క్రీడాభిరామము – (3)

kaakatiiya_3

వస్తు నిర్దేశం – ప్రేక్షకులు చూడబోయే సంగతులను సూచనప్రాయంగా తెలియజేసే పద్యం. తెరవెనుకనుంచి వినిపిస్తుంది.

కామమంజరి అనే పెరున్న వేశ్య, ఏదో కారణాన దేశాంతరగతుడైన తన ప్రియుడు, ‘క్రీడాభిరామం’ లో కథానాయకుడు అయిన కాసల్నాటి గోవింద మంచనశర్మను ఉద్దేశించి రాసి పంపిన ప్రేమలేఖను అతని స్నేహితుడయిన టిట్టిభ సెట్టి చదివి వినిపిస్తుండడంతో, అత్యంత రమణీయంగానూ, వ్యంగ్య వైభవంగానూ ఇందులో కథావస్తు నిర్దేశం చేయబడింది. రెండు పద్యాలు ఇవి. మొదటి పద్యం భావం –

“రసజ్ఞ శేఖరా, మధుపా! విరిసిన అరవిందాలున్న ఈ వనవాటికను (రంగురంగుల పూవులున్న, రమణీయమైన వన ప్రదేశాన్ని) విదిలి పెట్టి, చెట్టులంటా పుట్టలంటా (ఆ తిరుగుడులేమిటి?) అడవులలో పడి ఏం దొరికించుకుందామని భ్రమతో తిరుగుతున్నావు? నీ వివేకమంతా ఏమయిపోయింది? పాతబడిపోయిందా…అంటే నశించిపోయిందా?” అని మొదటి పద్యం.

గతి రసికుండ! షట్చరణ! గానకళాకమనీయ! యో మధు
వ్రత! విక చారవింద వనవాటిక నేమిటికిం బరిత్యజిం
చితి వటవీ ప్రదేశమునఁ జెట్టులఁ జేమలఁ నేమి గల్గునన్
రతి నిటు సంచరించెదవు ప్రాఁబడిపోయెనె నీ వివేకమున్?

Six-footed flyer! Sweet-tongued singer! Oh honey bee!
Why did you discard this place of flowers in full bloom?
And with what expectations do you roam among the
Forest shrubs and trees? Have you lost all your prudence?

క్రీడాభిరామము – (2)

kaakatiiya_2

మహాకవి శ్రీనాథుడు, వల్లభరాయుడు సమకాలీకులని పండితుల అభిప్రాయం. పద్యనిర్మాణంలో శ్రీనాథుడు అనుసరించిన పధ్ధతినే ‘క్రీడాభిరామం’ లో వల్లభరాయుడు చాలా చోట్ల అనుకరించాడు. శ్రీనాథుని అలంకారికమైన, అక్కడక్కడ శృంగారమయమైన, ప్రౌఢమైన పద్యనిర్మాణశైలిని వల్లభరాయుడు బాగా ఇస్టపడ్డాడని ‘క్రీడాభిరామం’ లోని చాలా పద్యాలు చెప్పకనే చెబుతాయి.

రచించబడిన తరువాత కొంతకాలానికి మరుగునపడిపోయి, ఆ తరువాతి కాలగర్భంలో కలిసిపోయి దాదాపుగా అయిదువందల సంవత్సరాలు కనుమరుగైపోయింది ‘క్రీడాభిరామం’. ఈ కావ్యాన్ని గుర్తించి, ఆ స్థితినుంచి వెలుపలికి తీసి మళ్ళీ వెలుగులోకి తెచ్చిన వారు బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు. తెలుగుసాహిత్యం మీద మక్కువ, శ్రధ్ధ వున్న వ్యక్తులేవరైనా సరే ఈయన పేరును ఎన్ని సార్లు స్మరించుకుంటే అంత మంచిది. తెలుగులో ‘క్రీడాభిరామం’ కావ్యాన్నే కాక, నన్నెచోడుని ‘కుమారసంభవం’, త్రిపురాంతకుని ‘త్రిపురాంతకోదాహరణం’, బద్దెన ‘నీతిసారముక్తావళి ‘ మొదలైన తెలుగు కావ్యాలను వెలికితీసి ప్రకటించిన వారాయన. తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయంలో క్రీ.శ.1856 లో తిరగరాయబడ్డ ‘క్రీడాభిరామ’ పు తాళపత్ర ప్రతిని గుర్తించి, ప్రాచీనమైన ఆ ప్రతిలోని గ్రంథపాతాలను సంస్కరించి, పరిస్కరించి, అందులోంచి మరొక వ్రాతప్రతిని తయారుచేసుకుని 1909లో ప్రకటించారాయన.

