పదాంగుటము…పురుష విరహమూ…

bfly_from top_1A

“తలచిన హృదయము ఝల్లను తరుణీమణి ఒయ్యారము
కలిగీనా ఇక నొకపరి కన్నుల జూడగను…

మో మరవాంచి పదాంగుటమున నిల నొయ్యన వ్రాయుచు
కోమలి కన్నీ రెడనెడ గ్రుక్కుచు రెప్పలను
వేమరు నా దెస చూచుచు వీడగ నొల్లని భావము
ఏమని తలపోయుదు విధి నేమని దూరుదును….”

అన్నమయ్య శృంగార కీర్తనలలోనిది ఇది. ఇందులోని భావం:

“ఆ అందగత్తె  ఒయ్యారాన్ని  గుర్తుచేసుకుంటే హృదయం ఝల్లుమంటుంది
మళ్ళీ ఒక్కసారన్నా ఆ ఒయ్యారాన్ని చుసే భాగ్యం ఈ కళ్ళకు కలుగుతుందా….

వదనాన్ని సంగంవంచి పాదం బొటనవేలుతో నేల మీద అదేపనిగా రాస్తూ
కన్నీరు అమాంతంగా ఉబికివస్తున్నా ఆమె  రెప్పల అడుగుననే వాటిని దాచేస్తూ
వెయ్యిసార్లు నా వంకకే చూస్తూ విడిచి వెళ్ళడానికి ఇష్టపడని ఆ భావాన్ని
ఏమని నేను గుర్తుచేసుకోను, విధిని ఏ మాటలతో నేను దూషించను…..”

తెలిసిన భావచిత్రమే కదా ఇది! ఎన్ని చిత్ర లేఖనాల్లో, ఎన్ని సినిమాల్లో, ఇంకా ఎన్నెన్ని పాటల్లో బహుశా ఒక్కొక్క generation కి ఒకసారి మళ్ళీ మళ్ళీనూతనంగా  పుట్టుకొస్తూ, వ్యక్తమవుతూ వస్తున్న భావచిత్రం ఇది! అన్నమయ్య వ్యక్తీకరించింది ఇందులో పురుష విరహం. అన్నమయ్యది క్రీ.శ. 15వ శతాబ్దం. నేను చదివినంత వరకు,  నా దృష్టికి వచ్చినంత వరకు ఈ భావ చిత్రాన్ని మొట్ట మొదటగా వ్యక్తీకరించింది అన్నమయ్యే! అంటే ఎంత కాదన్నాసాహిత్య చరిత్రలో  ఈ భావ చిత్రానికి  first recorded instance  ఈ పదంలో అన్నమయ్యది….కనుక ఈ మాటలలో ఈ భావ చిత్రానికి 500 ఏళ్ళ వయసు! అయినా, ఇది ఎప్పటి కప్పుడు నిత్య నూతనమవుతూ ఈ అయిదు శతాబ్దాలుగా మళ్ళీ మళ్ళీ వినబడుతూ కనబడుతూనే వుంది. ఇకముందూ కనబడుతూనే వుంటుంది కూడా! ఎందుకంటే, పై ఫోటోలోని natural phenomenon లాగా, లలితమైన పురుష హృదయం అనేది ఉన్నంత కాలం  ఈ భావానికి కాలం చెల్లడం అనేది ఉండదు కాబట్టి!

బాష పరంగా ఇందులోని అరవంచు (ముఖాన్ని నేల వైపుకు సంగంగా వంచడం), పదాంగుటము (పాదపు బొటనవ్రేలు) – ఇవి వినసొంపుగా వుండే అచ్చమైన తెలుగు మాటలు! అందునా ముఖ్యంగా ‘పదాంగుటము’ అనే మాట – ఈ శృంగార కీర్తనలోని ఒయ్యారమంతా ఆ పదంలోనే ఉన్నట్లు నాకనిపిస్తుంది.

తెలుగు మాట – (1)

శతాబ్దాలుగా తెలుగు భాష వుంది. హాలుని గాథా సప్తశతి కాలానికే,  అంటే క్రీస్తు శకారంభ కాలం నుండే తెలుగు భాషలోని కొన్ని పదాలు ప్రాకృతంలోకి వెళ్ళ గలిగేంతటి స్పష్టమైన, బలమైన వాడుక భాషగా తెలుగు ఎదిగిందని క్రీ.శే. తిరుమల రామచంద్ర గారు తమ ‘గాథాసప్తశతిలో తెలుగు పదాలు’ అనే వ్యాసంలో (భారతి  మే, 1948) నిరూపించారు. క్రీ.శ.1 వ శతాబ్దానికే అలా వున్న భాషలో  క్రీ.శ. 11 వ శతాబ్ది దాక లిఖిత సాహిత్యం లేదు. అంటే దాదాపు ఒక సహస్రాబ్ద కాలం పాటు అంత బలంగా వాడుకలో వుండి, వేరే భాషల మీద కూడా ప్రాభావాన్ని చూపగలిగే స్థాయిలో వున్న తెలుగులో లిఖిత సాహిత్యం ఎందుకు రాలేదో అంత సులభంగా అర్ధం కాదు.

