కాకతీయులు (4)

కాకతీయులు (4)

‘కాకతి’ అన్నది ఒక ఊరి పేరా, దేవత పేరా అన్న విషయంపై భిన్నమయిన అభిప్రాయాలూ వున్నాయి. ఆంధ్ర చరిత్ర పరిశోధకుల మధ్య ఈ విషయమై బహు విధాల చర్చ జరిగింది. కాకతీయుల వంశంలో ఈ మొదటిబేతరాజుకు పూర్వమే, అతని పేరులో ‘కాకతి’ శబ్దం కనుపించే ‘కాకర్త్య గుండ్యన’ అనే రాజు వున్నాడు. ఇతడు క్రీ.శ.945-995 మధ్య కాలానికి చెందినవాడు. ఇతని పేరులోని ‘కాకర్త్య’ అనే పదం సంస్కృతీకరణం చెందిన ‘కాకతి’ శబ్దం అనీ, కొన్ని తెలుగు పేర్లు సంస్కృతీకరణం చెందే క్రమంలో గాలి నరసయ్య అనే పేరు వాతుల అహోబిలపతి అయినట్లుగా ‘కాకతి గుండన’ శబ్దం ‘కాకర్త్య గుండ్యన’ గా మారడం అసంభవమేమీ కాదని చరిత్రకారుల అభిప్రాయం. ఇతనిది సామంతఒడ్డె వంశం. ఒడ్డె పదం ఓడ్ర శబ్దాన్నుంచి పుట్టినది కాబట్టి ఇతడు విశాఖపట్టణ ప్రాంతపు ఒడ్డెనాడుకు చెందినవాడయి వుండవచ్చని ఒక అభిప్రాయం. కాకతీయులు దుర్జయవంశంవారని ఒక శాసనంలో కనబడుతుంది.

కాకర్త్య గుండ్యన తూర్పు చాళుక్యుల వద్ద ఉన్నతోద్యోగంలో వున్న వాడని మాగల్లు శాసనం వలన తెలుస్తుంది. ఇతడు అనుమకొండలోని ప్రాచీన రాజవంశజులతో పెళ్ళిసంబంధం చేసుకుని పెండ్లి గుండమరాజు అని కూడా పిలవబడ్డాడు. ఇతనికి కుంతలదేవి అని ఒక సోదరి ఉంది. ఆమెను బలవంతులయిన విరియాల వంశంజులకు ఇచ్చి వివాహంచేయడం ద్వారా వరంగల్లులో తన స్థానాన్ని పదిలం చేసుకో సంకల్పించాడని చెబుతారు. విరియాల వారిది దుర్జయ వంశం. వీరి వృత్తాంతం క్రీ.శ.1000 ప్రాంతపుదైన గూడూరు శాసనంలో వివరంగా వుంది. ఈ రాజులలో ఎఱ్ఱనరేంద్రుడు పరాక్రమశాలి. ఈయన భార్య కామమసాని, గొప్ప రాజనీతిజ్ఞురాలు, వీరవనిత. పెండ్లి గుండనగా పిలవబడిన కాకర్త్య గుండ్యన సోదరి పేరు కుంతలదేవిగా వున్నా, ఈ విరియాల కామమసాని అనే వనితనే కుంతలదేవిగా చరిత్రకారులు గుర్తిస్తున్నారు.

కాకర్త్య గుండ్యన అనుమకొండలోని రాజవంశీయులతో పెళ్ళిసంబంధ మేర్పరచుకుని, అక్కడ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే లోపలే మరణిస్తాడు. అతని కొడుకైన బేతరాజు అప్పటికి చాలా చిన్నవాడు, బాలుడు. మేనల్లుడు, బాలుడు అయిన బేతరాజును అతని మేనత్తయైన విరియాల కామమసాని (గుండ్యన చెల్లెలైన కుంతలదేవి), భర్తయైన ఎఱ్ఱనరేంద్రుని సహయంతో సంరక్షించి కాపాడుతుంది. బేతరాజు యుక్తవయస్కుడు కాగానే అతడిని రాజ్యాభిషిక్తుని చేస్తుంది. ఇది గూడూరు శాసనంలో చెప్పబడి ‘కాకతి నిల్పుట కోటి సేయదే’ అని కామమసాని రాజనీతిజ్ఞతకు ప్రశంసాపూర్వక కథనంగా లోకోక్తియై చరిత్రలో నిలిచింది.

దేశ చరిత్రలో ఒక నూతన రాజవంశం రూపుదాల్చి నిలదొక్కుకోవడానికి మానవ ప్రయత్నమేకాక, ఆ ప్రయత్నానికి దైవానుగ్రహం కూడా తోడైవుండాలనడానికి కాకతీయుల చరిత్రలోని ఈ కుంతలదేవి – బేతరాజుల ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కాకతి గుండన ముందు చూపుతోకూడినదైన చర్య, కుంతలదేవికి తన అన్నపైనున్న గౌరవం, ఆ అన్న కొడుకూ తన మేనల్లుడూ అయిన బేతరాజుపై ఆప్యాయతా ఆంధ్ర దేశ చరిత్రలో కాకతీయులనే ఒక ప్రసిధ్ధ రాజవంశం రూపుదాల్చడానికి కారణమయింది. ఇలా రాజ్యాభిషిక్తుడయిన వాడే మొదటి బేతరాజు. ఇతనికి గరుడ బేతరాజని కూడా పేరు వుంది. ఇతడు క్రీ.శ.995-1052 మధ్య రాజ్యపాలన చేసినట్లుగా తేల్చారు. చారిత్రకంగా ఇతడితోనే కాకతీయవంశం ప్రారంభమయిందని చరిత్ర పరిశోధకులు భావిస్తారు. ఇతని కొడుకు మొదటి ప్రోలరాజు, క్రీ.శ.1052-1076 మధ్య రాజ్యపాలన చేశాడు. ఈ మొదటి ప్రోలరాజు కొడుకే త్రిభువనమల్ల బేతరాజు, క్రీ.శ.1076-1108 మధ్య కాలంలో రాజ్యపాలన చేశాడు. ఇతని కాలానికి ముందు కాకతీయుల వంశంలో ఎంతలేదన్నా నాలుగైదు తరాల చరిత్ర గడిచిపోయిందని చెప్పవచ్చు.

