భట్టిప్రోలు స్తూపం

Bhattiprolu_0భట్టిప్రోలు స్తూపం – ఫొటో (1) (విశాలమైన ప్రదక్షిణ పథం తో)

భట్టిప్రోలు కు నేను మొదటి సారి నా ఇరవై ఏళ్ళ వయసులో వెళ్ళాను, (కాస్త దూరపు) బంధువులను ఏదో function కి పిలవాల్సిన పనిమీద. అప్పటికి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో భట్టిప్రోలు ప్రాథాన్యాన్ని గురించి చదివినది జ్ఞాపకం ఉండడం మినహా ఇందులో ఎదో చూడాలన్న కుతూహలంగానీ, ఆసక్తి గానీ అప్పుడు లేవు. పక్కనుంచి నడిచి వెళ్ళ్తూ ఒక సారి అటువైపుగా చూసి ‘ఒహో, ఇదా భట్టిప్రోలు స్తూపం అంటే!’ అనుకుని వెళ్ళిపోయాను.

Bhattiprolu_0Aభట్టిప్రోలు స్తూపం – ఫొటో (2) (విశాలమైన ప్రదక్షిణ పథం తో)

మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి ఇప్పుడు అనుకోకుండా భట్టిప్రోలు వెళ్ళడం, చూడడం, కాసిని ఫోటోలు తీసుకోవడం (సెల్ ఫోను లోని కెమేరాతో, అసలు కెమేరా వెంట లేని కారణంగా) …ఇప్పటికైనా మళ్ళీ వెళ్ళి చూసి, ఆ ప్రదేశంలో కాసేపు కాలం గడపగలగడం అదృష్టంగానే భావిస్తున్నాను! ఈ ప్రదేశం అలాంటిది మరి!

దక్షిణ భారతదేశంలోని లిపులన్నిటికీ (నిజానికి ఇక్కడే గాక, బౌధ్ధం విస్త్రుతంగా వ్యాపించిన బర్మా, మలయా, థాయిలాండు లాంటి కొన్ని పర దేశాల భాషలకు కూడా అని చదివాను) అధార లిపిని ప్రదానం చేసిన ఆది లిపి లాంటి లిపి ఒకటుంది.  ఆ లిపి పేరు ‘భట్టిప్రోలు లిపి ‘ అని భాషా చరిత్రకారులు చెబుతారు. మిగతా సంగతు లెలావున్నా, ఈ ఒక్క కారణంగా అక్షరాలు, భాష, సాహిత్యం అంటే  మమకారం ఉన్న నాకు (ఇంకా నా లాంటి చాలా మందికి) భట్టిప్రొలు నిస్సందేహంగా ఒక పుణ్య ప్రదేశం, పవిత్ర స్థలం.

Bhattiprolu_1భట్టిప్రోలు స్తూపం – ఫొటో (3)

చరిత్రలోకి వెళితే, భట్టిప్రోలు అసలు పేరు ‘ప్రతీపాలపురం’ అట! (కథలలో పేరులాగా పేరు వినడానికి చాల బాగుంటుంది. ఇలా వున్న పేర్లన్నీ ఇప్పుడు ఎందుకనో మాయమైపోయా యనిపిస్తుంది. ‘భట్టిప్రోలు’ విషయంలో పూర్తిగా అలా అనడానికి లేదనుకుంటాను. ఎందుకంటే, ‘ప్రతీ పాల’ అనే పదాలే పోను పోను ‘భట్టి ప్రోలు’ గా మారాయేమో అనిపిస్తుంది కాబట్టి!) ఆంధ్ర శాతవాహన రాజుల పాలనా కాలం ప్రారంభానికి ముందునుంచీ (క్రీ.పూ.3 వ శతాబ్ది ముందునుంచీ) ఈ నగరం ప్రముఖమైనదిగానే వుండినదని చరిత్ర చెబుతుంది. ఈ నగరాన్ని కుబేరకుడనే రాజు పాలించాడని ఇక్కడ దొరికిన శాసనాధారలను బట్టి చరిత్ర పరిశోధకులు కనుగొని చెప్పిన సంగతి.

దేశం బ్రిటిషువారి పాలనలో ఉన్న రోజులలో ఈ స్తూపాన్ని కనుగొని, తవ్వకాలలో బయటపెట్టిన వ్యక్తి పేరు అలక్జాండర్ రే (1892 లో). ఆ తరువాత భారతీయ పురాతత్త్వ పరిశోధకులయిన శ్రీ రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాలలో బౌధ్ధ విహారపు పునాదులు, బుధ్ధునికి సంబంధించిన వస్తువులు లభించాయని చెప్పబడింది. స్తూపం ఆవరించుకుని వున్న ప్రదేశం వైశాల్యం మొత్తం 1700 చదరపు గజాలు. 40 అడుగుల ఎత్తు. 8 అడుగుల సౌకర్యవంతమైన ప్రదక్షిణా పథం భట్టిప్రోలు స్తూపం ప్రత్యేకత. ఇదంతా ఒకింత academic గా అనుపించే సమాచారం.

Bhattiprolu_2భట్టిప్రోలు స్తూపం – ఫొటో (4)

తవ్వకాలలో ఇక్కడ స్తూపంలో దొరికిన ‘ధాతు కరండం’ (కరండము అంటే casket – భరిణ) మూత పైవైపు చెక్కబడి అక్షరాలు అశోకుని కాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో వున్నాయనీ,  ఆ లిపినే  భాషా శాస్త్రజ్ఞులు ‘భట్టిప్రొలు లిపి’ అని ఒక కొత్త పేరు పెట్టి పిలిచారనీ చదివిన సంగతులు.  దక్షిణ భారతంలోని భాషలకు ఈ లిపి నే ఆధార లిపి కావడం, ఈ లిపినుండే అవి పరిణామం చెందడం అనేది  ఇలా ‘భట్టిప్రొలు లిపి’ అని ఒక ప్రత్యేకమైన పేరు పెట్టి పిలవడానికి కారణం అట!

Bhattiprolu_3భట్టిప్రోలు స్తూపం – ఫొటో (5)

అమరావతి స్తూపం ఆవరణలో వున్నట్లుగా మొక్కుబడి స్తూపాలు (Votive Stupa), ఇంకా ఆయక స్తంభం లేవు గాని, ప్రత్యేకంగా ‘ఆయక అరుగులు’  (Ayaka platforms or Ayaka Stones) అనదగిన నిర్మాణాలు ఈ భట్టిప్రోలు స్తూపం ఆవరణలో కనుపిస్తాయి.  ‘ఆయక స్తంభాలు’ మాదిరిగానే ఇవి గూడా పూజనీయాలే!

Bhattiprolu_4భట్టిప్రోలు స్తూపం – ఫొటో (6)

Bhattiprolu_5భట్టిప్రోలు స్తూపం – ఫొటో (7)

బట్టిప్రోలు స్తూపం ఆవరణలో, ఏ అట్టహాసమూ లేకుండా, నిద్రపోతున్న వృధ్ధ వృషభం లాగా ఉన్న స్తూపం పక్కనే వున్నంతసేపూ, వేల సంవత్సరాల క్రితం తనంత తానుగా సమాధిలోకి వెళ్ళిపోయిన ఒక మహాపురుషుని చెంతనే ఉన్నానన్న భావన నాకు కలిగింది!