‘కంచి’ జ్ఞాపకాలు -(2) : కైలాసనాధ దేవాలయం

పల్లవ రాజు రాజసింహుడు – కైలాసనాధ దేవాలయం, కాంచీపురం

కైలాసనాథ దేవాలయం, కాంచీపురం
కైలాసనాథ దేవాలయం, కాంచీపురం

Ancient India లో – అంటే క్రీ.శ.1000 ని ఒక సరిహద్దుగా అనుకుని ఆలోచించినా కూడా, అంతకు ముందు పాలించిన రాజవంశాలకు చెందిన రాజులూ చక్రవర్తులూ  కేవలం రాజ్యాధికారం గురించి, చేయ్యాల్సిన యుధ్ధాలను గురించి, గెలవాల్సిన పొరుగు రాజ్యాలను గురించి మాత్రమే ఎప్పుడూ ఆలోచించకుండా, తాము పాలిస్తున్న భూభాగంలో కళలను గురించి, వాటి అభివృధ్ధి గురించి, ఆయా రంగాల కళాకారులకు ఇవ్వాల్సిన చేయూత గురించి గూడా పట్టించుకోవాలి, ఆ కార్యక్రమాలలో పాలుపంచుకోవాలి అన్న philosophy కి అనుగుణంగా నడుచుకుంటూ రాజ్య పాలన చేసారు. పల్లవ రాజవంశానికి చెందిన రాజులూ, చక్రవర్తులూ అదే బాటను అనుసరించి పాలించినవారే! రాజులు స్వతహాగా ఏ ధర్మాన్ని ఆచరించినా, రాజ్యంలోని బౌధ్ధ, జైన ఇత్యాది ఇతర ధర్మాల అనుచరులకు కావలసిన అన్ని సదుపాయాలనూ సమకూర్చారు. అన్ని ధర్మాల వారినీ సమానంగానే ఆదరించి రాజ్యంలో నివసించే అవకాశం కల్పించారు.

పల్లవ రాజులు కళలకు ఎంతగానో ప్రొత్సాహం ఇచ్చారు. ఆలయ శిల్పం వీరి కాలంలో కొత్త దారులు తొక్కింది. కొండ రాతి చరియలను (గుహాలయం) వదిలి దేవాలయం సమతల ప్రదేశంలోకి వచ్చింది.  అందులో భాగంగా, ఒక బృహత్తరమైన నిర్మాణంగా దేవాలయ నిర్మాణం అనేది దక్షిణ భారత దేశంలో ఈ కైలాసనాధ దేవాలయంతోనే మొదలయింది.  కాల క్రమంలో ఈ విధమైన మంచి మలుపుకు ఈ పల్లవ రాజవంశం కారణమయిందని చెబుతారు.

కైలాసనాథ దేవాలయం, కాంచీపురం - ఫోటో -2
కైలాసనాథ దేవాలయం, కాంచీపురం – ఫోటో -2

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గా వున్న భూభాగాన్నే అప్పుడు – అంటే క్రీ.శ.4 – 9 శతాబ్దాలమధ్య కాలంలో  – పల్లవులు వారి రాజ్యంలో ముఖ్యమైన భాగంగా పాలించారు. వారి రాజ్యాధికారం, ప్రాభవం, ఉఛ్ఛ స్థితిలో ఉన్న రోజులలో ఇప్పుడు తమిళనాడుగా ఉన్న భూభాగంలో చాలా మేరకు – అంటే కావేరీ తటం దాకా  – పల్లవ రాజ్యం వ్యాపించి వుండేది. పల్లవుల రాజధాని కాంచీపురం. పల్లవ రాజులలో ముఖ్యుడైన మహేంద్రవర్మ (పరిపాలనా కాలం క్రి.శ.590-630) స్వయంగా కవి, సంగీత కళా కోవిదుడు. అంతే కాకుండా చాలా విషయాల్లో ఇతనికి వున్న బుధ్ధి కుశలతను కళాహృదయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతనికి ‘విచిత్ర చిత్తుడు’  అనే పేరు కూడా వచ్చి స్థిరపడిపోయింది. ఈయన విష్ణుకుండిన చక్రవర్తి అయిన ‘విక్రమేంద్ర వర్మ’ దౌహిత్రుడు.  విష్ణుకుండినుల  విజయవాడ దగ్గర మొగల్రాజపురం గుహాలయాలలోని సాంప్రదాయాలను ఈయన దక్షిణాదిన అంటే తమిళం మాట్లాడే ప్రాంతంలో ప్రవేశ పెట్టాడు.

ఈ మహేంద్రవర్మ తరువాత నాలుగోతరం వాడు రాజసింహుడు అనే నామాంతరం కలిగిన రెండవ నరసింహవర్మ అనే పల్లవరాజు. ఇతడు క్రీ.శ.700 -730 మధ్య కాలంలో రాజ్య పాలన చేశాడు. ఈ రాజసింహ పల్లవుని పరిపాలనా కాలంలో నిర్మించబడిన దేవాలయలే కాంచీపురంలోని కైలాసనాధ దేవాలయం, మహాబలిపురంలోని సముద్ర తీర దేవాలయం. ఈ రెండూ దక్షిణ భారత దేవాలయ వాస్తులో ఒక ముఖ్యమైన మలుపుకు కారణమైన దేవాలయాలు. ఈ ఆలయాలలో అవలంబిచిన పధ్ధతికి ఈ పల్లవరాజు పేరు మీదుగానే ‘రాజసింహ పధ్ధతి’ అనే ప్రత్యేకమైన పధ్ధతిగా పేరు వచ్చింది. కాంచీపురంలోని కైలాసనాధ దేవాలయానికి ‘రాజసింహేశ్వరం’ అనే నామంతరం కూడా ఉంది. దేవాలయ నిర్మాణంలో అప్పటి దాకా  అవలంబిస్తూ వస్తూండిన గుహాలయాల పధ్ధతికి స్వస్తి చెప్పి,  ఆలయాన్ని  ఇటుకలతోనూ, రాళ్ళతోనూ కట్టే పధ్దతిని ఈ ఆలయాల నిర్మాణంలో అవలంబించారు. ఈ పధ్ధతినే ఆ తరువాత పట్టడకల్ లోని విరూపాక్షాలయం, ఎల్లోరాలోని కైలాసనాధ దేవాలయాల నిర్మాణంలోనూ అవలంబించారని పెద్దల అభిప్రాయం.

కైలాసనాథ దేవాలయం, కాంచీపురం - సింహముల వరుస
కైలాసనాథ దేవాలయం, కాంచీపురం – సింహముల వరుస

రాజసింహుడు గొప్ప శివ భక్తుడు.  గంగాధర శివునికి అంకితమీయబడిన ఈ కైలాసనాధ దేవాలయాన్ని తన ఆరాధన కోసంగానే  కట్టించినట్లు ఈ ఆలయ ప్రాంగణంలో వేయించిన శాసనంలో అతడు చెప్పుకున్నాడు.  ఆలయంలోని ప్రతి పార్శ్వం, ప్రతి కోణం కూడా సుందరమైన శిల్పంతో నింపివేయబడి కనుపిస్తుంది.

పల్లవులచే నిర్మించబడిన దేవాలయాలలో ‘నోరు తెరిచి వున్న సింహం తల’  motif చాలా ఎక్కువగా కనబడుతుంది.  సింహం ఈ పల్లవ రాజవంశపు అధికార చిహ్నం కావడం ఇందుకు కారణం.

కైలాసనాథ దేవాలయం, కాంచీపురం - దుర్గ
కైలాసనాథ దేవాలయం, కాంచీపురం – దుర్గ

దుర్గ, అంబ, శక్తి, భవాని – ఇలా ఏ పేరుతో పిలిచినా ఆ పేర్లన్నీ ఒకే స్వరూపానికి చెందుతాయి. ఆ స్వరూపం స్త్రీత్వానికి ఆది అనాది స్వరూపంగా పూజలందుకుంటూన్న శక్తిస్వరూపిణి అయిన అంబ.  కైలాసనాధ దేవాలయంలోని ఈ దుర్గామాత రూపం సౌందర్యం, శక్తిమత్వం – రెండూ సమపాళ్ళలో కలగలిసి వున్న అత్యంత అద్భుతమైన రూపం.  దేవాలయాలలో మలచబడిన దుర్గామాత రూపాలలో ఈ రూపం చాల పురాతనమూ, అంతగానూ సుందరమూ అయినదిగా మన్ననలందుకుంది.

కైలాసనాథ దేవాలయం, కాంచీపురం - శంకరుడు
కైలాసనాథ దేవాలయం, కాంచీపురం – శంకరుడు

ధ్యాన ముద్రలో వున్న ఈ శంకరుని ప్రతిమ సౌదర్యాన్ని వర్ణించడానికి మాటాలు చాలవు.

ఈ శిల్పాలలో ఒత్తుగా వుండి వేళాడుతూ వున్నట్లుగా వుండే ప్రస్పుటమైన యజ్ఞోపవీతం, వర్తుల స్తంభాకారంలో వుండే ఎత్తయిన కిరీతం వంటి ఆకర్ష ణీయమైన అలంకరణలు విష్ణుకుండిన శిల్పం నుంచి తీసుకోబడినాయని చెబుతారు.

కైలాసనాథ దేవాలయం, కాంచీపురం - నంది
కైలాసనాథ దేవాలయం, కాంచీపురం – నంది

కైలాసనాథ దేవాలయంలో నందీశ్వరుని ప్రతిమ ముఖ్య దేవాలయానికి కాస్త దూరంగా ఉంటుంది. అయితే, ఆ తరువాత నిర్మించబడిన శివాలయాలలో ఈ దూరం తగ్గి, నంది శిల్పం ముఖ్య దేవాలయానికి బాగా దగ్గరగా చేర్చబడి వుండడం తెలిసినదే!

కంచి లోని కైలాసనాధ దేవాలయాన్ని గురించి పూర్తిగా వ్రాయాలంటే దక్షిణ దేశపు చరిత్రకు, ఆలయ శిల్ప పరిణామ వికాసానికీ సంబంధించి సమగ్రమైన జ్ఞానం వుంటేనే గాని సాధ్యం కాదు. అందులో నాకున్న అంతంత మాత్రపు జ్ఞానంతోనూ, అక్కడక్కడా చదివి తెలుసుకున్న సమాచారంతోనూ, నా వద్ద వున్న ఫోటోల ఆదరువుతోనూ, ఈ చిన్న వ్యాసం వ్రాశాను. ముందుగానే చెప్పినట్లుగా, దక్షిణాది ఆలయ పరిణామ క్రమంలో ఈ కైలాసనాధ దేవాలయానికి ప్రత్యేకమైన, అతి ముఖ్యమైన స్థానం వుంది. అలాంటి ఈ ఆలయం గురించి ఇక్కడ నేను వ్రాసిన సమాచారంలో ఏదయినా తప్పు దొర్లి ఉండవచ్చు. అది తెలియక జరిగిన తప్పుగా భావించి ఈ ఆలయం గురించిన పూర్తి సమాచారం తెలిసిన ఈ విద్యలలో విజ్ఞులు అయిన పెద్దలు పెద్దమనసు చేసుకుని మన్నిస్తారని ఆశిస్తాను.