కాకతీయ వంశపు తొలితరం రాజుల పేర్లు గుండన, ప్రోల, బేత అని వుండగా, ఈ త్రిభువనమల్ల బేతరాజు పేరులో ‘త్రిభువనమల్ల’ చేరడానికీ ఒక కథ వుంది. కాకతీయ వంశంలో బేతరాజు అనే పేరుతో రాజ్యమేలిన రాజులు ఇద్దరు కాబట్టి ఇతనికి రెండవ బేతరాజని కూడ పేరుంది. ఇతడు రాజ్యభారాన్ని చేపట్టే నాటికి కళ్యాణి చాళుక్య రాజులలో రాజ్యాధికారం గూర్చి వారిలో వారికి అంతః కలహం చెలరేగింది. ఆ కలహంలో రెండవ బేతరాజు తన అనుకూల్యతను ప్రకటించి అతని పక్షం పోరాడిన విక్రమాదిత్యుడు అనే రాజు త్రిభువనమల్లుడనే పేర చాళుక్య సింహాసనాన్నిక్రీ.శ.1076 అధిష్ఠించాడు. ఆ రాజు తన విజయ సూచకంగా, ఆ ప్రయత్నంలో తనకు సహాయపడిన బేతరాజుకు తనవైన రెండు బిరుదులను ఇచ్చి గౌరవించాడు. వాటిలో ఒకటి ‘త్రిభువనమల్ల’ అనే బిరుదు. ఈ బిరుదు పేరుకు ముందు చేరి రెండవ బేతరాజు ‘త్రిభువనమల్ల బేతరాజు’ అయ్యాడని చరిత్రకారులు చెప్పారు. ప్రజలు ఈ ‘త్రిభువనమల్ల’ అనే బిరుదనామాన్నే బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈ కాకతీయ రెండవ బేతరాజుకు చాళుక్య ప్రభువుల వద్ద ఒక విశిష్ట స్థానం ఉండేది అనేది ఈ ఉదంతం వలన తెలియ వచ్చే మరొక విషయం.

కాకతీయులు (3)

కాకతీయులు (3)

శక సంవత్సరం 1166లో ఉమ్మక్క ఒక పుత్రునికి జన్మనిచ్చింది. సకల రాజమర్యాదలతో  ఆ పిల్లవానిని సామంతరాజులందరి సమక్షంలో రాజ్యాభిషిక్తుని చేశారు. ఆ పిల్లవానికి ప్రతాపరుద్రుడని నామకరణం చేశారు. ప్రతాపుడు పెరిగి పెద్దవాడయ్యడు. ఉమ్మక్కకు రెండవ పుత్రుడుగా అన్నమదేవుడు జన్మించాడు. ప్రతాపునికి వేదవిద్య, రాజరికానికి సంబంధించిన అన్ని విద్యలూ బోధించబడ్డ తరువాత అతని 16వ ఏట, 16 మంది కన్యలతో పెళ్ళి జరిగింది. వారిలో మొదటి భార్య విశాలాక్షి. రుద్రాంబ శక సంవత్సరం 1216 లో, 38 సంవత్సరాల పాలన అనంతరం స్వర్గస్తురాలయింది.

రాజ్యాభిషిక్తుడయ్యాక, ప్రతాపరుద్రుడు దిగ్విజయానికి బయలుదేరి, మొదటగా కటక బళ్ళాలుని జయించి, 3 కోట్లు పరిహారంగా పొంది, అతని కొడుకును రాజ్యాభిషిక్తుని చేశాడు. అతడూ, అలా ప్రతాపరుద్రునిచే జయించబడిన మిగతా రాజులు వారి వారి సైన్యాలతో ప్రతాపుని ఆజ్ఞ మేర వెంటవెళ్ళారు. అలా పాండ్య రాజును జయించాడు. దక్షిణానికి మరలి గోదావరి (?) నదిని దాటి రామేశ్వరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రామేశ్వరంలో పూజలు నిర్వహించి, తామ్రపర్ణి తీరాన్ని చేరగా అక్కడ పాలనలో వున్న  విజయనగర రాజైన  నరసింహరాయుడు ప్రతాపుని పెద్ద మొత్తాలలో బహుమానాలతో సత్కరించాడు.

ఆ తరువాత, ప్రతాపుడు ఒక స్త్రీ పరిపాలనలో వున్న రాజ్యం వైపుకు వెళ్ళి అక్కడ  రాణి అయిన ముకుందదేవిని జయించాడు. ఆ పై, కొంకణ, టంకణ, మళయాల, బాహ్లిక, గుజరాష్ట్ర  రాజులను కూడా జయించి వారి వద్ద నుండి పెద్ద మొత్తాలలో బహుమానాలను రాబట్టాడు. ఢిల్లి రాజు ప్రతాపునికి కానుకలను పంపాడు. ఆ కానుకలతో ప్రయాగకు వెళ్ళి, ప్రయాగ మాధవదేవునికి అవి సమర్పించాడు. బెనారసులో కూడా పూజలు నిర్వహించి విశ్వనాథునికి ఆ నగరాన్ని సమర్పించాడు. గయకు వెళ్ళి అక్కడి రాజును కలుసుకున్నాడు. పై ప్రదేశాలలో  చాలా చోట్ల తులాపురుషదానాలను చేశాడు. తన రాజధానికి తిరిగి వచ్చి తమ్ముడైన అన్నమదేవుని, తాను లేని ఆ 12 సంవత్సరాల కాలంలో రాజ్యాన్ని పరిరరక్షిస్తూ వుండినందుకు చాలా ఆనందపడి ఆదరించాడు.

ప్రతాపుడికి విశాలాక్షి ద్వారా విరూపాక్షుడు, వీరభద్రుడు అని ఇరువురు కొడుకులు కలిగారు. ప్రతాపరుద్రుని పరిపాలనా కాలంలో రెండు సార్లు ముసల్మాను సేనలు దండయాత్రలు చేశాయి. ఒక సారి ప్రతాపరుద్రుని బందీగా కూడా చేసుకున్నాయి.

