తెలుగు మాట – (1)

శతాబ్దాలుగా తెలుగు భాష వుంది. హాలుని గాథా సప్తశతి కాలానికే,  అంటే క్రీస్తు శకారంభ కాలం నుండే తెలుగు భాషలోని కొన్ని పదాలు ప్రాకృతంలోకి వెళ్ళ గలిగేంతటి స్పష్టమైన, బలమైన వాడుక భాషగా తెలుగు ఎదిగిందని క్రీ.శే. తిరుమల రామచంద్ర గారు తమ ‘గాథాసప్తశతిలో తెలుగు పదాలు’ అనే వ్యాసంలో (భారతి  మే, 1948) నిరూపించారు. క్రీ.శ.1 వ శతాబ్దానికే అలా వున్న భాషలో  క్రీ.శ. 11 వ శతాబ్ది దాక లిఖిత సాహిత్యం లేదు. అంటే దాదాపు ఒక సహస్రాబ్ద కాలం పాటు అంత బలంగా వాడుకలో వుండి, వేరే భాషల మీద కూడా ప్రాభావాన్ని చూపగలిగే స్థాయిలో వున్న తెలుగులో లిఖిత సాహిత్యం ఎందుకు రాలేదో అంత సులభంగా అర్ధం కాదు.

అదలా వుంచితే, క్రీ.శ. 18వ శతాబ్దం వాడనుకుంటూన్న అయ్యలరాజు నారాయణామాత్యుని ‘హంసవింశతి ‘ లో వాడిన కొన్ని తెలుగు పదాలకు అర్ధం గురించి మాట్లాడుతూ C.P. బ్రౌన్ గారు’ హంసవింశతి’ లోని పలుకుబళ్ళు కొన్ని అప్పటికే (అంటే క్రీ.శ.1820 ల  ప్రాంతానికే – బ్రౌను దొర కడపలో వుండిన సంవత్సరాలు) ప్రచారంలో లేవనీ, కాబట్టి తమ నిఘంటువులో కొన్నిటికి అర్ధం తెలియలేదనీ వ్రాశారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు క్రీ.శ. 18 వ శతాబ్దం ఉత్తరార్ధంలో వాడని అనుకుంటున్నారు గనుక, ఈ మాయమవడం అనేది అంతా 50-60 ఏళ్ళ మధ్య కాలంలోనే జరిగిందంటే ఆశ్చర్యమూ, తెలుగు భాషకు ఇది ఒక దురదృష్టకరమైన పార్శ్వమూ అనుకోవాల్సి వుంటుంది.

అలాగా, మనకు (వాడుకలో) వున్న మాటల కంటే, (వాడుకలో లేకుండా) పోయిన మాటలు శతాబ్దాలు గడిచేకొలదీ ఎక్కువవుతూ వచ్చాయి  అనిపిస్తుంది. ఆ వంతున, క్రీస్తు శకారంభ కాలం నుంచి ఇప్పటి దాకా తీసుకుంటే, ఈ రెండువేల సంవత్సరాల కాలంలో ఎన్నెన్ని మాటలు వాడుకలోంచి జారిపోయాయో లెక్కకట్టుకుంటే, ఏ కారణాల వల్లనైతే నేమి మనం వదిలేసుకుంటూ వచ్చిన పదజాలం (vocabulary) దాదాపుగా ఒక 30 శాతం దాకా వుంటుందేమో అని నా కనిపిస్తుం టుంది. ఇది ఉజ్జాయింపుగా నేను అంటున్న మాట. ఎక్కువో తక్కువో భాషలో అధికారికమైన  జ్ఞానం కలవాళ్ళు చెప్పాలి.

పెద్దలు చెప్పినట్లు, ఒక భాషలో ఏ మాటయినా మొదట శబ్దం, తరువాత అర్ధం, ఆ తరువాత రసము, అలంకారము, చందస్సు ఇంకా వ్యాకరణం. భాషలో మాటలకు సంబంధించి ఈ అన్ని అంశాల సమగ్ర జ్ఞానం కలిగి వుండడం ఆ భాషకు సంబంధించి పరిపూర్ణ జ్ఞానం కలిగి వుండడం అవుతుంది.