భోగనందీశ్వరాలయం,’నంది’ గ్రామం (కర్ణాటక) – 2

బాణ వంశపు రాజైన విద్యాధరుని దేవేరి ‘రాణి రత్నావళి’  కోరిక మేరకు మొదటి దశలోని భోగనందీశ్వరాలయం ఇక్కడ క్రీ.శ.810 లో నిర్మించబడిందనీ, ఆ తరువాతి కాలంలో గాంగ, పల్లవ, చోళ, హొయసల, విజయనగర రాజవంశాలకు చెందిన రాజుల పరిపాలనా కాలాల్లో  ఆపై తగిన విధంగా మార్పులూ చేర్పులూ ఈ ఆలయానికి జరిగాయని చెబుతుంది చరిత్ర.

ఆలయం ముఖ ద్వారానికి గోపురం  లేదు. ముఖ ద్వారం దాటి లోనికి అడుగు పెట్టి అంతా చూసిన తరువాత, నాకు లోపల ఆలయం మొత్తం మూడు భాగాలుగా ఉన్నట్లు  అనిపించింది.  ఆలయంలో అర్చనలందుకుంటున్న భోగనందీశ్వర, అరుణాచలేశ్వర మరియు ఉమామహేశ్వరుల  ఆలయాలు,  ఇంకా చిన్న చిన్న ఆలయాలు ఉన్న భాగం మొదటిది.  వసంతమండపం, తులాభార మండపం ఉన్న భాగం రెండవది. ఈ ఆలయంలోని ప్రత్యేక ఆకర్షణ అయిన బృహత్తర నిర్మాణం,  కోనేరు వున్న భాగం మూడవది.

ఆలయంలో అడుగుబెట్టిన దగ్గర్నుంచి ఎటు చూసినా  కంటికి అంతా సౌందర్యమే, మనసుకు అంతా ప్రశాంతతే! ఆయా కాలపు రీతులలో ఆ కాలపు శిల్పుల చేతులలో శిల తిరిగిన వివిధాలైన వంపులూ, వయ్యారాలు అన్నీ ఈ ఆలయ  ప్రాంగణంలో దర్శనమిస్తాయి.

భోగనందీశ్వర ప్రథాన ఆలయ గోపురం –

Gopuram

భోగనందీశ్వర ఆలయం గోడ వెలుపలి వైపు గూటిలో మలచబడిన ఈ బొజ్జ గణపయ్య బుజ్జి విగ్రహం ఎంతగానో అందంగా వుంది.

Vighnaraja

అలాగే ఆ పక్కనే వున్న ఈ నాగ ప్రతిమలూ…

Naga

భోగనందీశ్వర ఆలయం గోడ వెనక వైపున మలచబడిన ఈ సుందరీమణుల ప్రతిమల గుంపూ…

Beauty panel

ప్రథాన ఆలయం వెనుకవైపు వున్న చిన్న ఆలయంలో మలచబడిన ఈ విఘ్నేశ్వర, ద్వారపాలిక ప్రతిమలూ…

Vighnaraja_2

ఈ మొదటి బాగంలోని అందమయిన రూపాలలో ఇవి కొన్ని మాత్రమే!

భోగనందీశ్వరాలయం, ‘నంది’ గ్రామం (కర్ణాటక) – 1

దక్షిణ భారతదేశంలో ద్రావిడ పధ్ధతిలో దేవాలయ నిర్మాణం చేరుకున్న అత్యున్నత శిఖరాలను ఇప్పటికీ కళ్ళముందుంచగలిగిన దేవాలయాలలో అతి ముఖ్యమైన దేవాలయం, భోగనందీశ్వరాలయం.  కర్నాటక రాష్ట్రంలో, చిక్కబళ్ళాపూరుకు కొద్ది దూరంలో వున్న ‘ నంది’ అనే పేరున్న గ్రామంలో ఈ దేవాలయం వుంది.

పర్యాటకంలో tourist attraction గా  పక్కనే వున్న నందీ హిల్స్ కు ఉన్నంత – ప్రాథాన్యత  అనడం కన్నా – ఆకర్షణ లేక పోయినప్పటికీ, heritage పరంగా ఈ ఆలయానికి వున్న ప్రాథాన్యత చాలా గొప్పది. దేవాలయ నిర్మాణంలో తమదైన ద్రవిడ సంప్రదాయాన్ని ఊహించి, పెంచి ఒక స్పష్టమైన పధ్ధతిగా పెద్ద చేసిన మన పూర్వీకుల ఆలోచనలలోని grandness ఇక్కడ ప్రతి చోటా కనబడుతుంది.

ప్రాంగణంలోనికి అడుగు పెడుతూనే, ఆ ప్రాంగణం యొక్క విస్త్రుతి, వైశాల్యం…చుట్టూ ఆవరించి వున్న 112.8 మీటర్ల పొడవు, 78.2 మీటర్ల వెడల్పుతో వున్న – లోపలి వైపు pillored corridor గా నిర్మించబడి వున్న-  ప్రాకారం చేత పరివేష్ఠించబడి వున్న విశాలమయిన ఆవరణం… ముందుగానే మతి పోగొడుతుంది. ఇది గదా ఆలయ ప్రాంగణమంటే ! అని అనుకునేలా చేసి తీరుతుంది.

భోగనందీశ్వరాలయం - ఆలయ ప్రాంగణం  (ఫొటో-1)
భోగనందీశ్వరాలయం – ఆలయ ప్రాంగణం (ఫొటో-1)
భోగనందీశ్వరాలయం - ఆలయ ప్రాంగణం  (ఫొటో-2)
భోగనందీశ్వరాలయం – ఆలయ ప్రాంగణం (ఫొటో-2)
భోగనందీశ్వరాలయం - ఆలయ ప్రాంగణం  (ఫొటో-3)
భోగనందీశ్వరాలయం – ఆలయ ప్రాంగణం (ఫొటో-3)
భోగనందీశ్వరాలయం - ఆలయ ప్రాంగణం  (ఫొటో-4)
భోగనందీశ్వరాలయం – ఆలయ ప్రాంగణం (ఫొటో-4)

ముఖ్య ఆలయానికి ముందున్న విశాలమయిన ప్రాంగణంలో ఒక వైపున చిన్న  కోనేరు ఏర్పాటు చేయబడింది. ఈ కోనేరు ఉపయోగం ఊహించ గలిగిందే – ముఖ్య ఆలయ ద్వారాన్ని సమీపించే టప్పుడే భక్తులు పాద ప్రక్షాళనం చేసుకోవడానికి వీలుగా చేయబడిన ఏర్పాటు ఇది.  ఈ చిన్న కోనేరు ఆలయంలోపల ఉన్న మహద్భుతమైన కోనేటికి ఒక sample – నమూనా లాంటిది.

ఆలయం ముందున్న ఆవరణలోని కోనేరు - ఫొటో (1)
ఆలయం ముందున్న ఆవరణలోని కోనేరు – ఫొటో (1)
ఆలయం ముందున్న ఆవరణలోని కోనేరు - ఫొటో (2)
ఆలయం ముందున్న ఆవరణలోని కోనేరు – ఫొటో (2)

ఆలయం ముందు ‘మహానవమి దిబ్బ’ అని ఒక శిథిలమై మిగిలిన నిర్మాణం ఉంది. బహుశా ఇక్కడ దసరా పండుగ రోజులలో జరిగే ఉత్సవాలలో ఈ నిర్మాణం ప్రదర్శనలకు ఒక వేదిక లా ఉపయోగపడేది అనుకుంటాను. ఇక్కడ నిలబడి తలెత్తి చూస్తే, దూరంగా ఈ ప్రాంతంలో అమితంగా జనాకర్షణ కలిగిన ‘ నంది హిల్స్’  కనుపిస్తాయి.

మహానవమి దిబ్బ (background లో దూరంగా నంది హిల్స్) - ఫొటో (1)
మహానవమి దిబ్బ (background లో దూరంగా నంది హిల్స్) – ఫొటో (1)
'మహానవమి దిబ్బ' వేదిక - ఫొటో (2)
‘మహానవమి దిబ్బ’ వేదిక – ఫొటో (2)

కొండపల్లి కోట

ప్రకృతి పలు వనరుల్ని ప్రసాదిస్తుంది. ఆ వనరుల్ని ఏలా ఉపయోగించుకోవాలి అన్నది ఆయా ప్రాంతపు ప్రజల తెలివితేటల మీద, విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది.

విజయవాడకు నందిగామకు మధ్య దాదాపు 24 కి.మీ. పర్యంతం పరుచుకుని ఒక పర్వత శ్రేణి ఉంది. అందులో ముఖ్యమైన అంతర శ్రేణి కొండపల్లి కి చెందినది. ఈ కొండపల్లి పర్వతాలమీద స్థానికంగా ప్రజలు ‘పొనుకు చెట్టు ‘ అనే పేరుతో పిలుచే చెట్టు విస్తారంగా పెరుగుతుందట. ఈ చెట్టు నుంచి వచ్చే కలప బాగా తేలికగా వుండి బొమ్మల తయారీకి అనువుగా వుంటుందని గ్రహించిన విజ్ఞులైన స్థానికులు కొందరు అక్కడ బొమ్మల తయారీ మొదలెట్టారు, ఎన్నో వందల ఏళ్ళ క్రిందట. పోను పోను అది పెరిగి, ఆ ప్రాంతపు ప్రజలకు ముఖ్య జీవనాధామైంది. దానితో పాటు కొండపల్లికి మంచి పేరు ప్రఖ్యాతలని తెచ్చి పెట్టింది. కొండపల్లి పేరు చెపితే చాలు, సాంప్రదాయికమైన రంగులతోనూ ఆకారాలతోనూ అక్కడ తయారైన బొమ్మలే గుర్తుకు వస్తాయి ఇప్పుడు.

అదలా వుంచితే, కొండపల్లికి సంబంధించి అంతగా ప్రఖ్యాతం కాని ఒక పర్యాటక విశేషం వుంది. అది అక్కడి కొండ మీద నిర్మితమై ఇప్పుడు శిథిలావశేషంగా మిగిలి వున్న కోట.  క్రీ.శ.14 వ శతబ్దంలో రెడ్డిరాజుల పాలనా కాలంలో ఈ కోట నిర్మించబడిందట. ఆ తరువాతి కాలంలో ఈ కోట చాలా యధ్ధాలను చూసింది. బహమనీ సుల్తానుల చేతులలోకీ, గజపతుల చేతులలోకీ వెళ్ళింది. ఆ తరువాత విజయనగర రాజులలో అతి ముఖ్యుడు, ఆంధ్రులకు ప్రియాతి ప్రియుడైన రాజు శ్రీ కృష్ణదేవరాయల చేతిలోకి వెళ్ళింది. ఆ తరువాత కుతుబ్ షాహీ వంశజుల చేతిలోకీ, ఆపై ఆంగ్లేయుల అధీనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు, స్వతంత్ర భారతంలో ASI ఆలన పాలనలో వుంది.ఇదంతా చరిత్ర, ఒకింత  సంక్షిప్తంగా.

