పల్లవులు-చాళుక్యులు (చారిత్రక వ్యాసములు):డా.నేలటూరు వేంకటరమణయ్య -(2)

‘ఆంధ్రులు-చరిత్ర’

డా.నేలటూరు వేంకటరమణయ్యగారి ‘పల్లవులు-చాళుక్యులు (చారిత్రక వ్యాసములు)’ గ్రంథంలోని రెండవ విషయం ‘ఆంధ్రులు-చరిత్ర’. ఇది 1949వ సంవత్సరం డిశెంబరు నెల 12వ తేదీనాడు వాల్తేరు ఆంధ్రవిశ్వవిద్యాలయ యూనియన్ వారు చేసిన ఆంధ్రవారోత్సవ సందర్భంలో ఇచ్చిన ఉపన్యాసం అని గ్రంథం 27వ పుట అధోజ్ఞాపికలో ఇచ్చిన వివరం.

ఇది కూడా 27పుటల సుదీర్ఘ వ్యాసం. ఇందులో ఆంధ్రులు తొలుతగా ఎవరు? ఎక్కడివారు? ఏ జాతి? చరిత్రలో వారి విజయాలేమిటి? అనే ప్రశ్నలకు సమధానాలిస్తూ, చరిత్రపూర్వ యుగం దగ్గరనుంచి మొదలెట్టి విజయనగర సామ్రాజ్యం దాకా విషయాలన్నిటినీ ఒక మోస్తరు వివరంగా చర్చించారు. సంగ్రహంగా ఆ వ్యాసపు సారాంశం ఇది:

మొదటగా, ఆంధ్రులు ఎవరు? అనేది సమాధానం వెదకాల్సిన ప్రశ్న. ఆంధ్రులు అంటే ఆంధ్రదేశవాసులనీ, ఆంధ్రదేశమంటే ఇప్పటి తెలుగుభాషను మాట్లాడే జనులు నివసించే దేశమనీ సర్వసాధారణంగా అంగీకరించబడుతున్న సంగతి. అయితే, చరిత్రపరిశోధకులలో చాలామంది దీనితో ఏకీభవించరు. ఆంధ్రులనే తెగవారు ఒక్కరుకాదని, తెలుగువారితో వాళ్ళతో వారికి ఎలాంటి సంబంధమూ  లేదని, తెలుగుదేశం తొలుత వారి నివాస స్థలం కాదని, ఆంధ్రులు మాట్లాడిన భాష తెలుగు కాదని, అది ప్రాకృతమని వాదించే చరిత్ర పరిశోధకులు ఎందరో ఉన్నారు. వారి వాదంలో సర్వమూ అంగీకార యోగ్యం కాకపోయినా, అందులో కొంత నిజమూ లేకపోలేదు. ఆంధ్రుల తొలి నివాసస్థానము తెనుగుదేశము కాదు. ఉత్తరపారశీకమునందు అంక్షునదీ తీరంలో ఆంధ్రులు నివసిస్తూ వుండినట్లు  కొన్ని పురాణాలు చెప్పాయి. వింధ్య ప్రాంత దేశంలో వుండినట్లు ఐతరేయబ్రాహ్మణము చెప్పింది. గంగా తీరంలో వుండినట్లు మరికొన్ని గ్రంథాలలో కనిపిస్తుంది. ఆంధ్రజాతీయులైన ప్రాచీన సాతవాహనవంశజులు తమ శాసనాలన్నిటినీ ప్రాకృతభాషలో ప్రకటించారు. అలాగే, సాతవాహనవంశజులను ఆశ్రయించి గ్రంథరచన చేసిన గుణాఢ్యాది కవులు తమ గ్రంథాలను ప్రాకృతంలోనే రచించారు. క్రీ.శ.7వ శతాబ్దానికి ముందు తెలుగుభాష ఉండినదని నిరూపించడానికి తగిన ఆధారాలేవీ లేవు. అందువలన, ఆంధ్రుల నివాస స్థానం ఇప్పటి తెలుగువారు నివసించే దేశము కాదు; వారి భాష తెలుగు కాదు అనీ ఒప్పుకోవాల్సి ఉంటుంది.

కాని, ఆంధ్రులు వేరు, తెలుగువారు వేరు అనడం కూడా సరియైనది కాదు. తొలుత ఆంధ్రుల నివాసస్థానం ఏది అయినప్పటికీ, బౌధ్ధ మౌర్య యుగముల నుండీ దక్షిణాపథంలో కొంచెం ఇంచుమించుగా ఇప్పటి తెలుగుదేశంలోనే ఉన్నట్లుగా బౌధ్ధవాఙ్మయంవలనా, మౌర్య శాసనాలవలనా, గ్రీకు గ్రంథములవలనా  విదితమవుతుంది. అంతేకాక, ఆంధ్రపథము, సాతవాహనరాష్ట్రము, సాతవాహనకోట మొదలైన స్థలములు, ఆంధ్రికానది ఇప్పటి తెలుగుదేశంలోనే ఉండడంవలనా, శాసనాలలో, వాఙ్మయంలో  క్రైస్తవశక ప్రారంభంనుంచే ఆంధ్రులనే పేరు తెలుగువారికే చెల్లుతూండడంవలనా, తొలుత ఆంధ్రులు ఏప్రదేశంలో నివసిస్తూ ఉండినా బౌధ్ధయుగ ప్రారంభకాలంనాటికే వారు ఇప్పటి తెలుగుదేశానికి వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారనీ, అప్పటినుండి ఈ ప్రదేశం ఆంధ్రావని అయిందనీ చెప్పుకోవాలి.

జాతిచే ఆంధ్రులెవరు? అనేది ఇంకొక ప్రశ్న. ద్రావిడులని కొందరు, ఆర్యులని కొందరు సమాధానంగా చెబుతారు. నిజానికి ఈ రెండిటిలో ఏదీ పూర్తి నిజం కాదు. ప్రపంచంలో ఎక్కడా స్వచ్చమైన జాతిలేదు. అన్నీ మిశ్ర జాతులే. ఆంధ్రులు ఉత్తరభారతాన్నుంచి ఇక్కడికు చేరుకున్నపుడు ఈ ప్రదేశం నిర్మాణుష్యమైన కాడు కాదు. రామాయణకాలం నాటికే గోదావరీ తటప్రదేశానికి జనస్థానమని పేరు వచ్చివుంది. ఇక్కడ జీవనం సాగిస్తూవుండిన  ప్రజలు ఆదిమ ఖాండులు, కోయలు అని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. మొదట ద్రావిడులు ఆక్రమించుకుంటే, ఆ తరువాత ఆంధ్రులు వచ్చారు. ఈ మూడుజాతుల సమ్మేళనంతో ఆంధ్రజాతి మిశ్రజాతిగా మారింది. ఈ సమ్మేళనంవలన కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి. అందులో ఒకటి భాషాత్మకమైన మార్పు. ఆంధ్రుల ప్రాకృతం, ద్రావిడుల అరవము కలవడంవలన రెండు నూతన భాషలు ఏర్పడినాయి. తూర్పున తెలుగు, పశ్చిమాన కన్నడము. తూర్పున ద్రావిడుల కంటే ఆంధ్రులు ఎక్కువవడంవలన ఆంధ్రుల భాషలో  ప్రాకృత సంస్కృత శబ్దాలు ఎక్కువ అయ్యాయి. పశ్చిమాన ఆంధ్రుల కంటే ద్రావిడులు ఎక్కువవడం వలన అక్కడి పలుకుబడిలో ద్రావిడ శబ్దజాలం ఎక్కువైంది. తూర్పున ఆంధ్రుల సంఖ్య ఎక్కువవడంతో ఆంధ్రదేశమని పేరు వచ్చింది. పశ్చిమమున కర్ణ రాజులపేర కర్ణాటకమని పేరు వచ్చింది. ఆంధ్ర కార్ణాటకులు ఈ విధంగా వేరయినప్పటికీ, వారి ఇరువురి సంస్కృతీసంప్రదాయాలు ఒకాటిగానే ఉన్నాయి. దక్షిణాపథంలోని అన్యజాతుల కంటే, ఆంధ్రకర్ణాటకులకు ఒకరొకరితో సామ్యం ఎక్కువగా కలిగింది. ఈ సందర్భంలో జ్ఞప్తికి తెచ్చుకోవలసిన చారిత్రక ఘటన చాళుక్యుల దండయాత్ర.