ఢిల్లీ సుల్తాను ప్రతాపుని సాదరంగా ఆహ్వానించాడు. ప్రయాగ మాధవదేవుని భక్తురాలయిన అతని  తల్లి సలహా మీద, ప్రతాపుని కోరిక మీద, డిల్లీ సుల్తాను ఆ హిందూ రాజును, అతనికి సంరక్షకులనుగా 20,000 సైన్యాన్ని తోడుగా ఇచ్చి, బెనారసుకు పంపాడు. ప్రతాపునితో వెళ్ళిన బ్రాహ్మణులను కూడా ఆ రాజు బాగా సత్కరించాడు.

ప్రతాపుడు బెనారసులో 8 తులాపురుషదానాలను చేసి, గోదావరి తీరానికి వెళ్ళడానికి బయలుదేరాడు. దారిలో, శివదేవయ్య మరో 8 రోజులలో ఆ రాజు మరణం గోదావరీ తీరంలో సంభవమని లెక్కకట్టి వున్నందువలన, ఆయన సలహా మీద, కాళేశ్వరం అనే చోట ఆగుతాడు. ఈ లోపల అన్నమదేవుడు, నరపతి ఇరువురూ సుల్తాను సైన్యాన్ని ఓడించి వారిని తరిమికొడతారు. ప్రతాపుడు కాళేశ్వరానికి చేరి వున్నాడని తెలుసుకున్న వారిరువురూ అతని దగ్గరకు వచ్చారు. ప్రతాపుడు వారి శౌర్యాన్ని మెచ్చి తన కూతురైన రుద్రమదేవిని నరపతికి, 5 కోట్ల ధనంతోనూ కృష్ణకు దక్షిణంగా ఉన్న భూభాగంతోనూ, ఇచ్చి వివాహం చేశాడు.

కటకాన్ని 3 కోట్ల ధనంతో సహా రామరాయలను పెండ్లాడిన అన్నమదేవుని కూతురికి కట్నంగా ఇచ్చాడు. ప్రతాపుడు క్రీ.శ.1324 లో మరణించాడు. అతని రాణి అయిన విశాలాక్షి సహగమించింది. అన్నమదేవుడు వారికి ఘనంగా ఉత్తరక్రియలను నిర్వహించి, రాజ్యాన్ని వీరభద్రునికి ఇచ్చి, ప్రతాపుని కొడుకైన విరూపాక్షుడు తోడుగా రాగా వింధ్య ప్రాంతపు అడవులకు వెళ్ళిపోయాడు. శివదేవయ్య శ్రీశైలం చేరాడు. మొత్తంమీద ప్రతాపుని పాలన 76 సంవత్సరాలు సాగింది.

విజయనగర ప్రభువైన కృష్ణదేవరాయలు కొండవీడు, కొండపల్లి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండలను జయిస్తూ వచ్చి, వరంగల్లును ముట్టడించి అక్కడి ముసల్మానులను తరిమి కొట్టాడు. వరంగల్లులోని కాకతీయ వంశీయులకు రాజమర్యాద పూర్వకంగా ఇవ్వవలసిన ధన్నాని ఇచ్చాడు. ఇది అచ్యుత, సదాశివరాయల పాలన వరకూ సాగింది. అయితే, ఆ తరువాత అళియరామరాయల పతనం తరువాత, డక్కను భూభాగం అంతా ముసల్మానుల హస్తగతమయింది.”

ఇది సంగ్రహంగా మెకంజీ స్థానిక చరిత్రలలో రికార్డు చేయబడిన కాకతీయుల చరిత్ర.

అయితే, ఇప్పుడు ముఖ్యంగా శాసనాధారాలతోనూ, ఇంకా  ఇతరాలయిన ఆధారాలతోనూ చరిత్ర పరిశోధకులు రచించిన కాకతీయుల చరిత్రకూ, జనశ్రుతంగా వచ్చి మెకంజీ స్థానిక  చరిత్రలలో సేకరించబడి చేరిన కథలోని భాగాలకూ సామ్యాలూ విబేధాలూ, తత్సంబంధ చారిత్రక అంశాలనూ చర్చించుకుంటూ ముందుకు వెళితే–

మొదటగా, ఈ కథ ఆరంభంలో చెప్పబడిన త్రిభువనమల్లుడు చరిత్రకారులు నిర్ణయించిన త్రిభువనమల్ల బేతరాజు అనబడే రెండవ బేతరాజు. ఇతడు క్రీ.శ.1075/76 నుండి 1108/11 దాకా రాజ్యం చేశాడని శాసనాధారాలను బట్టి చెప్పారు. ఇతడు కాజీపేటలో వేయించిన ఒక శాసనంలో తన తాత అయిన మొదటి  బేతరాజును గురించి ‘సామంతవిష్టి వంశః శ్రీమాన్ కాకతిపురాదినాథోబేతః’ అనడాన్ని బట్టి, ఇతడు సామంతవిష్టి వంశం వాడనీ, కాకతిపురాధీశుడనీ చెప్పడం జరిగింది. అయితే ఈ కాకతిపురం ఏది అన్నది ఇప్పటికీ  తేలని విషయం.

కాకతీయులు (2)

కాకతీయులు (2)

రుద్రుడు తన రాజ్యానికి తూర్పుగా వున్న పరగణాల మీదికి దండెత్తి వెళ్ళి, ఆ తరువాత దక్షిణం వైపున రామేశ్వరం, ధణుష్కోటి దాకానూ వెళ్ళి అక్కడ 8 సార్లు తులాపురుషదానాలు చేశాడు. తిరిగి వచ్చే దారిలో పాండ్య రాజును జయించి అతని కుమారునికి పట్టం కట్టి వచ్చాడు.

రుద్రుని తమ్ముడైన మహాదేవుడు ఈ లోపల, కొంత సైన్యాన్ని సమకూర్చికుని అన్నపై తిరగబడ్డాడు. రుద్రుని పాలన 78 సంవత్సరాలు సాగి శకసంవత్సరం 1109 లో (ఇది తప్పు అని చరిత్ర) ముగిసింది. ఈ రుద్రుడు కాకతీయులలో  ప్రతాపరుద్రుడు కాదు, ఇతడు గణపతిదేవునికి తండ్రి అయిన రుద్రుడు మాత్రమే.