కిందనుంచి కొండమీదికి రోడ్డు బాగానే వుంటుంది. అయితే, పూర్తిగా ఘాటు రోడ్డు. ఒక్కొకచోట చాలా ఇరుకుగా, చుట్టూ చెట్లతో చీకటిగా, ఊహించని మలుపులతో ఆశ్చర్యానికి,  కొత్తవాళ్ళను ఒకింత గాభరాకూ గురిచేసేదిగా ఉంటుంది. కొండమీద కోటకు చేరుకున్న తరువాత, అక్కడ అంత విశాలమైన సమతల ప్రదేశం ఉండగలదని ఊహించలేనట్లుగా వుంటుంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఆంధ్ర ప్రదేశ్ శాఖ) వారి పరిరక్షణలో వుందీ కోట ప్రస్తుతం.  కొన్ని మరమ్మతు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మేము చూసినప్పుడు. కోట ఆవరణలోకి వెళ్ళగానే మొదటి అంతస్తులో – అంటే, అక్కడి ground level లో – ఉన్న arched hall వెలుపలి వైపు గోడకు అమర్చబడి వున్న మూడు ఫిరంగులు మొదటగా కనబడతాయి.

Fort_Outer_1A

Fort Outer_B

ఆ పక్కనే వున్న మెట్లమీదుగా పై అంతస్తుకి వెళితే, మనం అప్పుడు నర్తన శాల గా వుండిన విశాలమైన (ఇప్పుడు పై కప్పు లేకుండా పోయిన) హాలును చేరతాం.

Dancing Hall-1Aనర్తనశాల – చిత్రం (1)

Dancing Hall-2Aనర్తనశాల – చిత్రం (2)

Dancing Hall-3Aనర్తనశాల – చిత్రం (3)

Dancing hall_Aనర్తనశాల – చిత్రం (4)

అక్కడి నుంచి అంటే ఈ Dancing Hall వెనకవైపు నుంచి కిందకు చూస్తే కోటలొ నివసించే వాళ్ళకు నీటి అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేయబడిన నీళ్ళ టాంకు కనబడు తుంది.

Water TankWater Tank

క్రిందికి దిగి  నీళ్ళ టాంకు వున్న చోటినుంచి నడిస్తే అప్పటి రాణి మహలు అక్కడి నుంచి యాగ శాలకు, ఆపై అప్పటి విపణి ప్రదేశానికి
(Market place) ఆ వెనుక కారాగారం (Jail) కు చేరతాం.

Rani Mahal_Aరాణీ మహలు – చిత్రం (1)

Rani Mahal_2Aరాణీ మహలు – చిత్రం (2)

Market Place_Aవిపణి వీధి – చిత్రం (1)

Market place_Bవిపణి వీధి – చిత్రం (2)

Yaga_sala_Aయాగశాల

Jail_Aకారాగారం

ఆ తరువాత కోట వెనుకవైపుకు వెళ్ళి ఒక్క సారి క్రింది చూస్తే ఒక breath-taking view మనకు దర్శన మిస్తుంది.

View from the hill_fort_AView from the top of the Fort

మొత్తం మీద, కోటలోని ఒక్కొక భాగాన్ని తిరిగి చూస్తున్నంత సేపూ, కొండ కొన మీద ఇంత విశాలమైన ఆవరణలో,  అవసరానికి కావలసిన అన్ని సౌకర్యాలతోనూ, హంగులతోనూ ఇంత పెద్ద నిర్మాణం ఉండడం అనేది ఊహించి ఉండం కాబట్టి, ఒకింత అశ్చర్యానికి ఆనందానికి గురి అవుతాం. ఈ కోట నిండైన  రూపం మనకు పూర్తిగా అవగతమవక పోయినా, కనుపించే శిథిలాలలోనే మన ఊహలలో చాయా మాత్రంగా మెదిలే రూపం, అసలుకు ఈ కోట నిర్మాణాన్ని ఇక్కడ ఈ స్థాయిలో ఊహించి రూపం కల్పించడంలో కృతకృత్యులయిన అప్పటి వ్యక్తుల planing కూ, పనితనానికి మనసులో జోహారులర్పిచకుండా ఉండలేకుండా చేస్తుంది.

కోటలోని అంతర్భాగలను ఒక్కొకదానినీ ఇంకా organised గా  పునరుధ్ధీకరించి, తగినంత ప్రచారం కలుగజేసి, రవాణా ఇత్యాది సౌకర్యాలను పెంచి, ఈ ప్రాంతంలో ఒక మంచి పర్యాటక కేంద్రంగా వృధ్ధి చెందేలా చేయడానికి కావలసిన అర్హతలన్నీ ఈ కొండపల్లి కోటకు ఉన్నాయి.

కోటను చూసి ఇక తిరుగు ప్రయాణానికి సిధ్ధమై వస్తూండగా, ఆకులు రాలి ఎండిపోయినట్లున్న చెట్టు కొమ్మలలోంచి చందమామ, కొండపల్లి కోట శిథిలాలలావశేషాలలో నా సెల్ ఫోను కెమేరాకు ఇలా దొరికాడు.కోట శిథిలావశేషాల జ్ఞాపకాలతో పాటు, జ్ఞాపకంగా వెంట తెచ్చుకున్నాను!

Moon siight_A

భట్టిప్రోలు స్తూపం

Bhattiprolu_0భట్టిప్రోలు స్తూపం – ఫొటో (1) (విశాలమైన ప్రదక్షిణ పథం తో)

భట్టిప్రోలు కు నేను మొదటి సారి నా ఇరవై ఏళ్ళ వయసులో వెళ్ళాను, (కాస్త దూరపు) బంధువులను ఏదో function కి పిలవాల్సిన పనిమీద. అప్పటికి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో భట్టిప్రోలు ప్రాథాన్యాన్ని గురించి చదివినది జ్ఞాపకం ఉండడం మినహా ఇందులో ఎదో చూడాలన్న కుతూహలంగానీ, ఆసక్తి గానీ అప్పుడు లేవు. పక్కనుంచి నడిచి వెళ్ళ్తూ ఒక సారి అటువైపుగా చూసి ‘ఒహో, ఇదా భట్టిప్రోలు స్తూపం అంటే!’ అనుకుని వెళ్ళిపోయాను.

Bhattiprolu_0Aభట్టిప్రోలు స్తూపం – ఫొటో (2) (విశాలమైన ప్రదక్షిణ పథం తో)

మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి ఇప్పుడు అనుకోకుండా భట్టిప్రోలు వెళ్ళడం, చూడడం, కాసిని ఫోటోలు తీసుకోవడం (సెల్ ఫోను లోని కెమేరాతో, అసలు కెమేరా వెంట లేని కారణంగా) …ఇప్పటికైనా మళ్ళీ వెళ్ళి చూసి, ఆ ప్రదేశంలో కాసేపు కాలం గడపగలగడం అదృష్టంగానే భావిస్తున్నాను! ఈ ప్రదేశం అలాంటిది మరి!

దక్షిణ భారతదేశంలోని లిపులన్నిటికీ (నిజానికి ఇక్కడే గాక, బౌధ్ధం విస్త్రుతంగా వ్యాపించిన బర్మా, మలయా, థాయిలాండు లాంటి కొన్ని పర దేశాల భాషలకు కూడా అని చదివాను) అధార లిపిని ప్రదానం చేసిన ఆది లిపి లాంటి లిపి ఒకటుంది.  ఆ లిపి పేరు ‘భట్టిప్రోలు లిపి ‘ అని భాషా చరిత్రకారులు చెబుతారు. మిగతా సంగతు లెలావున్నా, ఈ ఒక్క కారణంగా అక్షరాలు, భాష, సాహిత్యం అంటే  మమకారం ఉన్న నాకు (ఇంకా నా లాంటి చాలా మందికి) భట్టిప్రొలు నిస్సందేహంగా ఒక పుణ్య ప్రదేశం, పవిత్ర స్థలం.

Bhattiprolu_1భట్టిప్రోలు స్తూపం – ఫొటో (3)

చరిత్రలోకి వెళితే, భట్టిప్రోలు అసలు పేరు ‘ప్రతీపాలపురం’ అట! (కథలలో పేరులాగా పేరు వినడానికి చాల బాగుంటుంది. ఇలా వున్న పేర్లన్నీ ఇప్పుడు ఎందుకనో మాయమైపోయా యనిపిస్తుంది. ‘భట్టిప్రోలు’ విషయంలో పూర్తిగా అలా అనడానికి లేదనుకుంటాను. ఎందుకంటే, ‘ప్రతీ పాల’ అనే పదాలే పోను పోను ‘భట్టి ప్రోలు’ గా మారాయేమో అనిపిస్తుంది కాబట్టి!) ఆంధ్ర శాతవాహన రాజుల పాలనా కాలం ప్రారంభానికి ముందునుంచీ (క్రీ.పూ.3 వ శతాబ్ది ముందునుంచీ) ఈ నగరం ప్రముఖమైనదిగానే వుండినదని చరిత్ర చెబుతుంది. ఈ నగరాన్ని కుబేరకుడనే రాజు పాలించాడని ఇక్కడ దొరికిన శాసనాధారలను బట్టి చరిత్ర పరిశోధకులు కనుగొని చెప్పిన సంగతి.

దేశం బ్రిటిషువారి పాలనలో ఉన్న రోజులలో ఈ స్తూపాన్ని కనుగొని, తవ్వకాలలో బయటపెట్టిన వ్యక్తి పేరు అలక్జాండర్ రే (1892 లో). ఆ తరువాత భారతీయ పురాతత్త్వ పరిశోధకులయిన శ్రీ రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాలలో బౌధ్ధ విహారపు పునాదులు, బుధ్ధునికి సంబంధించిన వస్తువులు లభించాయని చెప్పబడింది. స్తూపం ఆవరించుకుని వున్న ప్రదేశం వైశాల్యం మొత్తం 1700 చదరపు గజాలు. 40 అడుగుల ఎత్తు. 8 అడుగుల సౌకర్యవంతమైన ప్రదక్షిణా పథం భట్టిప్రోలు స్తూపం ప్రత్యేకత. ఇదంతా ఒకింత academic గా అనుపించే సమాచారం.

