శ్రీనాథుని ‘శివరాత్రి మాహత్మ్యం’ నుండి కొన్ని పద్యాలతో ఈ రాత్రి….(2)

‘లేలెమ్మెక్కడి వాండవు
పాలసముద్రమున భోగిపర్యంకమునం
దేలెద వొక్కండవు నను
ద్రైలోక్యాధీశు నెఱుంగుదా పరమేష్ఠిన్?’                                              (ప్రథమాశ్వాసం 80వ పద్యం).

పరమేశ్వర కల్పిత మాయా గర్వంతో, అలా లోకాలను చూడడానికి వెళ్ళిన బ్రహ్మ, పాలసముద్రంలో శేషతల్పంపై నిద్రిస్తున్న శ్రీ  మహావిష్ణువును చూసి, సమీపించి ఆయన సంగతిని తాహతును గుర్తించక, ఆయనను నిద్రనుంచి లేపుతూ అన్న మాటలు ఈ పద్యం.

వాండు, వీండు – ఈ విధమయిన పూర్ణబిందు సహిత ప్రయోగం శ్రీనాథుడు కూడా చేశాడనడానికి ఉదాహరణ ఈ పద్యం.

‘ఎవ్వడవు చెప్పుమనిన లే నవ్వు నవ్వి
యిందిరావల్లబుండు బ్రహ్మ కిట్టు లనియె
నే జగత్కర్తనై యుండ నెట్లు నీవు
కర్త నని పల్కెదవు సిగ్గుగాదె చెపుమ ‘                                              (ప్రథమాశ్వాసం 82వ పద్యం).

జగత్తు కంతటికీ నేను కర్తనై వుండగా, నీవు కర్తననడానికి సిగ్గుగా లేదా? అని బ్రహ్మను శ్రీ  మహావిష్ణువు అడగడం ఈ పద్యం. ఇందులో లేనవ్వు, లేత+నవ్వు, అంటే చిఱునవ్వు. (‘సమాసంబున బ్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగా నగు’ అని బాల వ్యాకరణం, సంధి పరిచ్చేదం 36వ సూత్రం.  అచ్చతెనుగు పదాలకు ఆయువుపట్టు లాంటి సూత్రాలలో ఇది ఒకటి. ప్రాత+ఇల్లు=ప్రాయిల్లు, ప్రాతయిల్లు, లేత+దూడ=లేదూడ, లేతదూడ, పూవు+రెమ్మ=పూరెమ్మ, పూవురెమ్మ, ఇలాంటి పదాలు ఇందుకు ఉదాహరణలు).

అని చెప్పినా వినిపించుకోని బ్రహ్మ, శ్రీ మహావిష్ణువుతో యుధ్ధానికి తలపడతాడు.

‘వాలిక మెఱుగుం దూపులు
నళీకాసనుడు కినుక నారాయణుపై
గీలుకొనజేసి యార్చెను
నాలుగు మోములను ద్రిభువనములు వడంకన్ ‘                             (ప్రథమాశ్వాసం 92వ పద్యం).

మంచి నడక వున్న కందపద్యం ఇది. వాలిక – వాడివి అయినట్టివి, మెఱుగుందూపులు – మెరుస్తున్నట్టివి అయిన బాణాలను, నాళీకాసనుడు (నాళీకము – పద్మమును, ఆసనముగా కలవాడు) బ్రహ్మ, కినుక – కోపంతో,  శ్రీ మహావిష్ణువుని నాటుకునేలా వేసి, తన నాలుగు మోములతో విజయోత్సాహంతో ముల్లోకాలూ అదిరిపడేలా పెద్దపెట్టున అరిచాడు అని ఈ పద్యం భావం.

ఇరువురి మధ్య అలా మొదలైన యుధ్ధం, చివరకు ఒకరిపై ఒకరు పాశుపతాస్త్రాలను  ప్రయోగించుకునే దాకా వెళ్ళగా, ఆ పాశుపతాస్తాలనుంచి పుట్టిన అగ్ని జ్వాలలను ఆర్పడానికి  వారికే వల్లగాకుండా వుండగా, ఆ స్థితిలో –

‘అస్త్రయుధ్ధము మాన్ప హర్యజుల గావ
దలచి యర్దేందు మౌళి యత్యంతకరుణ
నస్త్రములు రెంటినడుమ నయ్యవసరమున
సంభవించె మహానలస్తంభమూర్తి’                                                   (ప్రథమాశ్వాసం 101వ పద్యం).

అర్ధేందుమౌళి – అర్ధ ఇందు మౌళి – అర్ధ చంద్రుని శిరస్సునందు కలవాడు, శివుడు. ఆ రెండు అస్త్రాల నడుమ మహాశివుడు పెద్ద అగ్నిస్తంభం లాగా పుడతాడు.