మహాదేవుని వంచనతో కూడిన ఆక్రమణాన్ని ఇష్టపడని మంత్రులు, రుద్రుని కుమారుడైన గణపతిని రాజ్యాభిషిక్తుని చేయబోగా, గణపతి యువరాజుగానే ఉండడానికి ఇష్టపడినందువలన, మహాదేవుడు రాజై మూడేళ్ళు పాలించాడు. మహాదేవుడు గణపతి అనుమతితో దేవగిరిపైకి దండెత్తి వెళ్ళి ఆ పోరులో ఒక ఏనుగుపై ఎక్కి యుధ్ధం చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

గణపతిదేవుడు శ్రీశైలం పరిసరాలనుంచి తెచ్చిన శిలలతో వరంగల్లు కోటనూ, శివునికి దేవాలయాలను నిర్మింప జేశాడు. మహాభారతాన్ని తెనిగించిన తిక్కన మహాకవి  (నెల్లూరు రాజైన మనుమసిధ్ధి రాయబారిగా) గణపతి ఆస్థానానికి రాగా,ఆ రాజూ, అతని ఆస్థానంలోని కవులూ పండితులూ ఆయనను గొప్పగా సత్కరించారు. గణపతిదేవునికి  తిక్కన వేదాలనూ, శాస్త్రాలనూ, మహాభారతాన్ని అధ్యయనం చేయడం లోని ముఖ్యాంశాలను గురించి వివరంగా చెబుతాడు. గణపతిదేవుని ఆస్థానంలోని జైనులతోనూ, బుధ్ధులతోనూ తీవ్రంగా వాదించి వారిని నిరసించాడు. రాజకీయం మీద, వేదాంత విషయాల మీద తిక్కన గణపతిదేవునికి తగు బోధ చేశాడు.

అక్కన, బయ్యన అనే వారిచే సూర్యవంశీయుడైన మనుమసిధ్ధి తన రాజధాని నుంచి తరిమివేయబడినాడనీ, ఆ రాజుకి అతని రాజ్యాన్ని  తిరిగి దక్కించుకోవడంలో గణపతిదేవుని సహాయాన్ని అర్ధించడం, తాను వచ్చిన పనిగా తిక్కన చెబుతాడు. గణపతిదేవుడు  ఆ కార్యానికి అంగీకరించి తిక్కనను తగు విధంగా సత్కరించి బహుమతులిచ్చి పంపుతాడు. తిక్కన వెళుతూ, శైవుడైన శివదేవయ్యను గురించి గొప్పగా చెబుతాడు. శివదేవయ్య తరువాతి కాలంలో కాకతీయ రాజులకు మంత్రి అయ్యాడు.

మాట ఇచ్చినట్లుగానే, గణపతిదేవుడు  పెద్ద సైన్యంతో  వెళ్ళి, వెలనాడును ముట్టడించి, జయించి వారి కోటను తగులబెట్టించాడు. బయ్యనను తరిమివేసి అతని రాజముద్రికలను తెరల రుద్రదేవునికి ఇస్తాడు. మనుమను నెల్లూరులో పునః ప్రతిష్టించి, తాను జయించిన 24 దుర్గాలనూ, 68 పట్టణాలనూ అతనికి బహుమానంగా ఇచ్చి, వరంగల్లుకి తిరిగి వచ్చాడు.

తన కోటను మరింతగా సంరక్షించుకోవాలని, రాత్రి పగలనిలేక  నిరంతరం కోటచుట్టూ సైనికులు కాపలా వుండేలా నియమం చేస్తాడు. ఒక అక్షౌహిని సైన్యాన్ని కోటలో ఎప్పుడూ సిధ్ధంగా వుండేలా ఏర్పాటు చేస్తాడు. అతని పాలన పటిష్ఠంగా సుఖంగా సాగింది.

గణపతిదేవుడు శ్రీశైలం దర్శించి అక్కడి దేవుడైన మల్లికార్జునునికి 12,000 సువర్ణ పుష్పాలను సమర్పించాడు. ఆ రోజుననే, పంధలింగాల కు వెళ్ళి, కృష్ణానదిలో  స్నానంచేసి 16 రకాల దానాలను చేశాడు. శ్రీశైలంలో 4 చెరువులను, 4 శైవాలయాలను ఒక వైష్ణవాలయాన్ని నిరిమింపజేశాడు. మల్లికార్జునారాధ్యుని చేతులమీదుగా శైవుడయ్యాడు.

వరంగల్లుకు 3 యోజనాల దూరంలో తన పేరు మీదుగా గణపురమనే గ్రామాన్ని, చెరువును నిర్మింపజేశాడు. కటకాన్ని పాలిస్తూండిన రాజును తన సామంతునిగా చేసుకున్నాడు. మొత్తం మీద గణపతిదేవుడు 68 సంవత్సరాలు పాలించాడు. అతనికి ఉమ్మక్క అని ఒక కూతురు వుంది. ఆమెకు వయసు రాగానే, చాళుక్య వంశానికి చెందిన వీరభద్రునితో వివాహం జరిపించాడు.

గణపతిదేవుని తరువాత ఆతని భార్య రుద్రాంబ, శివదేవయ్య సలహాతో, రాజ్యభారాన్ని స్వీకరించింది.

ఆమె చాలా మంది దేవతలను సువర్ణ పుష్పాలతో, ఆమె కూతురయిన ఉమ్మక్క ద్వారా వీరుడయిన మనుమడిని పొందాలని పూజించి ‘దశరీడ్లనోము’ అనే పేరున్న నోము నోచింది. ఆ పూజా కార్యక్రమాలలో భాగంగా ఆమె వరంగల్లులో లేని సమయంలో హరిహరదేవుడు మురారి అనే ఇద్దరు సామంతులు తిరుగుబాటు చేయగా, వారిని ఓడించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

దేవగిరి పాలిస్తూండిన రాజు అకారణంగా వరంగల్లు మీద దండెత్తి వచ్చి కోటను ముట్టడించాడు. అయితే, ఓడించబడి ఒక కోటి దనాన్ని పరిహారంగా చెల్లించేలా చేయబడ్డాడు. ఆమె తన రాజ్యానికి సరిహద్దు రేఖల వెంబడి విజయస్తంభాలను పెట్టించింది. రుద్రాపురం, అంబాపురం అనే పేర్లతో రెండు గ్రామాలు ఆమె పేరుమీద నిర్మించబడ్డాయి.

