరుల వలన కలిగే కీడునుంచి, ఓటమినుంచి ఏ విధమయిన హాని కలుగకుండా అడ్డుకుని సంతానాన్ని కాచేదైన తల్లి, సర్పములపై ఏ కారణంచేత కోపించి శాపం ఇచ్చింది?’ అని సౌపర్ణాఖ్యానం వినాలనే కుతూహలంతో అడగగా….

(ఇక్కడితో నన్నయభట్టు చే రచించబడిన ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో  అనుక్రమణిక, పౌష్య ఉదంక భృగువంశకీర్తనము అన్నది ప్రథమాశ్వాసం సమాప్తం).

నన్నయ భారతం (నా వచనంలో) – 8

నన్నయ భారతం (నా వచనంలో) – 8

‘కాబట్టి నేను అసత్యానికి వెరచి ఈమె భృగుపత్నియని నిజమును చెప్పాను. అఖిలజగాలకూ కర్మసాక్షినై వున్న నేను అసత్యాన్ని ఎలా చెప్పగలను? ఆ కారణంగా నీవు నాకు శాపమిస్తే, తిరిగి నీకు నేను శాపమీయలేని వాడను కాను. కానీ, అణిచినా పరుషమైన పదాలతో తిట్టినా ఇంకా గట్టిగా  పొడిచినా గానీ ఉత్తమ ద్విజులు పూజ్యులే కాబట్టి వారికి చెడు చేసినచో ఇహానికీ పరానికీ రెండింటికీ చెడిన వాళ్ళమవుతాము. ఇది సిధ్ధమని తెలిసున్నవాడను గనుక భక్తితో ఎప్పుడూ ధరణీసురోత్తములను పూజలో తనుపుతానేగాని వారిపై కోపంచెందేందుకు  అశక్తుడను. నీవు బ్రాహ్మణుడవు. నీవేది చేసినా నీకే పరిమితమై చెల్లిపోతుంది. లోకహితుడనైన నాకు  ఆ శాపం ఇచ్చి సర్వలోకాలకూ హాని చేసినవాడ వైనావు. అదెట్లంటే, వేదోక్తాలయిన నిత్య నైమిత్తిక బలి విధానాలలో మహాద్విజులచేత నాలో వ్రేల్వబడే హవ్యాలు నా ముఖాననే దేవ పితృగణములు ఉపయోగిస్తారు. అట్టి నేను నీ శాపకారణంగా సర్వభక్షకుడనై అశుచినై అట్టి పనులకు పనికిరానివాడనవుతాను, లోకంలో ఏ  పనులూ జరగవు’ అని చెప్పి అగ్నిదేవుడు అఖిలలోకవ్యాప్తమయిన తన తేజోమూర్తిని ఉపసంహరించగా….

అన్ని చోట్లలోనూ త్రేతగ్నులు వెలగడం మానివేశాయి. అగ్నిహోత్రాలలోనూ, దేవతార్చనలలోనూ, ధూపదీపాది సద్విధులలోనూ అగ్ని ప్రవతిల్లక విరామం పొందాయి. పితృకార్యాలలో పితృపిండక్రియలన్నీ ఆగిపోయాయి. ధరిత్రిలో జనులంతా ఈ వింతకు ఆశ్చర్యపడి భయపడి మునుల వద్దకు వెళ్ళగా, ఆ మునులు అమరవరుల వద్దకూ, వారు వారివారూ భయంతో బ్రహ్మ వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు భృగు శాపకారణంగా అగ్నిదేవుని ఉపసంహారం  మొదలు జరిగిన దంతా తెలుసుకున్నవాడై, అగ్నిదేవుని పిలిపించి ఇలా అంటాడు:

“సర్వభూత సంతతికీ భర్తవు నీవు, సకల చరాచర ప్రవృత్తికీ హేతుభూతుడవు నీవు, సర్వులూ చూడగలిగే ఒకే ఒక దేవతా స్వరూపుడవు నీవు, లోకపావకుడవు నీవు, ఇలాంటి  దోషరహితమైన గుణములు కలవాడవైన నీకు ఈ విధమైన  విశ్వభారకభువన ప్రవర్తన పరాఙ్ముఖభావం కలగడం ధర్మమేనా?”

(ఆదిలో నన్నయ చెప్పిన  ‘అక్షర రమ్యత’ అనే మాటకు ఉదాహరణగా చెప్పడానికి  అర్హమైన సొగసైన పద్యం ఇక్కడిది, చంపకమాల వృత్తంలోనిది:

“ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవ చరాచర ప్రవృ
త్తికి మఱి హేతుభూతుడవు దేవముఖుండవు నీవ లోక పా
వకుడవు నీవ యిట్టి అనవద్యగుణుండవు నీకు విశ్వభా
రకభువన ప్రవర్తన పరాఙ్ముఖభావము పొంద పాడియే.”

