యక్షగానం – (దేశీ) భాష, భావ సౌందర్యాలు

ఆంధ్ర దేశంలో ఒకప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉండిన రూపక ప్రక్రియ ‘యక్షగానం’. యక్షగానం అంటే యక్షులచే పాడబడే పాట అని సామాన్యార్ధం. ఒక రూపక ప్రక్రియగా తీర్చిదిద్ది, ఒక ప్రత్యేకమైన రూపాన్ని సంతరించి పెట్టి యక్షగానానికి బహుళ ప్రచారాన్ని ఆంధ్రులు సాధించి పెట్టారు. తెలుగులో దాదాపుగా అయిదువందలకు పైగా యక్షగానాలు లభ్యమవుతున్నాయని చెబుతారు. లభ్యం కానివి దాదాపు రెందువందలకు పైగా ఉన్నాయట! అంటే మొత్తంగా ఈ వాజ్మయంలో ఏడువందలకు పైనే రచనలు వున్నాయని తెలుస్తుంది. దేశీ ఛందో రూపాలయిన ద్విపద, రగడ, దరువు, ఏల  మొదలైనవాటిని ఈ యక్షగానాలలో వర్ణనలకు విస్త్రుతంగా వాడడంచేత పండితులచే ఒకప్పటిదాకా ఇవి సాహిత్యంగా గుర్తింపబడక పోయినప్పటికీ, ఆ తరువాతి కాలంలో సాహిత్యాన్ని చూసే చూపులో మార్పులు వచ్చి, యక్షగానం కూడా తెలుగులో ఒక ముఖ్యమైన సాహిత్య ప్రక్రియగా పండితులైనవారి చేత కూడా గుర్తింపబడి మన్ననలందుకుంది.

తంజావూరు, మధుర ప్రాంతాలలో ఒకప్పుడు విజయనగర రాజులకు సామంతులుగా వుండి, అవిభాజ్య విజయనగర సామ్రాజ్య పతనానికి కారణంగా చరిత్ర ప్రసిధ్ధి కెక్కిన ‘రక్షసతంగడి’ యుధ్ధా (క్రీ.శ.1565) నంతర పరిణామాలలో స్వతంత్రులై పాలించిన నాయకరాజవంశంతో యక్షగానానికి అవినాభావ సంబంధం వుంది. ఈ వంశంలోని చాలా మంది రాజులు యక్షగానాన్ని ఎంతగానో అభిమానించి ఆదరించారు. వారిలో కొంతమంది పలు ఇతివృత్తాలతో యక్షగానాలనూ రచించారు. తంజావూరు యక్షగాన విలసనానికి కేంద్రంగా, ప్రథాన రంగస్థలంగా మారింది.  క్రీ.శ.1600-1631 మధ్య కాలంలో పాలించి, చేమకూరి వేంకటకవి విరచిత ‘విజయ విలాసము’ వంటి పేరుపొందిన ప్రబంధాలకు కృతిభర్తయైన రఘునాథరాయల ప్రాపు యక్షగానానికి మొదటలోనే దొరకడంచేత నాయక రాజుల కాలంలో ఆ ప్రక్రియలో రచనలు విశేషంగా పెరిగాయి.

క్రీ.శ.1670ల అనంతర కాలంలో నాయకరాజుల పాలన ముగిసి, తంజావూరు ప్రాంతం మాహారాష్ట్ర రాజుల పాలనలోకి వెళ్ళింది.  వారూ యక్షగానాన్ని అభిమానించి ఆదరించారు. అటువంటి మహారాష్ట్ర రాజులలో శాహాజీ రాజు యక్షగానానికి సంబంధించి బహుళ ప్రసిధ్ధుడు. సాహిత్యాభిలాషి, రసికుడు అయిన రాజు. ఎన్నో యక్షగానాలను అంకితం పుచ్చుకున్నాడు. దాదాపు ఇరవై దాకా యక్షగానాలను తాను రచించాడు. యక్షగానంలో కొన్ని మార్పులను చేసి, హాస్యరస ప్రథానమైన ‘ఆస్థాన సంతోషి’ అనే సాంప్రదాయిక పాత్రను యక్షగానాలలో కొత్తగా ప్రవేశపెట్టిన ఘనత శాహాజీదే అని చెబుతారు.