Bhattiprolu_2భట్టిప్రోలు స్తూపం – ఫొటో (4)

తవ్వకాలలో ఇక్కడ స్తూపంలో దొరికిన ‘ధాతు కరండం’ (కరండము అంటే casket – భరిణ) మూత పైవైపు చెక్కబడి అక్షరాలు అశోకుని కాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో వున్నాయనీ,  ఆ లిపినే  భాషా శాస్త్రజ్ఞులు ‘భట్టిప్రొలు లిపి’ అని ఒక కొత్త పేరు పెట్టి పిలిచారనీ చదివిన సంగతులు.  దక్షిణ భారతంలోని భాషలకు ఈ లిపి నే ఆధార లిపి కావడం, ఈ లిపినుండే అవి పరిణామం చెందడం అనేది  ఇలా ‘భట్టిప్రొలు లిపి’ అని ఒక ప్రత్యేకమైన పేరు పెట్టి పిలవడానికి కారణం అట!

Bhattiprolu_3భట్టిప్రోలు స్తూపం – ఫొటో (5)

అమరావతి స్తూపం ఆవరణలో వున్నట్లుగా మొక్కుబడి స్తూపాలు (Votive Stupa), ఇంకా ఆయక స్తంభం లేవు గాని, ప్రత్యేకంగా ‘ఆయక అరుగులు’  (Ayaka platforms or Ayaka Stones) అనదగిన నిర్మాణాలు ఈ భట్టిప్రోలు స్తూపం ఆవరణలో కనుపిస్తాయి.  ‘ఆయక స్తంభాలు’ మాదిరిగానే ఇవి గూడా పూజనీయాలే!

Bhattiprolu_4భట్టిప్రోలు స్తూపం – ఫొటో (6)

Bhattiprolu_5భట్టిప్రోలు స్తూపం – ఫొటో (7)

బట్టిప్రోలు స్తూపం ఆవరణలో, ఏ అట్టహాసమూ లేకుండా, నిద్రపోతున్న వృధ్ధ వృషభం లాగా ఉన్న స్తూపం పక్కనే వున్నంతసేపూ, వేల సంవత్సరాల క్రితం తనంత తానుగా సమాధిలోకి వెళ్ళిపోయిన ఒక మహాపురుషుని చెంతనే ఉన్నానన్న భావన నాకు కలిగింది!

అమరావతి – 2

అమరావతి స్తూపం జగత్ప్రసిధ్ధం. బుధ్ధుడు ఇక్కడనే ‘Kalachakra’ ను బోధించాడని చెబుతారు. అంటే ఈ ప్రదేశం బుధ్ధుని జీవితకాలం నుంచీ, అంటే క్రీ.పూ.500 ప్రాంతం నుంచే ప్రాముఖ్యాన్ని సంతరించుకుని ఉండినదిగా అవుతుందని కూడా అభిప్రాయపడ్డారు.

Stupam_1
Stupam_2

వైశాల్యంలో అమరావతి స్తూపం భారతదేశంలో నిర్మితమైన బౌధ్ధ స్తూపాలన్నిటిలోకీ పెద్దది.

Stupam_3

స్తూప నిర్మాణంలో ఆంధ్ర శిల్పుల పనితనం ఇక్కడి శిల్పంలో ఏ మేరకు కనబడుతుందనేది ఇప్పటికే సవివరంగా చాలా చోట్ల చెప్పబడింది.

Padmam_A

Padmam_2

ఈ స్తూపం ఉన్న ఆవరణలో నా దృష్టిని ఆకర్షించినవి ప్రముఖంగా రెండు; ఆ రెంటిలో మొదటిది – Votive Stupa అనబడే ‘మొక్కుబడి స్తూపాలు ‘, రెండవది Ayaka pillar ఆర్యక లేద ఆయక స్తంభం  అనేవి. వీటిలో మొక్కుబడి స్తూపం అనేది బౌధ్ధ మతానుయాయులు  వాళ్ళ మొక్కుబడులను చెల్లించుకోవడానికి ప్రముఖమైనటువంటి బౌధ్ధ స్థలాలను సందర్శించే సందర్భంలో నిర్మింపజేసినవి.  అలా కానప్పుడు, మోక్షం కోసంగా నిర్మింపజేసినవిగానీ అయి వుంటాయని చెబుతారు. అలా బౌధ్ధ భక్తులచే నిర్మింపజేయబడిన మొక్కుబడి స్తూపాలు అమరావతి స్తూపం ఆవరణలో వున్నాయి. పెద్ద స్తూపాలకు చిన్న ప్రతిరూపాల్లా చూడడానికి చాల బాగున్నాయి.

Votive Stupa_1

Votive Stupa_2

Votive Stupa_3

ఆయక స్తంభం లేదా ఆర్యక స్తంభం అంతే పూజనీయ మైన స్తంభం అని అర్ధం.  బుధ్ధ భగవానుని జీవితంలోని అయిదు ముఖ్యమైన ఘట్టాలకు ఈ ఆయక స్తంభం ప్రతీక కనుక పూజనీయమైనది అని అంటారు. ముఖ్య స్తూపం చుట్టూ  ప్రదక్షిణకు వెళ్ళబోయే ముందు ఈ ఆయక స్తంభానికి మొక్కి వెళ్ళడం ఆచారమని చెబుతారు.

Ayaka pillar_A

ఒక క్షేత్రానికి సంబంధించి దగ్గర దగ్గరగా రెండువేల అయిదువందల సంవత్సరాలకు సంబంధించి గుర్తించ గలిగిన చరిత్ర ఉండడం చిన్న విషయం కాదు. అందుకనే, అమరావతి లాంటి ప్రదేశానికి వెళ్ళి నపుడు, అక్కడి సంగతులను గురించి తెలుసు కున్నపుడు ఆనందం కలుగుతుంది. ఎందుకో చెప్పలేను గాని వదిలి వచ్చేస్తుంటే చివరలో కొంత బాధ లాంటి నిట్టూర్పు కూడా కలుగుతుంది!

అమరావతి – 1

ఆంధ్రుడయిన ప్రతి ఒక్కనికీ విశేషంగా అమరావతి ఒక పుణ్యభూమి (ఇలా చెప్పడమంటే మిగతా వాళ్ళకు కాదని కాదు సుమా! ఆంధ్రులకు చెందిన నేల కాబట్టి విశేషంగా అనే ఆ మాట!). శివుని పంచారమాలలో ఒకటై వుండడం, ఒకప్పుడు పూర్తి దక్షిణాపథాన్ని, ఉత్తర భారతంలోనూ కొంత బాగాన్నిపాలించిన శాతవాహనులకు తొలి (ధాన్యకటకం, ధరణికోట అనే పేర్లతో) రాజధాని కావడం, ఆంద్రుని చేతులమీదుగా బౌధ్ధ శిల్పం అత్యున్నత శిఖరాలను చేరుకున్న ప్రదేశం కావడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు.

Buddha Statue_1Aనేను సందర్శించిన నాటికి ఇంకా నిర్మాణం పూర్తి కాని బుధ్ధుని ప్రతిమ

అదలా వుంచితే, తెలుగు సాహిత్యం మీద అభిమానం, కథా సాహిత్యంతో మంచి పరిచయం వున్న వాళ్ళకి మరో కారణం వల్ల అమరావతి తప్పనిసరిగా గుర్తుండిపోయే ప్రదేశం. ఆ కారణం సత్యం శంకరమంచి గారి ‘అమరావతి కథలు’ పుస్తకం.

రచయిత తను పుట్టి పెరిగిన local జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా రాసి చూపెట్టిన ఏ కథయినా ప్రసిధ్ధమవుతుంది. కృష్ణానది, ఆ నదీ తీరాన్ని అంటి పెట్టుకుని వున్న ప్రజల  జీవితాల్లోని సంఘటనలతో కూడుకున్న ఈ కథలు  – అమరావతి, ఇంకా ఆ చుట్టుపట్ల ప్రదేశాలకు చెందిన జనజీవితాన్ని ఇవి బగా record చెసి చూపెట్టిన కారణంగా – తెలుగు సాహిత్యంలో బాగా ప్రసిధ్ధి చెందాయి. అమరావతి దగ్గర కృష్ణా నదిపై నాకు ప్రత్యేకమైన అనురాగం ‘అమరావతి కథల’ తోనే ఎక్కువయిందని చెప్పినా అతిశయోక్తి కాదు.

అమరేశ్వర స్వామి వారి ఆలయం పక్క నుంచి మెట్లు దిగగానే కనుపించే కృష్ణా నది నాకు సహజంగానే ‘అమరావతి కథలు ‘ పుస్తకాన్ని తలపుకు తెచ్చింది. తీసిన ఫోటోలను ఇంకాస్త నగిషీ చేసి ఇక్కడ ఇప్పుడు పెడుతున్నాను.

Amaravathi-3Aఅమరావతి – కృష్ణా నది – ఫోటో (1)

Amaravathi-1Aఅమరావతి – కృష్ణా నది – ఫోటో (2)

Amaravathi-2Aఅమరావతి – కృష్ణా నది – ఫోటో (3)

కాకతీయ శిల్పం

శిల్పాన్ని మలచడంలో అవలంబించిన పధ్ధతిని (style ని) దృష్టిలో పెట్టుకుని చూస్తే, తూర్పు చాళుక్యుల కాలపు శిల్పం అలంకరణ   పెద్దగా ఉండని సాదా శిల్పం. పశ్చిమ చాళుక్యులది అలంకరణ సహిత శిల్పం. హొయసలులది అమితాలంకరణతో నిండిన శిల్పం. కాకతీయులది పశ్చిమ చాళుక్యుల కాలపు అలంకరణకూ హొయసలుల కాలపు అమితాలంకరణకూ మధ్యస్తంగా ఉండే శిల్పం అని పెద్దల మాట. తనదైన ఒక ప్రత్యేకతను నిర్ధారించుకుని కాకతీయ శిల్పం, ఆ వంశపు మలితరం రాజులలో మొదటివాడనదగిన రుద్రదేవుని పరిపాలనా కాలంలో, అంటే క్రీ.శ.1158 నుండి 1195 మధ్య కాలంలో, ఊపిరిపొసుకుని వికాసంపొందింది.

