‘కంచి’ జ్ఞాపకాలు -(2) : కైలాసనాధ దేవాలయం

పల్లవ రాజు రాజసింహుడు – కైలాసనాధ దేవాలయం, కాంచీపురం

కైలాసనాథ దేవాలయం, కాంచీపురం
కైలాసనాథ దేవాలయం, కాంచీపురం

Ancient India లో – అంటే క్రీ.శ.1000 ని ఒక సరిహద్దుగా అనుకుని ఆలోచించినా కూడా, అంతకు ముందు పాలించిన రాజవంశాలకు చెందిన రాజులూ చక్రవర్తులూ  కేవలం రాజ్యాధికారం గురించి, చేయ్యాల్సిన యుధ్ధాలను గురించి, గెలవాల్సిన పొరుగు రాజ్యాలను గురించి మాత్రమే ఎప్పుడూ ఆలోచించకుండా, తాము పాలిస్తున్న భూభాగంలో కళలను గురించి, వాటి అభివృధ్ధి గురించి, ఆయా రంగాల కళాకారులకు ఇవ్వాల్సిన చేయూత గురించి గూడా పట్టించుకోవాలి, ఆ కార్యక్రమాలలో పాలుపంచుకోవాలి అన్న philosophy కి అనుగుణంగా నడుచుకుంటూ రాజ్య పాలన చేసారు. పల్లవ రాజవంశానికి చెందిన రాజులూ, చక్రవర్తులూ అదే బాటను అనుసరించి పాలించినవారే! రాజులు స్వతహాగా ఏ ధర్మాన్ని ఆచరించినా, రాజ్యంలోని బౌధ్ధ, జైన ఇత్యాది ఇతర ధర్మాల అనుచరులకు కావలసిన అన్ని సదుపాయాలనూ సమకూర్చారు. అన్ని ధర్మాల వారినీ సమానంగానే ఆదరించి రాజ్యంలో నివసించే అవకాశం కల్పించారు.

పల్లవ రాజులు కళలకు ఎంతగానో ప్రొత్సాహం ఇచ్చారు. ఆలయ శిల్పం వీరి కాలంలో కొత్త దారులు తొక్కింది. కొండ రాతి చరియలను (గుహాలయం) వదిలి దేవాలయం సమతల ప్రదేశంలోకి వచ్చింది.  అందులో భాగంగా, ఒక బృహత్తరమైన నిర్మాణంగా దేవాలయ నిర్మాణం అనేది దక్షిణ భారత దేశంలో ఈ కైలాసనాధ దేవాలయంతోనే మొదలయింది.  కాల క్రమంలో ఈ విధమైన మంచి మలుపుకు ఈ పల్లవ రాజవంశం కారణమయిందని చెబుతారు.

కైలాసనాథ దేవాలయం, కాంచీపురం - ఫోటో -2
కైలాసనాథ దేవాలయం, కాంచీపురం – ఫోటో -2

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గా వున్న భూభాగాన్నే అప్పుడు – అంటే క్రీ.శ.4 – 9 శతాబ్దాలమధ్య కాలంలో  – పల్లవులు వారి రాజ్యంలో ముఖ్యమైన భాగంగా పాలించారు. వారి రాజ్యాధికారం, ప్రాభవం, ఉఛ్ఛ స్థితిలో ఉన్న రోజులలో ఇప్పుడు తమిళనాడుగా ఉన్న భూభాగంలో చాలా మేరకు – అంటే కావేరీ తటం దాకా  – పల్లవ రాజ్యం వ్యాపించి వుండేది. పల్లవుల రాజధాని కాంచీపురం. పల్లవ రాజులలో ముఖ్యుడైన మహేంద్రవర్మ (పరిపాలనా కాలం క్రి.శ.590-630) స్వయంగా కవి, సంగీత కళా కోవిదుడు. అంతే కాకుండా చాలా విషయాల్లో ఇతనికి వున్న బుధ్ధి కుశలతను కళాహృదయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతనికి ‘విచిత్ర చిత్తుడు’  అనే పేరు కూడా వచ్చి స్థిరపడిపోయింది. ఈయన విష్ణుకుండిన చక్రవర్తి అయిన ‘విక్రమేంద్ర వర్మ’ దౌహిత్రుడు.  విష్ణుకుండినుల  విజయవాడ దగ్గర మొగల్రాజపురం గుహాలయాలలోని సాంప్రదాయాలను ఈయన దక్షిణాదిన అంటే తమిళం మాట్లాడే ప్రాంతంలో ప్రవేశ పెట్టాడు.