చాళుక్యులు కర్ణాటకులు. క్రీ.శ.7వ శతాబ్దం పూర్వార్ధంలో వీరి ప్రభువు ఇమ్మడి సత్యాశ్రయపులకేశి వల్లభుడు తూర్పు సముద్రతీరంలోని కృష్ణా గౌతమీ మధ్యస్థిత ఆంధ్రదేశాన్ని జయించి అక్కడ తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుని రాజుగా ప్రతిష్ఠించాడు. ఈ సంఘటనతో ఆంధ్రదేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. తూర్పుతీరంలోని వేంగీ మండలంలో ఒక నూతన రాజవంశం పూర్వ చాళుక్యులన్న పేరుతో ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావంతో చాళుక్యులు ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నప్పుడు, వారితో పాటుగా వారి స్త్రీజనం, పరివారం, పండితజనులు, ఉద్యోగులూ, వర్తకులూ, చతురంగబలములూ ఇక్కడకు చేరాయి. వీరంతా కర్ణాటకులే. ఈ పరిణామంతో ఇక్కడి జనసామాన్యం మిశ్రీభూతమైంది. ఈ ప్రజాసమ్మిశ్రణం వల్ల ఆచారవ్యవహారాలలో కొంత మార్పు వచ్చింది. భాషలో మార్పు వచ్చింది. కన్నడ పలుకుబడులు కొన్ని తెలుగున ప్రవేశించాయి. ఇంచుమించుగా ఇలాంటి సమ్మిశ్రణమే క్రీ.శ.11-12 శతాబ్దములలో ద్రావిడుల కలయిక వలన జరిగింది. ప్రథమశక్తివర్మ వేంగీ సింహాసనన్ని అధిష్ఠించినది మొదలు పూర్వచాళుక్య చోళరాజకుటుంబముల మధ్య వివాహసంబంధాలు ఏర్పడ్డాయి. వేంగిరాజులు చోళచక్రవర్తులకు అరిగాపులయ్యారు. రాజ్రాజనరేంద్రుని నిర్యాణానంతరం వేంగిరాజ్యం చోళసామ్రాజ్యంలో లీనమైపోయింది. రాజరాజనరేంద్రుని కుమారుడైన రాజేంద్రదేవుడు (ఇతడే తరువాత కుళోత్తుంగచోళుడుగా మారాడు) ఉభయరాజ్యములకూ అధిపతియై అరవలలో కలిసిపోయాడు. మేనమామయగు చోళచక్రవర్తి ఇమ్మడి రాజేంద్రదేవుని పుత్రికయైన మధురాంతకీ దేవిని పెండ్లాడి తన జన్మనామమైన రాజేంద్రదేవుడనే పేరును వదిలి కుళోత్తుంగచోళుడయ్యాడు. ఈ పరిణామంతో పెక్కండ్రు అరవ ఉద్యోగస్థులు ఆంధ్రదేశంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పటి ఆంధ్రబ్రాహ్మణ్యంలో మూడవవంతు ద్రావిడ బ్రాహ్మణులు ఉన్నారు. వీరితోపాటు అరవకరణ అరవవెలమ బేరి ముదిలియారుపిళ్ళలు అనేకులు ఆంధ్రదేశంలో నివసిస్తున్నారు. ఇందువలన తెలిసేది, ఆంధ్రులు కొందరనుకొనునట్లు స్వచ్చమైన జాతికాదు; వారు కేవలము ఆర్యులు కారు, ద్రావిడులూ కారు; ఆంధ్రులు మిశ్రజనులు. ఇది సత్యం.

ఆంధ్రులు సామ్రాజ్య నిర్మాతలు. భారతదేశ చరిత్రలో సుప్రసిధ్ధి చెందిన సామ్రాజ్యములు రెండు వారిచే సృజించబడ్డాయి. వీటిలో మొదటిది సాతవాహన సామ్రాజ్యం. క్రీ.పూ.240 నుండి క్రీ.శ.220 వరకు, 460 సంవత్సరములు ఈ రాజవంశం పరిపాలన సాగించింది. భారతదేశ చరిత్రలో ఏరాజవంశమూ ఇంత సుదీర్ఘకాలం పరిపాలించియుండలేదు. ఇంత సుదీర్ఘకాలం పరిపాలించియున్నప్పటికీ, వారి చరిత్రను గూర్చి కాని, వారి పరిపాలన క్రింద నడిచిన విశేష చరిత్రాంశములను గూర్చి కాని మనకు తెలిసినది అత్యల్పం. అయినప్పటికీ, తెలిసినంతలో వారి యేలుబడిక్రింద నడిచిన కొన్ని ముఖ్యాంశములను వివరించుటకు అవకాశం ఉంది. ఇందులో మొదటిది హిందూ ధర్మోధ్ధరణం. రెండవది నౌకానిర్మాణము, ద్వీపాంతర వాణిజ్యము. మూడవది స్త్తూపచైత్యాది శిల్పనిర్మాణము, నాల్గవది ప్రాకృతవాఙ్మయ పోషణ. హాలుని గాథాసప్తశతి, గుణాఢ్యుని బృహత్కథ (ప్రాకృత) సాహిత్యంలో ఉత్తమోత్తమమైన రచనలు.

