ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ -(5)

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి రేడియో ప్రసంగాల సంకలనం.

అయిదవ ప్రసంగం : కళింగము – గాంగయుగము

శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి ఈ రేడియో ప్రసంగాల సంకలనంలో అయిదవ ప్రసంగం కళింగదేశాన్ని రమారమి క్రీ.శ.500 ప్రాంతం నుంచి 1437 దాకా, అంటే దాదాపు తొమ్మిదిన్నర శతాబ్ధుల కాలం పాటు అవిఛ్ఛిన్నంగా పాలించిన గంగవంశపు రాజులకు సంబంధించినది. ఈ ప్రసంగంలోని విషయం సంగ్రహంగా:

మధ్యాంధ్రదేశంలో తూర్పుజిల్లాలలోని పిఠాపురం మొదలుకుని ఉత్తరంవైపు మహానది దాకా వ్యాపించిన దేశాన్ని కళింగం అంటారు. కళింగానికి ఉత్తరంవైపు ఉండే దేశం ఉత్కలం, అంటే ఓడ్రదేశం, ఒరిస్సా. ఉత్తర కళింగము అనే పదమే వాడుకలో ఉత్కలము అనే పదంగా మారిందని భాషాశాస్త్రం తెలిసినవారంటారు. కళింగదేశపు పూర్వచరిత్ర తలచుకోగానే ముందు మనకు జ్ఞాపకం వచ్చేది దంతపురం – కళింగదేశ రాజధాని. బుధ్ధుని నిర్యాణానంతరం ఆయన దంతాన్ని తీసుకువచ్చి ఇక్కడ అందమైన స్తూపంలో పదిలపరిచారట. ఆ కారణంగా దంతపురానికి ఆ పేరు వచ్చింది. పూర్వకాలంలో కళింగదేశ ప్రజలు, ఏలిన రాజులు బౌధ్ధాన్ని అనుసరించినవారే.  బౌధ్ధం తరువాత జైనం కూడా ఈ దేశంలో వ్యాపించింది. కాని ప్రబలలేదు. జైనాన్ని మొట్టమొదట ఆదరించినవాడు, శాతవాహనరాజు శ్రీశాతకర్ణికి సమకాలికుడు అయిన ఖారవేల మహారాజు. ఇతడు చాలా పరాక్రమవంతుడు. మగధ రాజ్యం మీదికి ఎన్నో తడవలు దండెత్తివెళ్ళి ఆ మహారాజును ఓడించి తరిమివేసినవాడు. ఇతడు జైనమతాభిమాని. ఓడ్రదేశంలోని పూరీ జిల్లాలోని ఉదయగిరి, ఖండగిరి కొండలను తొలిపించి సుందరమైన గుహాలయాలను నిర్మింపజేసి జైన సన్యాసులకు సమర్పించాడు. ఇతని తరువాత కళింగదేశాన్ని పాలించిన వారు ఇతనంతటి పరాక్రమవంతులుకారు, జైనమతాభిమానులూ కారు. అందువలన ఖారవేలమహారాజు తరువాత జైనం కళింగదేశంలో పూర్తిగా అంతరించకపోయినా ప్రబలలేదు.

కళింగదేశమంతా కొండల, అడవుల మయం. ఇది యావత్తూ సముద్రపు ఒడ్డున ఉన్న దేశం. అందువలన అడవులు, కొండలు, సముద్రము – ఈ మూడిటి ప్రభావమూ కళింగదేశ చరిత్రమీద కనబడుతుంది. కొండల మధ్య లోయలలోనూ, సముద్రతీరపు పల్లపు ప్రదేశాలలోనూ బలము, ప్రతాపము కలవారు చిన్నచిన్న రాజ్యాలను స్థాపించుకుని తమకు వశమైన ప్రాంతాన్ని పాలిస్తూవుండేవారు. కళింగదేశం ఈ విధంగా ఉన్న అదనుచూసుకుని గుప్తవంశజుడైన సముద్రగుప్త చక్రవర్తి క్రీ.శ.350 ప్రాంతాన దండెత్తి వచ్చి, కళింగాన్నే కాక కంచివరకూ తూర్పు సముద్రతీరాన రాజ్యంచేసే రాజులందరినీ వోడించాడు. సముద్రగుప్తుని ఈ దండయాత్ర ఒక పెనుతుఫానులాగా దేశాన్ని భీభత్సం చేసినా అది ఎక్కువకాలం నిలవలేదు. శీఘ్రకాలంలోనే దేశం మళ్ళీ తేరుకుని, కుదుటపడి ఎప్పటిలాగే చిన్నరాజ్యాల పాలన సాగింది. సముద్రగుప్తుని దండయాత్ర జరిగిన నూరునూటయాభై సంవత్సరాలకు కళింగదేశంలో అడుగుపెట్టారు గంగవంశపు రాజులు.

సముద్రగుప్తుడి దండయాత్రలాంటి పరరాజ దండయాత్రలు జరిగినప్పుడూ, కరువుకాటకాలు సంభవించినప్పుడూ సముద్రతీర ప్రాంతంలోని వారు ఆ ఉపద్రవాలు తప్పించుకోవడానికి గానీ, బ్రతుకుతెరువు చూసుకునేందుకు గానీ సముద్రంమీద తూర్పుదేశాలకూ, ద్వీపాలకూ సబురు వెళ్ళేవారు. ఓడ ప్రయాణాన్ని సబురు అంటారు. సముద్రతీర ప్రాంత కళింగదేశ వర్తకులు వ్యాపారంకోసంగా తూర్పుదేశాలయిన బర్మా, కంబోడియా, మలయా ద్వీపకల్పము, సుమాత్రా, జావా, బాలి మొదలయిన దేశాలకూ ద్వీపాలకూ సబురులు చేసేవారు. పూర్వకాలంలో బర్మా, మలయాద్వీపకల్పమూ, సుమాత్రా, జావాల నదీతీరాలలో బంగారపు ఇసుక దొరికేదనీ, కొండప్రాంతాలలో బంగారపు గనులు ఉండేవనీ, ఆ కారణం చేత ఈ దేశాలకూ, ద్వీపాలకూ సువర్ణభూమి అనీ, సువర్ణద్వీపమనీ పేరువచ్చిందనీ చెబుతారు. ఇక్కడ బంగారమే కాకుండా, వెండి, తగరం, అగరు, కర్పూరం, ఇతర సుగంధద్రవ్యాలు కూడా పుష్కలంగా లభ్యమయ్యేవి. మనదేశ రాజుల రాజభోగాలకు ఈ సుగంధద్రవ్యాలు, వెండి బంగారాలూ కావలసి వచ్చేవి. మనదేశ వర్తకులు సాహసంతో ధ్రువనక్షత్రాన్ని దిక్కులు తెలిపే సాధనంగా చేసుకుని ఓడలమీద సబురులు చేసి ఈ సరుకులన్నీ తెచ్చేవారు. దక్షిణహిందూ దేశంలోని తూర్పుతీరంలో ఈ విధమైన ఓడలమీద వర్తకం సువర్ణభూమితో మొట్టమొదటగా చేసినవారు కళింగదేశీయులే. చీనా దేశ వర్తకులూ, మనదేశ వర్తకులూ ఈ సువర్ణభూమిలో కలుసుకునేవారు. ఆ కాలంలో వర్తకం అంటే ఇక్కడినుంచి తీసుకువెళ్ళిన సరుకులను అక్కడ ఇచ్చి, అక్కడి సరుకులను ఇక్కడికి తేవడంగా ఉండేది. క్రీ.శ.మూడవ, నాలుగవ శతాబ్దములనాటి తమ దేశచరిత్రలో చీనా వారు తాము సువర్ణభూమిలో కళింగదేశ వర్తకులను కలుసుకున్నామనీ, అక్కడి వర్తకమంతా కాళింగులతోనే అనీ వ్రాసుకున్నారు. అప్పటి ఒక కళింగ వర్తకుడు చీనా దేశానికి కూడా వెళ్ళాడట! కళిగం నుంచి తూర్పు సముద్రాల మీదుగా చీనావెళ్ళి రావడానికి నాలుగేళ్ళు పట్టేదట! కళింగ వర్తకులు ఒక్కొకరు తెగించి ఇరవై, నలభై, ఎనభై, వంద, రెండు వందలు ఓడలు కట్టుకుని వర్తకానికి వెళ్ళేవారట. దేశంలో ఉపద్రవం సంభవించినప్పుడు కళింగదేశ జనం గుంపులు కట్టుకుని సముద్రం మీద ఓడలలో పడడమే. సముద్రప్రయాణం అంటే భయం కాని, పిరికితనంగానీ ఉండేది కాదు. కళింగ దేశం నుంచి ఆ దేశాలకు వెళ్ళినవారు అక్కడ వారు నివసించిన ప్రదేశాలకు కళింగమనే పేరు పెట్టుకున్నారు. ఇట్టివారిలో ఆ దేశాలలో ద్వీపాలలో రాజ్యాలు స్థాపించి రాచరికం చేసినవారూ వున్నారు. జావాను క్రీస్తుశకం ఎనిమిది, తొమ్మిది, పదవ శతాబ్దులలో పాలించిన శైలేంద్రవంశపు రాజులు కళింగదేశీయులే.