ఈ మహేంద్రవర్మ తరువాత నాలుగోతరం వాడు రాజసింహుడు అనే నామాంతరం కలిగిన రెండవ నరసింహవర్మ అనే పల్లవరాజు. ఇతడు క్రీ.శ.700 -730 మధ్య కాలంలో రాజ్య పాలన చేశాడు. ఈ రాజసింహ పల్లవుని పరిపాలనా కాలంలో నిర్మించబడిన దేవాలయలే కాంచీపురంలోని కైలాసనాధ దేవాలయం, మహాబలిపురంలోని సముద్ర తీర దేవాలయం. ఈ రెండూ దక్షిణ భారత దేవాలయ వాస్తులో ఒక ముఖ్యమైన మలుపుకు కారణమైన దేవాలయాలు. ఈ ఆలయాలలో అవలంబిచిన పధ్ధతికి ఈ పల్లవరాజు పేరు మీదుగానే ‘రాజసింహ పధ్ధతి’ అనే ప్రత్యేకమైన పధ్ధతిగా పేరు వచ్చింది. కాంచీపురంలోని కైలాసనాధ దేవాలయానికి ‘రాజసింహేశ్వరం’ అనే నామంతరం కూడా ఉంది. దేవాలయ నిర్మాణంలో అప్పటి దాకా  అవలంబిస్తూ వస్తూండిన గుహాలయాల పధ్ధతికి స్వస్తి చెప్పి,  ఆలయాన్ని  ఇటుకలతోనూ, రాళ్ళతోనూ కట్టే పధ్దతిని ఈ ఆలయాల నిర్మాణంలో అవలంబించారు. ఈ పధ్ధతినే ఆ తరువాత పట్టడకల్ లోని విరూపాక్షాలయం, ఎల్లోరాలోని కైలాసనాధ దేవాలయాల నిర్మాణంలోనూ అవలంబించారని పెద్దల అభిప్రాయం.

కైలాసనాథ దేవాలయం, కాంచీపురం - సింహముల వరుస
కైలాసనాథ దేవాలయం, కాంచీపురం – సింహముల వరుస

రాజసింహుడు గొప్ప శివ భక్తుడు.  గంగాధర శివునికి అంకితమీయబడిన ఈ కైలాసనాధ దేవాలయాన్ని తన ఆరాధన కోసంగానే  కట్టించినట్లు ఈ ఆలయ ప్రాంగణంలో వేయించిన శాసనంలో అతడు చెప్పుకున్నాడు.  ఆలయంలోని ప్రతి పార్శ్వం, ప్రతి కోణం కూడా సుందరమైన శిల్పంతో నింపివేయబడి కనుపిస్తుంది.

పల్లవులచే నిర్మించబడిన దేవాలయాలలో ‘నోరు తెరిచి వున్న సింహం తల’  motif చాలా ఎక్కువగా కనబడుతుంది.  సింహం ఈ పల్లవ రాజవంశపు అధికార చిహ్నం కావడం ఇందుకు కారణం.

కైలాసనాథ దేవాలయం, కాంచీపురం - దుర్గ
కైలాసనాథ దేవాలయం, కాంచీపురం – దుర్గ

దుర్గ, అంబ, శక్తి, భవాని – ఇలా ఏ పేరుతో పిలిచినా ఆ పేర్లన్నీ ఒకే స్వరూపానికి చెందుతాయి. ఆ స్వరూపం స్త్రీత్వానికి ఆది అనాది స్వరూపంగా పూజలందుకుంటూన్న శక్తిస్వరూపిణి అయిన అంబ.  కైలాసనాధ దేవాలయంలోని ఈ దుర్గామాత రూపం సౌందర్యం, శక్తిమత్వం – రెండూ సమపాళ్ళలో కలగలిసి వున్న అత్యంత అద్భుతమైన రూపం.  దేవాలయాలలో మలచబడిన దుర్గామాత రూపాలలో ఈ రూపం చాల పురాతనమూ, అంతగానూ సుందరమూ అయినదిగా మన్ననలందుకుంది.

కైలాసనాథ దేవాలయం, కాంచీపురం - శంకరుడు
కైలాసనాథ దేవాలయం, కాంచీపురం – శంకరుడు

ధ్యాన ముద్రలో వున్న ఈ శంకరుని ప్రతిమ సౌదర్యాన్ని వర్ణించడానికి మాటాలు చాలవు.

ఈ శిల్పాలలో ఒత్తుగా వుండి వేళాడుతూ వున్నట్లుగా వుండే ప్రస్పుటమైన యజ్ఞోపవీతం, వర్తుల స్తంభాకారంలో వుండే ఎత్తయిన కిరీతం వంటి ఆకర్ష ణీయమైన అలంకరణలు విష్ణుకుండిన శిల్పం నుంచి తీసుకోబడినాయని చెబుతారు.