‘క్రీడాభిరామం’ కావ్యం వెలుగులోకి రావడం వలన జరిగిన అతి ముఖ్యమైన సంగతులలో ఒకటి – ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనే విషయ ప్రకటనం చేసింది శ్రీకృష్ణదేవరాయలు కాదని, అది వల్లభరాయుడనీ, ఆ కీర్తి నిజానికి వల్లభరాయునికి దక్కాలనీ!

‘క్రీడాభిరామం’ పద్యంలో వల్లభరాయుడు చేసిన original idea ని తీసుకుని ఇంకొన్ని మెరుగులు దిద్ది మరింత relevant గా వేరే పద్యాన్ని కృష్ణదేవరాయలు అందించాడు తన ‘ఆముక్తమాల్యద’ లో!

“జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశభాషలందుఁ దెనుఁగు లెస్స
జగతిఁ దల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చుటాఁడుబిడ్డ మేలుగాదె.”

Mother is Sanskrit for all the languages that now exist
Amongst the languages of the land Telugu is the best;
Isn’t the sister-in-law who wishes for well being and wealth
In fact more comforting for a woman than her own mother!

క్రీడాభిరామము -(1)

kaakatiiya_1

తెలుగులో ‘క్రీడాభిరామం’ ఒక విలక్షణమైన కావ్యం. భారతీయ సంప్రదాయంలో దశరూపకాలలో ఒకటైన ‘వీధి’ నాటక పధ్ధతిలో ఈ కావ్యం వ్రాయబడింది. ఈ కావ్యానికి కర్త వినుకొండ వల్లభరాయడు. అయితే, ఇందులోని ప్రతి పద్యంలో కనిపించే శ్రీనాథుని తరహా పద్యనిర్మాణం, భాష, శృంగార పదజాలం ఈ కావ్యం అసలుకి శ్రీనాథుని చేతనే రచించబడి ఏ కారణం చేతనో వల్లభరాయని పేర ప్రచారంపొందిందని ఒక అభిప్రాయం సాహిత్య లోకంలో ప్రబలంగా ఉండింది. ఒకవైపు పెద్దలలో ఆ అభిప్రాయం అలా ఉన్నప్పటికీ, క్రీడాభిరామం కర్తృత్వం వల్లభరాయనికే ఆపాదించబడి ఇప్పటికీ పదిలంగానే వుంది.

తెలుగులోని పద్యకావ్యాలలో నిజానికి ‘క్రీడాభిరామం’ ఉన్నంత దగ్గరగా మరే కావ్యం ఉండదనే మాట అంత నిజం. సంస్కృతంలో రావిపాటి త్రిపురాంతకునిచే రచించబడిన ‘ప్రేమాభిరామం’ అనే కావ్యాన్ని అనుకరిస్తూ ‘క్రీడాభిరామం’ రచించబడిందని వల్లభరాయడే చెప్పిన మాట. అయితే, ‘ప్రేమాబిరామం’ ఇప్పటికీ లభించనిది కాబట్టి. ఈ అనుకరణ ఎలాంటిదనేది ఇప్పటికీ అస్పష్టమే!

వినుకొండ వల్లభరాయని తండ్రి తిప్పయామాత్యుడు విజయనగర ప్రభువైన రెండవ హరిహరరాయల కొలువులో రాజోద్యోగి అనే అధారాన్ని బట్టి ‘క్రీడాభిరామం’ బహుశా 15వ శతాబ్ది ప్రధమార్ధంలో రచించబడి వుండవచ్చని తేల్చారు. ‘క్రీడాభిరామం’ ఏకాశ్వాస ప్రబంధం. మొత్తం 245 పద్యగద్యలతో చంపూ పధ్ధతిలో చేయబడిన రచన. కాకతీయుల ఓరుగల్లు నగరం, కోట, అందులో ప్రజల వేషభాషలూ, ఆహారాలూ, అలవాట్లూ ఇందులో వర్ణించబడ్డాయి. అయితే, ఇందులో అక్కడక్కడా వర్ణనలలో చోటుచేసుకున్న సభ్యంకాని పదజాలం, వర్ణనా విధానం కారణంగా ఈ మొత్తం రచన చెడ్డదిగానూ, మామూలు పాఠకులకు పఠనయోగ్యమైనది కానిదిగానూ నిర్ధారించబడింది.