శైలేంద్రులు జావాలో రాచరికం చేస్తున్న కాలంలో కళింగాన్ని పాలించిన వారు గంగవశీయులు. పశ్చిమ, తూర్పు గంగరాజులని వీరివి రెండు కోవలు. పశ్చిమ గంగవంశ రాజులు మైసూరులో పాలించారు. తూర్పు గంగవంశరాజులు కళింగాన్ని పాలించారు. పూర్వం మైసూరునుంచి పాలించిన గంగవంశరాజులలో ఓ ఐదుగురు తమ బలపరాక్రమాలతో రాజ్యం సంపాదించుకోవాలని బయలుదేరి దేశాలు తిరుగుతూ కళింగానికి వచ్చి అక్కడ మహేంద్రగిరిపై వెలిసి ఉన్న గోకర్ణస్వామిని ఆరాధించి ఆయన అనుగ్రహంతో అక్కడి రాజులను జయించి కళింగ దేశంలో గంగరాజ్యం స్థాపించారు. వీరు కళింగాన్ని క్రీ.శ.500 ల ప్రాంతం నుండి 1400 ప్రాంతం దాకా కళింగానికి ఏలికలుగా ఉన్నారు. వీరిలాగా అవిఛ్ఛిన్నంగా తొమ్మిదివందల సంవత్సరాలపైని రాజ్యమేలిన వంశం దక్షిణహిందూదేశంలో మరొకటి కనబడదు. పూర్వకాలం నుంచి కళింగదేశ అడవులు శ్రేష్ఠమైన ఏనుగులకు ప్రసిధ్ధి. కళింగదేశ రాజుల సైన్యంలో ఎక్కువగా ఏనుగులు ఉండడంవలన వీరికి గజపతులు అనే పేరు వచ్చింది.

ఈ గంగవంశరాజులలో కళింగాన్ని క్రీస్తుశకం వెయ్యవ సంవత్సరానికి ముందు పాలించినవారిని ప్రాచీన గాంగరాజులనీ, ఆ తరువాతి వారిని అర్వాచీన గాంగరాజులనీ చరిత్రకారులు అంటారు. మొదటివారికంటే తరువాతివారే చాలా ప్రతాపవంతులు. వీరిలో వజ్రహస్తదేవుడు మొదటి మహారాజు. ఇతని కొడుకు రాజరాజదేవు, మనుమడు అనంతవర్మ చోడ గంగదేవుల రాజ్యకాలంలో వీరికీ చోళమహారాజులకూ చాలా యుధ్ధాలు జరిగాయి. గంగరాజులందరిలోనూ అనంతవర్మ చోడగంగదేవు చాలా ప్రసిధ్ధుడూ, పరాక్రమశాలీను.

గంగవంశంవారి రాజ్యం ఒకప్పుడు ఉత్తరాన గంగానది వరకు, దక్షిణాన గోదావరివరకూ వ్యాపించింది. రాజ్య సంపాదన, సంరక్షణ ప్రయత్నంలో గంగవంశపు రాజులకూ అటు ఉత్తరంవైపు బంగాళాదేశాన్ని పాలించిన నవాబులతోనూ, పడమటి వైపు చేదిరాజులతోనూ, దక్షిణంవైపు చాళుక్య చోళులతోనూ, కొండవీటి రెడ్డిరాజులతోనూ తరచుగా యుధ్ధాలు సంభవించేవి. ఈ వంశం వారిలో నాలుగవ భానుదేవు కళింగాన్ని పాలించిన చివరి రాజు. వీరి పాలన క్రీ.శ.1437లో అంతరించింది.

గంగవంశపు రాజులలో మొదటివారు శైవులు; తరువాతి వారు వైష్ణవులు. వీరు గొప్ప దేవాలయాలను నిర్మింపజేశారు. ముఖలింగం, శ్రీకూర్మం దేవాలయాలు వీరు కట్టించినవే. పూరి జగన్నాధాలయన్ని కట్టించినవాడు అనంతచోడ గంగదేవు. కోణార్క లోని సూర్యదేవాలయాన్ని కట్టించినది నరసింహదేవు. అద్భుతాలయిన ఈ కట్టడాలతో కళింగ గాంగవంశపు రాజులు ఉత్కలానికి అందం తెచ్చారు. వేములవాడ భీమకవి అనంతవర్మ చోడగంగదేవు తండ్రి అయిన రాజరాజదేవుకు సమకాలికుడని చెబుతారు. ఈ గాంగరాజులు వేదవిద్యలను, కళలను పోషించి కీర్తిగడించారు.

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ -(4)

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి రేడియో ప్రసంగాల సంకలనం.

నాలుగవ ప్రసంగం : పూర్వ చాళుక్యయుగము

తెలుగునేలన చిన్నచిన్న రాజ్యాల కాలంపోయి, వేంగీ చాళుక్యుల ఆగమనంతో పెద్దరాజ్యాల యుగం ప్రారంభమయింది. చాళుక్యుల ఆగమనంతో తెలుగుదేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయం అరంభమయింది. ఈ దశ ఆరంభ కాలం నుంచి రాజరాజనరేంద్రుని కాలం దాకా దాదాపు నాలుగుశతాబ్దాలకు పైగా కాలంలో జరిగిన చరిత్ర సంగతులను ఈ నాల్గవ ప్రసంగంలో క్లుప్తంగా నిక్షిప్తం చేశారు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు. ఈ ప్రసంగంలోని విషయం సంగ్రహంగా:

విష్ణుకుండివంశపు రాజుల తరువాత పూర్వాంధ్రదేశాన్ని ఆక్రమించుకుని పాలించినవారు చాళుక్యవంశ క్షత్రియులు. వాతాపి, ఇప్పటి బాదామి వీరికి మొదట రాజధాని. ఈ వంశంలోని సత్యాశ్రయుడనే రెండవ పులకేశిమహారాజు, ఉత్తర హిందూదేశాన్ని ఏలిన హర్షవర్ధనుడూ సమకాలీనులు. దక్కునుదేశం మీదికి దండెత్తి వచ్చిన హర్షవర్ధనుని ఓడించిన పరాక్రమవంతుడు సత్యాశ్రయుడు. దక్కనుదేశంలోని తన ఇరుగుపొరుగు రాజులనందరినీ ఓడించి అప్పటివరకూ ఒక చిన్న సంస్థానంగా ఉంటూ వచ్చిన బాదామిని గొప్ప చాళుక్య సామ్రాజ్యంగా విస్తరింపజేశాడు. ఆ తరువాత దిగ్విజయయాత్ర మొదలుపెట్టి యవరాజయిన తన తమ్ముడు విష్ణువర్ధనునితో కూడా ఆంధ్ర దేశంమీదికి దండెత్తివచ్చి, జయించి, తమ్ముడయిన విష్ణువర్ధనుని వేంగీదేశానికి తన ప్రతినిధిగా నియమించి వేంగీదేశంలో చాళుక్యరాజ్య స్థాపన చేశాడు. తూర్పుదేశాన్ని పాలించిన చాళుక్యులన్న పేరుతో తూర్పుచాళుక్యులనీ, పూర్వచాళుక్యులనీ వీరికి పేరు వచ్చింది. మొడట అన్నగారికి ప్రతినిధిగా ఉన్నప్పటికీ, తరువాత క్రీ.శ.625లో విష్ణువర్ధనుడు స్వతంత్రుడై రాజ్యం పాలించాడు. ఇతనికి గూను ఉండడంవలన కుబ్జవిష్ణువర్ధనుడనీ పేరు. ఇతని కొడుకు జయసింహవల్లభ మహారాజుకు సర్వసిధ్ధి అని పేరు. విశాఖపట్టణం జిల్లాలోని సర్వసిధ్ధి ఇతనిపేర కట్టినదే.

శాతవాహనుల కాలం నుంచీ వేంగీచాళుక్యుల దాకా గల రమారమి తొమ్మిదివందల సంవత్సరాల నడిమి కాలంలో మనదేశంలో చాలాభాగం అడవి తెగిపోయి ఆ ప్రాంతం అంతా జనులకు నివాసయోగ్యంగా చేయబడింది. పాడిపంటలు వృధ్ధిచేయబడ్డాయి. ప్రాంతాల మధ్య రాకపోకలు పెరిగి, వ్యాపారం పెరిగింది. చిన్నచిన్న రాజులు సంస్థానాలు కట్టుకుని విడివిడిగా పాలించే కాలం పోయి, జనసమృధ్ధమూ, సస్యసంపన్నమూ అయిన దేశాన్ని అంతా తమ ఆధినంలోనికి తెచ్చుకుని పాలించే పెద్ద రాజ్యల కాలం వచ్చింది. పూర్వాంధ్రదేశం అంతా చాళుక్యుల పాలనలో ఉంటే, వారికి పొరుగున కాంచీపురం రాజధానిగా పల్లవరాజ్యం విలసిల్లింది. పశ్చిమాంధ్రలోని కొంతభాగం వారి పాలనలో ఉండేది. బాదామిని సత్యాశ్రయమహారాజు సంతతివారు క్రీ.శ.ఎనిమిదవ శతాబ్ది మధ్యవరకు పాలించారు. అటుతరువాత వారిని జయించి రాష్ట్రకూటులు మాల్యఖేటము – నేటి మాల్ఖేడు – రాజధానిగారెండువందల సంవత్సరాలదాకా అంటే క్రీ.శ.పదవ శతాబ్ది మధ్య దాకా పాలించారు. ఇందువలన వేంగీ చాళుక్యులకు పడమటి దిక్కున వారికి జ్ఞాతులైన బాదామి చాళుక్యులు, అటు తరువాత మాల్యఖేటం రాష్ట్రకూటులూ సమకాలికులయ్యారు. తమ రాజ్యారంభకాలం నుంచీ రాష్ట్రకూటులు తమ రాజ్యాన్ని తూర్పు సముద్రతీరానికంతా వ్యాపింపజేయాలని ప్రయత్నిస్తూనే వచ్చారు. ఈ కారణంగా వేంగీ చాళుక్యులకూ రాష్ట్రకూటులకూ మధ్య చాలా యుధ్ధాలు జరిగాయి. ఒక సందర్భంలో ఈ యుధ్ధం పన్నెడేండ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. ఉభయవంశాల రాజులకూ మధ్య ఈ యుధ్ధాలు చాళుక్యవంశంలోని తైలపరాజు రాష్ట్రకూట రాజ్యన్ని పూర్తిగా కూలదోసి మళ్ళీ చాళుక్యవంశాధికారాన్ని పునఃప్రతిష్ఠించేదాకా సాగాయి. తైలపుని సంతతివారిని చరిత్రలో పశ్చిమ చాళుక్యులని అంటారు. వీరికి కళ్యాణి నగరం రాజధాని.