ఆంధ్రులచే నిర్మించబడిన రెండవ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. హిందూధర్మ రక్షణకొరకే ఈ సామ్రాజ్యమూ నిర్మించబడింది. క్రీ.శ.13వ శతాబ్దాంతంలో మహమ్మదీయులు దక్షిణాపథంలో అడుగుపెట్టారు. వారి రాకతో దక్షిణాపథంలో హిందూ రాజ్యాలయిన కాకతీయ (ఆంధ్ర), హొయ్సల (దక్షిణ కర్ణాటక), పాండ్య (ద్రవిడ), యాదవ (ఉత్తర కర్ణాటక) రాజవంశాలకు విపత్తు సంభవించింది. క్రీ.శ.1295-1326 మధ్య కాలంలో ఈ రాజవంశాలన్ని మహమ్మదీయుల ధాటికి తట్టుకోలేక కూలిపోయాయి. స్వతంత్రహిందూ ప్రభువెవ్వడూ లేక హిందూ సంస్కృతికి, ధర్మమునకూ ముప్పు వాటిల్లింది. దక్షిణాపథాన్ని ఈ విపత్తునుంచి కాపాడుకోవడానికై ఆంధ్రనాయకులందరూ ఒకచోట సమావేశమై ఒక జాతీయసమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితికి ముసునూరుప్రోలయనాయకుడు అధిపతి. ఈతని ఆధిపత్యంలో ఆంధ్రనాయకుల ఉద్యమం జయప్రదంగా కొనసాగింది. కాకతీయ రాజ్యం కూలిపోయిన 15 సంవత్సరములలోపలనే ఆంధ్రులు మహమ్మదీయులను పారద్రోలి తమ స్వాతంత్రాన్ని తిరిగి స్థాపించుకున్నారు. తీరాంధ్రమంతా తిరిగి ఆంధ్రుల వశమైంది. ఇది జరిగిన కొన్నాళ్ళకు ముసునూరుప్రోలయనాయకుడు దివంగతుడయ్యాడు. నాయకులందరూ మళ్ళీ ఏకమై ప్రోలయనాయకుని స్థానంలో అతని సోదరుని పుత్రుడైన కాపయనాయకుడిని సమితికి అధిపతిగా ఎన్నుకున్నారు.

కాపయనాయకుడు అసాధారణ పురుషుడు, దూరదృష్టిగల రాజ్యతంత్ర మర్మజ్ఞుడు. మహమ్మదీయులతో పోరాడి గెలుచుకున్న స్వాతంత్ర్యం మళ్ళీ చేజరిపోకుండా నిలిచేలాచేసి దక్షిణాపథాన్నంతా సురక్షితంచేయాలంటే దాక్షిణాత్యహిందూరాజులలో కెల్ల గొప్పవాడునూ బలవత్తముడును ఐన హొయ్సల ముమ్మడి బళ్ళాలదేవుని సహాయసహకారాలు లేకుండా సాధ్యపడదని ఆలోచించి హొయ్సల రాజదాని ద్వారసముద్రమునకు వెళ్ళి బళ్ళాలదేవునితో చర్చించి ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. ఈ ఒడంబడిక ఫలితార్ధం – దాక్షిణాత్యహిందూ సంఘమునకు బళ్ళాళుడు అధిపతియై స్వాతంత్ర్య యుధ్ధమును సాగించడం; తెలింగాణమునుండి మహమ్మదీయులను తరిమివేసి ఓరుగంటిని స్వాధీనపరచుకోవడానికి అవసరమైన సైన్యాన్ని కాపయనాయకునికి తోడుగా పంపడం. అల్పకాలంలోనే వారి కోరిక తీరి ఓరుగల్లు తిరిగి కాపయనాయకుని హస్తగతమైంది. అయితే ద్రావిడదేశంలోని చోళపాండ్యరాజ్యాలు ఇంకా మహమ్మదీయుల దాడినుండి విముక్తమై సురక్షితం కాలేదు. ఇందుకోసం మధురసుల్తానుతో బళ్ళాలుడు సలిపిన పోరులో ప్రారంభదశలో బళ్ళాలునికే విజయంచేకూరినప్పటికీ, తుదకు క్రీ.శ.1341లో బళ్ళాలుడు తిరుచునాపల్లి యుద్ధములో నిహతుడయ్యాడు. ఇక్కడితో హొయ్సల రాజవంశం అంతరించింది. బళ్ళాలుని మరణం తరువాత అతని స్థానాన్ని విజయనగర ప్రభువులు అధిష్ఠించారు.

విజయనగర సంస్థాననిర్మాతలు హరిహరబుక్కరాయలను ఇద్దరు ఆంధ్ర సోదరులు. మొదటలో వీరు ఓరుగంటి ప్రతాపరుద్రుని కొలువులో కోశాగారప్రతీహారులై వున్నవారు. క్రీ.శ.1323లో ఓరుగల్లు మహమ్మదీయుల హస్తగతమైనప్పుడు వీరిరువురు అచ్చటినుండి తప్పించుకుని పోయి కంపిలిలో వీరకంపిలిరాయల నాశ్రయించి అతని కోలువులో చేరారు. క్రీ.శ.1326లో ఢిల్లీ సుల్తాను కంపిలిరాయలను చంపి అతని రాజ్యాన్ని తనరాజ్యంలో కలుపుకున్నపుడు వీరిరువురు బందీకృతులై ఢిల్లీకి తీసుకుపోబడి, అక్కడ మహమ్మదీయులుగా మతమార్పిడి చేయబడ్డారు.

ఇది ఇలావుండగా, క్రీ.శ.1330లో ఆంధ్రజాతీయసైన్యములు ఆరవీటి సోమదేవుని ఆధీనములో వుండిన పశ్చిమాంధ్రదేశాన్ని పూర్వకంపిలిరాజ్యంతో సహా ఆక్రమించి స్వాధీనం చేసుకున్నాయి. ఈ సమాచారం అందినవెంటనే ఢిల్లీ సుల్తాను హరిహరబుక్కరాయలరను ఇరువురినీ కంపిలికి అధిపతులుగా నియమించి, తగినంత సైనాన్ని తోడుగా ఇచ్చి, పోయిన కంపిలిని తిరిగి స్వాధీనపరుచోవడానికి పంపాడు. ఈ కార్యంలో తొలుత పరాజయం ఎదురైనా విద్యారణ్యులవారి ప్రసాదంతో చివరకు అందులో కృతకృత్యులై హరిహరబుక్కరాయ లిరువురూ స్థిరంగా అక్కడ రాజ్యంచేయడం మొదలుపెట్టారు.

హరిహరబుక్క విద్యారణ్యులసమాగమము దక్షిణభారతదేశ చరిత్రలో ఒక సుమధుర ఘట్టం. ఒక మరువరాని విశేషాంశం. దక్షిణభారతదేశ చరిత్రను ఇది ఒక నూతనమార్గానకు తిప్పింది. విద్యారణ్యస్వామి మధ్యయుగ హిందూప్రపంచమును ఉధ్ధరించ వెలసిన మహాపురుషుడు, విశాలహృదయుడైన సన్యాసి. మహా జ్ఞాని. అద్వైతవేదాంతమున మొదటిబంతిలోని వాడు. సర్వతంత్రస్వతంత్రుడు, రాజ్యతంత్రపారంగతుడు. ధర్మోపదేశంతో తిరిగి హరిహరబుక్కరాయలనిరువురినీ హిందూమతానుయాయులుగ జేసి, వారిరువురు పంపావిరూపాక్షస్వామి ప్రతినిధులుగా దక్షిణదేశమంతటినీ పాలింతురని ప్రకటించారు. వారి ఆజ్ఞ మేరకు హరిహరబుక్కరాయలిరువురు డిల్లీసుల్తానును ధిక్కరించి స్వతంత్రులై క్రీ.శ.1336వ సంవత్సరం ఏప్రెలు 18వ తేదీనాడు పంపావిరూపాక్షస్వామి సన్నిధిన రాజ్యాభిషిక్తులయ్యారు. ఆ శుభముహూర్తాననే విజయనగరమను నూతన రాజధాని నగరానికీ శంకుస్థాపన జరిగింది. ఇది సంగ్రహంగా విజయనగరసామ్రాజ్య స్థాపన వృత్తాంతం. మూడువందల ఏండ్ల పాటు దక్షిణభారతదేశాన్ని మహమ్మదీయ పాలకులనుండి కాపాడిన సామ్రాజ్యం ఇది. కృష్ణ దాటి రావలయునని మహమ్మదీయులు; వారిని దాటి రానీయకూడదని విజయనగర చక్రవర్తులు. ప్రధాన రణరంగము కృష్ణా తుంగభద్రల నడిమిప్రదేశం. మహమ్మదీయులతో హోరాహోరీగా పోరాడి, వారి రాకకు అడ్డుకట్టవేసి, హిందూసంస్కృతి సంకరముకానీయకుండా ఆపడమేకాక ఆ సంస్కృతిని కాపాడడానికై పలువిధాలుగా విజయనగర ప్రభువులు పాటుపడ్డారు. మొట్టమొదటినుండి చిట్టచివరి వరకు విజయనగర ప్రభువులు వైదిక ధర్మాన్ని పోషించి వేదమార్గప్రతిష్ఠాపనాచార్యులనే బిరుదును సార్ధకం చేసుకున్నారు.  ప్రాచీన దేవాలయాలను బాగుచేయించడమే కాక వేలకొలది నూతన దేవాలయాలను నిర్మింపజేసి వాటిలో పూజాపురస్కారములు నిరంతరాయముగా సాగడానికి తగిన ఏర్పాట్లను చేసారు.