సభ్యంకాని, అభ్యంతరకరమయిన వర్ణనలు వున్న భాగాలను మినహాయిస్తే, ‘క్రీడాభిరామం’ నిస్సందేహంగా ఒక విలక్షణమైన రచన. ఆ కాలపు ఏ కవీ ఊహించని కథా వస్తువుతో ఒక కాల శకలాన్ని – కాకతీయుల పరిపాలనా కాలంలోని ఒక రోజును – వాస్తవానికి ఏవిధంగానూ అతీతంగా అనిపించనట్లుండే పాత్రల ద్వారా అక్షరభధ్ధంచేసి చూపించిన రచన. కథానాయకులనదగిన గోవింద మంచనశర్మ, అతని అనుచరుడు (financier) అనదగిన టిట్టిభశెట్టి…వీరిరువురు నడిచే మార్గంలోనే పాఠకుడినిగూడా మానసికంగా నడిపించగలిగేంత ప్రతిభావంతమయిన రచనావిధానంతో ముందుకు సాగుతుంది ఈ రచన. ఆకారణంగా, ఈ కావ్య సౌందర్యమంతా ఈ కావ్యంలోని ప్రతి పద్యంలో, గద్యలో అక్షరాలతో చిత్రించి చూపించిన ఆనాటి కాకతీయ జనజీవనం వుండి పాఠకుని మనోనేత్రాలకు కనబడుతుంది.

కాలగమనంలో మరుగునపడిపోయిన ఈ రచన, మళ్ళీ 1909లో బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారి పుణ్యమాని, వారే ప్రచురించిన ‘విస్మ్రుతకవులు’ శీర్షిక పరంపరలో భాగంగా వెలుగు చూసింది. ఆ తరువాత, బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారి విపులమైన పీఠికతోనూ, వారి కొన్ని సవరణలతోనూ 1928లో ముద్రించబడింది. ఆ తరువాతి కాలంలో ఎమెస్కో వారు వారి ‘సంప్రదాయ సాహితి – 20’ గా స్వర్గీయ బి.వి. సింగరాచార్యగారి ‘సమాలోకనం’ తో 1972లో ప్రచురించారు. ఇవి నాకు తెలిసిన ప్రతులు, చివరి రెండూ నాకు అందుబాటులో వున్నవి. ఇవి కాకుండా స్వర్గీయ బండారు తమ్మయ్య గారి సంపాదకత్వంలో వావిళ్ళవారు ప్రచురించిన ప్రతి 1960నాటిది, శ్రీ బి.ఎన్. శాస్త్రి గారి పీఠికతో నవోదయ సమితి, హైదరాబాదు వారు ప్రచురించినది 1968 నాటిది కూడా వున్నాయి.

ఇందులో అసభ్యత అంటూ ఏమాత్రమూ లేని పద్యాలను సాధ్యమయినంత అందంగా అలంకరించడము, వీలయినంత సౌందర్యవంతంగా భావం చెడకుండా ఆంగ్లంలోకి అనువదించడమూ అనేవి ఈ రచనను ఇంకాస్త glorify చేసే దిశగా నా మనసుకు తోచిన, నేను చాలా కాలంగా అనుకుంటున్న సంగతులు. వరంగల్లులో ఇప్పటి కోట శిథిలాలలో నేను తీసిన ఫోటోలపై, ఇందులో అతి ముఖ్యమైనవిగా అనిపించిన పద్యాలను వుంచి Photo Cards గా చేసి, ఒక abridged edition గా అవసరమైన notes తోనూ ఆంగ్లంలోనికి అనువాదంతోనూ ఈ పోస్టుల పరంపర సాగుతుంది.

***                                                            ***

“గణన కెక్కిన దశరూపకములయందు
వివిధ రసభావభావన వీథి లెస్స
యే కవీంద్రుఁడు రచియించె నీ ప్రభంధ
మనుచు మీ రానతిచ్చెద రైన వినుఁడు.”

‘క్రీడాభిరామం’ కృత్యవతరణ పద్యం ఇది.

రూపకం అంటే దృశ్య కావ్యం అని అర్ధం. బారతీయ సంప్రదాయంలో దశరూపకాలు ఇవి:
1. నాటకము, 2. ప్రకరణము, 3. బాణము, 4. ప్రహసనము, 5. డిమము, 6. వ్యాయోగము, 7. సమవాకారము, 8. వీధి, 9. అంకము, 10. ఈహామృగము.