వేయి స్తంభాల గుడి - చిత్రం (1)
వేయి స్తంభాల గుడి – చిత్రం (1)

రుద్రదేవుడు కాకతీయ వంశపు రాజులలో రెండవ ప్రోలుడు గా పిలవబడే రెండవ ప్రోలరాజు (క్రీ.శ.1115-1157)యొక్క ఐదుగురు పుత్రులలో పెద్దవాడు. క్రీ.శ.1157లో తీరాంధ్ర మండలంలో జరిగిన ఒక యుధ్ధంలో సంభవించిన ప్రోలుని మరణానంతరం రాజ్యాధికారాన్ని చేబడతాడు. తండ్రి అయిన రెండవ ప్రోలుడు కాకతీయ సామ్రాజ్యమనే సౌధానికి పునాదులను వేస్తే, కొడుకైన ఈ రుద్రదేవుడు ఆ పునాదులపై తండ్రి తలచిన రీతిలో ఆ సౌధ నిర్మాణాన్ని పూర్తిచేసి చూపెట్టాడు. రుద్రదేవుని కాలంలోనే కాకతీయ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యమైంది. స్వతంత్ర రాజ్య స్థాపన సందర్భంగా, శక సంవత్సరం 1084 చిత్రభాను సంవత్సరం మాఘ శుధ్ధ త్రయోదశికి   సరియైన క్రీ.శ.1163 జనవరి 19 శనివారం నాడు  అనుమకొండలో తనపేరున రుద్రేశ్వరదేవుని, వాసుదేవుని, సూర్యదేవుని ప్రతిష్ఠించి ఆ త్రికూటానికి వేయిస్తంభాలతో విరాజిల్లే మండపం వున్న దేవాలయాన్ని నిర్మింపజేశాడు. అదే ఇప్పుడు వేయి స్తంభాల గుడిగా పిలవబడుతూన్నది. ఆ ఆలయ పోషణ కొసంగా మద్దిచెఱువుల గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు తెలియజేసే శాసనం వేయిస్తంభాల గుడి శాసనంగా ప్రసిధ్ధమైంది. శాసనంలోని భాష సంస్కృతం. రుద్రదేవుని తండ్రియైన రెండవ ప్రోలరాజు విజయాలు, స్వతంత్ర రాజ్య స్థాపనకు ముందు రుద్రదేవుని విజయాలు అన్నీ కలిపి ఇందులో దాదాపుగా యాభై శ్లోకాలలో చెప్పబడినాయి. భరద్వాజ గోత్రుడు, రామేశ్వరదీక్షితుని పుత్రుడు, అద్వయామృత యతి శిష్యుడు అయిన అచింతేంద్రయతి  ఈ శాసనాన్ని ఒక చిన్న కావ్యంలాగా తీర్చి దిద్దాడని పెద్దల భావన.

వేయి స్తంభాల గుడి - చిత్రం (2)
వేయి స్తంభాల గుడి – చిత్రం (2)
వేయి స్తంభాల గుడి - చిత్రం (3)
వేయి స్తంభాల గుడి – చిత్రం (3)

రుద్రదేవుడు మంచి యోధుడు. కాకతీయ రాజ్య స్థాపకుడు. త్వరలోనే రాజ్యానికి తగినదైన ఒక రాజధాని, ఆ రాజధానికి సరితూగగల భవన సముదాయం, ఆ సముదాయానికి తగిన భద్రత, వీటన్నిటి అవసరాన్ని గుర్తించినవాడై కాకతీయుల ఆరాధ్య దైవమైన స్వయంభువ శివుని సన్నిధిలో ఒక పటిష్టమయిన కోట నిర్మాణానికి ఆలోచన చేసి ఆచరణలో పెడతాడు. కాని ఈ కోట నిర్మాణం అతని తరువాత నాలుగేళ్ళకు రాజై (వీరిరువురి నడుమ మహాదేవుని పాలన నిండా మూడేళ్ళుకూడా లేదని చరిత్ర చెబుతుంది) క్రీ.శ.1199 నుండి 1262 దాకా, ఆరు దశాబ్దాల పైగా కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన  గణపతిదేవుని కాలంలో గాని పూర్తికాలేదు. అయితే రుద్రదేవుడు వేసిన పునాదులపైనే ఓరుగల్లు కోట నిర్మాణం జరిగిందనేది లోక ప్రసిధ్ధం.

కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం - చిత్రం (1)
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం – చిత్రం (1)

ఓరుగల్లు కోట మూడు ప్రాకారాలతో పరివేష్టించబడి ఉండేటట్లుగా నిర్మించబడింది. వెలుపలి, మొదటి లోపలి ప్రాకారాలు రెండూ మట్టివి. లోపలిదైన మూడవ ప్రాకారం రాతిది.  ఈ రాతి ప్రాకారాన్ని దాటి లోపలికి వెళితే రాజధాని నగరం, రాజప్రాసాదాలు. ఇక్కడి అప్పటి రాజప్రాసాదాల అవశేషాలు ఇంకా గుర్తించబడలేదు. అయితే, ఇక్కడ ముఖ్యంగా  ఆకర్షించే నిర్మాణాలు శిలా తోరణాలు. కాకతీయరాజుల కాలపు శిల్పకళా కౌశలానికి ఈ తోరణాలు ముఖ్యమైన ఆనవాళ్ళుగా నిలిచి వున్నాయి.

కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం - చిత్రం (2)
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం – చిత్రం (2)
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం - చిత్రం (3)
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం – చిత్రం (3)

తోరణాల నిర్మాణం భారతీయ ఆలయ వాస్తులో సాంచి స్తూపం చుట్టూ సాతవాహన రాజైన శ్రీ శాతకర్ణిచే క్రీ.పూ.2 వ శతాబ్ది కాలంలో నిర్మించబడిన రాతి ఆవారం (stone balustrade), మధ్యలో నాలుగు దిశలా నాలుగు తోరణ ద్వారాల నిర్మాణంతో ప్రవేశపెట్టబడింది. తోరణ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని అందులోంచే గ్రహించినప్పటికీ, తమదైన శైలిలో అందమైన మార్పులన్నిటినీ చేసి అందులోంచి ఒక విశిష్టమైన నిర్మాణాన్ని సాధించి, కాకతీయ తోరణంగా ప్రతిష్ఠించి, శిల్పకళలో తమ ప్రతిభను చాటుకున్నారు కాకతీయ కాలపు శిల్పులు. తెలుగు ప్రజల కళాదృష్టికి, అభిరుచికి, కాకతీయుల కాలపు శిల్పుల కళా ఔన్నత్యానికి నిదర్శనాలుగానూ, అందులో వారి ప్రతిభను చాటి చెప్పే కీర్తి తోరణాలుగానూ  ఆ శిలా తోరణాలు ఇప్పటికీ  నిలిచి ఉన్నాయి.

dance_divine_1

ప్రస్తుతం ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ (ఆం.ప్ర. శాఖ) వారి పరిరక్షణలో ఉన్న ఈ ప్రదేశంలో, వారిచే భద్రపరచబడి ఉన్న మరొక శిల్ప కళాఖండం, ఒక శిలాఫలకంపై మలచబడిన శక్తిస్వరూపిణి, అంబ అయిన దాక్షాయని నాట్యం చేస్తున్నట్లుగా ఉన్న శిల్పం. చాలా భాగం ఖండితమైనప్పటికీ, ఈ శిల్పంలో ద్యోతకమవుతూ కనులకు కనుపించే నాట్యం  చూపరులను ఇప్పటికీ పారవశ్యంలో ముంచుతుందనడానికి  ఎంతమాత్రం సందేహించాల్సింది లేదు.

కాకతీయులు (4)

కాకతీయులు (4)

‘కాకతి’ అన్నది ఒక ఊరి పేరా, దేవత పేరా అన్న విషయంపై భిన్నమయిన అభిప్రాయాలూ వున్నాయి. ఆంధ్ర చరిత్ర పరిశోధకుల మధ్య ఈ విషయమై బహు విధాల చర్చ జరిగింది. కాకతీయుల వంశంలో ఈ మొదటిబేతరాజుకు పూర్వమే, అతని పేరులో ‘కాకతి’ శబ్దం కనుపించే ‘కాకర్త్య గుండ్యన’ అనే రాజు వున్నాడు. ఇతడు క్రీ.శ.945-995 మధ్య కాలానికి చెందినవాడు. ఇతని పేరులోని ‘కాకర్త్య’ అనే పదం సంస్కృతీకరణం చెందిన ‘కాకతి’ శబ్దం అనీ, కొన్ని తెలుగు పేర్లు సంస్కృతీకరణం చెందే క్రమంలో గాలి నరసయ్య అనే పేరు వాతుల అహోబిలపతి అయినట్లుగా ‘కాకతి గుండన’ శబ్దం ‘కాకర్త్య గుండ్యన’ గా మారడం అసంభవమేమీ కాదని చరిత్రకారుల అభిప్రాయం. ఇతనిది సామంతఒడ్డె వంశం. ఒడ్డె పదం ఓడ్ర శబ్దాన్నుంచి పుట్టినది కాబట్టి ఇతడు విశాఖపట్టణ ప్రాంతపు ఒడ్డెనాడుకు చెందినవాడయి వుండవచ్చని ఒక అభిప్రాయం. కాకతీయులు దుర్జయవంశంవారని ఒక శాసనంలో కనబడుతుంది.

కాకర్త్య గుండ్యన తూర్పు చాళుక్యుల వద్ద ఉన్నతోద్యోగంలో వున్న వాడని మాగల్లు శాసనం వలన తెలుస్తుంది. ఇతడు అనుమకొండలోని ప్రాచీన రాజవంశజులతో పెళ్ళిసంబంధం చేసుకుని పెండ్లి గుండమరాజు అని కూడా పిలవబడ్డాడు. ఇతనికి కుంతలదేవి అని ఒక సోదరి ఉంది. ఆమెను బలవంతులయిన విరియాల వంశంజులకు ఇచ్చి వివాహంచేయడం ద్వారా వరంగల్లులో తన స్థానాన్ని పదిలం చేసుకో సంకల్పించాడని చెబుతారు. విరియాల వారిది దుర్జయ వంశం. వీరి వృత్తాంతం క్రీ.శ.1000 ప్రాంతపుదైన గూడూరు శాసనంలో వివరంగా వుంది. ఈ రాజులలో ఎఱ్ఱనరేంద్రుడు పరాక్రమశాలి. ఈయన భార్య కామమసాని, గొప్ప రాజనీతిజ్ఞురాలు, వీరవనిత. పెండ్లి గుండనగా పిలవబడిన కాకర్త్య గుండ్యన సోదరి పేరు కుంతలదేవిగా వున్నా, ఈ విరియాల కామమసాని అనే వనితనే కుంతలదేవిగా చరిత్రకారులు గుర్తిస్తున్నారు.

కాకర్త్య గుండ్యన అనుమకొండలోని రాజవంశీయులతో పెళ్ళిసంబంధ మేర్పరచుకుని, అక్కడ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే లోపలే మరణిస్తాడు. అతని కొడుకైన బేతరాజు అప్పటికి చాలా చిన్నవాడు, బాలుడు. మేనల్లుడు, బాలుడు అయిన బేతరాజును అతని మేనత్తయైన విరియాల కామమసాని (గుండ్యన చెల్లెలైన కుంతలదేవి), భర్తయైన ఎఱ్ఱనరేంద్రుని సహయంతో సంరక్షించి కాపాడుతుంది. బేతరాజు యుక్తవయస్కుడు కాగానే అతడిని రాజ్యాభిషిక్తుని చేస్తుంది. ఇది గూడూరు శాసనంలో చెప్పబడి ‘కాకతి నిల్పుట కోటి సేయదే’ అని కామమసాని రాజనీతిజ్ఞతకు ప్రశంసాపూర్వక కథనంగా లోకోక్తియై చరిత్రలో నిలిచింది.