వేంగీచాళుక్యులలో పరాక్రమవంతులైన రాజులెందరో ఉన్నారు. వీరిలో చాలా మందికి విష్ణువర్ధనులనీ, విజ్యాదిత్యులనీ పేర్లుగా ఉండేవి. వీరిలో క్రీ.శ.844 నుండి 892దాకా పాలించిన మూడవ విజయాదిత్యమహారాజు రాష్ట్రకూటులతోడి యుధ్ధాలలో వారిని చాలాసార్లు ఓడించి వీరాధివీరుడనే పేరు గడించాడు. నాలుగవ విజయాదిత్యుని కొడుకైన అమ్మరాజ రాజమహేంద్రుడు తనపేర నేటి రాజమహేంద్రవరాన్ని కట్టించాడు. పూర్వచాళుక్య వంశపు రాజులు సంతానసమృధ్ధి కలవారు. అందువలన విష్ణువర్ధనుని వంశం శాఖోపశాఖలై వర్ధిల్లింది. అయితే, జ్ఞాతితగాదాలు, కుట్రలూ, యుధ్ధాలు కూడా ఈ కారణంగా సంభవించాయి. ఇందులో భాగంగానే ఈ వంశంవారు కొందరు పొరుగున వున్న రాష్ట్రకూటుల సహాయాన్ని పొందుతూ వచ్చారు. రాష్ట్రకూటులు తరచుగా పూర్వచాళుక్యులమీదికి దండెత్తిరావడానికి ఇది అవకాశం కల్పించింది. ఈ జ్ఞాతి తగాదాలు ఈ వంశంలో క్రీ.శ.వెయ్యవ సంవత్సరందాకా సాగుతూనే వచ్చాయి.

పశ్చిమ చాళుక్య ప్రభువైన తైలపుని విజయం తరువాత రాష్ట్రకూట రాజ్యం పడిపోయి పశ్చిమచాళుక్యులు తమ అధికారాన్ని పునఃప్రతిష్టించుకున్న తరువాతి సంధికాలంలో, పల్లవరాజుల తరువాత క్రీ.శ.పదవ శతాబ్దంలో అరవదేశాన్ని ఆక్రమించుకుని పాలించిన చోళ మహారాజులు రాజరాజు, అతని కొడుకైన రాజేంద్రచోడుడు మొదలైనవారు పూర్వచాళుక్యుల రాజకీయవ్యవహారాలలో ఈ అంతఃకలహాలవలననే జోక్యం కలుగజేసుకోవడం సంభవించింది. పూర్వకాలంలో పల్లవులకు, రాష్ట్రకూటులకులాగే, ఈ చోళరాజులకు పశ్చిమచాళుక్యులకు మధ్య రాజ్యసంపాదనకోసం కలహాలు పెరిగి వారి ఉభయుల మధ్య చాలాకాలం యుధ్ధాలు జరిగాయి. ఈ యుధ్ధాలలో పూర్వాంధ్రదేశం తమ పక్షాన లేకుంటే, తమ రాజ్యానికి క్షేమంలేదని చోళభూపతులు పూర్వచాళుక్యులతో స్నేహంకట్టవలసిన అవసరం కలిగి, వేంగి రాజ్యకీయ వ్యవహారాలలో కలుగజేసుకున్నారు. జ్ఞాతి కలహాలవల్ల రాజ్యం పోగొట్టుకున్న శక్తివర్మనూ, అతని సోదరుడైన విమలాదిత్యుని తిరిగి వేంగీ సింహాసనంమీద కూర్చోబెట్టారు. అంతేకాకుండా, వేంగీచాళుక్యులను తమ పలుకుబడికింద ఉంచుకునే నిమిత్తం చోళమహారాజులు వారి ఆడుబిడ్డలను చాళుక్య మహారాజులకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు. రాజరాజచోళ మహారాజు తన సోదరి అయిన కుందవాంబను శక్తివర్మ సోదరుడైన విమలాదిత్యునకిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతులిద్దరికి పుట్టినవాడే మన రాజరాజనరేంద్రుడు. ఇతడు మళ్ళీ రాజేంద్రచోళుడి కూతురు అమ్మంగదేవిని వివాహం చేసుకున్నాడు; క్రీ.శ.1022లో వేంగీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. నన్నయభట్టారకులవారు ఈ రాజరాజనరేంద్రుని ఆస్థానకవి.

వేంగీ చాళుక్యుల కాలంలో మనదేశంలో వేదమతం బాగా బలపడింది. వేదమత సంప్రదాయమైన శైవానికి జనాదరణ పెరిగింది. బౌధ్ధం పూర్తిగా పోయి, జైనానికి కొంత పట్టు దొరికింది. అత్తిలి, బెజవాడ, ధర్మవరం, తాటిపాక, పెనుగొండ మొదలైనవి ఆ కాలంలో గొప్ప జైనక్షేత్రాలుగా ఉండేవి. చాళుక్యరాజులు జైనులను, బ్రాహ్మణులను సరిసమానంగా ఆదరించారు. జైన మఠాలకు కూడా భూదాన, అగ్రహార దానాలు చేశారు. ఈ కాలంలో బ్రాహ్మణులు రాజగురువులై, ఉపదేశికులై, మంత్రులై రాజకార్యాలలో నియమితులవుతూ వచ్చారు. ఇట్టివారికి నియోగులనిపేరు. బ్రాహ్మణులలో వేదాలు, శాస్త్రాలు చదువుకొన్న గొప్ప పండితులనేకులు ఉండేవారు. యుధ్ధాలలో పాల్గొని గొప్ప కీర్తి గడించిన సేనాధిపతులూ ఉండేవారు. చాళుక్యుల కాలంలో వర్తకవ్యాపారాలు విరివిగా సాగాయి. మనదేశ వర్తకులు తూర్పు దేశాలతోనూ, ద్వీపాలతోనూ ఓడలలో వర్తకం బాగా చేసేవారు.

తెలుగుభాష క్రమంగా వృధ్ధి చెంది ఈ కాలంలో ననలు తొడిగింది. కవులు తెలుగులో పద్యాలు, పదాలు వ్రాస్తూ వచ్చారు. తెలుగుభాషలో పద్యాలు మొట్టమొదటిమారు మూడవ విజయాదిత్య మహారాజు కాలంనుంచీ, అతని తమ్ముని కొడుకైన భీమమహారాజు కాలంనుంచీ కనబడతాయి. అప్పటికే కవిత్వం చెప్పడానికి తెలుగు అనుకూలమైన భాషగా తయారయింది. రాజరాజనరేంద్రుని కాలం నాటికి తెలుగులో ధారాళంగా పద్యాలు వ్రాయడం వచ్చింది. అందువలననే, ఆ మహారాజు ఆస్థానకవియైన నన్నయగారు సంస్కృతమహాభారతాన్ని పద్యాల రూపంలో తెలుగులోకి తర్జుమా చేశారు. ఇంతవరకు దొరికిన తెలుగు గ్రంథాలలో నన్నయ్యగారు వ్రాసిన ఆంధ్రమహాభారతమే మొదటిది.

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ -(3)

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి రేడియో ప్రసంగాల సంకలనం.

మూడవ ప్రసంగం : చిన్న రాజ్యాల కాలం

శ్రీ మల్లంపల్లి సొమశేఖరశర్మగారి రేడియోప్రసంగాలలోని మూడవ ప్రసంగం ఆంధ్రదేశంలో  చిన్న రాజ్యాల కాలం వారి పరిపాలన, ఆ కాలంలో ఆంధ్రదేశంలో వచ్చిన సాంఘికమైన, సాంస్కృతికమైన మార్పుల గురించినది. చిన్న రాజ్యాల కాలం అంటే, ఆంధ్ర దేశం బృహత్ఫలాయన, శాలంకాయన, కందార, పల్లవ, విష్ణుకుండు ఇత్యాది రాజవంశాలకు చెందిన  రాజుల పరిపాలనో ఉండిన కాలం. ఈ ప్రసంగ విషయం సంగ్రహంగా:

కృష్ణానదికి ఉత్తరానను, గోదావరికి దక్షిణానను ఉన్న భూభాగాన్ని ఇక్ష్వాకుల తరువాత రెండు రాజవంశాలు పరిపాలించాయి. అవి ఒకటి: బృహత్ఫలాయనులు, రెండు: శాలంకాయనులు. వీరిని చరిత్రలో బృహత్ఫలాయన గోత్రులనీ, శాలంకాయన గోత్రులని కూడా పిలుస్తారు. బృహత్ఫలాయనులకు కృష్ణాజిల్లా బందరు దగ్గరలోని గూడూరు రాజధాని. ఈ వంశపు రాజులలో మనకు ఇంతవరకు తెలిసిన రాజు ఒక్కడే, అతడు జయవర్మ.

శాలంకాయనులు ఆంధ్రదేశాన్ని ఒక వంద సంవత్సరాలదాకా పాలించారు. ఈ వంశంవారికి నేటి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు దగ్గరిలోని పెదవేగి రాజధాని. వీరి పరిపాలనా కాలంలో పెదవేగి మహానగరం. ఈ నగరం రాజధానిగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన శాలంకాయన రాజులు దేవవర్మ, హస్తివర్మ, నందివర్మ, చండవర్మ, స్కందవర్మ మొదలైన రాజులు  చాలామంది ఉన్నారు. వీరంతా చిత్రరథస్వామి భక్తులు. చిత్రరథస్వామి అంటే సూర్యభగవానుడు. పెదవేగిలో పూర్వం పెద్ద చిత్రరథస్వామి దేవాలయం ఉండేదట.