కైలాసనాథ దేవాలయం, కాంచీపురం - నంది
కైలాసనాథ దేవాలయం, కాంచీపురం – నంది

కైలాసనాథ దేవాలయంలో నందీశ్వరుని ప్రతిమ ముఖ్య దేవాలయానికి కాస్త దూరంగా ఉంటుంది. అయితే, ఆ తరువాత నిర్మించబడిన శివాలయాలలో ఈ దూరం తగ్గి, నంది శిల్పం ముఖ్య దేవాలయానికి బాగా దగ్గరగా చేర్చబడి వుండడం తెలిసినదే!

కంచి లోని కైలాసనాధ దేవాలయాన్ని గురించి పూర్తిగా వ్రాయాలంటే దక్షిణ దేశపు చరిత్రకు, ఆలయ శిల్ప పరిణామ వికాసానికీ సంబంధించి సమగ్రమైన జ్ఞానం వుంటేనే గాని సాధ్యం కాదు. అందులో నాకున్న అంతంత మాత్రపు జ్ఞానంతోనూ, అక్కడక్కడా చదివి తెలుసుకున్న సమాచారంతోనూ, నా వద్ద వున్న ఫోటోల ఆదరువుతోనూ, ఈ చిన్న వ్యాసం వ్రాశాను. ముందుగానే చెప్పినట్లుగా, దక్షిణాది ఆలయ పరిణామ క్రమంలో ఈ కైలాసనాధ దేవాలయానికి ప్రత్యేకమైన, అతి ముఖ్యమైన స్థానం వుంది. అలాంటి ఈ ఆలయం గురించి ఇక్కడ నేను వ్రాసిన సమాచారంలో ఏదయినా తప్పు దొర్లి ఉండవచ్చు. అది తెలియక జరిగిన తప్పుగా భావించి ఈ ఆలయం గురించిన పూర్తి సమాచారం తెలిసిన ఈ విద్యలలో విజ్ఞులు అయిన పెద్దలు పెద్దమనసు చేసుకుని మన్నిస్తారని ఆశిస్తాను.

‘కంచి’ జ్ఞాపకాలు – (1)

ఏకామ్రనాథ స్వామి వారి ఆలయ గోపురం
ఏకామ్రనాథ స్వామి వారి ఆలయ గోపురం

ఉద్యోగ కారణంగా  నేను చెన్నై లో ఒక సంవత్సరం పాటు వున్నాను, 2007-08 మధ్య కాలంలో. ఆ సంవత్సర కాలంలో మూడు సార్లు  ‘కంచి’ వెళ్ళాను. అప్పటికి నేనింకా Digital camera వాడడం మొదలెట్టలేదు. Conventional ఫిల్మ్ కెమేరానే వాడుతుండేవాడిని. అయితే ఏదో కారణం వలన అది అప్పుడు నాకు అందుబాటులో లేదు. మార్కెట్ లోకి అప్పుడప్పుడే కెమేరా ఫొనులు వచ్చిన రోజులవి. నా దగ్గర కూడా  అప్పట్లో release అయిన మొదటి తరం కెమేరా ఫోను లలో Sony Ericsson ది ఒక కెమేరా ఉన్న సెల్ ఫోను వుండేది. ‘కంచి’ నా visits లోని మూడో visit లో ఫోటోలు తీయడానికి  ఆ కెమేరా ఫొన్ తో మాత్రమే సరిపెట్టుకుని అప్పటికి తృప్తి పడాల్సి వచ్చింది. అయితే, కాల క్రమంలో ఆ ఫొటోలు ఉన్న ఫైల్  కూడా ఎటో మాయమై, ఈ మధ్యనే దొరికింది. ‘కంచి’ కి నా visits కి సంబంధించి నంతవరకు ఈ సెల్ ఫోను లోని ఫోటోలు తప్ప ప్రస్త్తుతం నా దగ్గర వేరే ఏ  image memories లేకుండా పోయాయి. ఆ File లోని ఫోటోలను ‘కంచి జ్ఞాపకాలు’ గా ఇప్పుడు ‘పికాసా’ లో revive చేసి  ఇక్కడ ఉంచాను, భద్రంగా!

వరదరాజ స్వామి వారి ఆలయ ప్రాంగణం
వరదరాజ స్వామి వారి ఆలయ ప్రాంగణం
వరదరాజ స్వామి వారి ఆలయం - కళ్యాణ మండపం - రాతి గొలుసు
వరదరాజ స్వామి వారి ఆలయం – కళ్యాణ మండపం – రాతి గొలుసు
వరదరాజ స్వామి వారి ఆలయం - కళ్యాణ మండపం - విష్ణువు - నృసింహ మూర్తి
వరదరాజ స్వామి వారి ఆలయం – కళ్యాణ మండపం – విష్ణువు – నృసింహ మూర్తి
వరదరాజ స్వామి వారి ఆలయం - కళ్యాణ మండప స్తంభంపై - ఒక భక్తుల కుటుంబం
వరదరాజ స్వామి వారి ఆలయం – కళ్యాణ మండప స్తంభంపై – ఒక భక్తుల కుటుంబం
వరదరాజ స్వామి వారి ఆలయం - కళ్యాణ మండప స్తంభంపై - ఒక సన్నివేశం దృశ్యం- వీరం
వరదరాజ స్వామి వారి ఆలయం – కళ్యాణ మండప స్తంభంపై – ఒక సన్నివేశం దృశ్యం- వీరం
వరదరాజ స్వామి వారి ఆలయం - కళ్యాణ మండప స్తంభంపై - ఒక సన్నివేశం దృశ్యం- కరుణ/వాత్సల్యం
వరదరాజ స్వామి వారి ఆలయం – కళ్యాణ మండప స్తంభంపై – ఒక సన్నివేశం దృశ్యం- కరుణ/వాత్సల్యం