‘నడగె నస్త్రద్వయంబు నభ్యంతరమున
నగ్గికంబంబులో గాననయ్యె శివుడు
వలపె తెరలోన నున్న భావంబు దోప
మాఘకృష్ణచతుర్దశీ మధ్య రజని’                                                    (ప్రథమాశ్వాసం 105వ పద్యం).

ఆ రెండు అస్త్రాల నడుమ, అగ్ని స్తంభంలో శివుడు, వలపె తెరలోనన్ – సన్నని తెల్లని తెరలోపల నున్నాడా అని అనిపించేటట్లుగా, మాఘ కృష్ణ చతుర్దశీ మధ్యరజని – మాఘ మాసంలో బహుళ చతుర్దశినాటి అర్ధ రాత్రమునుందు – మహా శివరాత్రినాటి నడిరేయి అగుపించాడు అని ఈ పద్య భావం! హృద్యమైన వర్ణన కదూ! శ్రీనాథుని ప్రతిభంతా ఇలాంటి పద్యాలలోనే కనపడుతుంది. (ఇది చదువుతుంటే ఎందుకో ‘బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను’ అన్న శ్రీశ్రీ మాటలు గుర్తుకొచ్చాయి!)

శ్రీనాథుని ‘శివరాత్రి మాహత్మ్యం’ నుండి కొన్ని పద్యాలతో ఈ రాత్రి….

‘ఉన్నతమైన యంధ్రకవితోక్తుల నెంతయు బ్రోడలైన యా
నన్నయ భట్టు దిక్క కవి నాయకు దత్సము శంభుదాసుని
న్బన్నగు బోలు నా కమలనాభుని జేరి భజింతు నెంతయున్
సన్నుతశబ్దశాస్త్రముల సంభటనంబు ఘటించు వేడుకన్’           (ప్రథమాశ్వాసం 13వ పద్యం).

ఇందులో ‘శంభదాసుడు’ ఎఱ్ఱన. శంభుదాసుడు అనేది ఎఱ్ఱన బిరుదు. కమలనాభుడు శ్రీనాథునికి తాత అట. శ్రీనాథుడు అతనిని అనంతునితో పోల్చాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడో ఊహించుకోవచ్చును. (శ్రీనాథుని భీమఖండంలో కూడా ఈ కమలనాభామాత్యుని గుఱించిన ప్రశంశ ఉందట.)

‘జాతా జాత చరాచర ప్రతతికిని సంభూతక స్థానమై
ఖ్యాతంబై బుధ హృద్య మంగళ కవీంద్రాచార్య సంసేవ్యమై
యాతారార్క సుధాంశువై కమలజాతాకల్పమై యెప్పుడున్
జ్యోతిశ్చక్రము బోలె గ్రాలవలదా సొంపారి కావ్యం బిలన్ ‘     (ప్రథమాశ్వాసం 17 వ పద్యం)

ఇందులో శ్రీనాథుడు కావ్యాన్ని జ్యోతిశ్చక్రంతో పోల్చాడు. జాతా జాత చరాచరములైన వాటన్నిటికీ జన్మస్థానమై బ్రహ్మకల్పంగా వుండే జ్యోతిశ్చక్రంలాగా కావ్యం కూడా జాతాజాత చరాచరములయినట్టి వాటకి స్థానమై, ప్రసిధ్ధమై, పండితులు కవీంద్రులు ఆచార్యులు అయినట్టి వారి అందరి మన్ననలు పొందుతూ, ఈ భూమి మీద ఆచంద్రతారార్కంగా ఎప్పుడు వెలుగుతూ వుండాలి అని భావం. (ఈ పద్యం ఎత్తుబడి ‘నానా సూన వితాన వాసనల నానందించు’ పద్యాన్ని జ్ఞప్తికి తెస్తుంది కదూ!).

‘ఎక్కడ బోయెనో ధరణి యిందు విభాకరు లెందణింగిరో
చుక్కల సుద్ది యెద్ది యొకొ చూడగ గందుమె పర్వతంబులన్
దిక్కుల చాయలెవ్వి యని ధీరత నల్విటు చింతనొందె నే
సక్కటి చూచినం దిమిరసింహతి విశ్వము ముంచియుండగన్’           (ప్రథమాశ్వాసం 62వ పద్యం).

కొన్ని అచ్చమయిన తెలుగు పదాలతో వున్న అందమయిన పద్యం ఇది. ప్రళయ కాలాంతంలో, కాళరాత్రి గడిచి ఉదయమైన తరువాత నిద్రలేచి, ముల్లోకాలకూ అధిపతియైన బ్రహ్మ నిద్రనుండి అప్పుడే మేలుకొన్న కళ్ళతో ఆ చీకటి గుయ్యారంలో భూమి కోసం వెదుకుతూ మనసులో ఇలా అనుకుంటూ వుంటాడు.