ఈ పద్యాన్ని చదివేటప్పుడు నీవ, నీకు అన్న పదాలు ఉన్న చోట్ల  పద్యపాదాలను విరిచి చదువుకుంటే, పద్యం మొత్తం ద్రాక్షరసంలాగా జిహ్వమీంచి జారిపోతుంది. నన్నయ మేధస్సు అంతా ‘విశ్వభారకభువన ప్రవర్తన పరాఙ్ముఖభావము’ అన్న మాటల కూర్పులో ద్యోతకమవుతుంది. ఈ పవిత్ర భావాన్ని ఇలా తప్ప మరోవిధంగా వర్ణించడం సాధ్యమయే పనికాదు, ఛందో బధ్ధంగా చెప్పడం అంత సుళువూ కాదు.)

‘అయితే, ఆ మహాముని వచనం అమోఘం కాబట్టి, నీవు సర్వభక్షకుడవై కూడా శుచులలోకెల్ల అత్యంత శుచిగలవాడవై, అర్హమైనవారిలోకెల్ల అత్యంత అర్హుడవై, పూజ్యులలోకెల్ల అగ్రపూజ్యకు అర్హతగలవాడవై , వేదవిధులందు విప్రులకు  సహాయకుడవై జగముల వ్యవహారములను నడుపుమ’ని విశ్వగురువగు బ్రహ్మ వైశ్వానరుని ప్రార్ధించి నియోగించి, భృగు వచనానికి కూడా హాని కలుగకుండా చేశాడు.

అలాంటి భృగునికి సంతానమై పుట్టిన చ్యవనునకు సుకన్యకు ప్రమతి, ఆ ప్రమతికి ఘృతాచికి రురుడు పుట్టారు. ఆ రురునికి
విశ్వావసుడనే గంధర్వరాజుకు మేనకకు జన్మించి, స్థూలకేశుడనే ముని ఆశ్రమంలో పెరుగుతూవున్న రూపలావణ్యములలో ఆమె తోటివారందరిలోకీ మిన్నయయినటువంటి ప్రమద్వర అనే పడతిని ఇచ్చి వివాహంచేయడానికి నిశ్చయించి ఉండగా, ఒకనాడు తనతోడి స్నేహితురాండ్రతో కలిసి ఆడుకుంటూ వున్న సమయంలో పొరపాటున కలితో తొక్కబడిన ఒక పాము కాటువేయగా, స్నేహితురాండ్రందరూ బయంతో కేకలు పెడుతూండగా మరణిస్తుంది.

జరిగినది తెలుసుకుని, కరుణతో నిండిన హృదయములు కలవారై  గౌతమ కణ్వ కుత్స కౌశిక శంఖమేఖల భరద్వాజ వాలఖిల్య ఉద్దాలక శ్వేతకేతు మైత్రేయ ఇత్యాది ప్రముఖులూ, ప్రమతి రురుడు కలిసి స్థూలకేశుని ఆశ్రమానికి వచ్చి విషప్రభావానికి ప్రాణం పోగొట్టుకుని పడివున్న ఆ కన్యను చూసి చాలా దుఃఖితులై ఉండగా, అక్కడ వుండ లేక రురుడు శోకంతో కలచివేయబడుతున్న హృదయం కలవాడై ఏకాంతం ఆశించి నడుచుకుంటూ వనంలోకి వెళ్ళి….

నన్నయ భారతం (నా వచనంలో) – 7

నన్నయ భారతం (నా వచనంలో) – 7

అలా అడిగిన శౌనకాది మునులకు, ఆ కథకుడు ఇలా చెప్ప సాగాడు:

“పూర్వం సర్పకులానికంతటికీ తల్లియైన కద్రువ శాపం వలన జనమేజయ మహారాజు చేసిన సర్పయాగం నుంచి పుట్టిన భయంకరమైన అగ్ని జ్వాలలలో సర్పాలన్నీ పడి దహించుకుపోయే పళయం సంభవిస్తే, ఆ పళయాన్నుంచి  వాటిని, ఒకప్పుడు భృగువంశజుడైన రురుడు చేసిన సర్పఘాతాన్నుంచి వాటిని సహస్రపాదుడు కాపాడినట్లుగా, జరత్కారుని తనయుడైన అస్తీకుడు కాపాడాడు. ఆ ఉదంతాన్నంతా సవిస్తరంగా చెబుతాను వినండ ” ని భృగు వంశ కీర్తనమును, అస్తీక చరితాన్నీ చెప్పసాగాడు.

