సీతాకోకచిలుకలు – Gram Blue butterfly

Euchrysops cnejus – Gram Blue butterfly

Euchrysops cnejus (image-1)

Gram Blue అని పిలవబడే ఈ సీతాకోకచిలుక పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది. రెక్కల పైవైపు ఏ విధమైన మచ్చలు లేకుండా సాదాగా వెలుగు పడ్డప్పుడు మెరిసే నీలి రంగులో ఉంటుంది. రెక్కల లోపలి వైపు  మెరిసే బూడిదరంగు (silver grey) రెక్కలతో, ఆ రెక్కల మీద తెలుపు బార్డరుతో ఉన్నలేత గోధుమ రంగు మచ్చలు రెక్కల అంచుల బారుగా రెండు మూడు వరుసలలో డిజైనుగా ఏర్పడి ఉండే ఈ సీతాకోకచిలుక Lycaenidae (or Blues)  కుటుంబానికి చెందినది. ఈ సీతాకోకచిలుక శాస్త్రీయ వర్గీకరణ (Scientific classification) ఇలా ఉంటుంది – Kingdom: Animalia, Phylum: Arthropoda, Class: Insecta, Order: Lepidoptera, Genus: Euchrysops, Species: Euchrysops cnejus.


Euchrysops cnejus (images 2 & 3)

వెనుక రెక్క క్రింది భాగం చివరన దారపు పోగు లాంటి  చిన్న తోక, ఆ తోక మొదలయే చోట రెక్క మీద, పై సగ భాగం చుట్టూ అర్ధచంద్రాకారంలో కాషాయ రంగు  బార్డరుతో ఉన్న రెండు నల్లని మచ్చలు ఉంటాయి. వెనుక రెక్క మధ్య భాగంలో ఏ బార్డరూ లేని రెండు మూడు నల్లని మచ్చలు కూడా కనబడతాయి. వేగంగా ఎగురుతుంది. మరీ ఎత్తుగా ఉండే ప్రదేశాలకు ఎగరలేదు కాబట్టి మామూలు ఎత్తులో ఉన్న చెట్ల గుబురులపై ఎగురుతూ కనబడుతుంది. వీటి యాంటెన్నాల చుట్టూ తెల్లని దారాన్ని గుండ్రంగా తిప్పినట్లుగా ఉంటుంది. ఈ సీతాకోకచిలుకలు కూడా Mud puddling చేస్తాయి.

Euchrysops cnejus (image 4)

భారతదేశంలో మరీ ఎత్తైన ప్రదేశాలలో తప్ప అన్ని ప్రాంతాలలోనూ ఈ సీతాకోకచిలుక కనబడుతుంది. ఇంకా దక్షిణ సముద్ర దీవులలోనూ, ఆస్ట్రేలియాలోనూ కనబడుతుందట. ఈ సీతాకోకచిలుక ఫోటోలను కూడా నేను బెంగళూరు, లాల్ బాగ్ బొటానికల్ గార్డన్స్ లో తీశాను.

Euchrysops cnejus (image-5)

Euchrysops cnejus (image-6)