కాకతీయులు (1)

కాకతీయులు (1)

ఆంధ్రుల చరిత్రలో కాకతీయులది ఒక ప్రముఖ స్థానం. మెకంజీ సేకరించిన స్థానిక చరిత్రలలో అనుమకొండ హనుమకొండకు తొలి రూపం), వరంగల్లులను గురించి, ఈ రెండు పట్టణాలను రాజధానులుగా చేసుకుని పాలించిన కాకతీయ రాజుల వంశావళిని గురించి చెప్పే గాథలు వున్నాయి. చరిత్ర పరంగా చూసినప్పుడు ఈ గాథలకు, కొన్ని కొన్ని చోట్ల అతిశయమూ కల్పనా  చేరి వుండడం వలన, అన్నిటికీ అంతగా ప్రాముఖ్యం లేకపోయినప్పటికీ, కొన్ని వందల సంవత్సరాలుగా జనశ్రుతంగా తరం నుంచి తరానికి వచ్చి చేరినవి కాబట్టి, ఆంధ్ర దేశ చరిత్ర రచన మొదలెట్టిన తొలినాళ్ళలో ఆ కథలలోని విషయాలు కొన్నైనా ఆధారాలుగా నిలిచాయి కాబట్టీ వాటి  ప్రాముఖ్యత వాటిది. కాకతీయుల చరిత్రకు సంబంధించి  ఆ గాథలలో చరిత్రకు దగ్గరగా వున్నట్లనిపించే కొన్న గాథల సారాంశం ఇది:

కాకతీయ వంశానికి చెందిన మొదటి తరం రాజులలో ఒక రాజు త్రిభువనమల్లుడు. ఆ రాజుకి కాకతి అనే  దేవత కరుణ వలన కాకతి ప్రోలుడు జన్మించాడు. త్రిభువనమల్లుడు కటకాన్ని పాలిస్తూండిన  తిరుగుబాటుదారయిన రాజును రణంలో ఓడించి చంపి, ఆ స్థానంలో అతని కుమారుని రాజ్యాభిషిక్తుని చేసి, ఆ రాజు ధనాగారాన్ని వెంట తరలించుకు వెళ్ళాడు. గంగాపురం అనే ప్రదేశంలో త్రిభువనమల్లుడు ఎన్నో  దేవాలయాలను నిర్మింప జేశాడు.  ఈ రాజు 86 సంవత్సరాలు పాలించి శక సంవత్సరం 958 లో మరణించాడు.

ప్రోలుడు రాజ్య భారాన్ని చేపట్టే నాటికి చాలా చిన్నవాడు. ఇది అదనుగా చూసుకుని సామంతులు కొందరు తిరగబడతారు. కటకాన్ని పాలిస్తూండిన రాజు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విశ్వనాథదేవుడనే వాడిని ప్రోలుని మీదికి దండు పంపుతాడు. అనుమకొండ అతడి వశమవుతుంది. ఆ తరువాత 12 సంవత్సరాలు అనుమకొండ పరరాజుల హస్తగతమై వుంటుంది. ఈ కాలంలో వారు ఒక పెద్ద చెరువును కూడా తవ్వించారు. కన్నడసముద్రమని ఆ చెరువుకు పేరు. ప్రోలుడు తన రాజధానిని ఒక స్నేహితుడైన సామంతుని అధీనంలో వుంచి, ఒక రహశ్య మార్గం ద్వారా వెళ్ళి అనుమకొండను జయించి, మళ్ళీ కటకం మీదికి దండు వెళ్ళి, యుధ్ధంలో ఆ రాజును చంపి, వాని కుమారుని ఆ స్థానంలో వుంచి, 2 కోట్ల
సంపదను సంపాదించుకొస్తాడు.

ఈ ప్రొలుడు ఒక పెద్ద శివాలయాన్ని నిర్మింపజేసి, ఆ దేవాలయం చుట్టూ 8 యోజనాల పర్యంతగా వుండే ఒక నగరాన్ని కూడా నిర్మింపజేస్తాడు. ఇదే ఓరుగల్లు పట్టణం. ఓరుగల్లు కోటకు తొలి నమూనా చిత్రం ఆ స్థానం మీద 909 లో వ్రాయబడింది.

వరంగల్లులో శివాలయం పరశువేది శంభు ఆలయంగా పిలవబడేది. ఆ ఆలయానికి ఆగ్నేయంగా ఒక పెద్ద శిల వుండేది, కనుక ఆ ప్రదేశానికి ఏకశిలానగరమనీ, ఆ ప్రదేశం మీదుగా వెళ్ళే బండి చక్రం ఒకటి ఎప్పుడూ ఒకవైపుకు ఒరిగేది కాబట్టి ఆ ప్రదేశానికి ఓరుగల్లు అనీ పేర్లు వచ్చాయి.

ఓరుగల్లులోని దేవాలయాలలో ప్రతిష్ఠించబడిన ముఖ్యమయిన దేవతా విగ్రహాలు 1. ముక్తేశ్వర, 2. విశ్వనాథ, 3. వ్యక్తవిరూపాక్ష, మల్లికార్జున, 5. రామేశ్వర, 6. నీలకంఠ, 500 చిన్న గుడులు శివునివి, 10 దేవివి, 10 గణపతివి, 300 వాసుదేవునివి, 10 వీరభద్రునివి, కొత్తగా నిర్మించబడ్డాయి.

ప్రోలునికి ఒక దుష్టనక్షత్రంలో ఒక కొడుకు పుట్టాడు. ఆ నక్షత్ర ప్రభావం వలన అతడు తండ్రిని చంపేవాడుగా అయ్యాడు.
ఆ పిల్లవాడు రుద్రుడుగా నామకరణం చేయబడి, మంచి తెలివి కలవాడుగా, శక్తిమంతుడుగా పెరిగాడు. అతడికి ఉపనయనం అయిన తవువాత, శంభుని దేవాలయానికి రాజ రక్షకుడుగా నియమించబడ్డాడు.