ఇందులోని  సన్నివేశాన్ని ఊహించి మలచిన శిల్పి ఎవరోగాని ఎంత మానవీయంగానూ, సహజంగానూ ఆలోచించాడా అనిపిస్తుంది. సాంప్రదాయకం గాని – conventional కాని – చాలా liberties తీసున్నాడు ఇతడు ఈ శిల్పాన్ని మలచడంలో అనిపిస్తుంది. ఇందులో వున్నది శ్రీ రాముల వారు, హనుమంతుడు అని అనుకుంటున్నాను. ఆలా అనుకుంటే, లంకకు వెళ్ళి వచ్చిన హనుమంతుని చూడగానే శ్రీ రాములవారు ఉప్పొంగుతున్న అంతులేని  వాత్సల్యంతో దాహం తీరుస్తున్నట్లుగా మలచబడింది.  అదలా వుంటే, తనపై ఆయన చూపిస్తున్న ఆ వాత్సలయాన్ని అంతే వినమ్రంగా హనుమంతులవారు అందుకుంటున్నట్లుగా  కూడా మలచబడింది.  ఈ భావాలు రెండూ ఆ శిల్పంలో చక్కగా కనబడే విధంగా మలచ బడింది. బాగుంది కదూ!

వరదరాజ స్వామి వారి ఆలయం - కళ్యాణ మండప స్తంభాల వరుస
వరదరాజ స్వామి వారి ఆలయం – కళ్యాణ మండప స్తంభాల వరుస
వరదరాజ స్వామి వారి ఆలయం - కళ్యాణ మండప స్తంభం పై - విష్ణుమూర్తి
వరదరాజ స్వామి వారి ఆలయం – కళ్యాణ మండప స్తంభం పై – విష్ణుమూర్తి

ఎంత తక్కువ space లో ఎంత చక్కటి నాజూకైన రూపం!

కొండపల్లి కోట

ప్రకృతి పలు వనరుల్ని ప్రసాదిస్తుంది. ఆ వనరుల్ని ఏలా ఉపయోగించుకోవాలి అన్నది ఆయా ప్రాంతపు ప్రజల తెలివితేటల మీద, విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది.

విజయవాడకు నందిగామకు మధ్య దాదాపు 24 కి.మీ. పర్యంతం పరుచుకుని ఒక పర్వత శ్రేణి ఉంది. అందులో ముఖ్యమైన అంతర శ్రేణి కొండపల్లి కి చెందినది. ఈ కొండపల్లి పర్వతాలమీద స్థానికంగా ప్రజలు ‘పొనుకు చెట్టు ‘ అనే పేరుతో పిలుచే చెట్టు విస్తారంగా పెరుగుతుందట. ఈ చెట్టు నుంచి వచ్చే కలప బాగా తేలికగా వుండి బొమ్మల తయారీకి అనువుగా వుంటుందని గ్రహించిన విజ్ఞులైన స్థానికులు కొందరు అక్కడ బొమ్మల తయారీ మొదలెట్టారు, ఎన్నో వందల ఏళ్ళ క్రిందట. పోను పోను అది పెరిగి, ఆ ప్రాంతపు ప్రజలకు ముఖ్య జీవనాధామైంది. దానితో పాటు కొండపల్లికి మంచి పేరు ప్రఖ్యాతలని తెచ్చి పెట్టింది. కొండపల్లి పేరు చెపితే చాలు, సాంప్రదాయికమైన రంగులతోనూ ఆకారాలతోనూ అక్కడ తయారైన బొమ్మలే గుర్తుకు వస్తాయి ఇప్పుడు.