ఈ పదింటిలో ఎనిమిదవది వీధి. అయితే, ‘వీధి’  నాటక పధ్ధతి ఎంతగా జనాదరణ పొందిందో వేరే చెప్పనక్కరలేదు. వినోదానికైనా, ఒక సందేశాన్ని జనం మనసులలోకి పంపించాలన్నా ఆధునికంగానూ ఈ పధ్ధతినే ఆశ్రయించడం ఇప్పటికీ చూస్తుంటాం.

 Among the much acclaimed ten methods of drama,
Method ‘Street’ capable of exhibiting various emotions
Is without doubt the best, if you order me to reveal
Which great poet authored this Prabandhathen listen.

‘యేమని పలికెనో యేమియు నెఱుగ…’

అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యుడు. ఈయన కుడా సంకీర్తనా చార్యుడే. తండ్రిగారి కున్నంత లలితమైన హృదయం ఇతనిదీని. ఫలితంగా అన్నిటా తండ్రి అంతటి ప్రజ్ఞావంతుడే అనిపించుకున్నాడు ఈయన కూడా! సంకీర్తనలే కాకుండా వచనమాలిక, దండకం, శతకం లాంటి ఇతర ప్రక్రియలలో కూడా రచనలు  చేశాడు.

ఈయనది శృంగార సంకీర్తనలలో ఒకటి భావకవిత్వాన్ని పోలినది వుంది. స్నిగ్ధత్వం, అమాయకత్వం నిండి వున్న ఒక స్త్రీ హృదయపు ప్రేమ రాగ రంజితమైన అంతరంగాన్ని సామాన్యమైన మాటలతో సూటిగా తెలియజెబుతుంది ఈ పదం. సాంప్రదాయికమైన నాయికలలో ఈమె ‘ముగ్ధ ‘ అని పేర్కొనబడుతుంది.

Mugdha
“మచ్చి కెఱుగుదు గాని మనసెఱుగ, నిన్ను
మెచ్చు టెఱుగుదు గాని మీదేమి నెఱుగా …      /పల్లవి/

కామించి పతిరూపే కనుటెరుగుదు గాని
ఆ మీదటి పనులవి యెఱుగా
నా మో మతడు చూచి నవ్వుటెఱుగుదుగాని
యేమని పలికెనో యేమియు నెఱుగ…”       /చరణం/

ఇందులో భాష పరంగా అర్ధంకాక పోవడానికి ఒక్క కఠినమైన పదం కూడా లేదు. అన్ని సామాన్యంగా వింటూండే పదాలే! అయితే భావం పరంగా విడమరిచి చెప్పాలంటేనే కష్టం. అర్ధమయిన వాళ్ళకి ‘ఆహా ఎంత బాగా చెప్పాడు!’ అనిపిస్తుంది. అర్ధంకాని వాళ్ళకి .. ఆ ఏముంది ఇందులో? అనిపించినా అనిపించవచ్చు….చెప్పలేం!

అందువలన, తెలుగులో మళ్ళీ ఈ పంక్తుల భావాన్ని మళ్ళీ రాయడం అనవసరం . కనుక, ఆంగ్లంలోకి తర్జుమా చేసి చూద్దామనిపించింది.  దాని ఫలితమే ఈ క్రింది స్వేచ్చానువాదం అన్నా, భావానువాదం అన్నా…ఏదని అన్నాను!

“I feel the intimacy
But I don’t understand His mind
I like to praise Him always
More than that I don’t know anything…

With longing in heart I know how to visualise Him
But I don’t know the deeds that shoud follow
I feel the pleasure when he looks at my face and smile
But then, I don’t remember a word of what all he spoke!”

పై పదంలోని భాషనూ, భావాన్ని, పెదతిరుమలయ్య ఆశించిన, ఉద్దేశించిన దానితో పొలిస్తే, ఈ ఆంగ్లానువాదంలో చెడగొట్టలేదని మాత్రం అనుకుంటాను!

అజీతా స్స్యామ శరద శ్శతం!

“….బతకడంకోసం బతకడం గొప్పేమీ కాదు. ఇలాంటి బతుకుగురించే, అకర్మణ్యతను గురించే,

“ఉడుముండదె నూరేండ్లును?
  పడియుండదె పేర్మి పాము పదినూరేండ్లున్?
  మడుగున కొక్కెర యుండదె?
  కడు నిల పురుషార్ధపరుడు కావలె…..”