భృగువు అనే పేరుగల విప్రుడు అతని భార్య అయిన పులోమను, గర్భవతిగా ఉన్న స్త్రీని, అగ్నిహోత్రానికి అగ్నులను సిధ్ధం చేసే నిమిత్తమై నియోగించి తాను అభిషేచన కొరకు వెళ్ళగా, అంతలో పులోముడు అనే పేరుగల వింత రాక్షసుడు అగ్నిహోత్ర గృహానికి వచ్చి, ఆమెను చూసి ఉన్మత్తుడై ‘ఈమె ఎవ్వరి సతి?’ యని అగ్నిదేవుని అడుగగా, అగ్నిదేవుడు అబధ్ధం చెప్పడం వల్ల కలిగే దోషం, నిజం చెబితే కలగబోయే విప్రుని వలని  శాపం అనే ఈ  రెంటిలో అబధ్ధం చెప్పడం వలన కలిగే దోషం ఎప్పటికీ పోనిది మిగుల హానికరమైనదీ అని యెంచి, ఆ పరమ పవిత్ర భృగు పత్ని  అని నిజమును చెప్పగా, ఆ పులోముడు ఈమె మొదట నాచే వరించబడిన స్త్రీ, ఆ తరువాత  భృగునితో వివాహమయినదని చెప్పి, వరాహ రూపము పొంది ఆమె నెత్తుకుని పరుగెట్టగా, ఆమె గర్భమందున్న కుమారుడు ఆ కుదుపులకు  కోపించి గర్భంనుండి విడుదలయై, చ్యవనుడనే  పేరును పొందాడు. వేయి సూర్య్లుల కాంతితో  సమానమయిన తెజస్సుతో వెలిగిపోతున్న చ్యవనుని తేజో జ్వాలల ధాటికి ఓర్వలేని  ఆ పులోముడనే రాక్షసుడు అంతలోనే కాలి బూడిదై మిగులుతాడు.

ఆ వెంటనే పులోమ, భృగుకులవర్ధనుడైన కుమారుని ఎత్తుకుని ఆశ్రమానికి చేరుతుంది. అంతకు ముందర, ఆ రాక్షసుని దుష్కృత్యానికి  భయపడి ఆమె ఏడ్చుచూ వెళ్ళడంలో ఆమె కనులనుండి రాలిన కన్నీటి ధారలు ప్రవాహమై మహా నదియై ఆ ఆశ్రమ సమీపంలోనే పాఱగా ఆ నది లోకపితామహుడైన బ్రహ్మచే (తన కుమారుడైన భృగుని ఇల్లాలు – తన కోడలు – కన్నీటినుంచి పుట్టినది కాబట్టి)’వధూసర’గా నామకరణం చేయబడింది. అంతలో, స్నానం చేసినవాడై ఆశ్రమానికి వచ్చిన భృగుడు, బాలసూర్యునిలా వెలిగిపోతున్న కుమారునితో పులోమను చూసి, ఆ ఆసురుడు ఇక్కడ వున్నది నీవని  ఎలా తెలుసుకున్నాడు, వాడికి ఎవరు చెప్పారని ప్రశ్నించగా, పులోమ ఈ అగ్నిదేవుడే చెప్పాడనీ, ఆ అసురుడు సూకరరూపం దాల్చి నన్నెత్తుకుని పాఱునంతలో గర్భంనుంచి విడుదలయైన ఈ కుమారుడే ఆ రాక్షసుని తన శక్తితో భస్మం చేసి నన్ను కాపాడాడనీ చెప్పగా విన్న భృగుడు మహోగ్ర రూపం దాల్చి, కోపంతో అగ్నిని ‘నీవు అతి క్రూరుండవు సర్వభక్షకుండవు కమ్మ’ ని శపిస్తాడు.

ఆ శాపం విన్న అగ్నిదేవుడు ‘తనకు తెలిసున్న సంగతిని చెప్పమని అడిగిన వానికి అది చెప్పని వాడును, సత్యము చెప్పని వాడును ఘోర నరక పంకంలో పడతాడు’ అంటాడు. (ఇది ఇక్కడ నన్నయ చేర్చి చెప్పిన సుభాషితం. కంద పద్యం:

“తన యెఱిగిన యర్ధం బొరు
డనఘా, యిది యెట్లు సెప్పుమని యడిగిన జె
ప్పని వాడును, సత్యము సె
ప్పని వాడును, ఘోర నరక పంకమున పడున్.’

సరళమైన పదాలతో చక్కని తెలుగు పద్యం.)