ఆంధ్రవాఙ్మయానికి విజయనగరప్రభువులు చేసిన సేవ అమూల్యమైనది. మొదటి హరిహరరాయలకాలంనుండి ముమ్మడి శ్రీరంగరాయలవరకూ ఆంధ్రకవులను ఆదరించని రాయడు లేడు. వారి ఆశ్రయంలో ఆంధ్రవాఙ్మయం తామరతంపరగా వృధ్ధి చెందింది. రాయల ఆస్థానం ఆంధ్ర ప్రబంధమునకు జన్మస్థానం. యక్షగాన, వచనకావ్యములు మధుర తంజావూరు నాయకుల ప్రోత్సాహమువలన వృధ్ధిచెందాయి.

విజయనగర రాజులకాలంలో దేవాలయ వాస్తు కొత్త దారులు తొక్కింది. విజయనగరఫక్కి అని ఒక నూతనఫక్కి ఏర్పడింది. హంపి, పెనుగొండ, చంద్రగిరి, తంజావూరు, మధుర మొదలగు ప్రదేశాలలో పెక్కు ప్రాసాదాలు నిర్మించబడినాయి. కర్ణాటక సంగీతము కూడా విజయనగర సంస్థానంలో పెరిగినదే. రాయసంస్థాన స్థాపనకు పూర్వం ఆంధ్రసంగీతము ఏస్థితిలో వుండినదో తెలుసుకోవడానికి ఆధారములు లేవు; కాని, రాయసామ్రాజ్య స్థాపన తరువాత దేశంలోని అన్నిప్రాంతాలలోనూ అది జనాదరణమునకు పాత్రమైంది. రాచకొండలో సర్వజ్ఞసింగభూపాలుడు, కొండవీటియందు కుమారగిరి పెదకోమటి వేమారెడ్డి సంగీతశాస్త్రగ్రంథములను రచించారు. క్రీ.శ.15వ శతాబ్దపూర్వార్ధంలో సాళువగోపతిప్పన, కల్లరుసు అనువారు విజయనగరరాయల ఆస్థానాన్ని అలంకరించారు. అటుపిమ్మట, కృష్ణరాయల ఆస్థాన విద్వాంసుడు బండారులక్ష్మీనారాయణ తన సంగీతసూర్యోదయంలో కర్ణాటక సంగీతవిశేషములను ఎన్నిటినో వివరించాడు. అచ్యుతదేవరాయలు సుప్రసిధ్ధ వైణికుడు. వీణమెట్లను సరిచేసి రాగరాగమునకు వానిని సవరింపనవలసిన ఆవశ్యకత లేకుండా స్థిరపరిచాడు. దీనికి అచ్యుతరాయవీణ అని పేరు.

తళ్ళికోట యుధ్ధానంతరం రాయరాజధానియైన విజయనగరం ఖిలపడిపోయింది. రాయాస్థానమును ఆశ్రయించుకొని ఉండిన సంగీత విద్వాంసులు, కళావంతులు అందరూ తంజావూరు చేరి అక్కడి నాయకరాజులను ఆశ్రయించారు. ఆంధ్రులచే వృధ్ధిచేయబడిన కర్ణాటక సంగీతం అలా అరవసీమ చేరింది. అది మొదలుగా వారు కర్ణాటకసంగీతాన్ని కాపాడుతూ వచ్చారు.

ఆంధ్రుల చరిత్రకు సంబంధించి తెలిసినదానికంటే తెలియనిదే యెక్కువ. తెలియని విషయాలను తెలుసుకొనడానికి, తెలిసిన విషయాలను చక్కగా గ్రహించడానికి పరిశోధన ఇంకా జరగవలసి వుంది. ఆంధ్రదేశంలో ఒకటిరెండు శిలాశాసనాలన్నా కనుపించని గ్రామాలు లేవు. తామ్రశాసనాలెన్నో గుప్తములై వున్నాయి. ఆంధ్ర భాషకు చరిత్రకు అవినాభావ సంబంధం ఉంది. ఆంధ్ర వాఙ్మయమును చక్కగా చదవనివాడు చరిత్రపరిశోధకుడు కాలేడు. చరిత్ర జ్ఞానము లేనివానికి మన కావ్యాలు అర్ధము కాజాలవు. మన కవులు వారి కాలంలో వాడుకలో వుండిన రాజకీయ సాంఘిక మతాచారవ్యవహారములను తమ కావ్యాలలో వర్ణించారు. వారు చెప్పు కథ రామాయణమైనను అందు వర్ణించబడిన స్త్రీపురుషులందరూ కవుల కాలంలో వాడుకలో వుండిన వస్త్రములను, భూషణములను ధరించారు; వారి కాలపు అచారవ్యవహారాలను అవలంబించారు; అప్పటి ప్రజల వలెనే వర్తించారు. కాబట్టి వాఙ్మయం చరిత్రరచనకు చాలా ఉపయోగకరం అవుతుంది.