అదలా వుంచితే, కొండపల్లికి సంబంధించి అంతగా ప్రఖ్యాతం కాని ఒక పర్యాటక విశేషం వుంది. అది అక్కడి కొండ మీద నిర్మితమై ఇప్పుడు శిథిలావశేషంగా మిగిలి వున్న కోట.  క్రీ.శ.14 వ శతబ్దంలో రెడ్డిరాజుల పాలనా కాలంలో ఈ కోట నిర్మించబడిందట. ఆ తరువాతి కాలంలో ఈ కోట చాలా యధ్ధాలను చూసింది. బహమనీ సుల్తానుల చేతులలోకీ, గజపతుల చేతులలోకీ వెళ్ళింది. ఆ తరువాత విజయనగర రాజులలో అతి ముఖ్యుడు, ఆంధ్రులకు ప్రియాతి ప్రియుడైన రాజు శ్రీ కృష్ణదేవరాయల చేతిలోకి వెళ్ళింది. ఆ తరువాత కుతుబ్ షాహీ వంశజుల చేతిలోకీ, ఆపై ఆంగ్లేయుల అధీనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు, స్వతంత్ర భారతంలో ASI ఆలన పాలనలో వుంది.ఇదంతా చరిత్ర, ఒకింత  సంక్షిప్తంగా.

కిందనుంచి కొండమీదికి రోడ్డు బాగానే వుంటుంది. అయితే, పూర్తిగా ఘాటు రోడ్డు. ఒక్కొకచోట చాలా ఇరుకుగా, చుట్టూ చెట్లతో చీకటిగా, ఊహించని మలుపులతో ఆశ్చర్యానికి,  కొత్తవాళ్ళను ఒకింత గాభరాకూ గురిచేసేదిగా ఉంటుంది. కొండమీద కోటకు చేరుకున్న తరువాత, అక్కడ అంత విశాలమైన సమతల ప్రదేశం ఉండగలదని ఊహించలేనట్లుగా వుంటుంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఆంధ్ర ప్రదేశ్ శాఖ) వారి పరిరక్షణలో వుందీ కోట ప్రస్తుతం.  కొన్ని మరమ్మతు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మేము చూసినప్పుడు. కోట ఆవరణలోకి వెళ్ళగానే మొదటి అంతస్తులో – అంటే, అక్కడి ground level లో – ఉన్న arched hall వెలుపలి వైపు గోడకు అమర్చబడి వున్న మూడు ఫిరంగులు మొదటగా కనబడతాయి.

Fort_Outer_1A

Fort Outer_B

ఆ పక్కనే వున్న మెట్లమీదుగా పై అంతస్తుకి వెళితే, మనం అప్పుడు నర్తన శాల గా వుండిన విశాలమైన (ఇప్పుడు పై కప్పు లేకుండా పోయిన) హాలును చేరతాం.

Dancing Hall-1Aనర్తనశాల – చిత్రం (1)

Dancing Hall-2Aనర్తనశాల – చిత్రం (2)

Dancing Hall-3Aనర్తనశాల – చిత్రం (3)

Dancing hall_Aనర్తనశాల – చిత్రం (4)

అక్కడి నుంచి అంటే ఈ Dancing Hall వెనకవైపు నుంచి కిందకు చూస్తే కోటలొ నివసించే వాళ్ళకు నీటి అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేయబడిన నీళ్ళ టాంకు కనబడు తుంది.

Water TankWater Tank

క్రిందికి దిగి  నీళ్ళ టాంకు వున్న చోటినుంచి నడిస్తే అప్పటి రాణి మహలు అక్కడి నుంచి యాగ శాలకు, ఆపై అప్పటి విపణి ప్రదేశానికి
(Market place) ఆ వెనుక కారాగారం (Jail) కు చేరతాం.

Rani Mahal_Aరాణీ మహలు – చిత్రం (1)

Rani Mahal_2Aరాణీ మహలు – చిత్రం (2)

Market Place_Aవిపణి వీధి – చిత్రం (1)

Market place_Bవిపణి వీధి – చిత్రం (2)

Yaga_sala_Aయాగశాల

Jail_Aకారాగారం

ఆ తరువాత కోట వెనుకవైపుకు వెళ్ళి ఒక్క సారి క్రింది చూస్తే ఒక breath-taking view మనకు దర్శన మిస్తుంది.

View from the hill_fort_AView from the top of the Fort

మొత్తం మీద, కోటలోని ఒక్కొక భాగాన్ని తిరిగి చూస్తున్నంత సేపూ, కొండ కొన మీద ఇంత విశాలమైన ఆవరణలో,  అవసరానికి కావలసిన అన్ని సౌకర్యాలతోనూ, హంగులతోనూ ఇంత పెద్ద నిర్మాణం ఉండడం అనేది ఊహించి ఉండం కాబట్టి, ఒకింత అశ్చర్యానికి ఆనందానికి గురి అవుతాం. ఈ కోట నిండైన  రూపం మనకు పూర్తిగా అవగతమవక పోయినా, కనుపించే శిథిలాలలోనే మన ఊహలలో చాయా మాత్రంగా మెదిలే రూపం, అసలుకు ఈ కోట నిర్మాణాన్ని ఇక్కడ ఈ స్థాయిలో ఊహించి రూపం కల్పించడంలో కృతకృత్యులయిన అప్పటి వ్యక్తుల planing కూ, పనితనానికి మనసులో జోహారులర్పిచకుండా ఉండలేకుండా చేస్తుంది.

