సీతాకోకచిలుకలు – Common Crow butterfly

Euploea core – Common Crow butterfly

దక్షిణ ఆసియా దేశాలలో సర్వ సాధారణంగా కనుపించే సీతాకోకచిలుక ఈ Common Crow. భారతదేశంలో ఈ సీతాకోకచిలుకను Common Indian Crow అని కూడా అంటారు. అలాగే, ఆస్ట్రేలియాలో Australian Crow అనీ పిలుస్తారు. Nymphalidae కుటుంబంలోని Crows and Tigers అనే ఉపకుటుంబానికి చెందిన ఈ Common Crow సీతాకోకచిలుక పూర్తి శాస్త్రీయ వర్గీకరణ (Scientific classification) ఇలా ఉంటుంది – Kingdom: Animalia, Phylum: Arthropoda, Class: Insecta, Order: Lepidoptera, Family: Nymphalidae, Genus: Euploea, Species: Euploea core.

Euploea core (image-1)

ఈ Common Crow సీతాకోకచిలుక రెక్కలు 6-8 సెం.మీ., నిడివితో విశాలంగా ఉండి చాలా నునుపుగా (glossy) మెరుస్తూ ఉంటాయి. ముదురు గోధుమ రంగులో ఉండే ఈ  రెక్కలపై అంచుల పొడుగూతా రెండు వరసలుగా తెల్లని మచ్చలు, నల్లని శరీరంపై కూడా ప్రస్ఫుటమైన తెల్లని మచ్చలూ ఉంటాయి. ముందు రెక్క (Fore wing) అంచుల పొడుగూతా ఉన్న తెల్లని మచ్చలలో లోపలి వరుసలోని మచ్చలు దాదాపుగా అండాకృతిలో ఉంటాయి, అంచుకు ఆనుకుని ఉన్న మచ్చల వరస సాధారణంగా రెక్క పై అంచుదాకా కొనసాగకుండా చివరకు చేరే కొలదీ పరిమాణం  తగ్గుతూ పోయి, రెక్క చివర (apex) లో ఒకటి లేదా రెండు చిన్న మచ్చలతో అంతమవుతుంది. వెనుక రెక్క (hind wing) పై ఉన్న తెల్లని మచ్చలు ముందు రెక్క మీది  మచ్చలతో పోలిస్తే పరిమాణంలో  పెద్దవిగానూ, చివరలకు సాగి (elongated) ఉన్నట్లుగానూ కనబడతాయి.

Euploea core (image-2)

ఈ సీతాకోకచిలుక రెక్కలపై మచ్చలున్న తీరు ఇంత వివరంగా వర్ణించడం ఎందుకంటే, ఈ వివరం సహాయంతోనే రూపంలో ఈ Common Crow సీతాకోకచిలుకను అనుకరించే (mimicry) Double Branded Crow, Brown King Crow వంటి సీతాకోకచిలుకలను గుర్తించడానికి వీలవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఈ రూపంలో అనుకరణ (mimicry) అనే ప్రక్రియను గురించి కొంత చెప్పుకోవాలి.

సీతాకొకచిలుకలలో ఈ రూప అనుకరణ (mimicry) అనేది ఒక రక్షణ విధానం. తమను తాము శత్రువులనుంచి రక్షించుకోవడానికి ఈ విధానాన్ని కొన్ని సీతాకోకచిలుకలు అనుసరిస్తాయి. జీవ పరిణామ క్రమంలో (evolutionary biology) ఈ mimicry అనేది ఒకటి లేదా రెండు రకాలకు చెందిన జీవులు వాటి రెండింటికీ సంభంధించిన శత్రువులనుంచి (common enemy or predator నుంచి) తమను తాము రక్షించుకోవడానికి అవలంబించే రూపసామ్యత విధానం. దీనినే mimetism అని కూడా అంటారు. ఈ mimetism ను, ఇప్పుడు Common Crow సీతాకోకచిలుకను ఉదాహరణగా తీసుకుని చెప్పుకుంటే —

ఈ Common Crow సీతాకోకచిలుక ఆహార యోగ్యమైనది కాదు (inedible). ఏ ఇతర జంతువు దీనిని ఆహారంగా తీసుకోదు. ఈ సీతాకోకచిలుకకు ప్రకృతిసిధ్ధంగా సంక్రమించిన లక్షణం ఇది. ఈ లక్షణం వలన దీని ప్రయత్నం ఏమీ లేకుండానే ఈ సీతాకోకచిలుక ఇతర జంతువులనుంచి చంపబడకుండానూ, ఆహారంగా తీసుకోబడకుండానూ రక్షించబడుతూ వుంటుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు జరిగిన జీవ పరిణామ క్రమంలో ఈ సంగతిని గ్రహించిన కొన్ని సీతాకోకచిలుకలు వాటిని అవి ఇతర జంతువులచే ఆహారంగా తీసుకోబడకుండా రక్షించుకోవడానికి ఈ Common Crow సీతాకోకచిలుకతో రూప సామ్యాన్ని తెచ్చుకోవడం ద్వారా సాధించ గలిగాయి. అలాంటి కొన్ని సీతాకోకచిలుకలు Double Branded Crow, Brown King Crow, Malabar Raven, Common Mime అనే పేర్లు కలవి. ఇది సంక్షిప్తంగా సీతాకోకచిలుకలలో mimetism లేదా mimicry కి సంబంధించిన సంగతి.

ఈ క్రింది ఫోటోలలో ఉన్నవి Common Crow సీతాకోకచిలుకకు అనురూపాలైన – mimic లైన – Double Branded Crow (Euploea sylvester) సీతాకోకచిలుకలు. చూడడానికి అంతా Common Crow సీతాకోకచిలుక లానే అనిపించే ఈ సీతాకోకచిలుకలు నిజానికి Double Branded Crow సీతాకోకచిలుకలని గుర్తించడానికి సాధనం, వీటి ముందు రెక్క (Fore wing) అంచునే అనుకుని సాగే తెల్లని చుక్కల వరుస రెక్క చివరిదకా (apex దాకా) చుక్కల పరిమాణంలో పెద్దగా తేడా ఏమీ లేకుండా సాగి apex దగ్గర అంతమవడం. ముందు  చెప్పుకున్నట్లుగా Common Crow సీతాకొకచిలుకకు ముందు రెక్క అంచున సాగే చుక్కలు ఇలా ఉండకుండా apex కు చేరే కొలదీ పరిమాణం తగ్గుతూ పోయి  apex కి చేరే లోపలే సన్నని కనుపించీ కనుపించని మచ్చలుగా అంతమవుతాయి.

Euploea sylvester (image-1)

Euploea sylvester (image-2)

ఈ సీతాకోకచిలుకల ఫోటోలన్నీ నేను బెంగళూరు, లాల్ బాగ్ బొటానికల్ గార్డన్స్ లో తీసినవి.