పయనం…ఎటుపడితే అటు!

payanam

పయనం – this has become the theme of my life for the last 10-15 years అనిపిస్తుంది నాకు… తిరిగి తిరిగి వేసారిపోయి, ఇక చాల్రా బాబూ అని మనసులో ఎన్ని సార్లు అనుకున్నా గానీ ప్రయోజనం లేకుండా పోయి, మళ్ళీ మళ్ళీ ఒంటికి (కనుపించనివే!) రెక్కలు తగిలించుకుని ఎప్పటి కప్పుడుగా సర్దిచెప్పుకుని ప్రయాణమవ్వాల్సివచ్చినప్పుడల్లా….

శరీరంలో కదలిక- movement- కి సంబంధించిన స్పృహ అసలంటూ లేకుండా వుంటే ఎలావుంటుందో ఊహించుకోవడానికి కూడా రాకుండా వుండేంతగా మారిపోయింది గదా స్థితి…

ఫోటోని చూసిన మిత్రుడొకడు ‘ఎక్కడికో’  అని tag-line పెడితే బాగుంటుంది కదా! అన్నాడు…అప్పటికి అతని స్థితికి సరిపోయే విధంగా – అప్పుడుంటున్న చోటి నుంచి ఇష్టం లేని చోటికి బదిలీ అవగా, తనకి అనుకూలమైన మరోచోటికి బదిలీ కోసంగా పెట్టుకున్న అర్జీ – application – కి జవాబు ఇంకా రాని సందిగ్ధ స్థితిలో, ఇంకా waiting లో ఉన్న అవస్థలో, తను వున్న పరిస్థితికి అనుగుణంగా…

అలాగయితే, నేనన్నానూ…‘ ఎటుపడితే అటు’   అని…నా స్థితికి అనుగుణంగా…గడచిన (గడుస్తున్న) పదీపదిహేనేళ్ళలో నేను వెళ్ళిన, వెళ్ళాల్సొచ్చిన….ఇక ఇక్కడితో నన్నా ముగుస్తాయనుకుని ఎంతగానో ఆశపడినా ముగియక… ఇంకా వెళుతూనే వున్న ప్రదేశాలను తలుచుకునీ, మరొసారి గుర్తుచేసుకునీను.

బాబూ…ఇది అనంతం! ఇష్టమున్నా లేకపోయినా, కూటికోసంగా సాగే ఈ పయనం ఆగదు గదా…పశుపక్ష్యాదులకయినా, మనుషులకయినా!

వాస్కో మరియు గోవా నుండి-1

majorda_1‘చిన్న తనం’ (smallness) బాగుంటుంది, చూడడానికి!
అనంత జలరాశి పక్కన నిలబడితే ఏదైనా సరే చిన్నదే అయిపోతుంది.
అంత సూర్యుడు కూడా వొదిగివొదిగి ఉదయిస్తున్నట్లుగా కనబడతాడు గదా మరి చూపులకి.
సాయం సంధ్య వెలుగులలో ఈ చిన్న పక్షి…ఆహారాన్వేషణలో
ఆ రోజుకి ఇంకొద్ది సమయంలో ముగియబోయే క్షణాలలో ఇంకా ఏదయినా దొరుకుతుందని చూస్తూ…

(మజోర్డా బీచ్, గోవా నుండి)

ఓటమిలోనూ నేను నేనే!

thrown out...

రెక్కలు తెగి పడినా, చిక్కి శల్యమైనా, సగమై మిగిలినా…నేను నేనే!
ఇక్కడ, నా అతి చిన్నదైన ఏమీ లేనితనంతో
ఈ అనంతమైన ఖాళీని నింపగలిగానన్న ఆనందంలో నేనున్నానంటే
ఏ అభ్యంతరమూ వుండకూడదు.
ఒకప్పుడు, ఇక్కడే , నేను ఏదో ఒక అధ్బుతాన్ని తయారుచేసి
లోకానికి కానుకగా ఇవ్వాలన్న తపనతో తిరుగాడానన్న తీపి జ్ఞాపకం ఒకటి
నన్నెప్పుడూ అంటిపెట్టుకుని ఉంటూనే ఉంటుంది.
సాధించలేకపోయిన విజయమూ ఒక్కొకప్పుడు ఊపిరే!
తిరిగి పొందలేని కాలమని అన్నా, యవ్వనమన్నా, జీవితమన్నా….ఏదని అన్నా,
అది నాకు ఈ వోటమిని తయారుచేసి ఇచ్చిన ఒక సొంపైన సన్నివేశాల సముదాయంగా కనుపించీ, అనిపించీ…
ఎప్పటికప్పుడు నా పెదాలమీద ఒక చిరునవ్వును చిలికించి నన్ను విస్మయపరుస్తూనే వుంటుంది.
చివరిదాకా ఓడిపోయి మిగలడమూ ఒక అనుభవమే!
ఎదురుగా ఎన్నెన్నో విజయాలతో నిండి వున్న ఈ అంతులేని అగాధాన్ని
ఏకాంతంలో చూస్తూ నేను పొందే తన్మయం నాకు ఏ విజయం సాధించి ఇవ్వగలదు?
గమ్యం దానికది తెలియకుండానే ఒక చిరునామా!
ఎంత నడిచినా ఎక్కడికీ చేరని దారికి
అడుగులను అనంతంగా మోస్తూండడమే ఒక తెలుసుకున్న జ్ఞానం అయినట్లుగా
ఓటమి ఒక పాట అవవలసినప్పుడు
అందులోని ప్రతి పదంలో పొందికగా
నేను నేనే!