కోటలోని అంతర్భాగలను ఒక్కొకదానినీ ఇంకా organised గా  పునరుధ్ధీకరించి, తగినంత ప్రచారం కలుగజేసి, రవాణా ఇత్యాది సౌకర్యాలను పెంచి, ఈ ప్రాంతంలో ఒక మంచి పర్యాటక కేంద్రంగా వృధ్ధి చెందేలా చేయడానికి కావలసిన అర్హతలన్నీ ఈ కొండపల్లి కోటకు ఉన్నాయి.

కోటను చూసి ఇక తిరుగు ప్రయాణానికి సిధ్ధమై వస్తూండగా, ఆకులు రాలి ఎండిపోయినట్లున్న చెట్టు కొమ్మలలోంచి చందమామ, కొండపల్లి కోట శిథిలాలలావశేషాలలో నా సెల్ ఫోను కెమేరాకు ఇలా దొరికాడు.కోట శిథిలావశేషాల జ్ఞాపకాలతో పాటు, జ్ఞాపకంగా వెంట తెచ్చుకున్నాను!

Moon siight_A

భట్టిప్రోలు స్తూపం

Bhattiprolu_0భట్టిప్రోలు స్తూపం – ఫొటో (1) (విశాలమైన ప్రదక్షిణ పథం తో)

భట్టిప్రోలు కు నేను మొదటి సారి నా ఇరవై ఏళ్ళ వయసులో వెళ్ళాను, (కాస్త దూరపు) బంధువులను ఏదో function కి పిలవాల్సిన పనిమీద. అప్పటికి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో భట్టిప్రోలు ప్రాథాన్యాన్ని గురించి చదివినది జ్ఞాపకం ఉండడం మినహా ఇందులో ఎదో చూడాలన్న కుతూహలంగానీ, ఆసక్తి గానీ అప్పుడు లేవు. పక్కనుంచి నడిచి వెళ్ళ్తూ ఒక సారి అటువైపుగా చూసి ‘ఒహో, ఇదా భట్టిప్రోలు స్తూపం అంటే!’ అనుకుని వెళ్ళిపోయాను.

Bhattiprolu_0Aభట్టిప్రోలు స్తూపం – ఫొటో (2) (విశాలమైన ప్రదక్షిణ పథం తో)

మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి ఇప్పుడు అనుకోకుండా భట్టిప్రోలు వెళ్ళడం, చూడడం, కాసిని ఫోటోలు తీసుకోవడం (సెల్ ఫోను లోని కెమేరాతో, అసలు కెమేరా వెంట లేని కారణంగా) …ఇప్పటికైనా మళ్ళీ వెళ్ళి చూసి, ఆ ప్రదేశంలో కాసేపు కాలం గడపగలగడం అదృష్టంగానే భావిస్తున్నాను! ఈ ప్రదేశం అలాంటిది మరి!

దక్షిణ భారతదేశంలోని లిపులన్నిటికీ (నిజానికి ఇక్కడే గాక, బౌధ్ధం విస్త్రుతంగా వ్యాపించిన బర్మా, మలయా, థాయిలాండు లాంటి కొన్ని పర దేశాల భాషలకు కూడా అని చదివాను) అధార లిపిని ప్రదానం చేసిన ఆది లిపి లాంటి లిపి ఒకటుంది.  ఆ లిపి పేరు ‘భట్టిప్రోలు లిపి ‘ అని భాషా చరిత్రకారులు చెబుతారు. మిగతా సంగతు లెలావున్నా, ఈ ఒక్క కారణంగా అక్షరాలు, భాష, సాహిత్యం అంటే  మమకారం ఉన్న నాకు (ఇంకా నా లాంటి చాలా మందికి) భట్టిప్రొలు నిస్సందేహంగా ఒక పుణ్య ప్రదేశం, పవిత్ర స్థలం.