పల్లవులు-చాళుక్యులు (చారిత్రక వ్యాసములు): డా.నేలటూరు వేంకటరమణయ్య -(1)

‘ఆంధ్రదేశమున చరిత్రపరిశోధన’

పుస్తకం నన్ను ఎప్పుడు ఏ సంధర్భంలో పట్టుకుందో చెప్పలేనుగాని, ఆ పట్టుకోవడం మాత్రం చాలా గట్టిగానే పట్టుకుంది. పుస్తకంతో దాదాపు మూడు దశాబ్దాల సాంగత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో అప్పుడప్పుడూ వదిలించుకోవాలని చేసిన ప్రయత్నాలెన్నో ఉన్నా, తిరిగితిరిగి మళ్ళీ పుస్తకం దగ్గరికి చేరుకోవడం అన్నిసార్లూ మరోదారి లేదన్నట్లుగా జరిగింది. ఈ మూడుదశాబ్దాల కాలంలో ఎన్నెన్నో పుస్తకాలను, పాతవాటిని పేవుమెంట్లమీదనుంచీ, కొత్తవాటిని పుస్తకాల దుకాణాలనుంచీ కొనడం, వాటిలో కొన్నిటిని పోగొట్టుకోవడమూ జరిగింది. లోకంలో ఎక్కడకన్నా, గ్రంధాలయాల్లో పుస్తకాలున్న ర్యాకులమధ్య నిశ్శబ్దంలోనూ, పుస్తకాల దుకాణాల్లో కొత్త పుస్తకాల ర్యాకుల మధ్యనూ ఉన్నప్పుడనిపించినంత సుఖం మరే ప్రదేశంలో ఉన్నప్పుడూ అనిపించకపోవడం చాల సార్లు నా అనుభవంలోకి వచ్చిన మాట నిజం. చిన్నదైనా పెద్దదైనా, ప్రతి పుస్తకంలోనూ ఒక మేధస్సు సృష్టించుకున్న జ్ఞాన ప్రపంచమో, కల్పించికున్న ఊహా ప్రపంచమో నిక్షిప్తమై ఉంటుందన్న స్పృహ నా ఆ సుఖానికి కారణం అనుకుంటూ ఉంటాను. కొత్త సంగతిని కనిపెట్టి చూపడం ఎంత మోహనమో, ఉన్నదాన్ని విశదపరచి చెప్పడమూ అంతే మోహనమని నా నమ్మకం. ఇప్పటికి దాదాపు నా ఈ మూడుపదుల సంవత్సరాల bibliophile-పుస్తకాలపురుగు జీవనంలో పెద్దగా జరిగిందేమీ లేకపోయినా, పోయిందీ  ఏమీ లేదు. మిగిలింది మాత్రం, మక్కువపడి కొనుక్కున్న ఒక్కొక పుస్తకాన్నీ చదువుతున్నప్పుడు కలిగిన కొద్దో గొప్పో అర్ధజ్ఞానమూ, ఆనందమూ, అనుభూతి! అర్ధజ్ఞానం అన్న మాట ఎందుకంటే, పుస్తకాలంటే ఇష్టమున్నంత మాత్రాన, జ్ఞానవంతుల మవుతామన్న భరోసా ఏమీ లేదు కాబట్టి!

పఠనం అన్నది మొదట కాల్పనిక సాహిత్యం అనబడే నవలాసాహిత్యంతో మొదలైనా, పోనుపోనూ దృష్టీ ఆసక్తీ తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర సంబధ విషయాలపైకి మళ్ళింది. చరిత్ర ఒక గమ్మత్తయిన సంగతి. మనకు తెలియనంత మాత్రాన లేదని చెప్పడానికి విల్లేనటువంటి ఒకానొక అంతుచిక్కని అనుభవం లాంటిది. దోసిళ్ళతో తోడే కొద్దీ, తోడేవ్యక్తి చేతులని ఇంకా ఇంకా లోపలికి లాక్కెళుతూ వుంటుంది. ఆంధ్రుల చరిత్రకు సంబంధించి ఇది ఇలాగే గడచిన శతాబ్దంలోని నలభై, యాభై, అరవై, డెబ్భైవ దశకాల్లో జరిగింది. భారతి మాసపత్రిక ఆంధ్ర దేశంలోని చిన్న పెద్ద చరిత్రపరిశోధకులందరికీ చేయూతనిచ్చి వారు వెలుగులొకితెచ్చిన సంగతులన్నిటినీ ప్రచురించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధనకు సంభందించినంతవరకూ, నేను గ్రహించినంతలో ఈ నాలుగు దశాబ్దాల కాలం స్వర్ణయుగం లాంటిది. ఆంధ్రులకు సంబంధించినంతవరకు గడచిన శతాబ్దంలో జరిగిన అత్యంత దురదృష్టకర సంఘటన ఏదని నన్నెవరైనా అడిగితే, భారతి మాసపత్రిక ప్రచురణ ఆగిపోవడం అని చెప్పడానికి నేను సందేహించననుకుంటాను.

ఆ కాలంలో వచ్చిన మంచి ఆంధ్రుల చరిత్ర సంబంధ పుస్తకాలలో ఒక మంచి పుస్తకం డా.నేలటూరు వేంకటరమణయ్య, ఎం.ఏ.పిఎచ్.డి., గారి ‘పల్లవులు-చాళుక్యులు (చారిత్రక వ్యాసములు)’ అనే పుస్తకం. 1969లో ఈ పుస్తకం ప్రచురించబడింది. ప్రకాశకులు వారే. ముద్రాపకులు శ్రీ వేదం వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మద్రాసు-1.

1928-50 ల మధ్య, అప్పుడప్పుడు, చరిత్ర పరిశోధన సందర్భమున వారికి కలిగిన సంశయములను నివర్తిజేసికొనుటకై విరచించినవి ఈ వ్యాసములని డా. నేలటూరు వేంకటరమణయ్య గారు ఈ పుస్తకానికి పీఠికలో చెప్పుకున్న మాట! ఇందులోని వ్యాసాలన్నీ అంతకు మునుపు ‘భారతి’ మాస పత్రికలో ముద్రింపబడినవే! ఆ పత్రికాధిపతుల అనుమతితోనూ, ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీవారి, ఆంధ్రప్రదేశ గవర్నమెంటువారి ధనసహాయంతో ముధ్రణ చెందినది ఈ పుస్తకం.

తాప్పొప్పుల పట్టికతో కలుపుకుంటే 450 పుటలు దాటి వుండే ఈ పుస్తకానికి, విషయసూచిక ఈ క్రింది విధంగా ఉంటుంది:

1. ఆంధ్ర దేశమున చరిత్ర పరిశోధన
2. ఆంధ్రులు చరిత్ర
3. పల్లవ చరిత్రము నందు కొన్ని సంశయములు
4. పల్లవవంశము - వీరకూర్చవర్మ
5. నెడుఙ్గరాయ తామ్రపట్టిక
6. పృథ్వీమహారజు యొక్క తాణ్డివాడ శాసనము
7. లేములవాడ చాళుక్యులు
   చాళుక్యు లెవరు
8. జినవల్లభుని గంగాధర శిలాశాసనము
9. గుణగవిజయాదిత్యునినాటి వర్తమానములు -1
           అదే ...              -2
    "      రాష్ట్రకూటులు
10. రాజరాజనరేంద్రుని కలిదిండి తామ్రశాసనము
11. రాజరాజనరేంద్రుని మండతామ్రశాసనము

పటము-1 రాజరాజనరేంద్రుని కాలమున
శాసన ప్రతిబింబములు --
               1. నెడుఙ్గరాయ తామ్రపట్టిక
               2. తాణ్డివాడ తామ్రపట్టిక
               3. రాజరాజనరేంద్రుని కలిదిండి తామ్రశాసనము
                       "      మండ తామ్రశాసనము.