దేశ చరిత్రలో ఒక నూతన రాజవంశం రూపుదాల్చి నిలదొక్కుకోవడానికి మానవ ప్రయత్నమేకాక, ఆ ప్రయత్నానికి దైవానుగ్రహం కూడా తోడైవుండాలనడానికి కాకతీయుల చరిత్రలోని ఈ కుంతలదేవి – బేతరాజుల ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కాకతి గుండన ముందు చూపుతోకూడినదైన చర్య, కుంతలదేవికి తన అన్నపైనున్న గౌరవం, ఆ అన్న కొడుకూ తన మేనల్లుడూ అయిన బేతరాజుపై ఆప్యాయతా ఆంధ్ర దేశ చరిత్రలో కాకతీయులనే ఒక ప్రసిధ్ధ రాజవంశం రూపుదాల్చడానికి కారణమయింది. ఇలా రాజ్యాభిషిక్తుడయిన వాడే మొదటి బేతరాజు. ఇతనికి గరుడ బేతరాజని కూడా పేరు వుంది. ఇతడు క్రీ.శ.995-1052 మధ్య రాజ్యపాలన చేసినట్లుగా తేల్చారు. చారిత్రకంగా ఇతడితోనే కాకతీయవంశం ప్రారంభమయిందని చరిత్ర పరిశోధకులు భావిస్తారు. ఇతని కొడుకు మొదటి ప్రోలరాజు, క్రీ.శ.1052-1076 మధ్య రాజ్యపాలన చేశాడు. ఈ మొదటి ప్రోలరాజు కొడుకే త్రిభువనమల్ల బేతరాజు, క్రీ.శ.1076-1108 మధ్య కాలంలో రాజ్యపాలన చేశాడు. ఇతని కాలానికి ముందు కాకతీయుల వంశంలో ఎంతలేదన్నా నాలుగైదు తరాల చరిత్ర గడిచిపోయిందని చెప్పవచ్చు.

కాకతీయ వంశపు తొలితరం రాజుల పేర్లు గుండన, ప్రోల, బేత అని వుండగా, ఈ త్రిభువనమల్ల బేతరాజు పేరులో ‘త్రిభువనమల్ల’ చేరడానికీ ఒక కథ వుంది. కాకతీయ వంశంలో బేతరాజు అనే పేరుతో రాజ్యమేలిన రాజులు ఇద్దరు కాబట్టి ఇతనికి రెండవ బేతరాజని కూడ పేరుంది. ఇతడు రాజ్యభారాన్ని చేపట్టే నాటికి కళ్యాణి చాళుక్య రాజులలో రాజ్యాధికారం గూర్చి వారిలో వారికి అంతః కలహం చెలరేగింది. ఆ కలహంలో రెండవ బేతరాజు తన అనుకూల్యతను ప్రకటించి అతని పక్షం పోరాడిన విక్రమాదిత్యుడు అనే రాజు త్రిభువనమల్లుడనే పేర చాళుక్య సింహాసనాన్నిక్రీ.శ.1076 అధిష్ఠించాడు. ఆ రాజు తన విజయ సూచకంగా, ఆ ప్రయత్నంలో తనకు సహాయపడిన బేతరాజుకు తనవైన రెండు బిరుదులను ఇచ్చి గౌరవించాడు. వాటిలో ఒకటి ‘త్రిభువనమల్ల’ అనే బిరుదు. ఈ బిరుదు పేరుకు ముందు చేరి రెండవ బేతరాజు ‘త్రిభువనమల్ల బేతరాజు’ అయ్యాడని చరిత్రకారులు చెప్పారు. ప్రజలు ఈ ‘త్రిభువనమల్ల’ అనే బిరుదనామాన్నే బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈ కాకతీయ రెండవ బేతరాజుకు చాళుక్య ప్రభువుల వద్ద ఒక విశిష్ట స్థానం ఉండేది అనేది ఈ ఉదంతం వలన తెలియ వచ్చే మరొక విషయం.

కాకతీయులు (3)

కాకతీయులు (3)

శక సంవత్సరం 1166లో ఉమ్మక్క ఒక పుత్రునికి జన్మనిచ్చింది. సకల రాజమర్యాదలతో  ఆ పిల్లవానిని సామంతరాజులందరి సమక్షంలో రాజ్యాభిషిక్తుని చేశారు. ఆ పిల్లవానికి ప్రతాపరుద్రుడని నామకరణం చేశారు. ప్రతాపుడు పెరిగి పెద్దవాడయ్యడు. ఉమ్మక్కకు రెండవ పుత్రుడుగా అన్నమదేవుడు జన్మించాడు. ప్రతాపునికి వేదవిద్య, రాజరికానికి సంబంధించిన అన్ని విద్యలూ బోధించబడ్డ తరువాత అతని 16వ ఏట, 16 మంది కన్యలతో పెళ్ళి జరిగింది. వారిలో మొదటి భార్య విశాలాక్షి. రుద్రాంబ శక సంవత్సరం 1216 లో, 38 సంవత్సరాల పాలన అనంతరం స్వర్గస్తురాలయింది.

రాజ్యాభిషిక్తుడయ్యాక, ప్రతాపరుద్రుడు దిగ్విజయానికి బయలుదేరి, మొదటగా కటక బళ్ళాలుని జయించి, 3 కోట్లు పరిహారంగా పొంది, అతని కొడుకును రాజ్యాభిషిక్తుని చేశాడు. అతడూ, అలా ప్రతాపరుద్రునిచే జయించబడిన మిగతా రాజులు వారి వారి సైన్యాలతో ప్రతాపుని ఆజ్ఞ మేర వెంటవెళ్ళారు. అలా పాండ్య రాజును జయించాడు. దక్షిణానికి మరలి గోదావరి (?) నదిని దాటి రామేశ్వరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రామేశ్వరంలో పూజలు నిర్వహించి, తామ్రపర్ణి తీరాన్ని చేరగా అక్కడ పాలనలో వున్న  విజయనగర రాజైన  నరసింహరాయుడు ప్రతాపుని పెద్ద మొత్తాలలో బహుమానాలతో సత్కరించాడు.

ఆ తరువాత, ప్రతాపుడు ఒక స్త్రీ పరిపాలనలో వున్న రాజ్యం వైపుకు వెళ్ళి అక్కడ  రాణి అయిన ముకుందదేవిని జయించాడు. ఆ పై, కొంకణ, టంకణ, మళయాల, బాహ్లిక, గుజరాష్ట్ర  రాజులను కూడా జయించి వారి వద్ద నుండి పెద్ద మొత్తాలలో బహుమానాలను రాబట్టాడు. ఢిల్లి రాజు ప్రతాపునికి కానుకలను పంపాడు. ఆ కానుకలతో ప్రయాగకు వెళ్ళి, ప్రయాగ మాధవదేవునికి అవి సమర్పించాడు. బెనారసులో కూడా పూజలు నిర్వహించి విశ్వనాథునికి ఆ నగరాన్ని సమర్పించాడు. గయకు వెళ్ళి అక్కడి రాజును కలుసుకున్నాడు. పై ప్రదేశాలలో  చాలా చోట్ల తులాపురుషదానాలను చేశాడు. తన రాజధానికి తిరిగి వచ్చి తమ్ముడైన అన్నమదేవుని, తాను లేని ఆ 12 సంవత్సరాల కాలంలో రాజ్యాన్ని పరిరరక్షిస్తూ వుండినందుకు చాలా ఆనందపడి ఆదరించాడు.

ప్రతాపుడికి విశాలాక్షి ద్వారా విరూపాక్షుడు, వీరభద్రుడు అని ఇరువురు కొడుకులు కలిగారు. ప్రతాపరుద్రుని పరిపాలనా కాలంలో రెండు సార్లు ముసల్మాను సేనలు దండయాత్రలు చేశాయి. ఒక సారి ప్రతాపరుద్రుని బందీగా కూడా చేసుకున్నాయి.

ఢిల్లీ సుల్తాను ప్రతాపుని సాదరంగా ఆహ్వానించాడు. ప్రయాగ మాధవదేవుని భక్తురాలయిన అతని  తల్లి సలహా మీద, ప్రతాపుని కోరిక మీద, డిల్లీ సుల్తాను ఆ హిందూ రాజును, అతనికి సంరక్షకులనుగా 20,000 సైన్యాన్ని తోడుగా ఇచ్చి, బెనారసుకు పంపాడు. ప్రతాపునితో వెళ్ళిన బ్రాహ్మణులను కూడా ఆ రాజు బాగా సత్కరించాడు.

ప్రతాపుడు బెనారసులో 8 తులాపురుషదానాలను చేసి, గోదావరి తీరానికి వెళ్ళడానికి బయలుదేరాడు. దారిలో, శివదేవయ్య మరో 8 రోజులలో ఆ రాజు మరణం గోదావరీ తీరంలో సంభవమని లెక్కకట్టి వున్నందువలన, ఆయన సలహా మీద, కాళేశ్వరం అనే చోట ఆగుతాడు. ఈ లోపల అన్నమదేవుడు, నరపతి ఇరువురూ సుల్తాను సైన్యాన్ని ఓడించి వారిని తరిమికొడతారు. ప్రతాపుడు కాళేశ్వరానికి చేరి వున్నాడని తెలుసుకున్న వారిరువురూ అతని దగ్గరకు వచ్చారు. ప్రతాపుడు వారి శౌర్యాన్ని మెచ్చి తన కూతురైన రుద్రమదేవిని నరపతికి, 5 కోట్ల ధనంతోనూ కృష్ణకు దక్షిణంగా ఉన్న భూభాగంతోనూ, ఇచ్చి వివాహం చేశాడు.

కటకాన్ని 3 కోట్ల ధనంతో సహా రామరాయలను పెండ్లాడిన అన్నమదేవుని కూతురికి కట్నంగా ఇచ్చాడు. ప్రతాపుడు క్రీ.శ.1324 లో మరణించాడు. అతని రాణి అయిన విశాలాక్షి సహగమించింది. అన్నమదేవుడు వారికి ఘనంగా ఉత్తరక్రియలను నిర్వహించి, రాజ్యాన్ని వీరభద్రునికి ఇచ్చి, ప్రతాపుని కొడుకైన విరూపాక్షుడు తోడుగా రాగా వింధ్య ప్రాంతపు అడవులకు వెళ్ళిపోయాడు. శివదేవయ్య శ్రీశైలం చేరాడు. మొత్తంమీద ప్రతాపుని పాలన 76 సంవత్సరాలు సాగింది.