అదలా వుంచితే, క్రీ.శ. 18వ శతాబ్దం వాడనుకుంటూన్న అయ్యలరాజు నారాయణామాత్యుని ‘హంసవింశతి ‘ లో వాడిన కొన్ని తెలుగు పదాలకు అర్ధం గురించి మాట్లాడుతూ C.P. బ్రౌన్ గారు’ హంసవింశతి’ లోని పలుకుబళ్ళు కొన్ని అప్పటికే (అంటే క్రీ.శ.1820 ల  ప్రాంతానికే – బ్రౌను దొర కడపలో వుండిన సంవత్సరాలు) ప్రచారంలో లేవనీ, కాబట్టి తమ నిఘంటువులో కొన్నిటికి అర్ధం తెలియలేదనీ వ్రాశారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు క్రీ.శ. 18 వ శతాబ్దం ఉత్తరార్ధంలో వాడని అనుకుంటున్నారు గనుక, ఈ మాయమవడం అనేది అంతా 50-60 ఏళ్ళ మధ్య కాలంలోనే జరిగిందంటే ఆశ్చర్యమూ, తెలుగు భాషకు ఇది ఒక దురదృష్టకరమైన పార్శ్వమూ అనుకోవాల్సి వుంటుంది.

అలాగా, మనకు (వాడుకలో) వున్న మాటల కంటే, (వాడుకలో లేకుండా) పోయిన మాటలు శతాబ్దాలు గడిచేకొలదీ ఎక్కువవుతూ వచ్చాయి  అనిపిస్తుంది. ఆ వంతున, క్రీస్తు శకారంభ కాలం నుంచి ఇప్పటి దాకా తీసుకుంటే, ఈ రెండువేల సంవత్సరాల కాలంలో ఎన్నెన్ని మాటలు వాడుకలోంచి జారిపోయాయో లెక్కకట్టుకుంటే, ఏ కారణాల వల్లనైతే నేమి మనం వదిలేసుకుంటూ వచ్చిన పదజాలం (vocabulary) దాదాపుగా ఒక 30 శాతం దాకా వుంటుందేమో అని నా కనిపిస్తుం టుంది. ఇది ఉజ్జాయింపుగా నేను అంటున్న మాట. ఎక్కువో తక్కువో భాషలో అధికారికమైన  జ్ఞానం కలవాళ్ళు చెప్పాలి.

పెద్దలు చెప్పినట్లు, ఒక భాషలో ఏ మాటయినా మొదట శబ్దం, తరువాత అర్ధం, ఆ తరువాత రసము, అలంకారము, చందస్సు ఇంకా వ్యాకరణం. భాషలో మాటలకు సంబంధించి ఈ అన్ని అంశాల సమగ్ర జ్ఞానం కలిగి వుండడం ఆ భాషకు సంబంధించి పరిపూర్ణ జ్ఞానం కలిగి వుండడం అవుతుంది.

భాషలోని మాటలకు సంబంధించి ఈ అన్ని అంశాలపై ఒక మేరకు జ్ఞానాన్ని కలిగింపజేసేవి నిఘంటువులు. చాలా కాలం దాకా తెలుగులో మనకు మూడు ముఖ్యమైన నిఘంటువులు వున్నాయి. వాటిలో మొదటిది బ్రౌన్ నిఘంటువు. రెండవది శబ్దరత్నాకరం. మూడవది శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు. ఇప్పుడు మాండలిక పదకోశాల నిర్మాణం జరిగాక ఆయా ప్రాంతాలకు సంబంధించిన పదజాలాన్ని చేర్చుకున్న నిఘంటువులు కొన్ని వచ్చి చేరాయి. అయితే, మొత్తం భాషకు సంబంధించి వాడుకలో అర్ధానికిగాని, సాహిత్య పరంగా గానీ ఇప్పటికీ బ్రౌను నిఘంటువుది ప్రత్యేకమైన స్థానం అని ఒప్పుకోవాలి.