‘ఆంధ్రదేశమున చరిత్రపరిశోధన’ అన్న పేరుతో మొదటగా వున్నది 26 పుటల వ్యాసం. ఇందులో ఆంధ్రదేశంలో చరిత్ర పరిశోధన అన్నది ఓంప్రథమంగా ఏ పరిస్థితులలో ఎలా ఎవరి చేతులమీదుగా మొదలైందన్న దాని దగ్గరనుంచి, అప్పటిదాకా (అంటే 1969వ సంవత్సరందాకా) ఆంధ్రదేశ చరిత్ర పరిశోధనకు సంబంధించిన సంగతులన్నీ ఒక మోస్తరు వివరంగా చర్చించబడ్డాయి. ఆంధ్రదేశ చరిత్ర పరిశోధన చరిత్రపై ఆసక్తి కలవారందరూ  కొంతలో కొంతైనా తెలుసుకోవాల్సిన సంగతులవి. ఆ వ్యాసపు సారాంశం ఇది:

పాశ్చాత్యులతో సాంగత్యంవలన  మనకు అలవడిన విద్యలలో చరిత్ర పరిశోధన ఒకటి. చరిత్రపరిశోధన భారతావనిలో అన్ని ప్రదేశాలకంటే ముందే ఆంధ్రదేశంలో ఆరంభమైనది. క్రీ.శ.19వ శతాబ్ది పూర్వార్ధంలో కుంఫిణీ ప్రభుత్వంవారు కర్నల్ కాలిన్ మెకంజీ అనే అతనిని దక్షిణభారతదేశంలో సర్వేయరుజనరల్ పదవికి నియమించారు. ఈయనకు దక్షిణదేశచరిత్ర వ్రాయాలనే అభిలాష కలిగింది. అందుకుగాను అతడు  తన సొంత ధనాన్ని ఖర్చుబెట్టి కొంతమంది  వ్రాయసకాండ్రను, గుమాస్తాలను ఏర్పాటుచేసుకుని, వారిని దక్షిణభారతదేశంలోని గ్రామగ్రామానికీ వెళ్ళి అక్కడ లభ్యమయ్యే తామ్రశిలాశాసనాలకు, తాళపత్ర గ్రంథాలకు ప్రతులు వ్రాయించడమేకాకుండా, ఆయా ప్రదేశాల జనుల జాతి, మత, సాంఘిక, ఆర్థిక పరిస్థితులను విచారించి వాటి వివరాలనుకూడా వ్రాసుకుని తేవలసిందిగా నియోగించాడు.

మెకంజీగారి గుమాస్తాలకందరికీ నాయకుడు ఒక ఆంధ్ర బ్రాహ్మణుడు. ఆయన పేరు కావలి వెంకటబొఱ్ఱయ్య. ఈయన కింద ఈయన సోదరుడు రామస్వామి, వెంకటరావు, నారాయణరావు అనే వారితో పాటు ఇంకా కొంతమంది గుమాస్తాలు పనిచేసేవారు. వెంకటబొఱ్ఱయ్య గారి ఉత్తరువులను అనుసరించి ఈ గుమాస్తాలు గ్రామగ్రామానికీ వెళ్ళడం, అక్కడి శాసనాదులకు యథామాత్రుకలను తయారుచేసి వ్రాసి పపడం జరిగింది. కావలి వెంకటబొఱ్ఱయ్యగారు, వారి దగ్గర పనిచేసిన గుమాస్తాలలో చాల మంది తెలుగువారవడంచేత వారిచే తయారుచేయబడిన గ్రామ కైఫియ్యతులు, ఇంకా ఇతరాలైన సర్వ విషయాలూ  తెలుగు భాషలోనే వ్రాయబడినాయి. వీటిని ఆధారంగా చేసుకునే వెంకటబొఱ్ఱయ్య గారు సందర్భానుసారంగా నాడులచరిత్రలను, రాజుల చరిత్రలను వ్రాశారు. అట్లా మెకంజీగుమాస్తాలే మొదటి ఆంధ్ర చరిత్ర పరిశోధకులయ్యారు. పరిశోధనాపధ్ధతులను తనక్రిందపనిచేసే గుమాస్తాలందరికీ నేర్పి శాస్త్రసమ్మతమార్గాన్ని ఉల్లంఘించనీయకుండా పరిశోధనను నడిపించిన వెంకటబొఱ్ఱయ్యగారు ఈ కారణంచేత ‘ఆంధ్రచారిత్రక పితామహులు’ అనదగినవారు. ఆంధ్ర చరిత్రకు వీరువేసిన పునాదులను అనుసరించే తరువాత పరిశోధకులు చరిత్ర రచన సాగించారు.

మెకంజీ గుమాస్తాల దేశసంచారంలో వారికి పరిచయంలేని లిపిలో వ్రాయబడివున్న శాసనాలు చాల చోటల కనిపించాయి. ఈ లిపి సామాన్యంగా ఆంధ్ర కర్ణాట శాసనాలలోనే కనిపించడంచేత, ఈ లిపికి అప్పటి పరిశోధక పండితులు ‘తెలుగుకన్నడ’ లిపి అని పేరుపెట్టారు. ఈ ‘తెలుగుకన్నడ’ లిపిలో ఉన్న శాసనాలను చదివే మార్గాన్ని అప్పటి చరిత్రపరిశోధకులకు నేర్పి శాసనపరిశోధనకు వెంకటబొఱ్ఱయ్యగారు పునాది వేశారు.

మెకంజీ గుమాస్తాలు సేకరించిన వ్రాతప్రతులు దాదాపుగా నాలుగువందల సంపుటాలు మద్రాసుప్రాచ్యలిఖితపుస్తక భాండారంలో ఉన్నాయి. వీటికి మెకంజీ పుస్తకాలని పేరు. కాలక్రమంలో క్రిమిదష్టములైపోసాగిన వీటిని సంరక్షించే ఉద్దేశ్యంతో చార్లెసు ఫిలిప్ బ్రౌనుగారు ఈ పుస్తకాలలో చాలా భాగాన్ని అరవైకి పైగా సంపుటాలుగా తిరుగవ్రాయించారు. ఇలా తిరుగవ్రాయబడిన గ్రంథాలకు ‘లోకల్ రెకార్డ్స్’ అని పేరు. మెకంజీ పుస్తకాలుగానీ, వాటికి మారుకాపీలనదగిన బ్రౌన్ ‘లోకల్ రికార్డ్స్’ గానీ ఆంధ్రుల  చరిత్రరచనకు అలా అమూల్యమైన సాథనాలుగా మారాయి.

కావలి వెంకటబొఱ్ఱయ్యకు తరువాత పేర్కొనదగిన చరిత్ర పరిశోధకుడు శ్రీమాన్ బుక్కపట్టణము రాఘవాచార్యులవారు. వీరు అప్పటి మద్రాసు గవర్నరుగారి కౌన్సిలుమెంబరు కార్మైకేలు దొరగారి ప్రోత్సాహంతో తనకు అప్పటికి లభ్యములైన చారిత్రకసాధనసామగ్రిని ఆధారంగా చేసుకుని ఆంధ్రదేశచరిత్రను కొన్ని సంపుటాల గ్రంథంగా తయారుచేశారు. ఈ గ్రంథం సరిగా సంరక్షించబడినట్లుగా కనబడదు. ఇందులో కొంత భాగాన్ని మానవల్లి రామకృష్ణకవిగారు ఒక గుజలీ పుస్తకముల అంగడిలో కొంతసొమ్మిచ్చి కొన్నారనిన్నీ, కొంతభాగాన్ని శ్రీరాఘవాచార్యులవారి దత్తపుత్రుల యింటనుండి పొడిపొడియై చెడిపోయి ఉన్నదశలో వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సేకరించి శ్రీరాఘవాచార్యులవారి జ్ఞాపకంగా ఉంటుందని మద్రాసుప్రాచ్యలిఖిత పుస్తకశాలకు చేర్చారనీ వివరం వ్రాయబడింది.శ్రీరాఘవాచార్యులవారి పరిశోధనతో, ఆంధ్రదేశ చరిత్రరచనలో క్రీ.శ.19వ శతాబ్దం ముగిసింది.