విజయనగర ప్రభువైన కృష్ణదేవరాయలు కొండవీడు, కొండపల్లి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండలను జయిస్తూ వచ్చి, వరంగల్లును ముట్టడించి అక్కడి ముసల్మానులను తరిమి కొట్టాడు. వరంగల్లులోని కాకతీయ వంశీయులకు రాజమర్యాద పూర్వకంగా ఇవ్వవలసిన ధన్నాని ఇచ్చాడు. ఇది అచ్యుత, సదాశివరాయల పాలన వరకూ సాగింది. అయితే, ఆ తరువాత అళియరామరాయల పతనం తరువాత, డక్కను భూభాగం అంతా ముసల్మానుల హస్తగతమయింది.”

ఇది సంగ్రహంగా మెకంజీ స్థానిక చరిత్రలలో రికార్డు చేయబడిన కాకతీయుల చరిత్ర.

అయితే, ఇప్పుడు ముఖ్యంగా శాసనాధారాలతోనూ, ఇంకా  ఇతరాలయిన ఆధారాలతోనూ చరిత్ర పరిశోధకులు రచించిన కాకతీయుల చరిత్రకూ, జనశ్రుతంగా వచ్చి మెకంజీ స్థానిక  చరిత్రలలో సేకరించబడి చేరిన కథలోని భాగాలకూ సామ్యాలూ విబేధాలూ, తత్సంబంధ చారిత్రక అంశాలనూ చర్చించుకుంటూ ముందుకు వెళితే–

మొదటగా, ఈ కథ ఆరంభంలో చెప్పబడిన త్రిభువనమల్లుడు చరిత్రకారులు నిర్ణయించిన త్రిభువనమల్ల బేతరాజు అనబడే రెండవ బేతరాజు. ఇతడు క్రీ.శ.1075/76 నుండి 1108/11 దాకా రాజ్యం చేశాడని శాసనాధారాలను బట్టి చెప్పారు. ఇతడు కాజీపేటలో వేయించిన ఒక శాసనంలో తన తాత అయిన మొదటి  బేతరాజును గురించి ‘సామంతవిష్టి వంశః శ్రీమాన్ కాకతిపురాదినాథోబేతః’ అనడాన్ని బట్టి, ఇతడు సామంతవిష్టి వంశం వాడనీ, కాకతిపురాధీశుడనీ చెప్పడం జరిగింది. అయితే ఈ కాకతిపురం ఏది అన్నది ఇప్పటికీ  తేలని విషయం.

కాకతీయులు (2)

కాకతీయులు (2)

రుద్రుడు తన రాజ్యానికి తూర్పుగా వున్న పరగణాల మీదికి దండెత్తి వెళ్ళి, ఆ తరువాత దక్షిణం వైపున రామేశ్వరం, ధణుష్కోటి దాకానూ వెళ్ళి అక్కడ 8 సార్లు తులాపురుషదానాలు చేశాడు. తిరిగి వచ్చే దారిలో పాండ్య రాజును జయించి అతని కుమారునికి పట్టం కట్టి వచ్చాడు.

రుద్రుని తమ్ముడైన మహాదేవుడు ఈ లోపల, కొంత సైన్యాన్ని సమకూర్చికుని అన్నపై తిరగబడ్డాడు. రుద్రుని పాలన 78 సంవత్సరాలు సాగి శకసంవత్సరం 1109 లో (ఇది తప్పు అని చరిత్ర) ముగిసింది. ఈ రుద్రుడు కాకతీయులలో  ప్రతాపరుద్రుడు కాదు, ఇతడు గణపతిదేవునికి తండ్రి అయిన రుద్రుడు మాత్రమే.

మహాదేవుని వంచనతో కూడిన ఆక్రమణాన్ని ఇష్టపడని మంత్రులు, రుద్రుని కుమారుడైన గణపతిని రాజ్యాభిషిక్తుని చేయబోగా, గణపతి యువరాజుగానే ఉండడానికి ఇష్టపడినందువలన, మహాదేవుడు రాజై మూడేళ్ళు పాలించాడు. మహాదేవుడు గణపతి అనుమతితో దేవగిరిపైకి దండెత్తి వెళ్ళి ఆ పోరులో ఒక ఏనుగుపై ఎక్కి యుధ్ధం చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

గణపతిదేవుడు శ్రీశైలం పరిసరాలనుంచి తెచ్చిన శిలలతో వరంగల్లు కోటనూ, శివునికి దేవాలయాలను నిర్మింప జేశాడు. మహాభారతాన్ని తెనిగించిన తిక్కన మహాకవి  (నెల్లూరు రాజైన మనుమసిధ్ధి రాయబారిగా) గణపతి ఆస్థానానికి రాగా,ఆ రాజూ, అతని ఆస్థానంలోని కవులూ పండితులూ ఆయనను గొప్పగా సత్కరించారు. గణపతిదేవునికి  తిక్కన వేదాలనూ, శాస్త్రాలనూ, మహాభారతాన్ని అధ్యయనం చేయడం లోని ముఖ్యాంశాలను గురించి వివరంగా చెబుతాడు. గణపతిదేవుని ఆస్థానంలోని జైనులతోనూ, బుధ్ధులతోనూ తీవ్రంగా వాదించి వారిని నిరసించాడు. రాజకీయం మీద, వేదాంత విషయాల మీద తిక్కన గణపతిదేవునికి తగు బోధ చేశాడు.

అక్కన, బయ్యన అనే వారిచే సూర్యవంశీయుడైన మనుమసిధ్ధి తన రాజధాని నుంచి తరిమివేయబడినాడనీ, ఆ రాజుకి అతని రాజ్యాన్ని  తిరిగి దక్కించుకోవడంలో గణపతిదేవుని సహాయాన్ని అర్ధించడం, తాను వచ్చిన పనిగా తిక్కన చెబుతాడు. గణపతిదేవుడు  ఆ కార్యానికి అంగీకరించి తిక్కనను తగు విధంగా సత్కరించి బహుమతులిచ్చి పంపుతాడు. తిక్కన వెళుతూ, శైవుడైన శివదేవయ్యను గురించి గొప్పగా చెబుతాడు. శివదేవయ్య తరువాతి కాలంలో కాకతీయ రాజులకు మంత్రి అయ్యాడు.

మాట ఇచ్చినట్లుగానే, గణపతిదేవుడు  పెద్ద సైన్యంతో  వెళ్ళి, వెలనాడును ముట్టడించి, జయించి వారి కోటను తగులబెట్టించాడు. బయ్యనను తరిమివేసి అతని రాజముద్రికలను తెరల రుద్రదేవునికి ఇస్తాడు. మనుమను నెల్లూరులో పునః ప్రతిష్టించి, తాను జయించిన 24 దుర్గాలనూ, 68 పట్టణాలనూ అతనికి బహుమానంగా ఇచ్చి, వరంగల్లుకి తిరిగి వచ్చాడు.

తన కోటను మరింతగా సంరక్షించుకోవాలని, రాత్రి పగలనిలేక  నిరంతరం కోటచుట్టూ సైనికులు కాపలా వుండేలా నియమం చేస్తాడు. ఒక అక్షౌహిని సైన్యాన్ని కోటలో ఎప్పుడూ సిధ్ధంగా వుండేలా ఏర్పాటు చేస్తాడు. అతని పాలన పటిష్ఠంగా సుఖంగా సాగింది.

గణపతిదేవుడు శ్రీశైలం దర్శించి అక్కడి దేవుడైన మల్లికార్జునునికి 12,000 సువర్ణ పుష్పాలను సమర్పించాడు. ఆ రోజుననే, పంధలింగాల కు వెళ్ళి, కృష్ణానదిలో  స్నానంచేసి 16 రకాల దానాలను చేశాడు. శ్రీశైలంలో 4 చెరువులను, 4 శైవాలయాలను ఒక వైష్ణవాలయాన్ని నిరిమింపజేశాడు. మల్లికార్జునారాధ్యుని చేతులమీదుగా శైవుడయ్యాడు.

వరంగల్లుకు 3 యోజనాల దూరంలో తన పేరు మీదుగా గణపురమనే గ్రామాన్ని, చెరువును నిర్మింపజేశాడు. కటకాన్ని పాలిస్తూండిన రాజును తన సామంతునిగా చేసుకున్నాడు. మొత్తం మీద గణపతిదేవుడు 68 సంవత్సరాలు పాలించాడు. అతనికి ఉమ్మక్క అని ఒక కూతురు వుంది. ఆమెకు వయసు రాగానే, చాళుక్య వంశానికి చెందిన వీరభద్రునితో వివాహం జరిపించాడు.

గణపతిదేవుని తరువాత ఆతని భార్య రుద్రాంబ, శివదేవయ్య సలహాతో, రాజ్యభారాన్ని స్వీకరించింది.

ఆమె చాలా మంది దేవతలను సువర్ణ పుష్పాలతో, ఆమె కూతురయిన ఉమ్మక్క ద్వారా వీరుడయిన మనుమడిని పొందాలని పూజించి ‘దశరీడ్లనోము’ అనే పేరున్న నోము నోచింది. ఆ పూజా కార్యక్రమాలలో భాగంగా ఆమె వరంగల్లులో లేని సమయంలో హరిహరదేవుడు మురారి అనే ఇద్దరు సామంతులు తిరుగుబాటు చేయగా, వారిని ఓడించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

దేవగిరి పాలిస్తూండిన రాజు అకారణంగా వరంగల్లు మీద దండెత్తి వచ్చి కోటను ముట్టడించాడు. అయితే, ఓడించబడి ఒక కోటి దనాన్ని పరిహారంగా చెల్లించేలా చేయబడ్డాడు. ఆమె తన రాజ్యానికి సరిహద్దు రేఖల వెంబడి విజయస్తంభాలను పెట్టించింది. రుద్రాపురం, అంబాపురం అనే పేర్లతో రెండు గ్రామాలు ఆమె పేరుమీద నిర్మించబడ్డాయి.