పాటను సాహిత్యంగా గుర్తించి తమిళులు పురాతన సాహిత్యం కలవాళ్ళయితే, అది చేయక మనం లేని వాళ్ళమయ్యాం అని ఒకచోట కీ.శే. ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి సంపుటం లో) అన్నారు. అలా, అన్నమయ్యను గురించి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంవారు 1920-30 లలో శ్రీ వేంకటేశ్వర దేవాలయంలోని స్వామివారి హుండీ గుమ్మానికి పక్కగా వున్న దక్షిణపు ఆవరణలోని  అన్నమాచార్యుల సంకీర్తన భాడారంలోని రాగిరేకులను పైకి తీయించి, వాటిలోని సంకీర్తనలను కీ.శే.లు వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గార్ల సహాయంతో పరిష్కరించి అనేక సంపుటాలుగా వేయించిన దాకా మనకు తెలీదు. వేల వేల సంకీర్తనలలోని అప్పటి భాషను, నుడికారాన్ని చేలా తేలికగా మనకు సంబంధం లేనివన్నట్లుగా వదిలేశాం, మర్చిపోయాం!

ఆ తరువాతి కాలంలో శ్రీమతి రామలక్ష్మి ఆరుద్ర గారి సంపాదకత్వంలో ‘తాళ్ళపాకవారి పలుకుబళ్ళు’ అని ఒక ఐదారు వందల పేజీల గ్రంథం ,’అన్నమయ్య పదకోశం‘ అని శ్రీ రవ్వా శ్రీహరి గారి ఇంకో ఆరేడువందల పేజీల నిఘంటువు  అవసరమయ్యాయి (ఇప్పటికి నాకు తెలిసినంత వరకు) అన్నమయ్య వాడిన తెలుగుభాషలోని ఆ కాలపు (క్రీ.శ.15 వ శతాబ్దం) నుడికారాన్ని ఇప్పుడు సవివరంగా అర్ధం చేసుకోవడానికి అంటే అప్పుడు వాడుకలో వుండిన ఎంత భాష (vocabulary) ఇప్పుడు లేకుండా పోయిందో అర్ధమవుతుంది గదా!

అదలా వుండగా, ఇప్పటికీ అన్నమయ్య పదాలలోని మాటలకు అర్ధాలను చెప్పుకోవడంలోనూ, భావాన్ని అన్వయించుకోవడంలోనూ పూర్తి స్పష్టత లేని సందర్భాలు ఇంకా వున్నాయనే నాకు అనిపిస్తుంది. ఉదాహరణకి ఈ సంకీర్తన పల్లవి లో:

“అయ్యో పోయెం బ్రాయము కాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి…”

‘ముయ్యంచు’ అనే మాట.ఈ మాటకు అర్ధం శ్రీ రవ్వా శ్రీహరి గారి ‘అన్నమయ్య నిఘంటువు’ లో ‘ధర్మార్ధ కామములనే మూడు అంచులు గల మనసు’ అని సూచించబడింది.

మూడు + ఏరు = ముయ్యేరు (గంగా నది) అయినట్లుగా, మూడు + అంచు = ముయ్యంచు అయింది. అంత దాకా బాగానే వుంది. అయితే ఇందులోని అంచులు ఏవి అనే దగ్గరే అసలు సంగతంతా వుంది. ధర్మార్ధ కామములని మూడు అంచులు అని అనుకుంటే, మోక్షమనే నాలుగో అంచు కూడా ఉండాలి గదా, అది ఎందుకు అన్నమయ్యచేత వదలబడింది అని సందేహం కలుగుతుంది.  అసలుకు ఈ ధర్మార్ధ కామ మోక్షములనేవి మనసుకు అంచులు అవుతాయా? ‘అంచు’ అనే మాట అక్కడ సందర్భాన్ని బట్టి నిందార్ధంలో కదా వాడబడింది?  ఆ అర్ధంలో ధర్మార్థకామములను మనసుకు ఆపాదించటం సాధ్యమవుతుందా? ఒక వేళ సాధ్యమవుతుం దనుకున్నా, నాలుగో దయిన  మొక్షాన్ని కలుపుకుని కదా చెప్పుకోవాలి? అదెందుకు ఇక్కడ వదిలివేయబడింది? ఇలాంటి సందేహాలు రాక మానవు. అందువలన ఈ ‘ముయ్యంచు‘ అనే మాటలోని మూడు అంచులు ధర్మార్ధ కామములను సూచించవని నా అనుమానం.