ఇక్ష్వాకురాజ్యం అంతరించిన తరువాత కృష్ణకు దక్షిణాన వున్న దేశం మొదట కందారవంశపు రాజులకు, ఆ తరువాత కంచి రాజధానిగా పరిపాలిస్తూ ఉండిన పల్లవ వంశ రాజుల పరిపాలనలోకి వెళ్ళింది. కందార వంశం రాజులలో దామోదరవర్మ, అత్తివర్మ అనేవారు ప్రసిధ్ధులు. అయితే, వారి రాజ్యంకూడా ఎక్కువకాలం నిలబడలేదు. ఆ తరువాత పల్లవ వంశపు రాజులే కృష్ణానదికి దక్షిణాన ఉన్న పూర్వాంధ్రదేశాన్ని చాలాకాలం పాలించారు.

వీరకూర్చవర్మ, విష్ణుగోపవర్మ, స్కందవర్మ, వీరవర్మ, సింహవర్మ, బుధ్ధవర్మ, నందివర్మ మొదలైనవారు అనేకులు పల్లవరాజులలో పరాక్రములైన రాజులు ఉన్నారు. శాలంకాయనులు వేంగీదేశాన్ని పాలిస్తూన్నపుడు కృష్ణకు దక్షిణదేశాన్ని పల్లవరాజులు పాలిస్తూండేవారు. వారి పరిపాలన ప్రారంభ సంవత్సరాలలో  సముద్రగుప్త చక్రవర్తి దండెత్తివచ్చి శాలంకాయన హస్తివర్మనూ, పల్లవ విష్ణుగోపవర్మనూ జయించాడు. అయితే, సముద్రగుప్త చక్రవర్తి తిరిగి ఉత్తరభారతానికి తరలి వెళ్ళగానే వీరు స్వతంత్రులై తమతమ రాజ్యాలను ఏలుకున్నారు.

శాలంకాయన రాజుల పాలన తరువాత పూర్వాంధ్రదేశాన్ని విష్ణుకుండిన రాజులు పాలించారు. విష్ణుకుండిన రాజులు శైవులు, వేదమతాభిమానులు. వీరు తమకు పొరుగున దక్కనులో పాలిస్తూవచ్చిన వాకాట వంశం వారితోనూ, మధ్య గణాలలోని తేవారు ప్రాంతపు రాజులతోనూ ముందుచూపుతో  వివాహ సంబంధాలు కుదుర్చుకుని తమ రాజ్యాధికారానికి పొరుగురాజ్యాలవల్ల ఆపద రాకుండా కాపాడుకున్నారు.

తమకు పూర్వం పాలించిన రాజవంశాలందరికంటే ఈ విష్ణుకుండివంశపు రాజులు బాగా బలపరాక్రమములు కలవారు. మొదట వీరు కృష్ణకు దక్షిణాన ఉన్న దేశాన్ని వశపరుచుకుని పాలించినప్పటికీ, కాలక్రమేణా బలవంతులైన పల్లవరాజుల వలన ఒత్తిడి ఎక్కువై, చివరకు వేంగీ దేశానికి వెళ్ళిపోయి అక్కడ వేగికి సమీపంలోని దెందులూరు రాజధానిగా చేసుకుని పాలించారు. విష్ణుకుండివంశంవారివి ఇంతవరకు ఐదు రాగి శాసనాలు దొరికాయి. వీటినిబట్టి చూస్తే విష్ణుకుండి వంశంవారు క్రీస్తుశకం అయిదవ శతాబ్ది చివరిభాగం నుండి ఏడవ శతాబ్దం మొదటి భాగం దాకా, అంతే సుమారు నూటయాభై సంవత్సరాలదాకా పాలించారని తెలుస్తుంది.

విష్ణుకుండివంశం రాజులలో మాధవవర్మ మహారాజు చాలా పరాక్రమవంతుడు. ఈయన కాలంలో విష్ణుకుండులు కళింగంలోని కొంతబాగాన్నికూడా జయించి తమరాజ్యంలో కలుపుకుని పాలించారు. బాదామి చాళుక్య వంశంవాడైన రెండవ పులకేశిమహారాజూ, అతని తమ్ముడు యువరాజు విష్ణువర్ధనుడు వేంగిదేశంపైకి దండెత్తి వచ్చి జయించి తమరాజ్యాన్ని అక్కడ స్థాపించేదాకా ఈ విష్ణుకుండిరాజుల పాలన సాగింది.

ఇక్ష్వాకువంశపు రాజుల పాలన నుండి విష్ణుకుండిరాజుల పాలన సమాప్తి వరకూ అయిన సుమారు రెండువందల సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్రదేశంలో సామాజికంగానూ, సాంస్కృతికంగానూ కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చాయి. ఉత్తరదేశాన్నుంచి వచ్చిన ఆంధ్రులలోని వేరువేరు తెగలవారు ఇక్కడ స్థిరపడిన తరువాత, అనాదిగా ఇక్కడ నివసిస్తూండిన స్థానిక తెగలవారితో వివాహసంబంధాలు పెట్టుకోవడం వలన సాంఘికంగా ఒక గొప్ప మార్పు వచ్చి ఒక మహా సంఘ నిర్మాణానికి దారితీసింది. ఇక మత పరంగా చెప్పాలంటే – మనదేశంలోని జనులలో ముప్పాతికమువ్వీసం మంది ప్రాచీనకాలంనుంచీ బుధ్ధమతావలంబకులు. బుధ్ధుని నిర్యాణం తరువాత కొంతకాలానికి అతనికి పూజ ఏర్పడి, దేవుడుగా చేయబడ్డాడు.  ఆ తరువాత కొంతకాలానికి బుధ్ధుడు ప్రధాన దేవుడై, మరికొందరు ఇతర దేవుళ్ళు ఏర్పడ్డారు. ఈ దేవుళ్ళకు భార్యలు, దేవతలు ఏర్పడినారు. వీరి ఉభయుల సంఖ్యా నానాటికీ హెచ్చింది. వీరికి విగ్రహాలు ఏర్పడి మొదట దేవుడే లేదనే మతంలో విగ్రహారాధన మొదలయ్యింది. ఈ విగ్రహాలను పూజించే పధ్ధతులు అనేకం వచ్చాయి. వీటికి తిరునాళ్ళూ, ఉత్సవాలు ఏర్పడి, రానురాను హెచ్చి స్త్రీ పురుష బౌధ్ధ సన్యాసుల ప్రవర్తనలపై అభ్యంతరకరమైన ప్రభావాన్ని చూపాయి.

క్రమంగా బౌధ్ధం ఆదరాభిమానాలను కోల్పోయింది. ఈ సమయంలో ఇక్ష్వాకు తదితర రాజవంశాలు ఇచ్చిన ప్రోత్సాహంతో వేదమతం తిరిగి ప్రజలలో ప్రబలడం మొదలయింది. శాతవాహనులూ, ఆ తరువాత పాలించిన ఇక్ష్వాకులు తదితర చిన్నచిన్న రాజవంశాల రాజులు అందరూ వేదమతాన్నిఅవలంబించినవారే. ఈ రాజవంశాలలోని రాజులలో అశ్వమేధయాగం చేసిన రాజు వంశానికి ఒక్కరైనా ఉన్నాడు. విష్ణుకుండి రాజులలో మాధవవర్మ అనే రాజు ఒక్కటికాదు, పదకొండు అశ్వమేధ యాగాలు చేశాడట! దీనిని బట్టి ఆ కాలంలో యజ్ఞాలూ, యాగాలపై మోజు హెచ్చిందనీ, అది ఒక ఘనతగా కూడా తయారయిందనీ అనుకోవచ్చు. యజ్ఞయాగాది వేదకర్మలను చేయించే బ్రాహ్మణులకు దీనివలన ప్రాపకమూ, ఆదరణా సహజంగానే హెచ్చింది. ఇరుగుపొరుగు దేశాలనుండి బ్రాహ్మణులనేకులు రాజాశ్రయం వెదుకుకుంటూ ఈ దేశం వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికీ ఇది దారితీసింది. వేద, శాస్త్రపారంగతులైన బ్రాహ్మణులకు  దానాలను చేసి, వాటిని రాగిరేకుల మీద చెక్కించి ఇచ్చారు. ఇక్ష్వాకు వంశం వారి రాజ్యం అంతరించినప్పటినుంచీ మనకు దొరికిన భూదాన శాసనాలన్నీ రాగిరేకులమీద చెక్కినవే!

దేశంలో బౌధ్ధమతం క్రమంగా క్షీణించినకొలదీ శైవమతం ప్రబలింది. దీని తరువాతనే వ్యాప్తి చెందింది వైష్ణవమతం. శైవమతానికి ఆధిక్యం కలిగిన కాలంలో ఇప్పటి శ్రీశైలం గొప్ప శైవక్షేత్రమై శ్రీపర్వతం అన్న పేరుతో ప్రసిధ్ధికెక్కింది. ఆ కొండమీద వెలసిన శివునికి శ్రీపర్వతస్వామి అని పేరు సార్ధకమయింది. విష్ణుకుండి వంశపు రాజులు శ్రీపర్వతస్వామి పాదాలు కొలిచి వృధ్ధిచెందిన వారు.  ఈ కాలంలో ప్రాకృతం, ప్రాకృతకవులకు ఆదరణ సన్నగిల్లింది. సంస్కృత భాషకు, సంస్కృత కవులకూ ఆదరణ హెచ్చింది. తెలుగు భాష రేఖ ఈ కాలంలోనే క్రమంగా బయలుపడింది.

