క్రీడాభిరామము -(1)

kaakatiiya_1

తెలుగులో ‘క్రీడాభిరామం’ ఒక విలక్షణమైన కావ్యం. భారతీయ సంప్రదాయంలో దశరూపకాలలో ఒకటైన ‘వీధి’ నాటక పధ్ధతిలో ఈ కావ్యం వ్రాయబడింది. ఈ కావ్యానికి కర్త వినుకొండ వల్లభరాయడు. అయితే, ఇందులోని ప్రతి పద్యంలో కనిపించే శ్రీనాథుని తరహా పద్యనిర్మాణం, భాష, శృంగార పదజాలం ఈ కావ్యం అసలుకి శ్రీనాథుని చేతనే రచించబడి ఏ కారణం చేతనో వల్లభరాయని పేర ప్రచారంపొందిందని ఒక అభిప్రాయం సాహిత్య లోకంలో ప్రబలంగా ఉండింది. ఒకవైపు పెద్దలలో ఆ అభిప్రాయం అలా ఉన్నప్పటికీ, క్రీడాభిరామం కర్తృత్వం వల్లభరాయనికే ఆపాదించబడి ఇప్పటికీ పదిలంగానే వుంది.

తెలుగులోని పద్యకావ్యాలలో నిజానికి ‘క్రీడాభిరామం’ ఉన్నంత దగ్గరగా మరే కావ్యం ఉండదనే మాట అంత నిజం. సంస్కృతంలో రావిపాటి త్రిపురాంతకునిచే రచించబడిన ‘ప్రేమాభిరామం’ అనే కావ్యాన్ని అనుకరిస్తూ ‘క్రీడాభిరామం’ రచించబడిందని వల్లభరాయడే చెప్పిన మాట. అయితే, ‘ప్రేమాబిరామం’ ఇప్పటికీ లభించనిది కాబట్టి. ఈ అనుకరణ ఎలాంటిదనేది ఇప్పటికీ అస్పష్టమే!

వినుకొండ వల్లభరాయని తండ్రి తిప్పయామాత్యుడు విజయనగర ప్రభువైన రెండవ హరిహరరాయల కొలువులో రాజోద్యోగి అనే అధారాన్ని బట్టి ‘క్రీడాభిరామం’ బహుశా 15వ శతాబ్ది ప్రధమార్ధంలో రచించబడి వుండవచ్చని తేల్చారు. ‘క్రీడాభిరామం’ ఏకాశ్వాస ప్రబంధం. మొత్తం 245 పద్యగద్యలతో చంపూ పధ్ధతిలో చేయబడిన రచన. కాకతీయుల ఓరుగల్లు నగరం, కోట, అందులో ప్రజల వేషభాషలూ, ఆహారాలూ, అలవాట్లూ ఇందులో వర్ణించబడ్డాయి. అయితే, ఇందులో అక్కడక్కడా వర్ణనలలో చోటుచేసుకున్న సభ్యంకాని పదజాలం, వర్ణనా విధానం కారణంగా ఈ మొత్తం రచన చెడ్డదిగానూ, మామూలు పాఠకులకు పఠనయోగ్యమైనది కానిదిగానూ నిర్ధారించబడింది.

సభ్యంకాని, అభ్యంతరకరమయిన వర్ణనలు వున్న భాగాలను మినహాయిస్తే, ‘క్రీడాభిరామం’ నిస్సందేహంగా ఒక విలక్షణమైన రచన. ఆ కాలపు ఏ కవీ ఊహించని కథా వస్తువుతో ఒక కాల శకలాన్ని – కాకతీయుల పరిపాలనా కాలంలోని ఒక రోజును – వాస్తవానికి ఏవిధంగానూ అతీతంగా అనిపించనట్లుండే పాత్రల ద్వారా అక్షరభధ్ధంచేసి చూపించిన రచన. కథానాయకులనదగిన గోవింద మంచనశర్మ, అతని అనుచరుడు (financier) అనదగిన టిట్టిభశెట్టి…వీరిరువురు నడిచే మార్గంలోనే పాఠకుడినిగూడా మానసికంగా నడిపించగలిగేంత ప్రతిభావంతమయిన రచనావిధానంతో ముందుకు సాగుతుంది ఈ రచన. ఆకారణంగా, ఈ కావ్య సౌందర్యమంతా ఈ కావ్యంలోని ప్రతి పద్యంలో, గద్యలో అక్షరాలతో చిత్రించి చూపించిన ఆనాటి కాకతీయ జనజీవనం వుండి పాఠకుని మనోనేత్రాలకు కనబడుతుంది.