20వ శతాబ్దంతో నూతనయుగం ప్రారంభమయింది. పాశ్చాత్య విజ్ఞానం ఎల్లయెడలను ప్రసరించింది. విద్యావంతులకు పాశ్చాత్య శాస్త్రపరిశోధనా పధ్ధతులు పరిచితాలయ్యాయి. ఆంధ్రదేశ చరిత్రపరిశోధలో ఒక కొత్త యుగం ప్రారంభమయింది. ఈ యుగంలో మొదటి పరిశోధకుడు శ్రీ కందుకూరి వీరేశలింగం. చరిత్ర సంబంధి కాకపోయినా కందుకూరి వీరేశలింగంగారి ఆంధ్రకవుల చరిత్ర చాలామంది విద్యావంతులను  చరిత్రపరిశోధనకు పురికొల్పింది. వీరేశలింగంగారి పరిశోధన అంతా మెకంజీ గ్రంధసంచయం మీదనూ, బ్రౌను లోకల్ రికార్డ్సు మీదనూ ఆధారపడి సాగింది. వీరేశలింగంగారి తరువాత చిలుకూరి వీరభద్రరావుగారు, కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారు ఆంధ్రదేశ చరిత్రపరిశోధనను ముందుకు నడిపించారు. లక్ష్మణరావుగారు గొప్ప శాసనపరిశోధకులు. ఆంధ్ర దేశ చరిత్రకు సంబంధించిన శిలాతామ్రశాసనములను చాలావాటిని బయలుపరచి పరిష్కరించి ప్రకటించారు. క్రీ.శ.20వ శతాబ్దం ప్రథమ ద్వితీయ దశకములలో లక్ష్మణరావుగారు, వీరభద్రరావుగారూ ఆంధ్రదేశచరిత్ర పరిశోధక ప్రపంచంలో సూర్యచంద్రులవలె ప్రకాశించారని, అప్పటిలో అక్షరఙ్నులైన ఆంధ్రులలో వీరి రచనలను చదువనివారు అరుదనీ చెబుతారు. లక్ష్మణరావుగారు స్థాపించి పోషించిన విఙ్నానచంద్రికామండలి చాల ప్రసిధ్ధి చెందింది.

క్రీ.శ.1915 ప్రాంతంలో మద్రాసు విశ్వవిద్యాలయంలో దక్షిణదేశ చరిత్ర పరిశోధనార్థం చరిత్రపరిశోధన శాఖ ఏర్పడింది. ఈ విశ్వవిద్యాలయంలో మొదటి హిందూదేశ చరిత్ర ప్రొఫెసరుగా ఉండిన డా.యస్. కృష్ణస్వామి అయ్యంగారికి విజయనగర సామ్రాజ్యంపై అభిమానం యెక్కువ. అయితే వారికి సంస్కృతాంధ్రకర్ణాటభాషలలో ప్రావీణ్యం లేకపోవడం చేత, ఆ భాషలలో కుప్పలుతెప్పలుగా లభించే విజయనగర చరిత్రను తెలిపే సాధనసామగ్రిని తెలుసుకోవడానికిగాను తనదగ్గర పనిచేసే ఆసూరి రంగస్వామి సరస్వతి అనే ఒక పరిశోధక విద్యార్ధిని సంస్కృతాంధ్రకర్ణాట భాషలలో లభించే విజయనగర చరిత్ర సామగ్రినంతటినీ ఆంగ్లంలోకి అనువదించేందుకు నియోగించారు. ఈ రంగస్వామి సరస్వతి మహామేధావి, చరిత్రపరిశోధనలో సహజ నైపుణ్యం కలవాడు. సంస్కృత, ఆంధ్ర తదితర  వాఙ్మయాన్నంతా పరిశోధించి, అచిర కాలంలోనే విజయనగసామ్రాజ్యంపై 342 పుటల పుస్తకాన్ని తయారుచేశాడు. కృష్ణస్వామి అయ్యంగారు దీనికి ‘సోర్సెస్ ఆఫ్ విజయనగర హిస్టరీ’ అని నామకరణంచేసి తనపేరిట ప్రకటించుకున్నారు. అయితే అది రంగస్వామి సరస్వతిచే రచించబడినదని ఆ గ్రంథపీఠికలో చెప్పి ఒప్పుకునే అలా ప్రకటించుకున్నారు. విజయనగరచరిత్ర పరిశోధనకు ఈ గ్రంథం పునాది వేసింది.

అంతవరకు తెలుగులో చరిత్రపరిశోధనాంశాలను గురించి సావకాశంగా చర్చించడానికి అనుకూలమైన పత్రికలు లేని లోటును విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావుపంతులుగారి ‘భారతి’ మాసపత్రిక తీర్చింది. చరిత్రపరిశోధనలో ఆరితేరి పేరుప్రఖ్యాతులుగాంచిన పండితులనేకుల వ్యాసాలను భారతి మాసపత్రిక ప్రకటించింది. భారతిలో చరిత్రవ్యాసాల ప్రకటనల వలన ఆంధ్ర దేశంలోని విద్యావంతులలో చారిత్రక విజ్ఞానము పెరిగింది. భారతిలో ప్రకటితములైనన్ని చరిత్రసంబంధ వ్యాసాలు, శాసనాలు మరే ఇతర భాషా పత్రికలో ప్రకటితం కాలేదనడం అతిశయోక్తి కాదు. క్రమక్రమంగా భారతి పత్రిక చారిత్రక విషయాల చర్చకు ఒక ప్రామాణిక రంగస్థలంగా మారింది.

ఆంధ్రుల చరిత్రపరిశోధనయే ముఖ్య ఉద్దేశ్యంగా గలిగిన ఆంధ్రైతిహాసక పరిశోధకసంఘం, రాజమండ్రి వారి కృషివలన నాలుగు ‘సంచిక’  లు వెలువడ్డాయి. వాటిలో మొదటిది ‘శ్రీ రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక’; 1922లో  భావరాజు వేంకటకృష్ణారావుగారి సంపాదకత్వంలో ప్రచురింపబడింది. పూర్వచాళుక్య వంశజుడు, నన్నయభట్టారకునిచే ఆంధ్రీకరించబడిన మహాభారత భాగానికి కృతిపతి అయిన రాజరాజనరేంద్రుని మంగళకీర్తిని స్మరించుకోవడం కోసమై ఈ సంచిక ప్రకటించబడినప్పటికీ, పూర్వచాళుక్య చరిత్రకు సంబంధించిన చాలా విషయాలు ఇందులో వర్ణించబడినాయి. ఈ సంచికల వరుసలో రెండవది, 1930లో ప్రచురించబడిన కళింగసంచిక, శ్రీ రాళ్ళబండి సుబ్బారావు పంతులుగారి సంపాదకత్వంలో వెలువడింది. పేరుకు తగినట్లుగానే కళింగదేశ చరిత్రకు సంబంధించిన సంగతులెన్నో ఇందులో వర్ణించబడినాయి. మూడవది, కాకతీయ సంచిక, డాక్టరు మారేమండ రామారావుగారి సంపాదకత్వంలో 1935లో ప్రకటింపబడింది. కాకతీయుల చరిత్ర ఇందులో వర్ణించబడింది. నాల్గవది, రెడ్డి సంచిక, శ్రీ వడ్డాది అప్పారావుగారి సంపాదకత్వంలో 1947లో ప్రకటించబడింది. ఇందులో కొండవీటిరెడ్ల చరిత్ర ఎక్కువభాగం, కొంతగా రాజమహేంద్రవర రెడ్ల చరిత్ర వర్ణించబడింది.

