క్రీడాభిరామము – (2)

kaakatiiya_2

మహాకవి శ్రీనాథుడు, వల్లభరాయుడు సమకాలీకులని పండితుల అభిప్రాయం. పద్యనిర్మాణంలో శ్రీనాథుడు అనుసరించిన పధ్ధతినే ‘క్రీడాభిరామం’ లో వల్లభరాయుడు చాలా చోట్ల అనుకరించాడు. శ్రీనాథుని అలంకారికమైన, అక్కడక్కడ శృంగారమయమైన, ప్రౌఢమైన పద్యనిర్మాణశైలిని వల్లభరాయుడు బాగా ఇస్టపడ్డాడని ‘క్రీడాభిరామం’ లోని చాలా పద్యాలు చెప్పకనే చెబుతాయి.

రచించబడిన తరువాత కొంతకాలానికి మరుగునపడిపోయి, ఆ తరువాతి కాలగర్భంలో కలిసిపోయి దాదాపుగా అయిదువందల సంవత్సరాలు కనుమరుగైపోయింది ‘క్రీడాభిరామం’. ఈ కావ్యాన్ని గుర్తించి, ఆ స్థితినుంచి వెలుపలికి తీసి మళ్ళీ వెలుగులోకి తెచ్చిన వారు బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు. తెలుగుసాహిత్యం మీద మక్కువ, శ్రధ్ధ వున్న వ్యక్తులేవరైనా సరే ఈయన పేరును ఎన్ని సార్లు స్మరించుకుంటే అంత మంచిది. తెలుగులో ‘క్రీడాభిరామం’ కావ్యాన్నే కాక, నన్నెచోడుని ‘కుమారసంభవం’, త్రిపురాంతకుని ‘త్రిపురాంతకోదాహరణం’, బద్దెన ‘నీతిసారముక్తావళి ‘ మొదలైన తెలుగు కావ్యాలను వెలికితీసి ప్రకటించిన వారాయన. తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయంలో క్రీ.శ.1856 లో తిరగరాయబడ్డ ‘క్రీడాభిరామ’ పు తాళపత్ర ప్రతిని గుర్తించి, ప్రాచీనమైన ఆ ప్రతిలోని గ్రంథపాతాలను సంస్కరించి, పరిస్కరించి, అందులోంచి మరొక వ్రాతప్రతిని తయారుచేసుకుని 1909లో ప్రకటించారాయన.

‘క్రీడాభిరామం’ కావ్యం వెలుగులోకి రావడం వలన జరిగిన అతి ముఖ్యమైన సంగతులలో ఒకటి – ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనే విషయ ప్రకటనం చేసింది శ్రీకృష్ణదేవరాయలు కాదని, అది వల్లభరాయుడనీ, ఆ కీర్తి నిజానికి వల్లభరాయునికి దక్కాలనీ!

‘క్రీడాభిరామం’ పద్యంలో వల్లభరాయుడు చేసిన original idea ని తీసుకుని ఇంకొన్ని మెరుగులు దిద్ది మరింత relevant గా వేరే పద్యాన్ని కృష్ణదేవరాయలు అందించాడు తన ‘ఆముక్తమాల్యద’ లో!

“జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశభాషలందుఁ దెనుఁగు లెస్స
జగతిఁ దల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చుటాఁడుబిడ్డ మేలుగాదె.”

Mother is Sanskrit for all the languages that now exist
Amongst the languages of the land Telugu is the best;
Isn’t the sister-in-law who wishes for well being and wealth
In fact more comforting for a woman than her own mother!

వ్యాఖ్యానించండి