మహాదేవుడు ప్రోలునికి రెండవ కుమారుడు. ఇతడు కుష్టువ్యాధి పీడితుడయ్యాడు. ఒక బ్రాహ్మణునికి 5 పుట్ల నువ్వులను ఒకచోట పోసి పెద్ద రాసిగానూ, తోడుగా బంగారంతో చేసిన ఆకులను, మాడలను, దానంగా ఇచ్చిన తరువాత ఆ శ్వేతకుష్టు వ్యాధి నుంచి మహాదేవుడు బయటపడ్డాడు. అయితే, ఆ బ్రాహ్మణుడు ఆ తరువాత బ్రహ్మరాక్షసునిగా మారాడు. ప్రోలుడు ఆ బ్రాహ్మణుని కుమారునికి పెద్ద మొత్తంలో  ధనమిచ్చి కాశీలో దోష పరిహారార్ధం చేయించవలసిన పూజలను చేయించమని పంపాడు. అలా చేసిన తరువాత, నువ్వులరాసిని దానంగా తీసుకోవడం వలన సంక్రమించిన  దోషం పరిహారమై ఆ బ్రాహ్మణుడు ముక్తిని పొందాడు.

ఒకసారి, ప్రోలుడు శంభులింగమును ప్రార్ధించదలచి దేవాలయంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో లోపలి ద్వారం దగ్గర రుద్రుడు నిద్రపోతున్నాడు. రుద్రుడి నిద్రను భంగపరచడం ఇష్టపడని ప్రోలుడు పక్కనుంచి ప్రవేశించబోగా, అతని పాదం బొటనవ్రేలు రుద్రునికి తగిలి అతడు నిద్ర మేల్కొంటాడు. నిద్రమత్తు పూర్తిగా వదలని రుద్రుడు, ప్రోలుని ఒక దొంగగా భావించి అతని చేతిలో వున్న కటారితో పొడుస్తాడు. అయితే వెంటనే తనచే పొడవబడినది తండ్రేనని గ్రహిస్తాడు. ప్రోలుడు పురోహితులనూ, రక్షకులనూ, మంత్రులనూ అందరినీ పిలిపించి వారికి జరిగిన సంగతిని, దానికి కారణమైన రుద్రుని జన్మకు సంబంధించిన సంగతినీ చెప్పి, రుద్రుడినే తన అనంతరం రాజునిగా పట్టభిషిక్తుని చేయమంటాడు. రుద్రుడు పట్టభిషిక్తుడవుతాడు. కొన్నాళ్లకు ప్రోలుడు మరణిస్తాడు. అనంతరం రుద్రుడు 73 సంవత్సరాలు పాలించాడు. అతని పాలన 1031 లో అంతమయింది.

రుద్రుడు ప్రజారంజకంగా పాలన చేస్తూ  రాజ్యాన్ని సిరిసంపదలతో నింపాడు. ఓరుగల్లుకు దక్షిణంగా 12 మైళ్ళ దూరంలో వున్న అయినవోలు గ్రామానికి పశ్చిమాన మైలార దేవునికి దేవాలయాన్ని నిర్మింపజేశాడు. అనుమకొండకు నాలుగు మైళ్ళు (రెండు కోసులు) దూరంలో వున్న ఒడ్డిపల్లి అనే గ్రామంలో బొద్దన గణపతికి దేవాలయాన్ని నిర్మింపజేశాడు. మొగలిచెర్ల అనే గ్రామంలో మహాశక్తికి దేవాలయాన్ని నిర్మింపజేసి తిరుణాళ్ళు నిర్వహించబడేలా సౌకర్యం చేశాడు.

కటకం మీదకు దండెత్తి వెళ్ళి ఆ రాజును చంపి, ఆ స్థానంలో అతని కుమారునికి పట్టం కట్టి ప్రతిగా సంప్రదాయకంగా రావలసినది గ్రహించి తెచ్చాడు. ఏకుదేవుడు (?) అనే ఒక సామంతుడు తిరుగుబాటు చేయ యత్నిస్తే, అతడిని ఓడించాడు. వచ్చే దారిలో వెలనాడులో ప్రవేసిస్తాడు. ఆ రాజులు అతడి శౌర్యాన్ని మెచ్చుతారు. ఆ తరువాత కొందరు మ్లేఛ్ఛులనూ (?) జయిస్తాడు.

తండ్రిని చంపిన దోషం పోవడానికి చేయాల్సిన దోషపరిహార క్రియలన్నిటినీ నిర్వర్తిస్తాడు. చాలా ధనం ఖర్చుపెట్టి ఓరుగల్లులో మంచి శిల్పకళతో నిండినవైన ఆలయాలను నిర్మింపజేశాడు. 1000 స్థంభాలు ఆ గుడి ప్రాంగణాన్ని అలంకరించి ఉంటాయి.
చతుర్ముఖేశ్వర దేవాలయానికి నాలుగు వైపులా ద్వారాలపై నాలుగు శాసనాలను నాలుగు భాషలలో లిఖింప జేశాడు.
వరంగల్లు పట్టణంలో కొత్త వీధులను, భవనాలను నిర్మింపజేసి బాగా వృధ్ధిపరిచాడు. రుద్రుని తమ్ముడైన మహాదేవుడు కొందరి తప్పుడు సలహాలను విని అతనికి విరోధిగా మారతాడు. అయితే, ఈ సంగతులను గ్రహించిన రుద్రుడు మహాదేవుని కార్యకలాపాలన్నిటినీ ఒక కంట  కనిపెడుతూ వుండాల్సిందిగా మంత్రులను నియోగిస్తాడు. శ్రీశైల మఠాథిపతుల సలహా మీద  గణపతి అనే పేరున్న ఒక బాలుడిని, (ప్రమథ)గణాల అనుగ్రహంతో జన్మించినవాడుగా నమ్మబడుతున్న వానిని, అక్కడినుంచి తన ఆస్థానానికి తెచ్చుకున్నాడు.