మరయితే, ఈ మాటకు ఇక్కడ పొసిగే అర్ధం ఏమై ఉండాలి? అనుకున్నపుడు, ఇందులో అన్నమయ్య ఉద్దేశించింది  ధర్మార్ధ కామములనేవి కాక, కామ క్రోధ లోభములనే  మూడు ముఖ్యమైన అవలక్షణాలనీ…అలా  ‘కత్తులవంటి ఈ మూడు అవలక్షణాలు నిండి వున్న మనసుతో లోకాన్ని చూస్తూ, ప్రవర్తిస్తూ ఇన్నాళ్ళుగా నేను మొహమతినై వున్నానే’ అని అన్నమయ్య ఇందులో మొఱపెట్టుకున్నది అని నాకు తోస్తుంది.

ఇప్పుడు ఈ సంకీర్తన పూర్తి పాఠం ఒకసారి చదువుకుంటే –

“అయ్యో పోయెం బ్రాయము కాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి…

చుట్టంబులా తనకు సుతులు, కాంతలు చెలులు
వట్టియాసం బెట్టువారే కాక
నెట్టుకొని వీరు కడు నిజమనుచు హరినాత్మ
బెట్టనేరక వృథా పిరివీకులైతి…. అయ్యో….

తగు బంధులా తనకు తల్లులును తండ్రులును
నగలబెట్టుచు తిరుగువారేగాని
మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ
తగిలించలేక చింతాపరుడనైతి….అయ్యో…”

ఇందులో మిగతా భాగం, అంటే చరణాలున్న భాగం గురించి మరొక పోస్టులో.

ఇక్కడ ఒక మాట. పెద్దలు, శ్రీ రవ్వా శ్రీహరి గారు సూచించిన అర్ధంతో ఇందులో విబేధించడమన్నది నా తెలివితేటలు ప్రదర్శించికోవడానికి ఎంతమాత్రం కాదు. ఈ సాహిత్య సంబంధ విషయాలలో వారికి వున్న ప్రజ్ఞలో నాకు సహస్రాంశం కూడా లేదు. ఇది కేవలం సరయిన అర్ధం అన్వయం కోసం చేసిన ప్రయత్నమే తప్ప వేరు కాదు. ఈ రాతలో ఎక్కడయినా వాడకూడని మాట వాడినట్లుగా అనిపిస్తే, అది తెలియక జరిగినదిగా పెద్దలు, పెద్దమనసుతో మన్నిస్తారని ఆశిస్తాను.

అన్నమయ్య పాట – తెలుగు మాట (3)

అన్నమయ్య పాట – తెలుగు మాట (3)

‘పలుకు తేనెల తల్లి’ (అన్నమయ్య భావనలో అలమేలుమంగ కూడా  ‘ఇక్షు వాక్కే’. ‘ఇక్ష్వాకూ కుల తిలకా, ఇకనైన పలుకవా’, ‘పలుకే బంగారమాయెనా’ – అని త్యాగయ్య ‘పలుకు’ మీద అంత మమకారం పెంచుకుంది, ఆయన ఒక్క మాట కోసం అంతగా తపించిపోయిందీ అందుకే అనుకుంటాను!) అనే శృంగార సంకీర్తనలో, మొదటి చరణంలోనే అలమేలుమంగను అన్నమయ్య అచ్చ తెలుగు మాటలలో ఇలా వర్ణిస్తాడు:

“నిగనిగని మోముపై నెఱులు కెలకుల చెదర” – ఈ అయిదు మాటలలోనే అచ్చమయిన, స్పష్టమైన భావ చిత్రం నిక్షిప్తమై ఉంది. కాస్త చెయ్యి తిరిగిన చిత్రకారుడెవరైనా అలతి కాలంలోనే ఈ మాటలకు చిత్ర రూపం ఇవ్వగలడు. (నా కయితే ‘వ.పా’ గారు ఆయన స్టయిల్లోని రేఖలతోనూ, వర్ణాలతోనూ  ‘చిత్రించని’ చిత్రం కళ్ళ ముందు మెదులుతున్నట్లుగా ఉంటుంది ఈ మాటలను తలుచుకున్నప్పుడల్లా).