హైదరాబాదు నగరంలోని ‘లక్ష్మణరాయ పరిశోధకమండలి’ నైజాము పాలనక్రింద ఆంధ్రరాష్ట్ర ప్రాచీన చరిత్రను గురించి కృషిచేసి, తెలంగాణములో నున్న శాసనాలను  వెదికి పట్టుకుని వాటన్నిటినీ ‘తెలంగాణాశాసనములు’ అనే పేరుతో ఒక ప్రత్యేక గ్రంథంగా ప్రకటించింది. ఈ సంపుటంలో ప్రాచీనాంధ్ర దేశచరిత్రకు సంబంధించిన శాసనాలు అపూర్వములైనవి చాలా ఉన్నాయని, అయితే ఈ గ్రంథం పరిష్కృతమైతేగాని పరిశోధకులకు అంతగా ఉపయోగకారి కాదనీ చెప్పబడింది.

ఆంధ్రదేశపు చరిత్రపరిశోధకులలో మరొక ప్రముఖుడు, శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు. వీరు మొదటలో కొన్ని ఏండ్లపాటు శ్రీ లక్ష్మణరావుగారికి చరిత్రపరిశోధనలో చేదోడువాదోడుగా పనిచేసినవారు. శాసనపరిష్కారము వీరికి అభిమాన విద్య. లిపిశాస్త్రంలో వీరితో సమాన జ్ఞానము కలవారిసంఖ్య అత్యల్పం. వీరు సంపాదించి, పరిష్కరించినన్ని శాసనాలను మరియెవ్వరును ప్రకటించియుండలేదనీ, ప్రాచీన దక్షిణదేశ చరిత్రకు సంబంధించి శ్రీ శర్మగారికి తెలియని విషయం లేదనీ చేప్పబడింది. శర్మగారు పెక్కు పరిశోధన వ్యాసాలను, గ్రంథాలను  రచించారు. అందులో, అమరావతీ స్తూపము, మన ప్రాచీన విద్యాసంస్థలు, హిందూదేశ చరిత్ర చాలా ముఖ్యమైనవి. ఇవిగాక, ఆంగ్లంలో వీరు రచించిన ‘ఎ ఫర్గాటన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్రహిస్టరీ’ ‘ది హిస్టరీ ఆఫ్ ది రెడ్డికింగ్డమ్స్’  అనే గ్రంథాలవలన ఆంధ్రదేశ చరిత్ర, సంస్కృతికి సంబంధిన ఎన్నో సంగతులు వెలుగుచూశాయి.

సొమశేఖరశర్మగారి తరువాత పేర్కొనదగినవారిలో అతి ముఖ్యులు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. వీరు మహామేధావియగు సంస్కృతాంధ్రభాషా విశారదులు. శ్రీనాథకవిరాజు జీవనచరిత్ర రచించడంకోసం కొండవీడు, రాజమహేంద్రవర రెడ్డిరాజుల చరిత్రను చక్కగా పరిశీలించి తమ ‘శృంగార శ్రీనాథము’ అనే గ్రంథంలో సంగ్రహంగా వర్ణించారు. కళింగదేశ చరిత్ర పరిశోధనకు సంబంధించి పేర్కొనదగిన ముఖ్యులలో మొదటివ్యక్తి శ్రీ గొడవర్తి రామదాసుపంతులుగారు. ఖారవేలుని కాలమునుండి ఒడ్డె గజపతుల యేలుబడివరకూ కళింగదేశచరిత్ర వీరి పరిశోధనారంగం. పూర్వ గాంగ చరిత్రపై వీరికి అభిమానం మెండు. పూర్వగాంగ శక ప్రారంభకాల నిర్ణయమును గురించి వీరు చాల విపులంగా వ్రాసియున్నారు. అలాగే, తంజావూరు ఆంధ్రరాజుల చరిత్రకు సంబంధించి శ్రీ కురుగంటి సీతారమభట్టాచార్యులవారి కృషి, వారి రచనలు, కాకతీయ రెడ్డిరాజ్యములకు సంబంధించి శ్రీ మారేమండ రామారావుగారి కృషి, వారి రచనలు ముఖ్యమైనవి.

ఇక  డా.నేలటూరు వెంకటరమణయ్యగారి సంగతికొస్తే, వీరి అభిమాన విషయం విజయనగర సామ్రాజ్యం. ప్రాచీన రాజులపైని వ్యాసావళి, లేములవాడ చాళుక్యుల చరిత్ర వీరి తెలుగురచనలలో ముఖ్యమైనవి. ఆంగ్లంలో ‘కంపిలి అండ్ విజయనగర’, ‘ఆరిజిన్ ఆఫ్ ది సిటీ అండ్ యంపైర్ ఆఫ్ విజయనగర’, ‘స్టడీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ విజయనగర’, ‘యర్లీ ముస్లిం ఎక్స్పాన్షన్ ఇన్ సౌత్ ఇండియా’, ‘ఫర్దర్ సోర్సెస్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ విజయనగర’, ‘ది హిస్టరీ ఆఫ్ ది ఈస్టరన్ చాళుక్యాస్’ అనే చేరిత్రక గ్రంథాలు చాలా ముఖ్యమైనవి.

ఆంధ్రదేశ చరిత్రపరిశోధకులలో ఇంకా, డా.ఓరుగంటి రామచంద్రయ్యగారు – కృష్ణదేవరాయలు; డా. సత్యవోలు కామేశ్వరరావుగారు – పూర్వగాంగులు; శ్రీ ముట్లూరి వెంకటరామయ్యగారు – తెలుగుచోళులు; శ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారు – కళ్యాణి చాళుక్యులు; డా.రాయప్రోలు సుబ్రహ్మణ్యముగారు – కళింగ సూర్యవంశగజపతులు; శ్రీ మామిడిపూడి వేంకటేశ్వర్లుగారు – వెలనాటి చోళులు; డా.కవుతా యశోదాదేవిగారు – రెడ్డిరాజ్యములు, క్రీ.శ.1000-1500 మధ్య తెనుగుదేశ చరిత్ర; శ్రీ వడ్డాది రాంచంద్రమూర్తిగారు – ఆనందవంశపు రాజులు…మొదలగువారు, వారి రచనులూ ముఖ్యమైనవే!