కాకతీయులు (1)

కాకతీయులు (1)

ఆంధ్రుల చరిత్రలో కాకతీయులది ఒక ప్రముఖ స్థానం. మెకంజీ సేకరించిన స్థానిక చరిత్రలలో అనుమకొండ హనుమకొండకు తొలి రూపం), వరంగల్లులను గురించి, ఈ రెండు పట్టణాలను రాజధానులుగా చేసుకుని పాలించిన కాకతీయ రాజుల వంశావళిని గురించి చెప్పే గాథలు వున్నాయి. చరిత్ర పరంగా చూసినప్పుడు ఈ గాథలకు, కొన్ని కొన్ని చోట్ల అతిశయమూ కల్పనా  చేరి వుండడం వలన, అన్నిటికీ అంతగా ప్రాముఖ్యం లేకపోయినప్పటికీ, కొన్ని వందల సంవత్సరాలుగా జనశ్రుతంగా తరం నుంచి తరానికి వచ్చి చేరినవి కాబట్టి, ఆంధ్ర దేశ చరిత్ర రచన మొదలెట్టిన తొలినాళ్ళలో ఆ కథలలోని విషయాలు కొన్నైనా ఆధారాలుగా నిలిచాయి కాబట్టీ వాటి  ప్రాముఖ్యత వాటిది. కాకతీయుల చరిత్రకు సంబంధించి  ఆ గాథలలో చరిత్రకు దగ్గరగా వున్నట్లనిపించే కొన్న గాథల సారాంశం ఇది:

కాకతీయ వంశానికి చెందిన మొదటి తరం రాజులలో ఒక రాజు త్రిభువనమల్లుడు. ఆ రాజుకి కాకతి అనే  దేవత కరుణ వలన కాకతి ప్రోలుడు జన్మించాడు. త్రిభువనమల్లుడు కటకాన్ని పాలిస్తూండిన  తిరుగుబాటుదారయిన రాజును రణంలో ఓడించి చంపి, ఆ స్థానంలో అతని కుమారుని రాజ్యాభిషిక్తుని చేసి, ఆ రాజు ధనాగారాన్ని వెంట తరలించుకు వెళ్ళాడు. గంగాపురం అనే ప్రదేశంలో త్రిభువనమల్లుడు ఎన్నో  దేవాలయాలను నిర్మింప జేశాడు.  ఈ రాజు 86 సంవత్సరాలు పాలించి శక సంవత్సరం 958 లో మరణించాడు.

ప్రోలుడు రాజ్య భారాన్ని చేపట్టే నాటికి చాలా చిన్నవాడు. ఇది అదనుగా చూసుకుని సామంతులు కొందరు తిరగబడతారు. కటకాన్ని పాలిస్తూండిన రాజు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విశ్వనాథదేవుడనే వాడిని ప్రోలుని మీదికి దండు పంపుతాడు. అనుమకొండ అతడి వశమవుతుంది. ఆ తరువాత 12 సంవత్సరాలు అనుమకొండ పరరాజుల హస్తగతమై వుంటుంది. ఈ కాలంలో వారు ఒక పెద్ద చెరువును కూడా తవ్వించారు. కన్నడసముద్రమని ఆ చెరువుకు పేరు. ప్రోలుడు తన రాజధానిని ఒక స్నేహితుడైన సామంతుని అధీనంలో వుంచి, ఒక రహశ్య మార్గం ద్వారా వెళ్ళి అనుమకొండను జయించి, మళ్ళీ కటకం మీదికి దండు వెళ్ళి, యుధ్ధంలో ఆ రాజును చంపి, వాని కుమారుని ఆ స్థానంలో వుంచి, 2 కోట్ల
సంపదను సంపాదించుకొస్తాడు.

ఈ ప్రొలుడు ఒక పెద్ద శివాలయాన్ని నిర్మింపజేసి, ఆ దేవాలయం చుట్టూ 8 యోజనాల పర్యంతగా వుండే ఒక నగరాన్ని కూడా నిర్మింపజేస్తాడు. ఇదే ఓరుగల్లు పట్టణం. ఓరుగల్లు కోటకు తొలి నమూనా చిత్రం ఆ స్థానం మీద 909 లో వ్రాయబడింది.

వరంగల్లులో శివాలయం పరశువేది శంభు ఆలయంగా పిలవబడేది. ఆ ఆలయానికి ఆగ్నేయంగా ఒక పెద్ద శిల వుండేది, కనుక ఆ ప్రదేశానికి ఏకశిలానగరమనీ, ఆ ప్రదేశం మీదుగా వెళ్ళే బండి చక్రం ఒకటి ఎప్పుడూ ఒకవైపుకు ఒరిగేది కాబట్టి ఆ ప్రదేశానికి ఓరుగల్లు అనీ పేర్లు వచ్చాయి.

ఓరుగల్లులోని దేవాలయాలలో ప్రతిష్ఠించబడిన ముఖ్యమయిన దేవతా విగ్రహాలు 1. ముక్తేశ్వర, 2. విశ్వనాథ, 3. వ్యక్తవిరూపాక్ష, మల్లికార్జున, 5. రామేశ్వర, 6. నీలకంఠ, 500 చిన్న గుడులు శివునివి, 10 దేవివి, 10 గణపతివి, 300 వాసుదేవునివి, 10 వీరభద్రునివి, కొత్తగా నిర్మించబడ్డాయి.

ప్రోలునికి ఒక దుష్టనక్షత్రంలో ఒక కొడుకు పుట్టాడు. ఆ నక్షత్ర ప్రభావం వలన అతడు తండ్రిని చంపేవాడుగా అయ్యాడు.
ఆ పిల్లవాడు రుద్రుడుగా నామకరణం చేయబడి, మంచి తెలివి కలవాడుగా, శక్తిమంతుడుగా పెరిగాడు. అతడికి ఉపనయనం అయిన తవువాత, శంభుని దేవాలయానికి రాజ రక్షకుడుగా నియమించబడ్డాడు.

మహాదేవుడు ప్రోలునికి రెండవ కుమారుడు. ఇతడు కుష్టువ్యాధి పీడితుడయ్యాడు. ఒక బ్రాహ్మణునికి 5 పుట్ల నువ్వులను ఒకచోట పోసి పెద్ద రాసిగానూ, తోడుగా బంగారంతో చేసిన ఆకులను, మాడలను, దానంగా ఇచ్చిన తరువాత ఆ శ్వేతకుష్టు వ్యాధి నుంచి మహాదేవుడు బయటపడ్డాడు. అయితే, ఆ బ్రాహ్మణుడు ఆ తరువాత బ్రహ్మరాక్షసునిగా మారాడు. ప్రోలుడు ఆ బ్రాహ్మణుని కుమారునికి పెద్ద మొత్తంలో  ధనమిచ్చి కాశీలో దోష పరిహారార్ధం చేయించవలసిన పూజలను చేయించమని పంపాడు. అలా చేసిన తరువాత, నువ్వులరాసిని దానంగా తీసుకోవడం వలన సంక్రమించిన  దోషం పరిహారమై ఆ బ్రాహ్మణుడు ముక్తిని పొందాడు.

ఒకసారి, ప్రోలుడు శంభులింగమును ప్రార్ధించదలచి దేవాలయంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో లోపలి ద్వారం దగ్గర రుద్రుడు నిద్రపోతున్నాడు. రుద్రుడి నిద్రను భంగపరచడం ఇష్టపడని ప్రోలుడు పక్కనుంచి ప్రవేశించబోగా, అతని పాదం బొటనవ్రేలు రుద్రునికి తగిలి అతడు నిద్ర మేల్కొంటాడు. నిద్రమత్తు పూర్తిగా వదలని రుద్రుడు, ప్రోలుని ఒక దొంగగా భావించి అతని చేతిలో వున్న కటారితో పొడుస్తాడు. అయితే వెంటనే తనచే పొడవబడినది తండ్రేనని గ్రహిస్తాడు. ప్రోలుడు పురోహితులనూ, రక్షకులనూ, మంత్రులనూ అందరినీ పిలిపించి వారికి జరిగిన సంగతిని, దానికి కారణమైన రుద్రుని జన్మకు సంబంధించిన సంగతినీ చెప్పి, రుద్రుడినే తన అనంతరం రాజునిగా పట్టభిషిక్తుని చేయమంటాడు. రుద్రుడు పట్టభిషిక్తుడవుతాడు. కొన్నాళ్లకు ప్రోలుడు మరణిస్తాడు. అనంతరం రుద్రుడు 73 సంవత్సరాలు పాలించాడు. అతని పాలన 1031 లో అంతమయింది.

రుద్రుడు ప్రజారంజకంగా పాలన చేస్తూ  రాజ్యాన్ని సిరిసంపదలతో నింపాడు. ఓరుగల్లుకు దక్షిణంగా 12 మైళ్ళ దూరంలో వున్న అయినవోలు గ్రామానికి పశ్చిమాన మైలార దేవునికి దేవాలయాన్ని నిర్మింపజేశాడు. అనుమకొండకు నాలుగు మైళ్ళు (రెండు కోసులు) దూరంలో వున్న ఒడ్డిపల్లి అనే గ్రామంలో బొద్దన గణపతికి దేవాలయాన్ని నిర్మింపజేశాడు. మొగలిచెర్ల అనే గ్రామంలో మహాశక్తికి దేవాలయాన్ని నిర్మింపజేసి తిరుణాళ్ళు నిర్వహించబడేలా సౌకర్యం చేశాడు.

కటకం మీదకు దండెత్తి వెళ్ళి ఆ రాజును చంపి, ఆ స్థానంలో అతని కుమారునికి పట్టం కట్టి ప్రతిగా సంప్రదాయకంగా రావలసినది గ్రహించి తెచ్చాడు. ఏకుదేవుడు (?) అనే ఒక సామంతుడు తిరుగుబాటు చేయ యత్నిస్తే, అతడిని ఓడించాడు. వచ్చే దారిలో వెలనాడులో ప్రవేసిస్తాడు. ఆ రాజులు అతడి శౌర్యాన్ని మెచ్చుతారు. ఆ తరువాత కొందరు మ్లేఛ్ఛులనూ (?) జయిస్తాడు.

తండ్రిని చంపిన దోషం పోవడానికి చేయాల్సిన దోషపరిహార క్రియలన్నిటినీ నిర్వర్తిస్తాడు. చాలా ధనం ఖర్చుపెట్టి ఓరుగల్లులో మంచి శిల్పకళతో నిండినవైన ఆలయాలను నిర్మింపజేశాడు. 1000 స్థంభాలు ఆ గుడి ప్రాంగణాన్ని అలంకరించి ఉంటాయి.
చతుర్ముఖేశ్వర దేవాలయానికి నాలుగు వైపులా ద్వారాలపై నాలుగు శాసనాలను నాలుగు భాషలలో లిఖింప జేశాడు.
వరంగల్లు పట్టణంలో కొత్త వీధులను, భవనాలను నిర్మింపజేసి బాగా వృధ్ధిపరిచాడు. రుద్రుని తమ్ముడైన మహాదేవుడు కొందరి తప్పుడు సలహాలను విని అతనికి విరోధిగా మారతాడు. అయితే, ఈ సంగతులను గ్రహించిన రుద్రుడు మహాదేవుని కార్యకలాపాలన్నిటినీ ఒక కంట  కనిపెడుతూ వుండాల్సిందిగా మంత్రులను నియోగిస్తాడు. శ్రీశైల మఠాథిపతుల సలహా మీద  గణపతి అనే పేరున్న ఒక బాలుడిని, (ప్రమథ)గణాల అనుగ్రహంతో జన్మించినవాడుగా నమ్మబడుతున్న వానిని, అక్కడినుంచి తన ఆస్థానానికి తెచ్చుకున్నాడు.