Bhattiprolu_1భట్టిప్రోలు స్తూపం – ఫొటో (3)

చరిత్రలోకి వెళితే, భట్టిప్రోలు అసలు పేరు ‘ప్రతీపాలపురం’ అట! (కథలలో పేరులాగా పేరు వినడానికి చాల బాగుంటుంది. ఇలా వున్న పేర్లన్నీ ఇప్పుడు ఎందుకనో మాయమైపోయా యనిపిస్తుంది. ‘భట్టిప్రోలు’ విషయంలో పూర్తిగా అలా అనడానికి లేదనుకుంటాను. ఎందుకంటే, ‘ప్రతీ పాల’ అనే పదాలే పోను పోను ‘భట్టి ప్రోలు’ గా మారాయేమో అనిపిస్తుంది కాబట్టి!) ఆంధ్ర శాతవాహన రాజుల పాలనా కాలం ప్రారంభానికి ముందునుంచీ (క్రీ.పూ.3 వ శతాబ్ది ముందునుంచీ) ఈ నగరం ప్రముఖమైనదిగానే వుండినదని చరిత్ర చెబుతుంది. ఈ నగరాన్ని కుబేరకుడనే రాజు పాలించాడని ఇక్కడ దొరికిన శాసనాధారలను బట్టి చరిత్ర పరిశోధకులు కనుగొని చెప్పిన సంగతి.

దేశం బ్రిటిషువారి పాలనలో ఉన్న రోజులలో ఈ స్తూపాన్ని కనుగొని, తవ్వకాలలో బయటపెట్టిన వ్యక్తి పేరు అలక్జాండర్ రే (1892 లో). ఆ తరువాత భారతీయ పురాతత్త్వ పరిశోధకులయిన శ్రీ రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాలలో బౌధ్ధ విహారపు పునాదులు, బుధ్ధునికి సంబంధించిన వస్తువులు లభించాయని చెప్పబడింది. స్తూపం ఆవరించుకుని వున్న ప్రదేశం వైశాల్యం మొత్తం 1700 చదరపు గజాలు. 40 అడుగుల ఎత్తు. 8 అడుగుల సౌకర్యవంతమైన ప్రదక్షిణా పథం భట్టిప్రోలు స్తూపం ప్రత్యేకత. ఇదంతా ఒకింత academic గా అనుపించే సమాచారం.

Bhattiprolu_2భట్టిప్రోలు స్తూపం – ఫొటో (4)

తవ్వకాలలో ఇక్కడ స్తూపంలో దొరికిన ‘ధాతు కరండం’ (కరండము అంటే casket – భరిణ) మూత పైవైపు చెక్కబడి అక్షరాలు అశోకుని కాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో వున్నాయనీ,  ఆ లిపినే  భాషా శాస్త్రజ్ఞులు ‘భట్టిప్రొలు లిపి’ అని ఒక కొత్త పేరు పెట్టి పిలిచారనీ చదివిన సంగతులు.  దక్షిణ భారతంలోని భాషలకు ఈ లిపి నే ఆధార లిపి కావడం, ఈ లిపినుండే అవి పరిణామం చెందడం అనేది  ఇలా ‘భట్టిప్రొలు లిపి’ అని ఒక ప్రత్యేకమైన పేరు పెట్టి పిలవడానికి కారణం అట!

Bhattiprolu_3భట్టిప్రోలు స్తూపం – ఫొటో (5)

అమరావతి స్తూపం ఆవరణలో వున్నట్లుగా మొక్కుబడి స్తూపాలు (Votive Stupa), ఇంకా ఆయక స్తంభం లేవు గాని, ప్రత్యేకంగా ‘ఆయక అరుగులు’  (Ayaka platforms or Ayaka Stones) అనదగిన నిర్మాణాలు ఈ భట్టిప్రోలు స్తూపం ఆవరణలో కనుపిస్తాయి.  ‘ఆయక స్తంభాలు’ మాదిరిగానే ఇవి గూడా పూజనీయాలే!

Bhattiprolu_4భట్టిప్రోలు స్తూపం – ఫొటో (6)

Bhattiprolu_5భట్టిప్రోలు స్తూపం – ఫొటో (7)

బట్టిప్రోలు స్తూపం ఆవరణలో, ఏ అట్టహాసమూ లేకుండా, నిద్రపోతున్న వృధ్ధ వృషభం లాగా ఉన్న స్తూపం పక్కనే వున్నంతసేపూ, వేల సంవత్సరాల క్రితం తనంత తానుగా సమాధిలోకి వెళ్ళిపోయిన ఒక మహాపురుషుని చెంతనే ఉన్నానన్న భావన నాకు కలిగింది!

ఈ వెన్నెల రాత్రి, ధాత్రి…

vennela raatri-1ఈ వెన్నెల రాత్రి, ధాత్రి
నా అంత మౌనంగానూ వుండి
మైమరచి వుంది ఎందుకని?