భాషలోని మాటలకు సంబంధించి ఈ అన్ని అంశాలపై ఒక మేరకు జ్ఞానాన్ని కలిగింపజేసేవి నిఘంటువులు. చాలా కాలం దాకా తెలుగులో మనకు మూడు ముఖ్యమైన నిఘంటువులు వున్నాయి. వాటిలో మొదటిది బ్రౌన్ నిఘంటువు. రెండవది శబ్దరత్నాకరం. మూడవది శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు. ఇప్పుడు మాండలిక పదకోశాల నిర్మాణం జరిగాక ఆయా ప్రాంతాలకు సంబంధించిన పదజాలాన్ని చేర్చుకున్న నిఘంటువులు కొన్ని వచ్చి చేరాయి. అయితే, మొత్తం భాషకు సంబంధించి వాడుకలో అర్ధానికిగాని, సాహిత్య పరంగా గానీ ఇప్పటికీ బ్రౌను నిఘంటువుది ప్రత్యేకమైన స్థానం అని ఒప్పుకోవాలి.

పాటను సాహిత్యంగా గుర్తించి తమిళులు పురాతన సాహిత్యం కలవాళ్ళయితే, అది చేయక మనం లేని వాళ్ళమయ్యాం అని ఒకచోట కీ.శే. ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి సంపుటం లో) అన్నారు. అలా, అన్నమయ్యను గురించి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంవారు 1920-30 లలో శ్రీ వేంకటేశ్వర దేవాలయంలోని స్వామివారి హుండీ గుమ్మానికి పక్కగా వున్న దక్షిణపు ఆవరణలోని  అన్నమాచార్యుల సంకీర్తన భాడారంలోని రాగిరేకులను పైకి తీయించి, వాటిలోని సంకీర్తనలను కీ.శే.లు వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గార్ల సహాయంతో పరిష్కరించి అనేక సంపుటాలుగా వేయించిన దాకా మనకు తెలీదు. వేల వేల సంకీర్తనలలోని అప్పటి భాషను, నుడికారాన్ని చేలా తేలికగా మనకు సంబంధం లేనివన్నట్లుగా వదిలేశాం, మర్చిపోయాం!

ఆ తరువాతి కాలంలో శ్రీమతి రామలక్ష్మి ఆరుద్ర గారి సంపాదకత్వంలో ‘తాళ్ళపాకవారి పలుకుబళ్ళు’ అని ఒక ఐదారు వందల పేజీల గ్రంథం ,’అన్నమయ్య పదకోశం‘ అని శ్రీ రవ్వా శ్రీహరి గారి ఇంకో ఆరేడువందల పేజీల నిఘంటువు  అవసరమయ్యాయి (ఇప్పటికి నాకు తెలిసినంత వరకు) అన్నమయ్య వాడిన తెలుగుభాషలోని ఆ కాలపు (క్రీ.శ.15 వ శతాబ్దం) నుడికారాన్ని ఇప్పుడు సవివరంగా అర్ధం చేసుకోవడానికి అంటే అప్పుడు వాడుకలో వుండిన ఎంత భాష (vocabulary) ఇప్పుడు లేకుండా పోయిందో అర్ధమవుతుంది గదా!

అదలా వుండగా, ఇప్పటికీ అన్నమయ్య పదాలలోని మాటలకు అర్ధాలను చెప్పుకోవడంలోనూ, భావాన్ని అన్వయించుకోవడంలోనూ పూర్తి స్పష్టత లేని సందర్భాలు ఇంకా వున్నాయనే నాకు అనిపిస్తుంది. ఉదాహరణకి ఈ సంకీర్తన పల్లవి లో:

“అయ్యో పోయెం బ్రాయము కాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి…”

‘ముయ్యంచు’ అనే మాట.ఈ మాటకు అర్ధం శ్రీ రవ్వా శ్రీహరి గారి ‘అన్నమయ్య నిఘంటువు’ లో ‘ధర్మార్ధ కామములనే మూడు అంచులు గల మనసు’ అని సూచించబడింది.