కాలగమనంలో మరుగునపడిపోయిన ఈ రచన, మళ్ళీ 1909లో బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారి పుణ్యమాని, వారే ప్రచురించిన ‘విస్మ్రుతకవులు’ శీర్షిక పరంపరలో భాగంగా వెలుగు చూసింది. ఆ తరువాత, బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారి విపులమైన పీఠికతోనూ, వారి కొన్ని సవరణలతోనూ 1928లో ముద్రించబడింది. ఆ తరువాతి కాలంలో ఎమెస్కో వారు వారి ‘సంప్రదాయ సాహితి – 20’ గా స్వర్గీయ బి.వి. సింగరాచార్యగారి ‘సమాలోకనం’ తో 1972లో ప్రచురించారు. ఇవి నాకు తెలిసిన ప్రతులు, చివరి రెండూ నాకు అందుబాటులో వున్నవి. ఇవి కాకుండా స్వర్గీయ బండారు తమ్మయ్య గారి సంపాదకత్వంలో వావిళ్ళవారు ప్రచురించిన ప్రతి 1960నాటిది, శ్రీ బి.ఎన్. శాస్త్రి గారి పీఠికతో నవోదయ సమితి, హైదరాబాదు వారు ప్రచురించినది 1968 నాటిది కూడా వున్నాయి.

ఇందులో అసభ్యత అంటూ ఏమాత్రమూ లేని పద్యాలను సాధ్యమయినంత అందంగా అలంకరించడము, వీలయినంత సౌందర్యవంతంగా భావం చెడకుండా ఆంగ్లంలోకి అనువదించడమూ అనేవి ఈ రచనను ఇంకాస్త glorify చేసే దిశగా నా మనసుకు తోచిన, నేను చాలా కాలంగా అనుకుంటున్న సంగతులు. వరంగల్లులో ఇప్పటి కోట శిథిలాలలో నేను తీసిన ఫోటోలపై, ఇందులో అతి ముఖ్యమైనవిగా అనిపించిన పద్యాలను వుంచి Photo Cards గా చేసి, ఒక abridged edition గా అవసరమైన notes తోనూ ఆంగ్లంలోనికి అనువాదంతోనూ ఈ పోస్టుల పరంపర సాగుతుంది.

***                                                            ***

“గణన కెక్కిన దశరూపకములయందు
వివిధ రసభావభావన వీథి లెస్స
యే కవీంద్రుఁడు రచియించె నీ ప్రభంధ
మనుచు మీ రానతిచ్చెద రైన వినుఁడు.”

‘క్రీడాభిరామం’ కృత్యవతరణ పద్యం ఇది.

రూపకం అంటే దృశ్య కావ్యం అని అర్ధం. బారతీయ సంప్రదాయంలో దశరూపకాలు ఇవి:
1. నాటకము, 2. ప్రకరణము, 3. బాణము, 4. ప్రహసనము, 5. డిమము, 6. వ్యాయోగము, 7. సమవాకారము, 8. వీధి, 9. అంకము, 10. ఈహామృగము.

ఈ పదింటిలో ఎనిమిదవది వీధి. అయితే, ‘వీధి’  నాటక పధ్ధతి ఎంతగా జనాదరణ పొందిందో వేరే చెప్పనక్కరలేదు. వినోదానికైనా, ఒక సందేశాన్ని జనం మనసులలోకి పంపించాలన్నా ఆధునికంగానూ ఈ పధ్ధతినే ఆశ్రయించడం ఇప్పటికీ చూస్తుంటాం.

 Among the much acclaimed ten methods of drama,
Method ‘Street’ capable of exhibiting various emotions
Is without doubt the best, if you order me to reveal
Which great poet authored this Prabandhathen listen.

1 thoughts on “క్రీడాభిరామము -(1)

  1. పింగుబ్యాకు: వీక్షణం-78 | పుస్తకం

వ్యాఖ్యానించండి