చిరుచెమటన తడిసి, ఆరి, ఎక్కడినుంచో అల్పంగా పడుతున్న వెలుగులో అనల్పంగా మెరుస్తున్న ముఖం – ఇది ‘నిగనిగని మోము’. ఇప్పుడు నిగనిగలాడు ముఖం అని ‘నిగనిగ’ కు ‘ఆడు’ ను జోడించి చెప్పుకుంటున్నాం,  రాతలలో రాసుకుంటున్నాం. ఇందులోని  ‘నిగనిగలు’ ముఖంపై ‘ఆడుతాయి’  కనుక – అంటే, ఇంకాస్త  వివరంగా చెప్పుకోవాలంటే, నిగనిగలు ముఖంపై నిశ్చలంగా ఉండేవి కావు; ముఖంపైని వివిధ పార్శ్వాలకు, మూలలకు ఒక చోటినుంచి ఇంకొక చోటికి అనిశ్చలంగా ప్రసరిస్తూ ఉండడం ‘నిగనిగలు ఆడడం’  అన్నది. అన్నమయ్య ఉద్దేశించినది ఈ నిగనిగ కాదు. అక్కడ అలమేలుమంగ ఉన్న స్థితిలో ఆమె మోము పై నిగనిగ నిశ్చలం. అందువలన అక్కడ ‘ఆడు’ కి ఆస్కారమే లేదు. ‘నిగనిగల’ అని  బహువచనంలో కూడా ఆయన అనలేదు –  అలమేలుమంగ ముఖంపై నిశ్చలమైన ‘నిగనిగ’ నే అన్నమయ్య ఊహించిందీ, చెప్పిందీను.

నెఱులు – ‘నెరి’ అనే పదానికి బహువచనం ‘నెఱులు’ . ‘నెరి’ అనే మాటకు అర్ధాల్లో ఒక అర్ధం ‘చుట్టు వెంట్రుక’ (curly hair). ‘కెలకు’ – దిక్కు. బహువచనం ‘కెలకులు’ ; చెదర; – నిగనిగతో ఉన్న ముఖంపై వెంట్రుకలు అన్ని వైపులకూ చెదిరి ఉండగా – అని ఈ  పాదం భావం.

‘ఏమొకొ చిగురుటధరమున’ అనే శృంగార సంకీర్తనలో ఒక వింతైన భావ చిత్రం వుంది. ఈ సంకీర్తన మొదటి చరణం:

                                      “కలికి చకోరాక్షికి గడకన్నులు గెంపై తోచిన
                                       చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు
                                      నలువున బ్రాణేశ్వరుపై నాటిన యాకొనచూపులు
                                      నిలువున బెరుకగ నంటిన నెత్తురు గాదుగదా”

కలికి చకోరాక్షికి – అలమేలుమంగకు,  కడకన్నులు – కంటిచివరలు (కడకన్ను అనే మాట కంటే, కటాక్షము – కడ + అక్షము – అనే మాట ఎక్కువగా ప్రయోగించబడి కనిపిస్తుంది మనకు ఇప్పుడు సాహిత్యంలో గానీ, ఇతరత్రా గాని. కడగంటిచూపు అనే ఒక్క మాటలో తప్ప ‘కడకన్ను’ తెలుగులో వేరే ఎక్కడైనా మిగిలి ఉందా అంటే నాకు సందేహమే!)  కెంపై – ఎరుపై తోచిన, చెలువము – విధము, ఇప్పుడిదేమో చింతింపరె – ఆలోచించరే చెలులు;

నలువున – సామర్ధ్యంతో అని ఈ మాటకు అర్ధం. అయితే ఇక్కడ ప్రేమ నేర్పిన చాకచక్యంతో అంటేనే సరిగా ఉంటుందనుకుంటాను, ప్రాణేశ్వరుపై – తిరు వేంకటపతిపై, నాటిన ఆ కొనచూపులు – కడగంటిచూపులు, వాడి చూపులు అని కూడా అనుకోవచ్చేమో, నిలువున – నాటబడివున్న వాటిని అలాగే, పెరుకగ అంటిన నెత్తురు కాదు గదా –
చూపులను తప్పనిసరిగా తిప్పుకోవాల్సి వచ్చి మరల్చినపుడు ఆ చూపులతో పాటే ఆయన శరీరపు ఎరుపు రంగు వదలక అలాగే వచ్చి ఆమె కడగంటికి చేరలేదు కదా- అని ఈ చరణం భావం.

ఈ సందర్భాన్ని ఇలా  ఊహించి అచ్చతెలుగు మాటలలో అందంగా  చిత్రించింది నేను చదివినంతలో అన్నమయ్య ఒక్కడే!