మూడు + ఏరు = ముయ్యేరు (గంగా నది) అయినట్లుగా, మూడు + అంచు = ముయ్యంచు అయింది. అంత దాకా బాగానే వుంది. అయితే ఇందులోని అంచులు ఏవి అనే దగ్గరే అసలు సంగతంతా వుంది. ధర్మార్ధ కామములని మూడు అంచులు అని అనుకుంటే, మోక్షమనే నాలుగో అంచు కూడా ఉండాలి గదా, అది ఎందుకు అన్నమయ్యచేత వదలబడింది అని సందేహం కలుగుతుంది.  అసలుకు ఈ ధర్మార్ధ కామ మోక్షములనేవి మనసుకు అంచులు అవుతాయా? ‘అంచు’ అనే మాట అక్కడ సందర్భాన్ని బట్టి నిందార్ధంలో కదా వాడబడింది?  ఆ అర్ధంలో ధర్మార్థకామములను మనసుకు ఆపాదించటం సాధ్యమవుతుందా? ఒక వేళ సాధ్యమవుతుం దనుకున్నా, నాలుగో దయిన  మొక్షాన్ని కలుపుకుని కదా చెప్పుకోవాలి? అదెందుకు ఇక్కడ వదిలివేయబడింది? ఇలాంటి సందేహాలు రాక మానవు. అందువలన ఈ ‘ముయ్యంచు‘ అనే మాటలోని మూడు అంచులు ధర్మార్ధ కామములను సూచించవని నా అనుమానం.

మరయితే, ఈ మాటకు ఇక్కడ పొసిగే అర్ధం ఏమై ఉండాలి? అనుకున్నపుడు, ఇందులో అన్నమయ్య ఉద్దేశించింది  ధర్మార్ధ కామములనేవి కాక, కామ క్రోధ లోభములనే  మూడు ముఖ్యమైన అవలక్షణాలనీ…అలా  ‘కత్తులవంటి ఈ మూడు అవలక్షణాలు నిండి వున్న మనసుతో లోకాన్ని చూస్తూ, ప్రవర్తిస్తూ ఇన్నాళ్ళుగా నేను మొహమతినై వున్నానే’ అని అన్నమయ్య ఇందులో మొఱపెట్టుకున్నది అని నాకు తోస్తుంది.

ఇప్పుడు ఈ సంకీర్తన పూర్తి పాఠం ఒకసారి చదువుకుంటే –

“అయ్యో పోయెం బ్రాయము కాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి…

చుట్టంబులా తనకు సుతులు, కాంతలు చెలులు
వట్టియాసం బెట్టువారే కాక
నెట్టుకొని వీరు కడు నిజమనుచు హరినాత్మ
బెట్టనేరక వృథా పిరివీకులైతి…. అయ్యో….

తగు బంధులా తనకు తల్లులును తండ్రులును
నగలబెట్టుచు తిరుగువారేగాని
మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ
తగిలించలేక చింతాపరుడనైతి….అయ్యో…”

ఇందులో మిగతా భాగం, అంటే చరణాలున్న భాగం గురించి మరొక పోస్టులో.

ఇక్కడ ఒక మాట. పెద్దలు, శ్రీ రవ్వా శ్రీహరి గారు సూచించిన అర్ధంతో ఇందులో విబేధించడమన్నది నా తెలివితేటలు ప్రదర్శించికోవడానికి ఎంతమాత్రం కాదు. ఈ సాహిత్య సంబంధ విషయాలలో వారికి వున్న ప్రజ్ఞలో నాకు సహస్రాంశం కూడా లేదు. ఇది కేవలం సరయిన అర్ధం అన్వయం కోసం చేసిన ప్రయత్నమే తప్ప వేరు కాదు. ఈ రాతలో ఎక్కడయినా వాడకూడని మాట వాడినట్లుగా అనిపిస్తే, అది తెలియక జరిగినదిగా పెద్దలు, పెద్దమనసుతో మన్నిస్తారని ఆశిస్తాను.