అన్నాడు సుమతి శతకకారుడు. పురుషార్థపరత పూర్ణారోగ్యం లేనిదే సాధ్య పడదు.  కనుకనే మన పూర్వీకులు

“పశ్యేమ శరద శ్శతం
జీవేమ శరద శ్శతం
నందామ శరద శ్శతం
భవామ శరద శ్శతం
ప్రబ్రవామ శరద శ్శతం
అజీతా స్స్యామ శరద శ్శతం!”

ఊరకే ఏదో జీవఛ్ఛవంలాగ బతకడం కాదు; నూరేళ్ళూ చూద్దాం.  నూరేళ్ళూ జీవం తొణికిసలాడుతూ ఉందాం.  నూరేళ్ళూ సంతోషిద్దాం.  నూరేళ్ళూ మోదంతో ఉందాం.  నూరేళ్ళూ ఉందాం.  నూరేళ్ళూ మాట్ల్లాడుతూ ఉందాం.  అన్నిటికన్నా మించి, నూరేళ్ళూ ఒకరికి లొంగకుండా ఉందాం – అని కోరుకున్నారు.

…నూరే ఎందుకు? కృష్ణభగవానుడు 108 సంవత్సరాలు జీవించాడని, ఇతరుడనే ఋషికుమారుడు మహీదాసుడు మృత్యువును నిలువుమని 116 సంవత్సరాలు జీవించాడని (మహీదాస ఐతరేయః….సహషొడశం వర్షశత మజీవత్) ఛాందోగ్యం చెప్పినట్టు ….”

ఎప్పటివో  ‘భారతి’ పాత సంచికలో చదివి నోటుచేసుకున్న మాటలు…బాగున్నై అనిపించి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రాసి వుంచడం జరిగిందన్నమాట! ఎందుకు అంటే? మంచి మాటలు గనక, ఎన్ని సార్లు తిరగరాసినా తప్పులేదనీ….ఇలాంటి మాటల్ని కొత్తవాటిని చెప్పగలిగే సామర్ధ్యం ఏలాగూ లేదు గాబట్టి, కనీసం ఆ మాటల్ని మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుని, మననం చేసుకుందామనీ!

‘Waiting for Godot’ – Samuel Beckett.

‘Waiting for Godot’ – Samuel Beckett.

Waiting for Godot రెండు అంకాల నాటకం, ఒక absurdist play. ఈ నాటకన్ని  Samuel Beckett 1948-49 మధ్యకాలంలో వ్రాశాడు, ఫ్రెంచ్ భాషలో. మొదటగా ఈ నాటకం 1953లో పారిస్ నగరంలో ప్రదర్శితమైంది. 1953లోనే తొలిసారి పుస్తకంగా ప్రచురించబడింది. ఫ్రెంచ్ భాషలోంచి ఈ నాటకాన్ని ఆంగ్లంలోకి తరువాత Samuel Beckett తానే అనువాదం చేశాదు. ఈ నాటకపు శీర్షికలోని Godot అనే పదం ముక్తి ప్రదాతను సూచిస్తుంది. నాటకంలో ఎక్కడా ఈ పాత్ర కనపడదు. అయినప్పటికీ, ఈ నాటకంలోని ప్రధాన పాత్రలైన Vladimir, Estragon అనే వ్యక్తులు, ఉన్నాడో లేడో తెలియని, వస్తాడో రాడో తెలియని ఈ ముక్తి ప్రదాత రాకకోసం వేచి వుండడమే Wait for Godot! అప్పటిలొ ప్రముఖ సాహిత్య విమర్శకులందరిచే గొప్ప నాటకంగా కొనియాడబడింది. ఇప్పటికీ ఆంగ్ల సాహిత్యంలో 20వ శతాబ్దంలోని అతిముఖ్య నాటకాలలో ఈ నాటకం ఒకటిగా మన్ననలను అందుకుంటోంది. ప్రముఖుల విమర్శలలో ఈ నాటకం ఒక tragicomedy గా చెప్పబడింది. tragicomedy అంటే, సుఖవిషాదాంతమో…విషాదసుఖాంతమో…లేకపోతే మరేదో?!