ఎక్కడ బోయెనో ధరణి (భూమి ఎటు పోయింది?) – ఇందు విభాకరులు (సూర్య చంద్రులు) ఎందణంగిరో (ఇందులో సూర్య చంద్రులు ఎటు పడిపోయారు?) – చుక్కల సుద్ది (మాట) యెద్ది యొకొ (మాటకైనా చుక్కలు కనబడడంలేదేమి?) – చూడగ కందుమె పర్వతంబులన్ (పర్వతాలను చూడాలన్నా కనబడడం లేదే?) – దిక్కుల చాయలెవ్వి (దిక్కుల జాడలే లేవు?) – అని ధీరత – నల్విటు (నల్వ+ఇటు=నల్విటు, నలు+వ – నలు అంటే నాలుగు – వ అంటే ముఖం- నాలుగు ముఖముల వాడు – బ్రహ్మ! – ఇటు అంటే ఈ విధంగా) – చింత నొందె (విచారించ సాగాడు) – నే సక్కటి (చక్కటి – దిక్కు) చూచినం (ఏ దిక్కుగా చూచినా) – తిమిర సంహతి (చీకటుల గుంపు) – విశ్వము ముంచియుండగన్ (లోకాలను కప్పి వుండగా!)

‘అటగాంచెం బద్మగర్భుం డహి మకరఢులీ హస్తినక్రాది యాదః
పటలీ ధాటీ విహార ప్రచలిత మహిభృ త్పక్ష విక్షేప లీలా
చటులోర్మి వ్యాప్త ఘోషా సముపచిత దిశా సౌధ వీథీవిటంకా
పటు సంఘాటా ప్రతి శృద్భయ కలిత జగద్వ్యాప్తి లబ్ధిన్ సుధాబ్ధిన్’        (ప్రథమాశ్వాసం 78వ పద్యం).

ఈశ్వరుడు కల్పించిన మాయచేత, బ్రహ్మ తనకుతానే చాలా గొప్పవాడననుకుని, దేవతలలో తనకు సాటిరాగల వారు వేరెవారూ లేరనే గర్వంతో పొంగిపోతూ, తాను నిర్మించిన లోకాలను చూడాలని తన హంసవాహనం మీద బయలుదేరి వెళ్ళి చూడగా కనుపించిన కల్లోలభరిత క్షీరసముద్రం, జగత్తు వర్ణన ఇది. సందర్భానికి తగినట్లుగా గంభీరమైన వర్ణన.

అదలా వుంచితే, ఈ పద్యాన్ని ఉటంకించడానికి అసలు కారణం ఇంకొకటుంది. అది – ఈ పద్యాన్ని చదవగానే, ప్రసిధ్ధమైన ఇంకొక పద్యం గుర్తుకు రావాలి. అది – ‘మనుచరిత్ర’ లోని అల్లసాని పెద్దనగారి ఈ పద్యం.

‘అటజని కాంచె భూమిసురు డంబరచుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహూర్లుఠద భంగతురంగ మృదంగనిస్స్వన
స్ఫుటనటనానుకూల పరిఫుల్ల కలాపకలాపిజాలమున్
గటకచరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్’

తేడా ఒకటే, అక్కడ క్షీరసాగర సహిత జగద్వర్ణన, ఇక్కడ హిమవత్పర్వత వర్ణన. అక్కడ వృత్తం మహాస్రగ్ధర. ఇక్కడ చంపకమాల. నడక గురించి వేరే చెప్పాల్సింది లేదు.

పెద్దనగారి ప్రసిధ్ధ పద్యం – ‘నిరుపహతి స్థలము, రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు’ కి కన్నడ భాషలో ‘సూక్తి సుధార్ణవం’లోని ‘నిరుపహతి స్థలం మృదుతరానన మెళ్ళుణి సింపు దంబులం’ అనే  పద్యం మూలం. ఇప్పుడు మనుచరిత్రలోని ఈ పద్యానికి శ్రీనాథుని ఆ పద్యం! ఇలా తనవిగా పేరుగాంచిన ఈ పద్యాలకు మూలాలను వేరే వాళ్ళ ప్రతిభలలోనూ పద్యాలలోనూ పెట్టుకుని, ఈ పెద్దయ్యగారు రాయలచే గండపెండెర బహూకరణ సందర్భంలో  ‘పెద్దనబోలు పండితులు పృథ్విని లేరని నీ వెరుంగవే?’ అన్న మాటను ఏ ధైర్యంతో చెప్పుకున్నాడా అనిపిస్తుంది! బహుశా, ఆయన కాలానికి ఆయనే! అని సరిపెట్టుకోవాలనుకుంటాను.