మిత్రుడా, ఆ కొలను గట్టును ఆశ్రయించివున్న బెంచీ మీద
ఆ ప్రేమికుల జంట అలా అదృశ్యంగా వుండి
ఇలను బాధిస్తోంది ఎందుకని?

vennela raatri-2ఇక్కడ ఈ చెట్లకింది నేలపై పద్యంలా పరుచుకున్న
వెన్నెల నీడలలో అర్ధం కాని ఎన్నెన్నో వలపు ఛందస్సులను
తెలుసుకో జూసినప్పుడల్లా, ఆ మర్మం ఏదో
గుట్టు విప్పకుండానే మాయమౌతూన్నట్లుంటుంది ఎందుకని?

vennela raatri-3ఇదిగో ఇక్కడ, ఈ అర్ధచంద్ర చందంగా పోతపోసి వున్న రాతి మెట్ల మీద
ఎవరివో లత్తుక అద్దిన పాదాల మంజీర నిక్వణాలు
వినపడకుండా ఈ నిశ్శబ్దాన్ని ఖేదపరుస్తున్నాయి ఎందుకని?

vennela raatri-4Aమిత్రుడా, ఎవ్వరూలేని ఈ వెన్నెలరాత్రి రాకామోహ ఏకాంతంలో
ఈ కొలను గట్టున పువ్వు ఇంకా విరిసే వుండి
ఈ నీరవ నిరామయాన్ని ఇలా భంగపరుస్తూ వుంది ఎందుకని?

ఓటమిలోనూ నేను నేనే!

thrown out...

రెక్కలు తెగి పడినా, చిక్కి శల్యమైనా, సగమై మిగిలినా…నేను నేనే!
ఇక్కడ, నా అతి చిన్నదైన ఏమీ లేనితనంతో
ఈ అనంతమైన ఖాళీని నింపగలిగానన్న ఆనందంలో నేనున్నానంటే
ఏ అభ్యంతరమూ వుండకూడదు.
ఒకప్పుడు, ఇక్కడే , నేను ఏదో ఒక అధ్బుతాన్ని తయారుచేసి
లోకానికి కానుకగా ఇవ్వాలన్న తపనతో తిరుగాడానన్న తీపి జ్ఞాపకం ఒకటి
నన్నెప్పుడూ అంటిపెట్టుకుని ఉంటూనే ఉంటుంది.
సాధించలేకపోయిన విజయమూ ఒక్కొకప్పుడు ఊపిరే!
తిరిగి పొందలేని కాలమని అన్నా, యవ్వనమన్నా, జీవితమన్నా….ఏదని అన్నా,
అది నాకు ఈ వోటమిని తయారుచేసి ఇచ్చిన ఒక సొంపైన సన్నివేశాల సముదాయంగా కనుపించీ, అనిపించీ…
ఎప్పటికప్పుడు నా పెదాలమీద ఒక చిరునవ్వును చిలికించి నన్ను విస్మయపరుస్తూనే వుంటుంది.
చివరిదాకా ఓడిపోయి మిగలడమూ ఒక అనుభవమే!
ఎదురుగా ఎన్నెన్నో విజయాలతో నిండి వున్న ఈ అంతులేని అగాధాన్ని
ఏకాంతంలో చూస్తూ నేను పొందే తన్మయం నాకు ఏ విజయం సాధించి ఇవ్వగలదు?
గమ్యం దానికది తెలియకుండానే ఒక చిరునామా!
ఎంత నడిచినా ఎక్కడికీ చేరని దారికి
అడుగులను అనంతంగా మోస్తూండడమే ఒక తెలుసుకున్న జ్ఞానం అయినట్లుగా
ఓటమి ఒక పాట అవవలసినప్పుడు
అందులోని ప్రతి పదంలో పొందికగా
నేను నేనే!

ఏదైనా…

memory

జ్ఞాపకాం ఏదైనా సరే
మొదటగా మన కళ్ళ ముందే జరుగుతూ కనపడేదే!
అయితే మరి, అలా జరుగుతూ కనపడే దానిని జ్ఞాపకంగా మార్చేది ఏది?
ఒక సంశయమా, చిరునవ్వా, చూసీ చుడనట్లుండే చూపా , లేక
ఒక కూలిపోయిన హర్మ్యపు శిథిలావశేషంపై
అలవోకగా జారిపడి నర్మంగా మెరిసే వెన్నెల మరకా?
ఏది?
ఏదైనా!

భూమి, ఆకాశం…

earth and sky

మౌనం ఎప్పటికీ ఇరువురు వ్యక్తుల మధ్య బంధాన్ని వృధ్ధి చేయలేదు;
మహా అయితే, ఆ బంధానికి మొదటి మెట్టు కాగలదు!
అయితే, మొదలవడమే తప్ప పెరగడమూ
ఏదో ఒక తప్పనిసరి తీరమనేది చేరడమూ వుండని బంధాలు కొన్ని వుంటాయి;
అవి మౌనంలోనే మొదలై, అక్కడే
ఏ తప్పించుకోలేని తీరమో చేరడాన్ని ఆశించకుండా, అలాగే
ఎప్పటికీ మౌనంలోనే వుండిపోతూ వుంటాయి…
కలిసినట్లుగానే కనబడుతూ ఎప్పటికీ కలవని భూమీ ఆకాశం లాగా!