నాటకం మొదలియిన దగ్గరనుంచి చివరిదాకా Beckett ఒక ప్రశ్నను  వ్యూహాత్మకంగా మన ముందుకు తెస్తూనే ఉంటాడు – చెప్పాల్సిందేమీ లేనపుడు, ఏ అనుభవాలలోంచి చెప్పాలో అవేవీ లేనపుడు, చెప్పడానికి కావలసిన సామర్ధ్యము లేనపుడు, ఎలాగైనా సరే ఏదో ఒకటి చెప్పాలన్న తపన, బలమైన కోరిక ఉన్నపుడు, మన సామాన్య జీవితాల్లోని ప్రతి సందర్భాన్నీ సంఘటనల చుట్టూతా మబ్బులాగానూ, మంచుతెరలాగానూ ఆవరించుకుని వున్న మామూలు తనాన్నుంచి పుట్టే అనాసక్తతను ఛేదించుకుని బయటికి రావడానికి భాష దానికదే ఒక సమర్ధవంతమైన ప్రత్యామ్నాయం కాగలదా? అన్నది ఆ ప్రశ్న.

అలవాటనేది ఒక గొప్ప శవం లాంటిది. ఈ ఆధునిక జీవనపు రోజువారీ పనులలోని రోజువారీ తనం అనేవి గొప్ప నాశనకారులు. వాటి నుంచి ఏమీ పుట్టదు. కనుక, ఎదురుగా అనంతంగా పరుచుకునున్న గంటల, రోజుల, నెలల, సంవత్సరాల కాలాన్ని ఇలా గడుపుతూ అందులోంచి జీవితాన్ని చూడడం అనేది ఎలాగ? అనేది అసలు సమశ్య.
Godot పనీ పాటూ పెద్దగా లేని ఇద్దరు  Estragon, Vladimir అనే ఇద్దరు వ్యక్తులు  కేంద్రంగా నడుస్తుంది.

చేయడానికి పనంటూ ఏమీ లేనపుడు వాళ్ళిద్దరూ చేసే పని అనంతంగా మాట్లాడుకోవడం. ఏం మాట్లాడుకుంటున్నారన్నది కూడా గుర్తుపెట్టుకోకుండా మాట్లాడుకోవడం వాళ్ళు చేస్తుంటారు. వీరిరువురిలో Estragon అనే వ్యక్తి మంచి మంచి పద్యాలను కూడా సంభాషణ మధ్యలో ఉదాహరిస్తూంటాడు. అతని ఉద్దేశంలో అతనొక మంచి కవి. తనకుతానుగా పెంపొందించుకున్న ఒకరకమైన అదృష్టహీన భావానికి తనకు తానొక అత్యుత్తమ ఉదాహరణగా ఊహించుకుంటూ, లోకపు కర్కశత్వానికి, కళాహీన దృష్టికీ బలియై జీవచ్చవంలా మిగిలివున్న ఒక గొప్ప జ్ఞాని (intellectual) తానని అతని భావన వీరి మధ్య సంభాషణ సాధారణంగా ఇలా సాగుతుంటుంది:

Vladimir: నువ్వు ఇప్పటికే మర్చి పోయి ఉండడం అన్నది సంభవమే!
Estragon: నా తత్త్వం అంతే. మర్చి పోవడం అంటూ జరిగితే వెంటనే మర్చి పోతాను; లేకపోతే చచ్చేదాకా మర్చిపోలేను.
….
….

Estragon: నిశ్శబ్దంగా ఉండడ మన్నది మనకు చేతనైన విషయం కాదు గనుక, ఒక పని చేద్దాం. నిశ్శబ్దంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం.
Vladimir: వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు.
Estragon: వాళ్ళు ఒకరికి దగ్గరగా ఒకరు కదులుతున్నారు.
Vladimir: వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు?
Estragon: వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
Vladimir: జీవితాన్ని గడపడం అన్నదొక్కటే వాళ్ళకు చాలదనుకుంటా.
Estragon: తప్పనిసరిగా దాన్ని గురించి చెప్పుకోవాలి కాబోలు.

(ఇది ఆంగ్లం నుంచి తెలుగులోకి మాటకు మాట (word to word) అనువాదం కాదు. ఒకింత స్వేచ్చానువాదం
మాత్రమే!)