గానం, (అభినయంతో కూడినదైన) నాట్యం అనే రెండు ప్రథానమయిన అంగాలు యక్షగానానికి ప్రాణం. సాహిత్యం, భాష అనేవి రెండూ ఉపాంగాలు అనుకోవాలి. అయితే ఏ రచనకైనా భావ సౌందర్యం బలంగా ఉండి వెలుగుతున్నపుడు, ఆ వెలుగు భాష మీదికి కూడా ప్రసరించి అందులో లోపాలు ఏవైనా ఉన్నప్పటికీ వాటిని కప్పివేస్తుంది. యక్షగానాలలో దీనిని సమర్ధించే ఉదాహరణలు కనబడతాయి. యక్షగానం ఎక్కువగా భావసౌందర్యం మీదనే ఆధారపడి బ్రతికింది అనడం అతిశయోక్తి కాదు. చెప్పదలుచుకున్న, చూపించదలుచుకున్న భావాన్ని సాదా మాటలలో సంక్లిష్టత లేకుండా చెప్పడం ఈ ప్రక్రియకు అవసరం అన్నది ఆయా రచయితలచే ముందుగానే గుర్తించబడి, తదనుగుణంగానే రచనలు చేయబడ్డాయి అనిపిస్తుంది.

కథ నడుస్తున్నపుడు, రంగస్థలం మీదికి తరువాతి క్షణాలలో రాబోయే పాత్రను గురించిన ప్రస్తావన, సంక్షిప్త వివరణ (introduction) ఇవ్వడం, నాట్య పధానమయిన యక్షగానం వంటి రూపక బేధాలలో ఒక ప్రత్యేక పధ్ధతి. ఈ వివరణ అనేది సాధారణమయిన విన సొంపైన మాటలతోనూ, ఆ మాటల వలన ఆ పాత్ర రూపం వీక్షకుని మనస్సులో క్షణంలో మెదీలేదిగానూ ఉండేలా చెప్పబడడం జరుగుతుంది. ఉదాహరణకు, శ్రీ కృష్ణతులాభారం కథను ఇతివృత్తంగా చేసుకుని రచించబడిన ఒక యక్షగానంలో సత్యభామ ప్రవేశాన్ని సూచించే ఈ వర్ణన –

“ముత్యాలకమ్మచాయ – చెక్కిళ్ళ వింతవెన్నెల కాయ
చిత్తరుబొమ్మచాయ – వచ్చెను శ్రీ సత్యభామ వచ్చె”

చెవులకున్న ముత్యాల కమ్మల నుంచి వెలువడుతున్న వెలుగులు, చెక్కిళ్ళ మీదికి ప్రసరించి వింతైన వెన్నెలలను కాయిస్తున్నాయని అలంకారికంగా (ఉత్ప్రేక్ష) చెప్పబడింది ఇందులో.

అదే యక్షగానంలో నారదుని ప్రవేశాన్ని సూచించే ఒక వర్ణన –

“కలహమె కళ్యాణమని – కౌతుకమున బలుకుచు
మెల్లన వీణె వాయించుచు – మేలైన నారదుడు వచ్చె

మేనంత విభూతి బూసి – మెఱుగు జడల ముడివేసి
దానవారి స్మరణ జేసి – తాండవ మాడుచు వెడలె తపసి”

కలహ భోజనుడు, నారాయణ నామాన్ని సర్వదా జపిస్తూ, నారాయణుని సకల వేళలా  స్తుతిస్తూ, భజిస్తూ తిరుగుతూండేవాడయిన నారదుని గురించిన వర్ణన ఇందులో ఆ ముని రూపాన్ని కళ్ళకు కట్టిస్తుంది. ఇందులోనే ‘తాండవ మాడుతు’ అన్న మాట ఉంది. ‘తాండవం’ అనేది ఉధ్ధతమైన నృత్యం (శివ తాండవం). మందగమనంతో నడుస్తూ ఒక రకమయిన నృత్య భంగిమలో సాగే నారదుని నడకకు ఈ మాట సరిపోతుందా అన్న సందేహం కలుగుతుంది ఇక్కడ. అయితే, ‘తాండవం’ అన్న మాటకు ‘మామూలు గమనంలో నడక’ (motion in general, however slight) అన్న అర్ధాన్ని కూడా ఇచ్చింది బ్రౌణ్య నిఘంటువు. ఈ అర్ధంలోనే ఇక్కడ ఈ మాటను గ్రహించాల్సి ఉంటుంది.

ఆ యక్షగానం లోనిదే, రుక్మిణీదేవి ప్రవేశాన్ని సూచించే వర్ణన –

“వలరాజు శరమనంగ
అల రతి చేత విలసిల్లు చిలుక యనంగ
తొలకరి మెఱుపనంగ రుక్మిణి వచ్చె
పలుచని చెక్కిళ్ళు మెఱయగ”

‘తొలకరి మెఱుపు’ అని పోలిక! అందమైన ఆనందకరమైన భావం.