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ -(2)

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి రేడియో ప్రసంగాల సంకలనం.

రెండవ ప్రసంగం : బౌధ్ధయుగము – ఇక్ష్వాకులు

శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి రేడియోప్రసంగాలలోని రెండవ ప్రసంగం ఆంధ్రదేశంలో ఇక్ష్వాకువంశ రాజుల పరిపాలన, వారికాలంలో ఆంధ్రుల సంస్కృతిని గురించినది. . ఈ ప్రసంగంలోని విషయం సంగ్రహంగా:

శాతవాహన రాజుల పరిపాలన చివరి రోజులలో (అంటే క్రీ.శ.మూడవ శతాబ్దం ప్రథమార్ధంలో) ఆ సామ్రాజ్యంలోని వేరువేరు ప్రాంతాలలో నివసించే ప్రజలను కూడగట్టుకుని బలపరాక్రమాలుగల వీరులు విజృంభించి వేరువేరు ప్రాంతాలలో చిన్నచిన్న రాజ్యాలు స్థాపించారు. ఈ విధమైన స్వతంత్ర రాజ్యాల స్థాపనతో శాతవాహన సామ్ర్యాజ్యం చితికి చిదపలై చివరికి అంతరించిపోయింది. ఇలా తెలుగునేలనే వెలసిన చిన్నరాజ్యాలలో ఇక్ష్వాకు వంశమువారి రాజ్యం ఒకటి.

ఇక్ష్వాకు వంశంకూడ పురాణ ప్రసిధ్ధి చెందిన వంశం.  ఈ వంశపు రాజులు క్షత్రియులు. వీరిని గురించి తెలిసినదల్లా వీరికాలంలో రాళ్ళమీద వేయించిన శాసనాలవలననే. ఇక్ష్వాకుల కాలంనాటి శాసనాలు ముఖ్యంగా కృష్ణాజిలా, నందిగామ తాలుకా జగ్గయ్యపేటలోను, గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా నాగార్జునకొండలోనూ దొరికాయి. ఈ శాసనాలన్నీ బౌధ్ధస్తూపాలలోని రాళ్ళమీదా, స్తంభాలమీదా చెక్కబడి వున్నవి. ఇవన్నీ ప్రాకృతభాషలో ఉన్నాయి. ప్రాకృతమే ఇక్ష్వాకులకాలం నాటికి కూడా రాజభాషగా ఉండింది. దానపత్రం వ్రాసినా, మరే పత్రం వ్రాసినా అన్నీ ప్రాకృతభాషలోనే వ్రాసారు. ఈ శాసనాలన్నీ ఇక్ష్వాకుల కాలంలోని బౌధ్ధ సన్యాసులకు, బౌధ్ధ స్తూపాలకూ చేసిన దానధర్మాలను తెలిపేవి. ఆ కాలంలో స్త్రీలు కూడా బౌధ్ధం స్వీకరించి సన్యాసినులై బౌధ్ధ విహారలలో నివాసముండేవారు. అన్ని విద్యలనూ, కళలనూ నేర్చేవారు.

శాసనాల వలన మనకు ఇంతవరకూ తెలియవచ్చిన ఇక్ష్వాకువంశపు రాజులు ముగ్గురే. వాసిష్ఠీ పుత్ర క్షాంతమూల మహారాజు. ఇతని కుమారుడు మాఢరీపుత్ర వీరపురుషదత్తుడు, ఇతని కుమారుడు ఎహువులక్షాంతిమూలుడు. వాసిష్ఠీపుత్ర, మాఢరీపుత్ర పదాలను బట్టి ఆనాడు స్త్రీలకు ఎంతటి గౌరవం ఉండేదో తెలుస్తుంది. ఈ సంప్రదాయం సాతవాహనుల నుంచీ వచ్చిన ఆచారమే. ఆ సంప్రదాయాన్ని ఇక్ష్వాకులూ కొనసాగించారు.

ఇక్ష్వాకు రాజ్యన్ని తెలుగునేలన స్థాపించిన వాసిష్ఠీపుత్ర క్షాంతమూలుడు చాలా పరాక్రమవంతుడైన రాజు. సాతవాహన రాజైన శ్రీశాతకర్ణిలాగే ఇతడూ ఎన్నో యజ్ఞయాగాలను చేశాడు. వీటిలో ముఖ్యమైనవి వాజపేయ, అశ్వమేధ యాగాలు. అశ్వమేధం చేశాడు గనుక ఇతడు గొప్ప పరాక్రమవంతుడై చుట్ట్లుపక్కల రాజ్యాలనన్నిటినీ జయించి కీర్తి గడించిన రాజు అయ్యాడు. అయితే, ఇతని కాలపు శాసనం ఒక్కటికూడా ఇంతవరకూ దొరకలేదు. ఇతడిని గురించిన సమాచారం కొంతవరకూ ఇతని తనయుడైన వీరపురుషదత్తుని శాసనాలవల్లనే తెలుస్తుంది. ఈ శాసనాలవలన వాసిష్ఠీపుత్ర క్షాంతమూలుడు అప్రతిహత సంకల్పుడని, కుమారస్వామి భక్తుడని, మహా దానధర్మ నిరతుడని, అనేకకోటి హిరణ్యాలు (బంగారు నాణేలు) దానం చేశాడని, లక్షలకొద్దీ గోవులను, హలాల భూమిని దానం చేశాడని తెలుస్తుంది. హలం అంటే నాగలి. ఒక్క నాగలితో సేద్యం చేయడానికి వీలయ్యే భూమిని ఒక హలం అనేవారు. లక్షలకొద్దీ హలాల భూమిని దానమిచ్చాడంటే ఆ మహారాజు ఎంతో భూమిని సేద్యం లోనికి తెచ్చాడన్నమాట. సరసిక, కుసుమలత అనేవారు క్షాంతమూలుని భార్యలు; హమ్మశ్రీనిక, క్షాంతిశ్రీ అనేవారు ఈతని చెల్లెళ్ళు.

మనకు దొరికిన ఇక్ష్వాకు శాసనాలన్నిటిలో చాలాభాగం శ్రీవీరపురుషదత్తుని కాలం నాటివే. ఇతడు దాదాపు ఇరవై సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఇతని రాజధాని విజయపురి, కృష్ణానది తీరాన ఉన్న నాగార్జునకొండ ప్రదేశంలోనే పూర్వం విజయపురి ఉండేదని తెలుస్తుంది. ఇక్ష్వాకు రాజుల కాలంలో ఇది ఒక మహానగరం. ఇక్ష్వాకు రాజుల కాలంలో వెలసిన బౌధ్ధస్తూపాలు, విహారాలు, ఇక్కడ ఈ నాగార్జునకొండలోనే ఉన్నాయి. ఇవన్నీ శ్రీ వీరపురుషదత్తుని రాజ్యకాలంలో కట్టినవే. ఈ కాలంలో నాగార్జునకొండకు శ్రీపర్వతమని పేరు.

శ్రీ వీరపురుషదత్తుని కుమారుడు ఎహువుల క్షాంతిమూలుడు. ఇతడు వీరపురుషదత్తుని రాణి వాసిష్ఠీభట్టిదేవికి జన్మించినవాడు. ఇక్ష్వాకు రాజులలో మనకు తెలిసిన కడపటి రాజు ఇతడే. ఇతడు పదకొండు సంవత్సరాలు రాజ్యం చేసినట్లు ఇతని కాలపు శాసనాలవలన తెలుస్తుంది.

ఇక్ష్వాకు వంశపురాజులు మొత్తం మీద యాభై సంవత్సరాలు పరిపాలించినట్లు తెలుస్తుంది. అందువలన వీరి రాజ్యపాలనం క్రీ.శ.నాలుగవ శతాబ్ది చివరి కాలంలో అంతమైందని చప్పవచ్చు. ఏ కారణాల వలన వీరి రాజ్యం అంతమయినదీ మనకు తెలియదు.

ఇక్ష్వాకు రాజుల కాలంలో పూగియ, కులహక, ధనిక తెగలవారు రాజ్యంలో గొప్పగా అధికారాలు వహించడం వల్లనైతేనేమి, రాజకుటుంబంతో సంబంధ బాంధవ్యాలు జరపడంవల్ల నైతేనేమి ప్రముఖులుగా ఉంటూ వచ్చారు. సాతవాహన యుగం రెండవ అర్ధంలో మనదేశంలో ప్రవేశించిన శకులు శైవ, వైష్ణవ, బౌధ్ధమతాలు అవలంబించడమే కాక ఇక్కడ దేశంలో స్థిరపడిపోయి ఇక్కడివారితో వివాహ సంబంధాలను కూడా చేస్తూవచ్చారు. ఇక్ష్వాకు కాలంనాటికి ఈ సంబంధ బాంధవ్యాలు చాల హెచ్చాయి. ఉజ్జయినీ నగరం రాజధానిగా గలిగిన శకుల్ల కన్య అయిన రుద్రధరభట్టారికను ఇక్ష్వాకువంశజుడైన శ్రీ వీరపురుషదత్తుడు పెండ్లి చేసుకున్నాడు. శకరాజ్యాలకూ ఆంధ్రదేశానికీ వర్తకవ్యాపారమూ రాకపోకలు హెచ్చడమే కాక, శకజాతివారి కుటుంబాలు మనదేశానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవడం కూదా జరిగింది.