స్థానిక చరిత్రలు – కర్నల్ కాలిన్ మెకంజీ

ఆంధ్ర దేశపు స్థానిక చరిత్రలు  – కర్నల్ కాలిన్ మెకంజీ

ఇదేమీ ఒక పుస్తకం పేరు కాదు. ఆంధ్రదేశంలోని వివిధ గ్రామాల  ‘స్థానిక చరిత్రలు’ అన్న విషయాన్ని తలుచుకున్నప్పుడల్లా మొదటగా మనసులో మెదిలే పేరు మెకంజీ గారిది కాబట్టి ఈ విషయంపై నేను వ్రాసే, వ్రాయబోయే పోస్టులకు శీర్షిక మొదటిది అదిగా పెట్టడం బాగుంటుందనిపించి అలా పెట్టడం జరిగింది.

ఒక ఊరు ఉందంటే, ఆ ఊరికి సంబంధించిన ప్రాథమిక చరిత్ర, అంటే ఆ ఊరు పుట్టడానికి సంబంధించిన చరిత్ర,  ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. అది మనకు తెలియడం, తెలియకపోవడం అన్నది అలా వుంచితే, గ్రామ గ్రామానికీ ఉన్న ఈ ప్రాథమిక చరిత్రలే ఆంధ్రదేశ చరిత్ర కు సంబంధించిన పరిశోధనలోనూ, చరిత్ర రచనలోనూ, పెద్దల చేత స్థానిక చరిత్రలు గా పిలవబడి ప్రసిధ్ధికెక్కాయి.  ఈ స్థానిక చరిత్రలను రికార్డు చెయ్యడం (వ్రాసి భద్రపరచడం) అన్న ప్రక్రియను, దాని ప్రాముఖ్యాన్నీ గుర్తెరిగి, వీటన్నిటినీ దొరికినంతవరకూ సేకరించి భద్రపరచడం అన్నదాన్ని మొట్టమొదటగా మొదలుపెట్టిన వ్యక్తి కర్నల్ కాలిన్ మెకంజీ – క్రీ.శ.19 శతాబ్దపు పూర్వార్ధంలో దక్షిణభారత దేశానికంతటికీ సర్వేయర్ జనరల్. ఈ విషయానికి సంబంధించిన సంగతులను సంక్షిప్తంగా ఈ బ్లాగులో నా మొదటి పోస్టులో డా.నేలటూరు వేంకటరమణయ్యగారి చరిత్ర వ్యాసాల పుస్తకం ‘పల్లవులు-చాళుక్యులు’ లోని మొదటి వ్యాసం గురుంచి వ్రాసినప్పుడు తెలియజేయడం జరిగింది.

తెలుగునేలన వెలసి ఉన్న గ్రామాల స్థానికచరిత్రలలో చిన్నవీ పెద్దవీ, ఒక తరం నుంచి ఇంకొక తరానికి చేరే ప్రక్రియలో పెరిగినవీ తరిగినవీ చాలా ఉన్నాయి. వీటిలో ఆసక్తిని రేకెత్తించే సంగతులను చెప్పినవీ, చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని అందించగలిగినవీ చాలానే ఉన్నాయి. అసలు ఆంధ్రుల చరిత్ర రచనకు మెకంజీ సేకరించిన ఈ గ్రామచరిత్రలే మొట్టమొదటి ఆధారాలని కూడా పెద్దలు చెప్పారు.

నిన్న, అంటే 23-8-2012 తేది నాటి, The Hindu దినపత్రికలో Main Editionలోని చివరిపేజీలో శ్రీకాకుళం జిల్లా చిట్టివలస గ్రామనికి దగ్గరలో ఉన్న చరిత్రపూర్వ యుగంనాటి ఒక ‘druidical rock worshiping place and shelter’ కనుగొనబడటానికి సంబంధించిన వార్త వచ్చింది. (Druidism అనేది nature-based religion. దానికి సంబంధించినది కాబట్టి druidical అనే మాట! వీరు ప్రథానంగా సూర్యారాధకులు. ఒక పధ్ధతిగా నిలబెట్టబడిన పెద్దపెద్ద శిలలను ఆరాధించేవారు. ప్రపంచ ప్రసిధ్ధి చెందిన ఈస్టర్ ద్వీపంలోని Stonehenge నిర్మాణాన్ని ఇందుకు ఒక ఉదాహరణగా చెబుతారు). ఒక చోట గుంపుగా ఉండి పరిమాణంలో ఒక్కొకటీ దాదాపు ఎనిమిది మీటర్ల ఎత్తు, 28 మీటర్ల చుట్టుకొలతతో ఉన్న అండాకారపు శిలలో చక్కగా చేయబడిన ledge-cuts – మలచబడ్డ భాగాలు, post-holes – గుంజలవంటి వాటిని ఉంచడానికి వీలయ్యే పరిమాణంలో రాళ్ళలో చేయబడిన రంధ్రాలూ – ఇది చరిత్రపూర్వ యుగపునాటి మనుషులు ఈ రాళ్ళగుట్ట చుట్టూ ఏర్పరుచుకున్న వర్తులాకారపు  పంచగానో, ప్రార్ధనాస్థలంగానో ఉండిఉంటుందన్న విషయాన్ని గుర్తించి తెలియజెప్పిన వ్యక్తి ఒక మామూలు మనిషి, ఇక్కడి స్థానికుడు, పేరు శ్రీ కె. వెంకటేశ్వర రావు; ఈయన ఒక ‘freelance archaeologist’  అని ముచ్చటైన, గౌరవప్రదమైన మాటలతో ప్రస్తుతించింది ఆయనను The Hindu దినపత్రిక.

యూరోపు, ఆఫ్రికా దేశాలలో కనబడే ఈ రకపు నిర్మాణాల వంటిదే ఈ నిర్మాణం కూడా అని శ్రీ వెంకటేశ్వరరావుగారు ఈ మధ్యనే మొదటగా గుర్తించారు. ఎన్నాళ్ళుగానో అక్కడ ఆ స్థితిలో  ఉండిఉన్నా, ఎంతమంది అటుగా ఎన్నిమార్లో నడిచి వెళ్ళి ఉన్నా, ఇప్పటిదాకా వెలుగులోకి రాని  ఈ నిర్మాణం ప్రాముఖ్యాన్ని ఇప్పటికైనా ఈయన గుర్తించి తెలియజెప్పడం అన్నది ఎంతగానో ఆనందాన్ని కలిగించిన సంగతి. ఇది ఇప్పటికీ ఆంధ్ర దేశానికి చెందిన స్థలాలలో చరిత్రకు సంబంధించిన పరిశోధనకు ఉన్న మాసిపోని అవకాశాన్ని -scope ను – మరోసారి తెలియజేస్తుంది.