స్తీ, పురుషుల (నాయకీ, నాయకుల) మధ్య ప్రణయం, తదనుబంధ మోహం అనేవి మొదటినుండీ కావ్యానికి వస్తువులు. యక్షగానమూ అందుకు మినహాయింపేమీ కాదు. తమదైన శైలిలో, భాషలో ఈ భావాలను వర్ణించి రక్తి కట్టించాయి. ఉదాహరణకు, ఒక యక్షగానంలోని ఈ వర్ణన –

“మోహసాగరములో మునుగుచు దేలుచు
దేహము తల్లడింపగా
మోహనాకార నీ మోముజూడగ కొంత
ముచ్చట దీరెగదా!”

ప్రేమలో (విరహంలో) తనకు ఇష్టుడైన (ప్రియుడైన) వ్యక్తిని పదే పదే చూడాలని మనసు కొట్టుకుంటుంది. ఈ అవస్థను, విరహ బాధను ఒక ప్రియురాలు అలంకారికంగా, అన్యాపదేశంగా  ఒక యక్షగానంలో వర్ణించి వినిపించిన తీరు ఈ విధంగా ఉంది –

“నిదురలో నొకనాడు నినుజూచి నందుకే
నిలువున కరిగితిగా!
ఎదురుగా వచ్చి నన్నెలయించి పోతేను నే
నేలాగు వేగింతురా!

వలపువక్కణ జాబు వ్రాసి యంపెదనంటే
వద్దనెవ్వరు లేరుగా
చెలులెల్ల నను గేలిసేసేవారే గానీ
చేరదీసేవారు గారుగా!”

ఇందులో, (నే నేలాగు) ‘వేగింతురా!’ అనే పదంలో ఉండవలసిన సౌందర్యమంతా ఇమిడి వుంది. (నే నేలాగు) ‘వేగుదురా!’ అనే అర్ధంలో వాడబడిన మాట కాదు ఇది. ఒక్కసారిగా ప్రియుడు  నిజంలో ఎదురుపడి మాయమైతే, ఆ పై గడిచే క్షణాలను ఎలాగ  తట్టుకుని, సహించి భరించి కాలం వెళ్ళదీయాలి? అనే అర్ధంలో వాడినది. రెండవ చరణంలోని ‘వలపు వక్కణ’ అనే మాటకు ‘వక్కణము’ లేదా ‘వక్కాణము’- అంటే సమాచారము అనే అర్ధంలో ‘వలపు సమాచారాన్ని జాబుగా వ్రాసి పంపుదామంటే’ అని చెప్పుకోవాలి.

విరహ తాపాన్ని మరింత ఎక్కువ చేయ వద్దని చంద్రునితో అలంకారికంగా చెప్పుకుంటున్న ఒక ప్రియురాలి వేదన ఒక యక్షగానంలో  ఇలా ఉంది –

“వెన్నెల వెదజల్లకు చందమామయ్య
వెన్నెల వెదజల్లకు
పున్నమ జాతరజేసి నిన్ను వేడుకొందుగాని

పొలయల్కదీరి నా చెలువుడు నన్ను జేరి
కళలజొక్కించి నన్ను గౌగిట నుంచి
తళుకుచెక్కిలిపైన గుచ్చినగోరులను
నెలవంకలంచును నీపేరు పెట్టెదగాని!”

మరొక చోట, విరహతాపంలో వున్న ఒక ప్రియురాలి బాధను చూడలేక, ఆమె మనసు మళ్ళించాలనీ తద్వారా ఆమెకు కొంత శాంతిని చేకూర్చాలనీ ఆశపడి ఆమె చెలికత్తె ఒకరు ఆమెను వనవిహారానికి బయలుదేరదీసే సన్నివేశంలోని పాట –

“వనజాక్షి నీకింత వగపేల లేవె ఈ
వన వైఖరిని జూచి వత్తాము రావె.

విరిదేనెలు జాలువాఱీని
వికసించి పొదలింపుమీఱీని
కరువలి పేరెములు వాఱీని
గండుతేటులు బారుదీఱేని

గొరువంకలు మాటలాడేని  కోయిలజవరాలు పాడేని
చెఱకువిల్తుడు మర్లాడేని  చిలుకలెల్ల గుంపుగూడేని
కామునిబలములు వాలేని  కపురంపుదుమ్ములు రాలేని
ఆమని వనరాజ్యమేలేని  ఆనందంబున దేలేని.”

మొదటి చరణంలో ‘కరువలి’ అంటే  గాలి, ‘పేరెములు వాఱు’ అంటే మందముగా (సామాన్యమైన నడకతో) వీయు అని అర్ధం.

ఇప్పటికి, సహజమైన భావ, భాషా సౌందర్యాలతో నిండి వున్న ఈ ఉదాహరణలతో ఇక్కడిదాకా! ఇంకా ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలతో, ముందు ముందు మరొకసారి ఎప్పుడైనా!