ఇక్ష్వాకు రాజులు ప్రాకృతాన్ని ఆదరిస్తే, శకరాజులు సంస్కృతాన్ని పోషించారు. మనదేశానికి పెరవారయినప్పటికీ వేదభాషయైన సంస్కృతాన్ని, సంస్కృతభాషా పండితులను ఆదరించి వారీ దేశంలో పలుకుబడి సంపాదించుకుని తమ రాజ్యం సుప్రతిష్టం చేసుకున్నారు. ఉజ్జయిని సంస్కృత విద్యలకు ఆలవాలమయింది. జ్యౌతిష్యం మొదలయిన శాస్త్రాలన్ని శకరాజులిచ్చిన ఆదరప్రోత్సాహాలవల్ల బాగా వర్ధిల్లాయి. మనం ఇప్పుడు వాడుతూన్న పంచాంగం మొట్టమొదటగా శకరాజాస్థానమైన ఉజ్జయినిలో గణితమై పరివ్యాప్తమైనదే. తిథి, వార, పక్ష, మాసాదులతో కూడిన ఈ పంచాంగం ఆంధ్రదేశంలో ఇక్ష్వాకు వంశపు రాజూల తరువాత చాలాకాలానికిగాని వాడుకలోనికి రాలేదు. సాతవాహనుల కాలంలోనూ, ఇక్ష్వాకుల కాలంలోనూ సంవత్సరానికి గ్రీష్మం, వర్షము, హేమంతం అని ఒక్కొక ఋతువుకు నాలుగుమాసాల (ఎనిమిది పక్షాల) మూడు ఋతువులే. మన ఇప్పటి చాంద్రమాన వ్యవహారం శకరాజ్యములనుండి వచ్చినట్లు కనబడుతుంది.

ఇక్ష్వాకు రాజులను తలచుకోగానే మనకు జ్ఞాపకం వచ్చేది నాగార్జునకొండ. ఆ కాలంలో ఈ ప్రదేశమంతా ఒక మహా సుందరమైన దివ్య బౌధ్ధారామం. ఇక్ష్వాకు రాజవంశానికి సంబంధించినవారూ ఇతరులూ స్త్రీలనేకులూ శ్రీవీరపురుషదత్తమహారాజు కాలంలోనూ, అతని కుమారుని పరిపాలనా కాలంలోనూ ఎన్నో చైత్యాలు, చైత్యగృహాలు, మండపాలు, విహారాలు కట్టించారు; వాటికి దానాలు అనేకం చేశారు. కులహవిహారము, సింహళవిహారము, దేవీ విహారము అని ఇక్కడ ఎన్నో విహారాలు ఉండేవి. ఆ కాలంలో ఇక్కడకు కాశ్మీర, గాంధార, చీన, చిలాత, అపరాంత, వంగ, వనవాసి, యవన, ద్రమిళాది దేశాలనుంచీ, సింహళాది ద్వీపాల నుంచీ బౌధ్ధులు యాత్రార్ధం వచ్చేవారు. నాగార్జునాచార్యులవారు ఈ కొందమీద నివాసముండడం వలన బహుశా ఈ కొండకు ఆ పేరు వచ్చివుంటుంది. నాగార్జునకొండలోని ప్రధాన స్తూపానికి మహాచైత్యమని పేరు.  బుధ్ధభగవానుని ధాతువును ఇందులో వుంచి దానిని క్షాంతిమూలుని సోదరి క్షాంతిశ్రీ తన మేనల్లుడైన శ్రీ వీరపురుషదత్తుని ఆరవ రాజ్యపాలన సంవత్సరంలో కట్టించింది. ఈమె బంధువులైన స్త్రీలు అనేకులు ఈ చైత్యానికి స్తంభాలెత్తించి, ఇతర అలంకారాలు కూర్చి అందగింపజేశారు. క్షాంతిశ్రీ బాటలోనే నడిచి ఇక్కడ చైత్యగృహాలు, మండపాలు కట్టించిన మరొక స్త్రీ బోధిశ్రీ. చిత్రమేమంటే, ఇక్కడ బౌధ్ధస్తూపాలు, చైత్యాలు, మండపాలు కట్టించినవారు, వాటికి అవసరమైన దానాలు చేసినవారు అందరూ స్త్రీలే. ఇక్ష్వాకువంశ రాజులు, రాజబంధువులు పురుషులు వేదమతావలంబకులు, స్త్రీలు బౌధ్ధమతావలంబకులు. ఇలా ఒకే కుటుంబములోనే కొందరిది ఒక మతం, మరికొందరిది ఇంకొక మతం అయినా దానివలన కుటుంబ సౌమ్యజీవనానికి, ఐకమత్యానికి భంగం వుండేది కాదు.

హిందూదేశంలో అంతటిలోనూ అత్యుత్తమమైనదని పేరుపడింది ఆనాటి మన బౌధ్ధాంధ్ర శిల్పకళ. చెక్కడానికి తీసుకున్న వస్తువు బుధ్ధునికి సంబంధించినది అయినా, ఆనాటి శిల్పులు అప్పటి శిల్పంలో ఆనాటి మన జీవనవిధానానికి సంబంధించిన చాలా సంగతులను అందులో మేళవించి చూపించారు. ఉడుపులు, ఆభరణాలు, ఎక్కి ప్రయాణించిన బండ్లు అన్నీ ఆ కాలములో మన పూర్వులు ఉపయోగించిన వాటినే చెక్కి చూపించారు. స్త్రీలు పురుషులు తమ కేశపాశములను దిద్దుకుని అమర్చుకున్న విధానాలు, అందుకై వారు వాడిన సామగ్రి, ఆనాటి రాజప్రాసాదాల నమూనాలు, సామాన్య గృహాలు ఇత్యాదిగా అన్నీ ఈ శిల్పాలలో ప్రదర్శించబడి కనిపిస్తాయి. ఇలా నాగార్జునకొండ అంటే ఇక్ష్వాకుల కాలంనాటి  ప్రాచీనాంధ్ర సంస్కృతికి ఒక కళానిక్షేపంగా మారింది.

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ -(1)

‘ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము’ : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ గారి రేడియో ప్రసంగాల సంకలనం

మొదటి ప్రసంగం : మన దేశము – ఆంధ్రదేశ విభాగాలు – సాతవాహన యుగం

డా.నేలటూరు వేంకటరమణయ్యగారి ‘పల్లవులు-చాళుక్యులు’ గ్రంథంలోని మిగిలిన విషయాల ప్రస్తావనకు ముందు, ఆంధ్రుల చరిత్రకు సంబంధించినదే ఒక ముఖ్యమైనదైన చిన్న పుస్తకం గురించి ప్రస్తావించుకోవడం ఇక్కడ అవసరంగా అనిపించింది. 5 x 7 అంగుళాల పేపరు సైజులో 125 పుటల ఈ చిన్న పుస్తకం పేరు ‘ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము’. ఇది 1947వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలో శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఆలిండియా రేడియో, మద్రాసు కేంద్రం నుంచి విద్యార్ధులకోసం కార్యక్రమంలో చేసిన ఆంధ్రదేశ చరిత్ర ప్రసంగాల సంకలనం. ఆలిండియా రేడియో, మద్రాసు కేంద్రంవారు 1. సాతవాహనులు, 2. ఇక్ష్వాకులు, 3. విష్ణుకుండులు, 4. వేంగీచాళుక్యులు, 5. కళింగగాంగులు, 6. వెలనాటి నాయకులు, 7. ఓరుగంటి కాకతీయులు, 8. ప్రాచీనాంధ్ర వాణిజ్యము, 9. కొండవీటి రెడ్లు, 10. విజయనగర సామ్రాజ్యము, 11. గోల్కొండ సుల్తానులు, 12. ఈస్తిండియా కంపెనీ కాలు: ఆంధ్రులు అనే పన్నెండు శీర్షికల క్రింద 1857వరకు ఆంధ్రుల చరిత్ర వచ్చేటట్లుగా ప్రసంగాలు చేయవలసిందిగా శ్రీ శర్మగారిని కొరితే వారు దానికి అంగీకరించి ఒక్కొక విషయం మీదా సంగతులన్నీ పదినిమిషాల నిడివిలో అమరేటట్లుగా కుదించుకుని చేసిన ప్రసంగాల సంకలనం ఈ పుస్తకం. అప్పుడప్పుడే కొత్తగా ఏర్పడిన ‘ఆంధ్ర విశ్వభారతి సంఘం’, హైదరాబాదు వారు 1948 జులై నెలలో ఈ ప్రసంగాల పాఠాన్ని ఆలిండియా రేడియో, మద్రాసు వారి అనుమతితో యధాతధంగా పుస్తకంగా ప్రచురించారు. అనతికాలంలోనే ఈ పుస్తకం ద్వితీయ ముధ్రణంకూడా పొందింది. అప్పటికి అంటే 1948 నాటికి సంగ్రహంగానయినా 1857వరకూ ఆంధ్రదేశచరిత్ర ఒక పుస్తకంగా రావడం ఈ చిన్న పుస్తకంతోనే మొదలవడం అందుకు కారణం.

