సీతాకోకచిలుకలు – ‘mud puddling’

సీతాకోకచిలుకలలో ‘mud puddling‘ ప్రక్రియ

సీతాకోకచిలుకలను ఫోటోలు తీసే సమయాల్లో ఒక్కొక చోట మొక్కలను నీటితో తడిపినప్పుడు వాటి చుట్టూ నేల తడిసి ఏర్పడే బురద ప్రదేశాల్లో తడిమట్టిపై ఒకటి రెండు సీతాకోక చిలుకలు వాలడాన్ని, వాటి proboscis- శృంగాన్ని బురదమట్టి లోనికి  పూవులోని మకరందాన్ని సేకరించినట్లుగానే తడిమట్టిలోకి పోనిచ్చి ఉంచడాన్ని చూసి ఒకింత అయోమయానికి గురి అయ్యేవాడిని. కారణమేమిటంటే, సీతాకోకచిలుకలు పూవులపై వాలడాన్ని, వాటిలోని మకరందాన్ని సేవించడాన్ని మాత్రమే సాధారణంగా చూస్తాం కాని, బురద మట్టిపై వాలి అందులోంచి ‘ఆహారాన్ని సేకరించుకోవడం’ అన్నది ఊహించం,  చూడం. ఎమిటిలా చేస్తాయి? వీటికి మతిగాని లేదా? అనుకున్న సమయాలు కూడా ఉన్నాయి. అయితే, సీతాకోకచిలుకలను గురించి చదవడం మొదలెట్టాక, కొన్ని చోటల ‘mud puddling’ అనే మాట ప్రస్తావించబడి కనపడి, సీతాకోకచిలుకలలో అసలీ ‘mud puddling’ అంటే ఏమిటన్నది తెలుసుకోవడానికి దారితీసింది.

నీటితో తడిసి బురదగా మారిన నేల భాగాన్నుంచి- బురద మట్టినుంచి- కొన్ని రకాల సీతాకోకచిలుకలు ఆహారాన్ని సేకరించుకోవడాన్ని puddling అనీ, ఇంకొంత స్పస్టంగా mud puddling అనీ అంటారు. ఈ mud puddling అనేది సాధారణంగా ఎక్కువగా కొన్ని రకాల మగ సీతాకోకచిలుకలు చేస్తాయనీ, కొన్ని రకాలలో చాలా అరుదుగా ఆడ సీతాకోకచిలుకలు గూడా చేస్తాయనీ తెలిసింది.

మగ సీతాకోకచిలుకలు mud puddling ని  వాటికి ఆహారంలో సాధారణంగా తక్కువ మోతాదులలో లభ్యమయ్యే sodium లవణాన్ని ఈ mud puddling ప్రక్రియద్వారా తడి మట్టి నుంచి తీసుకొని శరీరంలో నింపుకోవడానికి చేస్తాయట. ఈ సోడియం లవణం యొక్క అవసరం మగ సీతాకోకచిలుకలకే ఎక్కువ అట. ఎందుకంటే ఆ రకపు సీతాకోకచిలుకలలో ఆడ సీతాకోకచిలుకల కంటే మగ సీతాకోకచిలుకలే వాటి జీవితకాలంలో ఎక్కువగా ఎగురుతూ గడుపుతాయి కాబట్టీనూ, ఎగరడంలో అవసరమయ్యే neuro-muscular activity కి సోడియం లవణం అవసరం ఎక్కువ కాబట్టీనూ నట. అదీ గాక, వాటినుంచి వాటి సంతతి ఉద్భవించే గుడ్డు బలంగా ఉండడానికి సోడియం లవణం ముఖ్య అవసరం కాబట్టి, ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి కొన్ని రకాల సీతాకోకచిలుకలలో మగ సీతాకోకచిలుకలు ఈ mud puddling ప్రక్రియ ద్వారా సేకరించిన అధిక సోడియం లవణాన్ని mating సమయంలో ఆడ సీతాకోకచిలుకల శారీరాలలోకి వాటి శరీరాల్లోంచి transfer చేస్తాయనీ చెప్పారు. గ్రుడ్ల ఉత్పత్తికి అవసరమయ్యే మొత్తం సోడియం లవణాన్ని కొన్ని రకాల సీతాకోకచిలుకలలో ఒక్క ఆడ సీతాకోకచిలుకలే ఇవ్వలేవట. ఆ కారణంగా మగ సీతాకోకచిలుకలు mud puddling చేసి ఆ అవసరాన్ని, లోపాన్ని తీరుస్తాయట.

ఇదిలా ఉంచితే, కొన్ని రకాల సీతాకోకచిలుకలలో ఈ mud puddling అనేది వాటి ఆహారంలో మామూలుగా పూవుల మకరందం సేవించడంతో లభ్యం కాని ముఖ్యమైన nutrients ని పూరించుకోవడానికి కూడా చేస్తాయట. ఇది ఒక ఊహ. ఇలాంటిదే ఇంకొక ఊహ – పూవులలోని మకరందంతో పొట్ట నింపుకోవడానికి ఆడ, యువక సీతాకోకచిలుకలతో పోటీలో తట్టుకోలేని వృధ్ధ మగ సీతాకోకచిలుకలు ఇక వేరే దారి లేక ఈ mud puddling అనే ప్రక్రియ ద్వారా ఆహారాన్ని సేకరించుకుని అప్పటికి అవసరాన్ని తీర్చుకుంటాయట. ఇవి రెండూ hypothesis, ఊహాజనిత నిర్ణయాలు అయినప్పటికీ వీటిలో కొంతైనా  నిజం ఉండకుండా పోదని,  ఊహలుగా కొట్టిపారెయ్యడానికి వీలులేదనీ చెబుతారు.ఇదీ కొన్ని రకాల సీతాకోకచిలుకలలో mud puddling ని గురించిన సంక్షిప్త సమాచారం.

Mud puddling చేస్తూన్న ఈ సీతాకోకచిలుకలు రెండింటిలో మొదటిది బెంగళూరు కబ్బన్ పార్క్ లోనూ, రెండవది లాల్ బాగ్ గార్డన్స్ లోనూ నా కెమేరా లెన్స్ కు చిక్కాయి.

Butterfly – mud puddling (image-1)

Butterfly – mud puddling (image-2)