సీతాకోకచిలుకలు – Mottled Emigrant butterfly

Catopsilia pyrantheMottled Emigrant butterfly

పేరులో ‘Emigrant’ అన్న పదం ఉన్న సీతాకోకచిలుకలు రెండు ఉన్నాయి – అవి  ఒకటి Common Emigrant, రెండవది Mottled Emigrant. ఈ రెండూ చూడడానికి మామూలు చూపుకు దాదాపుగా ఒకేలా కనబడతాయి. ఈ రెండు సీతాకోకచిలుకల గురించి తెలుసుకుని బాగా పరిశీలనగా చూస్తే గాని, ఈ రెండింటిలో ఏది ఏదో గుర్తించలేం. ఎంతగా జాగ్రత్త పడినా కూడా, ఒక్కొకప్పుడు ఇంకా సందేహంగానే ఉంటుంది; అంతలా మామూలు చూపులకు ఒకేలా ఉంటాయి ఈ రెండు సీతాకోకచిలుకలు!

Catopsilia pyranthe (image-1)

తెల్లని రెక్కలపై, పరిశీలనగా చూస్తే తప్ప, కనుపించీ కనుపించకుండా పారదర్శకంగా అన్నట్లుగా ఉండే మచ్చలతో ఈ Mottled Emigrant సీతాకోకచిలుక చాలా వేగంగా ఎగురుతూ ఎక్కువగానే కనపడుతుంది. మే, జూన్, జులై నెలలలో అయితే మరీ ఎక్కువగా కనపడింది నా అనుభవంలో. పరిమాణంలో మధ్యస్తంగా ఉండే ఈ సీతాకోకచిలుక తెల్లగా ఉండడం వలన చెట్ల మధ్య, పూల మొక్కల మధ్య ఎగురుతున్నపుడు చాలా సులభంగా దృష్టిలో పడుతుంది. Pieridae కుటుంబానికి చెందిన ఈ సీతాకోకచిలుక శాస్త్రీయ వర్గీకరణ (Scientific classification) ఇలా ఉంటుంది – Kingdom: Animalia, Phylum: Arthropoda, Class: Insecta, Order: Lepidoptera, Family: Pieridae, Genus: Catopsilia, Species: Catopsilia pyranthe.

Catopsilia pyranthe (image-2)

Catopsilia సీతాకోకచిలుకలు ఆరు రకాలలో, రెండు రకాలు – pomona, pyranthe – అని పేర్లున్నవి భారతదేశం, శ్రీ లంక, మలేశియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలలో విరివిగా కనిపిస్తాయి. ఈ సీతాకోకచిలుకలకు అలా అలా ఎగురుకుంటూ అలవోకగా దూర దూరాలకు వెళ్ళడమనే లక్షణం ఉండడం  వలన వీటి పేరులో ’emigrant’ అనే మాట చేరింది. ఈ లక్షణం వలననే ఈ రకం సీతాకోకచిలుకలు చాలా రకాల చెట్ల మీదా, పొదలమీదా, తడి ప్రదేశాలలోనూ దర్శనమిస్తాయి. గుంపులుగా వెళ్ళి  mud puddling చేస్తాయి. ఈ సీతాకోకచిలుక ఫోటోలు కూడా నేను బెంగళూరు లోని లాల్ బాగ్ బొటానికల్స్ గార్డన్స్ లో తీసినవే.

Catopsilia pyranthe (image-3)