‘ఈ ప్రసంగాలలో వీలయినంతవరకు ఆయా యుగాలకు సంబంధించిన రాజకీయ, సంస్కృతి చరిత్రలను రెంటిని సులువుగా బోధపడేటట్లుగా చెప్పాను. ఒక్కొక్కటి పదేసి నిమిషాలది అవడంవల్ల ఆ కాల పరిమితిలో చెప్పడానికి వీలయినన్ని విషయాలు ముఖ్యమైనవీ పరిణామ సూచకమైనవీ చెప్పాను. అందువల్ల ఈ చరిత్ర దిఙ్మాత్ర సూచకమూ, అతి సంగ్రహమూ మాత్రమే’ అని పుస్తకానికి పీఠికలో శ్రీ శర్మగారు చెప్పుకున్న మాట. అప్పటికి (అంటే 1947-48 నాటికి) ‘ఆంధ్రదేశం అంటే మద్రాసు రాజధానిలోని తెలుగుజిల్లాలు మాత్రమే కాక, ఇంకా హైదరాబాదు రాజ్యంలోనూ, మైసూర్ రాజ్యంలోనూ, మధ్య పరగణాలుగాను, ఒరిస్సా రాష్ట్రంలోనూ ఇలా ఖండ ఖండాలుగా చీలిపోయి వుండింది. వీటన్నిటిలో హైదరాబాదు రాజ్యంలోని తెలుగు ఖండం, తెలంగానా, చాలా పెద్దదీ, ముఖ్యమైనదీ. తెలింగాణమే వ్యవహారంలో (తెలంగాణము) తెలంగానా అయింది.  ఆణె మనగా దేశం…. సముద్రతీరస్థ దేశం, రాయలసీమ, తెలంగానా – ఇవి మూడూ కలిసినది అసలు ఆంధ్రదేశం. ఇదయినా ఒక్కటిగా లేదు. దీనికి మైసూరు రాజ్యం, బస్తరు, మధ్యపరగణాలు, ఒరిస్సా లలోని, తమిళ జిల్లలలోని తెలుగుభాగాలు కలిపితే అఖండాంధ్రదేశం అవుతుంది. దీనినే మనలో కొందరు విశాలాంధ్ర అని వ్యవహరిస్తున్నారు’ అని శ్రీ శర్మగారు పీఠికలో ఇచ్చిన అదనపు వివరణ. శ్రీ శర్మగారి ఈ ప్రసంగాలన్నిటినీ చదివితే, ఆంధ్రదేశచరిత్రకు సంబంధించి ఒక విహంగ వీక్షణం అతి తక్కువకాలంలో పూర్తై రెండువేల సంవత్సరాల ఆంధ్రదేశచరిత్ర పై ఒక అవగాహ తప్పక ఏర్పడుతుంది.

ఇక ప్రసంగాలలోని విషయానికి వస్తే, మొదటి ప్రసంగంలోని విషయం, సంక్షిప్తంగా:

దక్కను పీఠభూమిలోని తూర్పుభాగమంతా ఇంచుమించుగా ఆంధ్రదేశమని చెప్పవచ్చును. తెలంగానా తప్ప మిగిలిన ఆంధ్రదేశమంతా (అప్పటి) మద్రాసు రాజధానిలోనే ఉంది. ఈ దేశమంతా నైసర్గికంగా మూడు విభాగాలుగా ఉంది; (1) తెలంగానా (2) తెలంగానాకు తూర్పున సముద్రపు ఒడ్డునే వున్న తెలుగుజిల్లాల భాగం (3) తెలంగానాకు దక్షిణాన ఉన్న తెలుగుజిల్లాలభాగం. తెలంగానాకు తూర్పుగా ఉన్న భాగానికి మధ్యాంధ్రమనీ, పూర్వాంధ్రమనీ పేర్లు. తెలంగానాకు దక్షిణాన ఉన్న భాగం పశ్చిమాంధ్రదేశం; రాయలసీమ అనికూడా అంటారు. తూర్పుకనుమలు అనే కొండలు తెలంగానాకూ పూర్వాంధ్రానికీ మధ్యగా ఈశాన్యపు దిక్కునుంచి నైరృతి దిక్కుగా వ్యాపించి ఈ రెండు భూభాగాలనూ విడదీస్తున్నాయి. కృష్ణానది, ఈ నదికి ఉపనది అయిన తుంగభద్రానది, తెలంగానాకూ రాయలసీమకూ మధ్యగా ప్రవహిస్తూ ఈ రెండు భూభాగాలనూ విడదీస్తున్నాయి. రాయలసీమలోని ఉత్తర, పశ్చిమ భూభాగాలూ, పూర్వాంధ్రదేశంలోని పడమటి భూభాగమూ అంతా కొండలమయం.

గోదావరికి ఉత్తరాన ఉన్న భూభాగానికి పూర్వకాలంనుంచీ కళింగమని పేరు. కళింగదేశమంతా కూడా పర్వతప్రాంతమే. కళింగదేశవాసులకు కాళింగులని పేరు.

సాతవాహనులు ఆంధ్రులలోని ఒక తెగవారు; ఆంధ్రులే. పూర్వపు గ్రంథాలవల్లనూ, ఈ వంశపు రాజులు రాళ్ళమీదా కొండగుహలలోనూ చెక్కించిన శాసనాలవల్లనూ, వీరి నాణెములవల్లను వీరి చరిత్ర కొద్దికొద్దిగానయినా తెలుస్తుంది.

మనదేశాన్ని పాలించిన శాతవాహన వంశపు రాజులు మొత్తం ముఫ్ఫై మంది. వీరందరూ కలిసి నాలుగందల యాభై సంవత్సరాలకుపైగా పాలించారని తెలుస్తుంది. పురాణాలలో ఈ ఆంధ్రవంశపు రాజుల ముఫ్ఫైమంది పేర్లూ, పరిపాలనా కాలాలూ ఉన్నాయి. వీరిలో శ్రీశాతకర్ణి, కుంతల శాతకర్ణి, సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి అని ఇలా చాలామందికి పేరు చివరన శాతకర్ణి అని ఉండడం వలన వీరికి కర్ణిరాజులనీ, వీరు పరిపాలించిన దేశం కర్ణినాడు అనీ పేరు కలిగింది. కర్ణినాడే ఇప్పటి కర్నాడు, కర్నాట దేశం.

క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో సిముకుడు, శ్రీముఖుడు అనే సాతవాహనరాజు ఆంధ్రరాజ్యం స్థాపించి సాతవాహనవంశ రాజులకు మూలపురుషుడయ్యాడు. ఆంధ్రరాజ్యానికి మొదట కృష్ణానదికి వొడ్డున వున్న శ్రీకాకుళం రాజధానిగా వుండేదనీ, తరువాత ఇప్పటి గుంటూరు జిల్లాలో అమరావతికి దగ్గరలోని ధరణికోట (అప్పటి ధాన్యకటకం) రాజధాని అయ్యిందనీ చెబుతారు. శ్రీముఖుడు మగధరాజుల అధికారాన్ని ధిక్కరించి స్వతంత్రుడయిన వాడు. అప్పటిలో ఉత్తరహిందూస్తానంలోని మగధ చాలా గొప్ప సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యానికి పాటలీపుత్రం (ఇప్పటి పాట్నా) రాజధాని. మౌర్యవంశ రాజులయిన చంద్రగుప్తుడు,  బిందుసారుడు, అశోకుడూ వంటి వారి తరువాత బలహీనులయిన రాజులు మగధ సింహాసనాన్ని అలంకరించారు. వీరిని జయించి శుంగవంశపు రాజులు, కణ్వవంశపురాజులూ కొంతకాలం మగధను ఏలారు. ఈ కాలంలోనే శ్రీముఖుడు మగధమీద తిరుగుబాటు చేసి వారిని జయించి మగధను సైతం ఆక్రమించుకున్నాడు. అయితే, మగధ సాతవాహనుల క్రింద ఎంతకాలం ఉన్నదో తెలియదు. మగధలాగే కళింగంకూడా సాతవాహనుల పాలన కింద ఎక్కువకాలం ఉండలేదు. కలింగదేశ చేదివంశపు రాజులలో ప్రముఖుడైన ఖారవేలుడు పరాక్రమవంతుడైన రాజు. శ్రీశాతకర్ణి అనే మూడవ సాతవాహనరాజూ ఇతడూ సమకాలీనులు.

శ్రీముఖుడు, ఇతడి సోదరుడైన కృష్ణుడు, ఇతని తరువాత సింహసనాన్ని అధిష్ఠించిన శ్రీశాతకర్ణి – ఈ ముగ్గురూ రాజ్యతంత్రంలోనూ, యుధ్ధతంత్రంలోనూ చాలా సమర్ధులు. వింధ్యకు దక్షిణాన వున్న భారతదేశంలో అశ్వమేధయాగం చేసిన మహారాజులలో మొదటివాడు శ్రీశాతకర్ణి. ఇతని కాలంలో ఆంధ్రరాజ్యం తూర్పున బంగాళాఖాతం మొదలుకుని పడమట అరేబియాసముద్రం ఎల్లలుగా వ్యాపించింది. ఈ మువ్వురి తరువాత శాతవాహనరాజులలో ముఖ్యులుగా మరి ముగ్గురు రాజులను చెబుతారు; వారు హాలుడు, గౌతమీపుత్ర శ్రీశాతకర్ణి, గౌతమీపుత్ర యజ్ఞశ్రీశాతకర్ణి. వీరిలో హాలమహారాజు ప్రాకృతకవులనెందరినో ఆదరించి పోషించాడు. తానూ, తన సమకాలీనులైన ప్రాకృతకవులు. తనకు పూర్వం ఉన్నవారు ప్రాకృత భాషలో చెప్పిన గాథలలో రత్నాలవంటి వాటిని ఏడువందలను ఏరి ‘గాథాసప్తశతి ‘ అనే గ్రంథాన్ని కూర్చాడు. ప్రాకృత ఛ్ఛందస్సులో వ్రాసిన పద్యాలను గాథలని అంటారు. ఇప్పటికీ లభ్యమవుతున్న ఈ గాథాసప్తశతి వలన హాలుడు భారతీయ సాహిత్యలోకంలో కూడా అమరుడయ్యాడు. హాలునికి గుణాఢ్యుడు, శర్వవర్మ అనేవారు ఇద్దరు మంత్రులు. గుణాఢ్యుడు ప్రాకృతభాషలో బృహత్కథ అనే గొప్ప కథలపుస్తకాన్ని రచించాడు. సంస్కృత వాఙ్మయంలోని ఎన్నో కథలకు ఈ గ్రంథం మూలం.  శర్వవర్మ ‘కాతంత్రం’ అన్న పేరుతో ఉన్న సంస్కృత వ్యాకరణం రచించాడు.