అన్నమయ్య పాట – తెలుగు మాట (2)

అన్నమయ్య పాట – తెలుగు మాట (2)

“వొలసి నొల్లముల పొందొనరించుకంటేను
అలవోకలైన పొలయలుక మేలు
 కలసీకలయని మనసు కసగాటుకంటేను
 తలపులో నడియాస తమకమే మేలు”

వద్దు నన్ను జెనకకుర ‘ కీర్తనలోని మొదటి చరణం ఇది. ఈ చరణంలోని మొదటి పాదం ‘వొలసిన ఉల్లముల పొందు వొనరించుట కంటెను’ లో ‘వొలసిన ఉల్లముల’ గురించి ముందు మాట్లాడుకుంటే, ఇందులో ‘ఒలియు’ అనే మాటకు ‘గాయపరచు’ అనీ, ‘ఉల్లము’ అంటే తెలిసిన అర్ధమే ‘మనస్సు’, ‘హృదయము’ కాబట్టి ‘వొలసినొల్లముల’ అంటే ‘గాయపడిన హృదయాలతో’ ఒకటిగా ఉండాలనుకోవడం కంటే, ‘అలవోకలైన’ – మనస్పూర్తిగా కాని, అలక్ష్యములైనటువంటి, ‘పొలయలుక’ – ప్రణయకలహము అని బ్రౌన్ నిఘంటువు, ఇంకా లోతుగా వెళితే – పొల్ల +అలుక (అచ్చ తెలుగు మాటలు) – పొల్ల, పొల్లు అంటే సారంలేని, తేలిపోయేటువంటి; ఇక్కడ హృదయంలోంచి రాని, పైపై నటనల అలుకలే మేలు అని అర్ధం. గాయపడిన హృదయాలతో ఒకటిగా, దగ్గరగా ఉండాలనుకోవడం కంటే, అదాటుగా వచ్చే పైపై నటనల అలుకలతో దూరంగా ఉండడమే మేలు అని ఈ రెండు పాదాల అర్ధం.

ఇక మూడవ పాదంలో, కలిసీ కలియని మనసు – ఇంతవరకు తెలిసినదే. కసగాటు – ఇదీ అసలైన పదం. సందర్భాన్ని బట్టి ఏదో – అంటే అయిష్టంలోంచి పుట్టే అనాత్మీయ భావపు తిరస్కారం లాంటిది ఏదో – చాయగా అర్ధమవుతున్నా, ఈ అచ్చ తెనుగు మాటకు స్పష్టమైన అర్ధాన్ని మాత్రం చెప్పలేం. నిఘంటువులలో లేని పదం, నాకు తెలిసినంతవరకూ. కసరు (=తిరస్కారం), గాటు(=తీక్షణమైన) అనే రెండు పదాలు కలిసి ‘కసగాటు’ అయిందేమో బహుశా! కలిసీ కలియని మనస్సులలొంచి పుట్టే తిరస్కార భావాన్ని భరిస్తూ కూర్చోవడం కంటే, తలపులో నడియాస తమకమే మేలు – మనస్సులో  ఇది జరిగేది కాదనే అడియాశ (ఆశ పొయిన స్థితి) నుంచి పుట్టే తమకము – మోహము, విరహము అని బ్రౌన్ నిఘంటువు చెప్పిన అర్ధం; అది అంత మాత్రమే కాదు – తమకము అనే భావానికి సరయిన అర్ధం చెప్పాలంటే, అది వట్టి మోహం కాదు; బాధించే మోహం అనాల్సి ఉంటుంది.

“పచ్చి పెచ్చుల కూర్మి పచరించు కంటేను
 కొచ్చి వూరకయుండు గుట్టు మేలు
 వచ్చియును రాములను వడిబొరలు కంటేను
 మచ్చరము మాని మెయి మఱచుటే మేలు”

‘వద్దు నన్ను జెనకకుర’ కీర్తనలోని రెండవ  చరణం ఇది.’పచ్చి పెచ్చుల కూర్మి’ – ఇది హృదయంలోంచి వస్తున్నది కాదని మాటలలోనే స్పష్టంగా తెలిసిపోతున్న ప్రేమ భావాన్ని, పచరించు కంటేను – ప్రసరింపజేయాలని, (ఏదో మొహమాటానికి అన్నట్లుగా) తెలియజేయాలని ప్రయత్నించడం కంటే, ‘కొచ్చి’ – ఈ మాటకు అర్ధం ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు, ఊరక యుండు గుట్టు మేలు – గుంభనంగా ఊరకే ఉండడం మేలు.