ఈ ఉదంతంలోని  ఇంకొక సంగతి ఏమిటంటే, ఈ నిర్మాణాన్ని ఇన్ని వందల, వేల ఏళ్ళుగా ఆ ప్రాంతపు స్థానికులు ‘పాండవులపంచ’, ‘పాండవులదొడ్డి’ , ‘దేముడురాళ్ళు’ అన్న మూడు విడి విడి పేర్లతో ఆ రాళ్ళ గుట్టలోని భాగాలను పిలుచుకుంటూనూ, పూజించుకుంటూనూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చా రన్నది. పేరుకు తగినట్లుగానే, ‘పాండవులపంచ’ అనే దాంట్లో అయిదు పెద్ద పెద్ద శిలాతల్పాలు (rock beds) వున్నాయట. ఆంధ్రదేశ  జనుల నమ్మకంలో, ఈ ఆంధ్రదేశంలో పాండవులు తిరుగాడని గుట్టా, శ్రీరాములవారూ సీతమ్మా నడయాడని చోటూ లేదంటే అతిశయోక్తికాదని స్వర్గీయ ఆరుద్రగారు ఎక్కడో అన్నట్లు, ఈ ప్రదేశపు స్థలపురాణాన్ని ఇదివరకెవరైనా సేకరించే ప్రయత్నం చేసి వున్నట్లయితే (ఎప్పటి నుంచో చరిత్రపూర్వ యుగ జనావాసంగా ఉండిన) ఈ ప్రదేశంలో పూర్వం పాండవులు తమ వనవాసకాలంలో ఇక్కడ కొన్ని నాళ్ళు విడిది చేసి నివసించడం జరిగిందనీ ఆ కారణంగా ఈ గ్రామం  ‘చిట్టివలస’ అయిందనీ ఏ వృధ్దుడైనా చెప్పివుండేవాడేమో బహుశా! అది ఏమిటో, అక్కడ అలా ఎందుకుందో తెలియని ఎవరో ఒక మహానుభావుడు దూరం ఆలోచించి పాండవులపేర నామకరణం చేస్తే, అదలా స్థిరపడిపోయి జనుల మనసుల్లో ఒక పూజనీయమైన స్థలంగా మిగిలిపోయింది, సంరక్షించబడింది. అందువలన, చరిత్రలో అసలు సంగతులు తెలియాలంటే అడుగడుగే నెమ్మదిగా వేసుకుంటూ గ్రామాలకు వెళ్ళాలిసిందే, స్థానికులను కలవాలిసిందే. ఈ సంగతిని గ్రహించిన మెకంజీ మహాశయుడు తన మనుషుల చేత మొదటగా ఆ పనినే చేయించాడు.

మెకంజీ గారి గుమాస్తాలు ఊరూరా తిరిగి సేకరించిన స్థానికచరిత్రలన్నీ మెకంజీ కైఫియతులు అనే పేర నాలుగువందల పైగా వాల్యూములుగా మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారంలో పదిలపరచ బడినాయి. వీటిలో విషయాలనే తిరుగ వ్రాయించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారు 54 సంపుటాలుగా బైండింగు చేయించి తెలుగు విశ్వవిద్యాలయంలో భద్రపరిచారు. మెకంజీ కైఫియతులలో విషయాలను తెలుసుకోవాలంటే ఈ రెండు ప్రదేశాలలో ఏదో ఒకచోటికి వెళ్ళాలిసిందే. మెకంజీ గారి గుమాస్తాలు విషయాలను సేకరించి గ్రంథస్తం చేసిన విధం చరిత్ర పరిశోధన మీద మక్కువగల వారికీ, పాత విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలం కలవారికీ ఎంతైనా ఆసక్తికరంగా  ఉంటుంది.  ఉదాహరణకు, వినుకొండ పరగణాలోని ‘పెదగాదెలవర్రు’ అనే గ్రామానికి సంబంధించి ఆ గ్రామపు దేశపాండ్యా ఇచ్చిన స్థానికచరిత్ర వివరం ఈ క్రింది విధంగా ఉంటుంది:

“పెదదింతినపాడు కు దగ్గరగా ఈశాన్య సరిహద్దుకు సమీపంలో జైన మతస్థులు నివాసముండిన ప్రదేశం ఉంది. కర్ణాటక ప్రభుత్వపు వడ్డి రెడ్డి హయాంలో జైనులు అక్కడినుంచి తరలి వెళ్ళిపోయారు. అప్పటినుంచీ ఆ ప్రదేశం ఒక దిబ్బగా మారింది. ఈ ప్రదేశానికి తూర్పున ఉన్న చుండూరు గ్రామస్తులలో కొందరు ఆ దిబ్బలోపలికి ఒక పాతర తవ్వి అందులో ధాన్యపు రాసులను పోగుచేసి దాచడం మొదలెట్టారు. పోనుపోను అది ఒక పెద్ద ధాన్యపు గాదె (store-house) గా మారింది. ఆ తరువాత చుండూరుకు చెందిన కొందరు గ్రామస్తులు ఆ ప్రదేశానికే వెళ్ళి అక్కడ ఇళ్ళను నిర్మించుకుని నివాసముండడం మొదలుపెట్టారు. తెలుగు భాషలో ధాన్యం నిలవవుంచే చోటుకు ‘గాదె’ అనే పేరుండడాన్ని బట్టి ఆ పల్లెటూరికి ‘పెద గాదెల వర్రు’ (great granary) అనే పేరు వచ్చింది.

మొగలులు ఈ ప్రదేశాన్ని జయించిన తరువాత, ఈ ప్రదేశం ఒక తాలుకా అయి, ఇరువురు మహమ్మదీయులకు జాగీరుగా ఇవ్వబడింది. ఆ తరువాతి కాలంలో ఈ ప్రాంతంలో ధనవంతులయిన కమ్మవారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో అమరేశ్వర స్వామి మరియు వేణుగోపాల స్వామి వార్ల దేవాలయాలు నిర్మించ బడినాయి.”

ఈ పాఠం యథాతథం కాదు; సంగ్రహంగా మాత్రమే!