హాలుని తరువాత కొంతకాలం ఆంధ్రరాజ్యం ప్రభ తగ్గిపోయింది. ఈ కాలంలో పడమటిదేశాలనుంచి శకులు, పహ్లవులు, యవనులు అనే కొత్తజాతులవారు దేశంలో ప్రవేశించి పంజాబులోని పడమటి సముద్రవొడ్డునే వున్న మాళవము, సౌరాష్ట్రము, ఘూర్జరము, అవంతి, అపరాంతము మొదలైనదేశాలలో ప్రవేశించి వ్యాపించారు. వీరంతా మొదట ఉత్తరదేశంలోని మహారాజులకు సామంతులు; క్షత్రపులని వీరిని అంటారు. వీరు నెమ్మదిగా చిన్నచిన్న రాజ్యాలను స్థాపించుకుని, వారికి పొరుగున ఉన్న ఆంధ్రరాజ్యంపైకి దండయాత్రలు చేసి సాతవాహన రాజ్యానికి ముప్పుకలిగించడమే కాకుండా, ఆ రాజ్యంలోని పశ్చిమ భాగాన్ని ఆక్రమించుకున్నారు. ఈ క్షత్రపులలో ముఖ్యంగా చెప్పుకోవలసినవారు భూమక, నహపానులు.  నహపానుని విజృంభణానికి ఆంధ్రరాజ్యం అల్లకల్లోలం అయింది. ఈ కాలంలో ఆంధ్రదేశాన్ని రక్షించిన వీరాధివీరుడు గౌతమీపుత్ర శ్రీశాతకర్ణి.  ఇతడు శక, యవన, పహ్లవ సైన్యాలను అనేక యుధ్ధలలో ఓడించాడు. నహపాణున్ని జయించాడు. వాళ్ళ రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. శక పహ్లవాదులు గౌతమీపుత్ర శ్రీశాతకర్ణికి సామంతులయ్యారు. ఈ మహారాజు కాలంలో ఉత్తర కొంకణం, ఉత్తర మహారాష్త్రం, సురాష్ట్రం, మాళవదేశం, తూర్పు రాజపుతానా, మధ్యపరగణాలు, బేరారు మొదలైన దేశాలన్ని ఆంధ్రరాజ్యంలో భాగాలయ్యాయి. దీనితో అప్పటి ఆంధ్ర రాజ్యానికి తూర్పున బంగాళాఖాతమూ, పశ్చిమాన అరేబియాసముద్రమూ ఎల్లలయ్యాయి.

గౌతమీపుత్ర శ్రీశాతకర్ణి మరణానంతరం మళ్ళీ శకరాజులు విజృంభించారు. వారు ఉజ్జయిని రాజధానిగా చేసుకుని క్రమంగా బలపడి, ఇదివరలో తాము పోగొట్టుకున్న భూభాగాలను ఆంధ్రరాజ్యంనుంచి తిరిగి ఆక్రమించుకున్నారు. దీనితో కడపటి సాతవాహనరాజులకు పడమటిదేశమనేది లేకుండా పోయింది. కేవలం ఆంధ్రదేశానికే వారు ప్రభువులయ్యారు. గొప్ప సాతవాహన రాజులలో యజ్ఞశ్రీశాతకర్ణి చివరివాడు. ఇతడు పశ్చిమ క్షత్రపులమీదికి దండెత్తివెళ్ళి వారిని జయించి, ఉత్తర మహారష్ట్రం, అపరాంతం మొదలైన దేశాలను తిరిగి ఆక్రమించుకున్నాడు. ఇతని శాసనాలు నాసిక, కణ్హేరి గుహలలో కనుపించాయి.

సాతవాహనులు పరిపాలించిన కాలంలో ప్రజలు అన్నివిధాలా అభివృధ్ధి చెందారు. బౌధ్ధమతం ఆ కాలంలో విరివిగా వ్యాపించి ఉండింది. అప్పటి ఆంధ్రదేశంలో ఎన్నో బౌధ్ధస్తూపాలు, బౌధ్ధవిహారాలూ నిర్మించబడ్డాయి. స్తూపం బుధ్ధుని నిర్యాణానికి చిహ్నం. స్తూపము,  బౌధ్ధుల ప్రార్ధనా స్థలము, బౌధ్ధ బిక్షువుల వసతి గృహాలు అన్నీ కలిసివున్న ప్రదేశానికి విహారము అని పేరు. దీనినే సంఘారామము అని కూడా అంటారు. ధాన్యకటకం, భట్టిప్రోలు, గుంటుపల్లి, ఘంటసాల, చినగంజాం మొదలైన చాలా చోట్ల బౌధ్ధస్తూపాలు నిర్మించబడ్డాయి. ఈ స్తూపాల నిర్మాణంలో బుధ్ధునికి సంబంధించిన కథలనన్నిటినీ పాలరాతి ఫలకాలపై చెక్కి స్తూపాలలో అమర్చారు. ఆనాటి ఆంధ్ర శిల్పుల పనితనానికి ఇవి మంచి నిదర్శనాలుగా ఉన్నాయి. స్తూప నిర్మాణాన్ని ఆశ్రయించుకుని ఆనాటి శ్రిల్పకళ వర్ధిల్లింది. ఆనాడు హిందూదేశం అంతటిలోనూ మన కళకు దీటైనదిలేదు. బౌధ్ధ సంఘారామాలు గొప్ప విద్యాపీఠాలు. ఎందిరికో ఇక్కడ విద్య లభ్యమయేది. అప్పటి విద్యాపీఠాలలో ధాన్యకటక విద్యాపీఠం చాలా గొప్పది.

సాతవాహనుల కాలంలో మనదేశం రోము మొదలైన పడమటిదేశాలతోనూ, తూర్పు దేశాలతోనూ ద్వీపాలతోనూ వర్తకవ్యాపారాలు బాగా సాగించింది. మనదేశంలోని ఎన్నో రేవుపట్టణాలనుంచి ఓడలు సరుకులతో బయలుదేరి విదేశాలకు వెళ్ళేవి. గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడల వర్తకానికి ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చాడు. ఈ మహారాజు నాణేలమీది లంగరు ఓడ ముద్రలున్నాయి. ఆనాడు తూర్పు సముద్రాల మీద ఆధిపత్యం ఆంధ్ర శాతవాహనులది గానే ఉండేది. అప్పటిలో ఒక్కొక రకం వస్తువులతో వ్యాపారం చేసేవారు ఒక్కొక సంఘంగా ఏర్పడేవారు; నూనె వర్తకం చేసేవారిది ఒక సంఘం, బట్టల వర్తకం చేఏవారిది ఒక సంఘం; ఇట్లా చాలా వ్యాపార సంఘాలుండేవి. ఈ సంఘాలు ఇప్పటి బ్యాంకుల లాగా పనిచేసేవి. ఎంతోకొంత డబ్బు ఈ సంఘాలలో వేస్తే, ఆ డబ్బుమీద సంవత్సరానికి వచ్చే వడ్డీకి సరియైన సరుకును ఏటేటా సరఫరా చేసేవారు.

ఓడల వర్తకంతో మన మతం, మన విద్య, మన కళలూ అన్నీకూడా తూర్పు దేశాలకు, ద్వీపాలకు వెళ్ళాయి. తద్వారా భారతీయ సంస్కృతినీ, నాగరికతనూ తూర్పు దేశాలకూ, ద్వీపాలకూ వ్యాపింపజేసిన మొట్టమొదటివారు మనపూర్వులు బౌధ్ధాంధ్రులూ, కాళింగులూ.

మనదేశంలో అప్పుడు బౌధ్ధమతం ఎక్కువగా వ్యాపించినా వేదమతమూ లేకపోలేదు. అప్పటికి నాలుగు వర్ణాలూ ఉన్నాకానీ, యిప్పటిలాగా మన మతం కొయ్యబారి ఉండేదికాదు. మనదేశానికి వచ్చిన శకులు, పహ్లవులు, యవనులు మన మతమవలంబించి శివుణ్ణి, విష్ణుని పూజించేవారు. బుధ్ధుని పూజించిన విదేశీయరాజులూ ఉన్నారు. అప్పటి మతం వారందరికీ చోటిచ్చి ఆదరించింది. సాతవాహనులు వేదమతావలంబకులు, యజ్ఞయాగాదులు చేశారు. అదే విధంగా బౌధ్ధమతాన్నీ ఆదరించారు. శాతవాహనుల కాలంలోనే ఉండిన ఆచార్య నాగార్జునుడు గొప్ప బౌధ్ధ సన్యాసి. ధాన్యకటకంలోని అమరావతీ స్తూపం చుట్టూ జీవకళ ఉట్టిపడేటట్లు బుధ్ధుని కథలను బొమ్మలుగా చెక్కిన రాళ్ళతో ఒక గొప్ప ప్రాకారాన్ని నిర్మింపజేశాడు. నాసిక్, నానాఘాటు, కార్లాలోని గుహలు వర్షాకాలం నాలుగునెలలకాలం బౌధ్ధసన్యాసులు ఉండే నిమిత్తం శాతవాహనరాజులచే నిర్మించబడినవే. కార్లా చైత్యగ్రృహం బౌధ్ధ ప్రార్ధనాలయం, అత్యధుతమైన సుందర నిర్మాణం.  వీటన్నిటి వలన ఆనాటి సాతవాహన రాజులు వేదమతావలంబకులయినా ఎంతటి మతసహనంకలవారో, ఎంతటి బౌధ్ధ మతాభిమానులో తెలుస్తుంది. భారతదేశంలో దాక్షిణాత్య సంస్కృతికి పునాదులు వేసిన వారు ఆంధ్ర సాతవాహనులే!