‘వచ్చియును రాములను’ – వచ్చురాములు అంటే వచ్చుట, రాకపోవుటలు. అయితే ఇక్కడ వచ్చియును రాములను అనడంలో – వచ్చియుండికూడా రాకపోయినట్లుగానే ఉండడం, అంటే ఎదురుగా ఉండి కూడా లేకుండా ఉండడంతో సమానంగా ఉండడం; వడిబొరలుకంటేను – ఆ స్థితిలోని ప్రేమరాహిత్యానికి మనసులో మిగుల హింస పడడం కంటే, మచ్చరము మాని – ఈర్ష్య మాని, మెయి మఱచుటే మేలు – ఒళ్ళు తెలియకుండా పడివుండడం మేలు. చాలా శోకం, మనసు పడ్డ వ్యక్తి ప్రేమను పొందలేక పోవడంలోని అసహాయ దుఃఖం ఉంది ఇందులో!

ఇవన్నీ అచ్చమయిన తెలుగు పదాలు. అయినాగానీ, కొన్ని శతాబ్దాలుగా మనం వొదిలేసుకుంటూ పోయినవి కాబట్టి, ప్రయోగంలో లేకుండా పోయి, అన్వయించుకోవడానికీ, అర్ధం చెప్పుకోవడానికీ ఇప్పుడు కొంత కష్టపడాల్సి వస్తోంది అనుకుంటాను.

అన్నమయ్య పాట – తెలుగు మాట (1)

అన్నమయ్య పాట – తెలుగు మాట (1)

తాళ్ళపాక అన్నమాచార్యుడు – అన్నమయ్య – క్రీ.శ.15 వ శతాబ్దానికి చెందిన వాడు. కడప జిల్లా తాళ్ళపాక గ్రామ వాసులైన నారాయణ సూరి, లక్కమాంబలకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో జన్మించినవాడు. అప్పటిలో ఆ ప్రాతంలో వ్యవహారంలో ఉండిన తెలుగులో 32 వేలదాకా పదాలను రచించాడని ప్రచారంలో ఉన్న మాట. అప్పటికీ ఇప్పటికీ తెలుగు భాషలో చాలా మార్పు వచ్చింది. చాలా మాటలు జన వ్యవహారం నుంచి జారిపోయినాయి. ఆంగ్ల భాషతో పరిచయం తరువాత ఈ మార్పు మరింత ఎక్కువగా జరిగింది. అన్నమయ్య పదాలలోని చాలా మాటలకూ, ఆయా చోటుల  వాటి ప్రయోగాలకూ ఇప్పుడు అర్ధాలను వెదుకుకోవాల్సి వచ్చేంతగా ఈ మార్పు సంభవించింది.

అన్నమయ్య కీర్తన ఏదైనా సరే వింటున్నప్పుడు, అప్పటికి ఆ కీర్తన మాధుర్యంలో పడి కొట్టుకుపోతాం. మాట మాటకూ అర్ధాన్ని గురించి అంతగా పట్టించుకోం. ఏదో అర్ధమయినట్లుగానే అనిపించి తల పంకించేస్తాం. అయితే, ఆయా కీర్తనలను విడిగా చదువుకుంటున్నప్పుడు మాత్రం, ఒక్కొకచోట ఇప్పుడు వ్యవహారంలో లేని మాట తగిలినప్పుడు విడిగా ఆ మాట అర్ధం ఏమిటై ఉంటుందన్నది, భాషలో మనం పోగొట్టుకున్న మాటలను ఒకసారి గురుతుకు తెచ్చుకోవడానికైనా ఆలోచించాల్సి ఉంటుందని నా కనిపిస్తుంది. ఉదాహరణకు, బహుళ ప్రసిధ్ధమైన ఈ కీర్తన —

                                “ఆకటి వేళల అలపైన వెళల
                                 తేకువ హరినామమే దిక్కు మఱి లేదు”