ఈ ఆధునిక ప్రపంచపు జీవన విధానంలోని నిరాసక్తతలో , ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుకోవడం అన్న క్రియ చుట్టూ ప్రపంచంలోని రణగొన ధ్వనుల మధ్య ఆ యిద్దరి జీవితాల్లో ఉన్న నిశ్శబ్దాన్ని అంతం చేస్తుంది, మాట్లాడుకున్నంత సేపైనా. ఆ ఏదో ఒకటి మాట్లాడుకోవడమన్నదే, ఆ యిద్దరు వ్యక్తులూ ఎవరికి వాళ్ళు ఒంటరిగా మిగిలినపుడు, చెవులలో మార్మోగి మళ్ళీ మళ్ళీ అటువైపుకు అడుగులను వేయిస్తుంది. కనుక, మాట్లాడుకోవడం, కేవలం మాట్లాడుకోవడం (just talking) అన్నది ఒక అత్యంత ముఖ్యమైన క్రియ!

తన అసలైన రచనా వ్యాసంగం తాను ఈ జీవితానికి అర్ధాన్ని గురించి అలోచనను ఒదులుకున్నపటినుంచీ నిజంగా మొదలైందని ఒక సందర్భంలో Samuel Beckett చెప్పాడట. తాను జవాబు చెప్పడానికి అమితంగా భయపడే ప్రశ్న, సరయిన సమాధానం అన్నది తాను అప్పటివరకూ దొరకబుచ్చుకోలేక పోయినటువంటిదీ అయిన ఒకే ఒక ప్రశ్నగా Beckett దీనిని చెప్పాడు – ‘నేను ఏమి చేస్తున్నాను?’ (What am I doing?).

‘తృప్తి లో ఆనందం ఉందనుకోవడం కంటే, తృప్తి ని గురించిన ఆలోచనను ఒదులుకోవడం  మంచిది’ అనేది సుఖమయ
జీవనానికి Beckett చెప్పిన సామాన్య సూత్రం.

కాలం ….ఒక ఊహేనా?!

కాలం ….ఒక ఊహేనా?!

స్టావ్రోజిన్: …. సర్వ జ్ఞానమూ తెలిసిన స్థితిలో, ఆ దేవకన్య చెప్పిందీ, కాలం అన్న మాటే ఉండదట.
కిరిల్లోవ్: నాకు తెలుసు, అది పూర్తిగా నిజం. అది చాలా స్పష్టంగా, సందేహం లేకుండా చెప్పబడింది. సర్వ మానవాళీ
సర్వం సహా ఆనందాన్ని సంపాదించుకున్న తరువాత, కాలం అనేదే ఉండదు. ఎందుకంటే అప్పుడు దాని అవసరమే లేదు. అది పూర్తిగా నిజం.
స్టావ్రోజిన్: మరి మనం దాన్ని ఎక్కడ పెడదాం?
కిరిల్లోవ్: ఎవరూ దాన్ని ఎక్కడా పెట్టరు. కాలం అనేది ఒక వస్తువు కాదు. అది ఒక ఊహ. మనసులోంచి ఆ ఊహ మాయమై పోతుంది, అంతే!

(దోస్తోవెస్కీ, ‘The possessed’ నుండి.)

***

అవునా? కాలం అనేది కేవలం ఒక ఊహేనా? అయితే, అందరి మనసులలోనూ ఆ ఊహ ఒకే కాలంలో, ఒకేరకంగా ఎలా ఉండగలుగుతోంది? అంటే…మానవ మస్తిష్కానికి కాలాన్ని గురించిన ఊహ ఎవరికి వారు స్వతంత్రంగా ఊహించుకోగలిగే శక్తి అనేది మొదటిలోనే తొలగించి వేయబడిందా? మానవాళికి సర్వం సహా ఎటుచూసినా ప్రపంచం అంతా సంతోష మయమైనప్పుడు కాలం అనే ఊహతో నిజంగానే పనిలేకుండా పోతుందా? కాలం అనే ఊహ లేకుండా చేసుకోవడమే మానవాళి ఎప్పటికైనా, ఎలాగైనా  సాధించాలని తపించి పోతున్న అంతిమ విజయమా?- అంటే అవును అనే సమాధానమే వస్తుందనుకుంటాను! ఎందుకంటే, దానికి నమూనాలుగా ‘అమరుల’ను  మనిషి ముందుగానే సృష్టించి పెట్టుకున్నాడు గనుక; మనిషి వారిలా అవ్వాలని, దైవత్వాన్ని చేరుకోవాలనీ, అందుకోవాలనీ సదా ప్రయత్నిస్తూనే వున్నాడు గనుక!!