ఇందులో ‘తేకువ’ అనే మాట ఇప్పుడు వాడుకలో లేదు. నేను చదివినంతలో, ఈ మాట అన్నమాచార్యుని ఈ కీర్తనలో
తప్ప ఇతర సాహిత్యంలో వేరే ఎక్కడా ప్రయుక్తమై కనబడలేదు. ఈ కీర్తన పల్లవిలో ఈ మాట ప్రయుక్తమైన సందర్భాన్ని బట్టి, ‘ధైర్యం కోసం, ఆ కష్టాన్నించి కోలుకోవడానికి, ఆ విపత్తునుంచి గట్టెక్కించడానికి’ అన్న అర్ధాలు కుదురుతాయని అవగతమవుతుంది. బ్రౌన్ నిఘంటువు ధైర్యము, భయము అని రెండు అర్ధాలనూ ఇచ్చింది. అయితే, ఇలాంటివి ఎన్ని అర్ధాలను చెప్పుకున్నా, ఇంకా మాటలలో చెప్పలేనిది ఏదో, అనిర్వచనీయమైనది ఏదో అర్ధం ఆ మాటలో అన్నమయ్య ఉద్దేశించిన సందర్భానికి సరిపోయి, అందులో ఇమిడిపోయి ఉందని అనిపిస్తుంది. సాళువ నరసింగరాయలు పెనుగొండలో రాజ్యం చేస్తూ, అన్నమయ్యను పిలిపించుకుని తనపై శృంగార పదాలు చెప్పమంటే అందుకు తిరస్కరించిన అన్నమయ్యను శృంఖలాబధ్ధుని చేస్తే, ఆ బాధలో, కష్టంలో, తనను తాను మరిచిపోవడానికి అన్నమయ్య ఆలాపించిన కీర్తన ఇది. ఈ కీర్తనను ఆలాపించడం ద్వారా ఏ ‘మరపు’ నైతే పొందాలని అన్నమయ్య ఆశించాడో ఆ మరపే ‘తేకువ’. ఈ పల్లవి మొదటి పాదంలోని ‘అలపైన వేళల’ అనే మాటలో ఉన్న ‘అలపు’ కూడా దైహికమైన (శ్రమ వలన వచ్చిన) అలసట అనే కాకుండా, ఇక వేరే ఏమీ చేయగలిగింది లేదన్న నిస్సహాయత నుంచి, బల హీనత నుంచి మనస్సుకు, చేతనకు కలిగిన అలపును సూచిస్తుంది. ‘అలపైన వేళ’ – ఈ రూపంలో సాహిత్యంలో వేరే ఎక్కడైనా ప్రయోగించబడిందో లేదో నాకు తెలియదు.

ఈ మాటల సంగతి ఒక రకం. సందర్భాన్ని బట్టి కొంత అన్వయించుకుని అర్ధాలను చెప్పుకోవచ్చును. ఈ క్రింది శృంగార కీర్తన పల్లవిలో —

                                “వద్దు నన్ను జెనకకుర వాదేటికి,
                                 చద్ది వేడికి సొలపు జంకెనలు మేలు.”

నాయిక నాయకునితో అంటున్న మాటలివి. ‘వద్దు, నాతో ఆటలాడకు (నన్ను ఏడిపించకు), వాదం దేనికి?’ అని ఈ పల్లవి రెండు పాదాలలోని మొదటి పాదం అర్ధం. ఇక రెండవ పాదంలోని సంగతులు -‘చద్ది వేడి’ కి ‘సొలపు జంకెనలు’ మేలు – ఇందులో ‘చద్ది వేడి’ అనే రెండు మాటల పదానికి సరయిన అర్ధం ఏమిటన్నది చాలా వెదికాను. రెండవ ‘చ’ తో మొదలయ్యే ‘చద్ది’ అనే మాటకు బ్రౌన్ నిఘంటువు ఇచ్చిన అర్ధం మామూలుగా మొన్న మొన్నటిదాకా వ్యవహారంలో ఉన్న చద్దన్నం అనే అర్ధాన్నే! ‘చద్ది వేడి’ అనే మాటకు సంబంధించిన ప్రస్తావనే లేదు. అసలు ఇలాంటి మాటలకు నిఘంటువులలో అర్ధాలను వెదకడం దండుగ. నాయికా నాయకులకు సంబంధించిన శృంగారంలో ఇది నాయిక తెచ్చి పెట్టుకున్న విరహానికి సంబంధించిన పదం.

ఇక్కడ నిజానికి ఎవరు ఎవరిని ఏడిపిస్తున్నారు, ఆటపట్టిస్తున్నారు అన్నది అర్ధం కానట్లుగానే ఉంటూ అర్ధమవుతుంది. (వియోగమనే)శీతలాన్నుంచి కాపాడుకోవడానికి కావాల్సిన వేడికి, సొలపు (సొక్కు, నిస్త్రాణ -languishment), జంకెన (వియోగం వలన కలిగిన భయం, బెదురు) అనేవే సరిపోతాయి, ఇక వేరే ఏమీ అక్కరలేదంటూ  ఇక్కడ నాయిక, ఇక ఈ విషయమై వాదమాడాల్సిన పని లేదూ, మాట్లాడొద్దని కూడా  విన్నవించుకుంటోంది, భక్తితో నిండిన శృంగారపు అలుకతో, విభుడైన శ్రీవేంకటేశ్వరునికి!